Sun 30 Oct 00:16:57.325601 2022
Authorization
మతఛాందసవాదులు చేస్తున్న ప్రచారం తప్ప ఆ వాదనలో సత్యం లేదు. వివక్షతలను పెంచి పోషించే మనువాద భావజాలం ఒక వైపు పెరిగిపోతుంటే, రెండో వైపు విచ్చలవిడితనపు ఆలోచనలు విస్తరిస్తున్నాయి. ఆధునికత పేరుతో మనుషులను మర బొమ్మలుగా చేస్తున్న వ్యాపార సంస్కృతి ఆడపిల్లలను కూడా ఒక సరుకుగా చూపెడుతున్నది. సెల్ఫోను, వెబ్సైట్లలో వికృత చిత్రాలు విధ్వంసపూరిత ప్రదర్శనలు యువత మదిని రెచ్చగొడుతున్నాయి. పర్యవసానంగా రోగగ్రస్తమైన మానసికత పెరిగిపోతున్నది. ఒక వైపు వివక్షతల దాడి, మరోవైపు విశృంఖలత దాడి వెరసి సాంస్కృతిక విలువల విధ్వంసం. ఇదీ నేటి పరిస్థితి.
సమాజంలో వికృత చేష్టలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వినటానికి, చూడటానికి ఎంతో బాధవేస్తోంది. ఎందుకు ఈ వైపరీత్యాలు పెచ్చరిల్లుతున్నాయి! ఎందుకీ ఆలోచనలు పెరుగుతున్నాయి! ఎక్కడి నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో.. ఎప్పుడు విషనాగు విషం చిమ్ముతుందో తెలియకుండా వుంది. భయంభయంగా వుంది. మొన్న హైద్రాబాద్ నగరంలో దయానందుని పేరుతో నడుపుతున్న పాఠశాలలో నాలుగేండ్ల ఎల్కేజీ పాపపై రెండు నెలలుగా లైంగిక దాడి ఘటన విని మనసు చెలించిపోయింది. స్వయానా పాఠశాల ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం, ఎవరి దృష్టికీ రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
బడులంటే విజ్ఞానం వికసించే స్థలాలు. సాంస్కృతిక విలువల కార్ఖానాలు. పవిత్ర ప్రదేశాలు. అందులో దయానంద సరస్వతి బోధనాదర్శాలతో నడుపుతున్న పాఠశాలలో ఈ వికృత చేష్ట జరగటం మరింత దారుణం. ఇదే రాజధాని నగరంలో ఒక అనాథాశ్రమంలో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగి మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటనా జరిగింది. ఆశ్రయాలు, పాఠశాలలు, కార్యాలయాలు, పని ప్రదేశాలు ఎక్కడయినా సరే ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతున్నది. ముఖ్యంగా చిన్న పిల్లలపై దాడులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఇవి మాత్రమే కాదు ఇలాంటివి దేశం మొత్తంలో పెరిగాయి. విలువలు, సంస్కారం నేర్పాల్సిన ప్రదేశాలలో, భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన పెద్దల నుంచే ఈ మానసిక వికారపు పనులు జరగటం వల్ల విశ్వసనీయత లేకుండా పోయింది. తల్లిదండ్రులు తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతున్నారు. వీరికి భరోసానిచ్చే ప్రయత్నాలేవీ కొనసాగటం లేదు. రక్షణ కోసం చేస్తున్న ఏర్పాట్లూ లేవు.
బడిలో జరిగిన ఈ సంఘటనను చాలా చిన్నదిగా భావిస్తున్న వాళ్లూ వున్నారు. ఆడపిల్లలపై జరిగే లైంగిక దాడుల సందర్భంగా చాలా మంది పాలకులు చేస్తున్న విమర్శలు ఏమంటే, దుస్తులు సరిగా వేసుకోకపోవటం, అర్ధరాత్రిళ్లు ఆడపిల్లలు తిరగటం వల్ల ఇలాంటివి జరుగుతాయని మాట్లాడతారు. మరిప్పుడు నాలుగేండ్ల పసిపాప ఏం రెచ్చగొట్టింది? మతఛాందసవాదులు చేస్తున్న ప్రచారం తప్ప ఆ వాదనలో సత్యం లేదు. వివక్షతలను పెంచి పోషించే మనువాద భావజాలం ఒక వైపు పెరిగిపోతుంటే, రెండో వైపు విచ్చలవిడితనపు ఆలోచనలు విస్తరిస్తున్నాయి. ఆధునికత పేరుతో మనుషులను మర బొమ్మలుగా చేస్తున్న వ్యాపార సంస్కృతి ఆడపిల్లలను కూడా ఒక సరుకుగా చూపెడుతున్నది. సెల్ఫోను, వెబ్సైట్లలో వికృత చిత్రాలు విధ్వంసపూరిత ప్రదర్శనలు యువత మదిని రెచ్చగొడుతున్నాయి. పర్యవసానంగా రోగగ్రస్తమైన మానసికత పెరిగిపోతున్నది. ఒక వైపు వివక్షతల దాడి, మరోవైపు విశృంఖలత దాడి వెరసి సాంస్కృతిక విలువల విధ్వంసం. ఇదీ నేటి పరిస్థితి.
జరుగుతున్న సంఘటనలను కేవలం ఆ సంఘటనకే పరిమితం చేయలేము. అది చర్యగా బయటపడినపుడు మాత్రమే చూడగలుగుతున్నాము. కానీ సమాజంలో ఆ రకమైన దుర్మార్గ ఆలోచనలకు వికృత చేష్టలకు కారణభూతమైన సాంస్కృతిక విధ్వంసాన్ని అరాచకాన్ని అడ్డుకోకపోతే మన భావితరాలు రోగగ్రస్తులుగా తయారవుతారు. హింసించడం, చంపడం, క్రూరత్వానికి పూనుకోవడం మొదలైన దుర్మార్గాలన్నీ వైయక్తికమైనవి మాత్రమే కావు. ఒకానొక అపసవ్య సమాజపు సంస్కృతీ హీనత్వానికి ప్రతిఫలంగానే వాటిని చూడాల్సి వుంటుంది. ప్రజల బాగోగులను చూడాల్సిన బాధ్యత పరిపాలకులపై వున్నది. సమాజ తీరును సరిచేయాల్సీ వుంది. కానీ అందుకు వారు సంసిద్ధంగా లేరు. ప్రజలు అప్రమత్తమవ్వాల్సిన సమయమిది.