Mon 21 Nov 05:50:46.056639 2022
Authorization
జీవితం నువ్వనుకున్నట్టు
పూలనావా కాదు
సుదీర్ఘ ప్రయాణమూ కాదు
అదొక అరణ్య గమనం
భయాలతో భ్రమలతో
దారితప్పి పోవచ్చు
మృగాలనుంచీ ముంపులనుంచీ
బయటపడే పోరాటముంటది
అడుగు అడుగు లెక్కకట్టి
కొన్ని దూరాలను కొలుచుకుని
మజిలీ మజిలీలోనూ
విషాదానందాలను లిఖించుకొని
ఇంకా ఇంకా ఏదో దేవుకునే తచ్చాటే
భూమి ఆకాశం కలుస్తున్న
మాయాదృశ్యాలతో సేదతీరి
తియ్యటి స్వప్నాలను ఒలికిస్తుంది దేహం
నడిసంద్రమెంత నిర్మలంగా నిశ్శబ్దంగావున్నా
చిల్లుపడ్డ పడవలో
బ్రతుకు భద్రత ఊహించుకోవచ్చు
కాలం కొయ్యకు
నిన్ను నీవు తగిలించుకున్నాక
తిరిగిరాని సమయ సమూహాలను
మళ్లీ ఎలా ప్రోది చేసుకుంటావు
గతంకాదు
వర్తమానంలో జీవించటం నేర్చుకో
భవిష్యత్తు రెక్కలు కట్టుకొని వాలుతుంది
కలల ప్రపంచపు సౌందర్యంలో
సరిహద్దులను కొలవటం దేనికి..!?
సంకుచిత భావాలెప్పుడూ
ఉన్నత శిఖరాలపై నిలబడవు
నీతో అంటిపెట్టుకున్న
క్షణాల గొలుసు ముడులను
నీ ముగింపు వాక్యం వరకూ విప్పలేవు
రెండుకొసల్ని ఒకే ముడేసినట్టు
చావు పుట్టుకల్ని కలుపలేవు
ఎందుకంత తపస్సు
రెప్పపాటుకాలం చాలదూ
నిన్ను నీవు అవలోకనం చేసుకునేందుకు
ఓ కొత్త నియమం
నవీన పాదముద్రలకు నాంది
బ్రతుకు ఎండిపోయిందని మండిపోకు
మోడుకు పుట్టిన అంకురం
ఆకులు ఆకులుగా మొలకెత్తి
పూలతో పుప్పొడులతో
పుడమిపై పురివిప్పటం
మోడు లోలోపలి విశ్వాసం
చూపుల చిట్ట చివర
అడవంతా నునుపైన పచ్చని సోయగమే
దరిచేరితేగాని ఎత్తుపల్లాలు
ముళ్లు ముసళ్లు రాళ్లు రాక్షస గూళ్లు
తేటతెల్లం కావు
బ్రతుకొక అడవి
మనలోకి మనమే నిత్యం దెగ్గరవుతూ వుండాలి..!
- డా.కటుకోఝ్వల రమేష్, 9949083327