Sun 16 Oct 00:16:48.679405 2022
Authorization
నీ 'ముష్టి' సెల్ మంచిదే
కాదనను
కానీ ఒరే కన్నా!
నీ మెడల మీద ఉన్న
మెగా సెల్ గొప్పదిరా దాని కన్నా.
నువ్వు హాయిగా నీ ఒళ్ళోనే
'ల్యాప్'టాప్ వినియోగించడం బావుంది
వద్దనను కానీ ఒరే ఒరే చిన్నా!
నీ ఒంటికి మొత్తం శిఖరప్రాయంగా
ఉత్తమమైన అంగం ఒకటుందిరా నాయనా!!
అది అసలు సిసలు 'హెడ్'టాప్ అండ్ ట్యాబ్
శిరస్సు -
అద్భుత జ్ఞాన సరస్సు
నెత్తిని మించిన నెట్టుందా లోకంలో?
రోడ్లన్నీ రోమ్ వైపు వెళుతున్నట్లు
అన్ని వైఫైలూ నీ తల వైపే ఉంటాయి...కనుక్కో!
ఒక్క యూట్యూబ్ దృశ్య పరంపరతోనే
అనుక్షణం పరవశిస్తున్నావా?
నువ్వొకసారి నీ తలలో నివసించడం నేర్చుకో!
అది-
కేవలం యూట్యూబులే కాదు బుల్లోడా!
ఐ, వురు, హీ షీ ఇట్... ఇట్ లా.. ఇట్లా.. ఇలా..
సమస్త సజీవ స్పందనా నాళ గర్భిత స్థలం
'తల'రా బాబూ!
ఇవాళ ఫేస్బుక్ తోనో దాని గోడ తోనో
నేను గొడవ పడబోవడం లేదు
తలలోని ఆలోచనా సూచికల బుక్, ఫేస్ కదా!
సహజ సిద్ధమైన చక్కటి గుండ్రటి
అద్దం లాంటి వాల్, ముఖం కదా!!
''బాంచన్ దొరా! గులాపోన్ని''... నాటి మాట
''బాంచన్ సెల్లూ! గులామును''.. నేటి మాట
''అయ్యా! చిత్తం''.. ఆనాటి వాక్కు
''సెల్లూ! చిత్తం''... ఈనాటి షోకు
మరే... మరే... చివరాఖరున
ఒక్క మేటి మాట
ఇప్పటి సెల్ ఫోనే కాదు
రేపు మనిషి ఆవిష్కరించబోయే
మరే ఇతర మహత్తర వస్తువైనా
మనకు తలిదండ్రులు ప్రేమతో
పుట్టుకతోనే బహూకరించిన మన తలల ముందు
అన్నీ బలాదూర్... బహుత్ దూర్
- నలిమెల భాస్కర్