Sat 01 Oct 23:40:52.772358 2022
Authorization
ప్రతి రోజూ పొద్దున్నే,
అతడు రెండు వేళ్ల మధ్యలో బ్రతుకును ఇరికించి నోట్లో పెట్టి
నిప్పంటించుకునేవాడు,
కాలిన బ్రతుకును కాలికిందేసి నలిపి కాలరెగరేసి
కదిలిపోతుండేవాడు...
గాల్లోకి ధూమాన్ని వత్తాకార వలయాలుగా ఊది,
చివరి దమ్ము వరకూ దర్జాగా పీల్చడంపైనే అతడి ధ్యాసంతా,
నాలుగంగుళాల శ్వేత వర్ణ యమపాశంలో
అల్పానందాన్ని వెతుకుతుండేవాడు....
అతడొక పొగరాయుడిగా,
ధూమపాన ప్రియుడిగా,
అతడొక వ్యసనపరుడిగా,
బాధ్యత లేని పౌరుడిగా,
నిత్యం జనం నోట్లో నలుగుతుండేవాడు...
ఏం జరిగిందో తెలియదు,
ఎవరు మార్చారో తెలియదు,
ఎన్ని సార్లు వారించినా విననివాడు,
ఓ రోజు...
దిగుడు బావుల్లాంటి కళ్ళు,
పాలిపోయిన ముఖం,
నలుపెక్కిన పెదాలతో కనిపించి,
కాలిన ఊపిరి కవాటాల సాక్షిగా,
పొగ మానేస్తానన్నాడు,
ఆ మరునాడే కన్నుమూశాడు.
తెల్లని కాగితంలో చుట్టేయబడ్డ నికోటిన్ (సిగరెట్) లాగే,
అతడిని తెల్లని వస్త్రంలో (కఫన్) చుట్టేసి తీసుకెళ్తుంటే,
పొగ కమ్మేసిన తన నిర్జీవ దేహాన్ని నిర్ఘాంతపోయి
చూస్తూ స్మశానం వైపు కదిలాను,
అక్కడ ఇంకొకతను,
రెండు వేళ్ళ మధ్యలో దగ్ధమవడానికి సిద్ధంగా
నిండు జీవితంతో పక్కనొచ్చి నిల్చుని,
''నిప్పు కావాలన్నాడు''
దూరంగా కాలుతున్న చితి వైపు వేలు చూపించి
వెనుతిరిగాను అసహనంగా....
(మయూఖ, కవితా వేదిక వచన కవితా పోటీల్లో ''ద్వితీయ'' బహుమతి గెలుపొందిన కవిత)
- జాబేర్.పాషా, 00968 78531638