Sun 11 Dec 00:48:24.454191 2022
Authorization
పాటలతో అలరించి
బాధలల్లొ ఓదార్చి
ఆకలిని మరిపించి
వార్తలన్ని మోసుకచ్చేది
నాన్న దుబాయ్ పోయి తెచ్చిన
ఆ టేపు రికార్డర్!
నాన్న, గాదేశంల పడుతున్న నానా కష్టాలు
క్యాసెట్ల నింపి పంపితే
వాడ కట్టొల్లంత ఒక్కకాడ సేరి విని కళ్ళ నీళ్ళు వెడితే
అవ్వ సోకమెత్తి అర్థ రాత్రి దాక ఏడిసేది!
ఓగ్గు కథ, బుర్ర కథ, దేవదేవుళ్ళ చరిత్ర నుండి
జాన పదాల దాక అవన్నీ వింటుంటే
మా చింత చెట్టు కింద
సాందిరేసి ఆడి పాతున్నట్టే అనిపించేది!
ఏగిళ్లువారంగ రేడియోలో వచ్చే
ఎం.ఎస్ సుబ్బలక్ష్మి సుప్రభాతం
వాకిల్లు ఊడ్వంగ వచ్చే ముత్యాల ముగ్గు
''ముత్యమంత పసుపు'' గీతం ఎంత అద్భుతం!
ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి, జననాట్య మండలి
సమర్పించిన గద్దర్, సంజీవ్, డప్పు రమేష్,
మా భూమి సంధ్యక్క, బెల్లి లలితక్క వందేమాతరం శ్రీనివాస్,
అరుణోదయ నాగన్న, రామారావు, గొస్కుల కొంరన్నా,
వరంగల్ శంకర్ అన్నల గానం చేసిన
విప్లవ గీతాల క్యాసేట్లన్ని
కైకిలి పోయిన పైసల తోటి కొనుడె
పాటలు మల్ల మల్ల వినుడే!
ఇళయ రాజా, బప్పిలహరి, రాజ్-కోటి నుండి
ఏ.ఆర్ మనోజ్ కుమార్, కృష్ణ-నీరజ్, ఏఆర్ రెహ్మాన్ దాక
మాదిగుట్ల కూసొని సంబురంగ
సంగీతాన్ని వినిపిస్తుండే వారున్నట్టే ఉండేది!
ఆత్రేయ, శ్రీశ్రీ, వేటూరి, సినారె నుంచి సీతారామ శాస్త్రి,
డి.దేవవ్రత్, చరబండ రాజు, కలేకూరి ప్రసాద్,
అందేశ్రీ,సుద్దాల అశోక్ తేజ, జి.వై.గిరి, మాస్టర్ జీ,
డిండిగాల రవిందర్, టి.మురళి మధు, పొలిశేట్టి లింగయ్య,
అంజన్ శ్రీ, జాకబ్, నిసార్, కవ్వంపెల్లి స్వామి,
భానూరి సత్యనారాయణ, శక్తి, జయరాజు, దేవేంద్ర,
మిత్ర దాక మా పెరట్ల కూసోని సరదాగ
సాహిత్యాన్ని కూర్చుతున్నారేమో అనిపిచ్చేది!
ఘంటసాల-సుశీల, బాలు-చిత్ర, జానకమ్మ నుండి
జేసుదాసు, హరిహరన్, మిద్దే రాములు,
చుక్కసత్తయ్య, నాజర్, మేరా మల్లేశం,
దికోండ సారంగపాణి, విమలక్క,
భానూరి సంధ్యక్క, ఏక్లైమొంట్
గొల్లపెల్లి రవిందర్ దాక మా వాకిట్ల నిల్చొని
స్వరార్చన చేస్తున్నట్టే తోచేది!
వాళ్ళను నేను ఎవరిని కళ్ళార కనలేదు కానీ
చెవులార వినేవాన్ని మనసార మురిసే వాన్ని
ఆ టేపు రికార్డర్‌ను ప్రేమగా తుడిచే వాన్ని!
అలా బాల్యం నుంచి పాటలు వినీ వినీ
కాకతాళీయంగానే కలాన్ని చేబూని
కాగితాల ఎదలపై పదాలు
కొన్ని పేర్చాను, స్వరకల్పన చేసాను...
గడిపె మల్లేశ్ మహత్యం నా పాట సి.డి లకు ఎక్కింది!
కె.వి రాజమహి దర్శకత్వంలో నా పాట సినీ తెరపైకి వచ్చింది!
మా నాన్న తెచ్చిన ''టేపు రికార్డర్'' నన్ను ఇలా పెంచింది!
- సంపత్ బోయిని, 8341574158