Sun 16 Oct 00:15:07.053497 2022
Authorization
జనమంతా
ఎండదాడికి
శీతల గుడారాలు లెంకుకుంటుంటే
ఈ చెట్టుమాత్రం
ఆకుపచ్చగా నవ్వుతూ పాదాచారులకు
నీడ కొంగును పరుస్తుంది
నిలువెల్లా పచ్చదనంతో
ఆకుల చేతులు చాపి
చూపుల దారులు వేస్తుంది.
అడవంతా చెమటలు కక్కుతూ
చెలిమెల కడుపులు చూస్తుంటే
ఈ చెట్టు మాత్రం పచ్చని నీడను
పది మందికి పంచుతుంది.
అప్పటి నుంచి
నా జీవిత ప్రయాణంలోనూ
నావెంటే నడుస్తున్నది.
చిన్నప్పుడు మోదుగు చెట్టంటే
ఆట కోయిలలకు పచ్చని గుడిసె
పశు పక్షాదులకు అమ్మ ఒడి
ఒంటిపూట బడి చుట్టయి
ఇంటి దారి పట్టినప్పుడు
నా బీద పాదాలకు ఈ ఆకులే
మెత్తని అడుగులయ్యేవి
మూడాకుల తొడిమెలని జత చేసి
తలపై కప్పుకుంటే
ఆకాశమే ఆకుపచ్చని దుప్పటయ్యేది.
నా నాబి కింద దీని లేతాకు
శరీరాన్ని పాసంగంలో ఉంచేది.
ముందుకు సాగకుండా
సూర్యుడు దారి కడ్డమైనపుడు
ఈ మోతుకు చెట్టే
హరిత కుటీరమయ్యేది
ఇప్పటికీ ఈ చెట్టును చూస్తే
నిన్న ఎర్ర పిడికిళ్లతో పోరుకు సిద్ధమై
నేడు పెయ్యంత పచ్చని నవ్వులతో
వూగి పోతుంది
ఇప్పటికీ ఈ చెట్టును చూస్తే
పుట్టలు పుట్టలుగా
చిన్నప్పటి గుర్తులు యాదికస్తయి
సూర్యుని కోపానికి
కండ్లు ఎర్రని నిప్కలైనప్పడు
తానే తన కొమ్మల చూరు కిందికి పిలిచి
పచ్చని దస్తీతో
ఆయాసాన్ని తుడిచేసేది
నాతో పాటు
కర్రెపిట్టలు,
బెల్లం పిట్టెలు కంజులు బుర్కలు
కూనలకు మోతుకాకుల పొత్తిగన్డ్రలేసి
నిద్ర దుప్పటి కప్పేది
మోతుకు చెట్టంటే ఆదిలాబాదుకు
ఆయుర్వేద వైద్యశాల
పోరాటాల ఎర్రెర్రటి నినాదాలు
పండగలకు, చుట్టరికాలకు,
కొత్త పెండ్లి ప్రేమలకు
విస్తరాకు మర్యాద.
ఎప్పుడైనా
బస్సులోనో బైక్ పైననో వెళ్తుంటే
అప్పటి చిట్టి పాదాల దోస్తులు
చెట్టుకొంగుతో సైగలు చేస్తాయి
ఎప్పుడైనా నేను
మనిషితో మాట్లాడాలను కున్నప్పుడు
ఈ చెట్టు నీడకే చేరుకుంటాను.
ఈ చెట్టుతోనే మాట్లాడుతాను
- ఉదారి నారాయణ, 9441413666