వాడు దేశద్రోహి ఎట్లాయే అయ్యో రామ రామా వీడు ప్రాంతీయ శత్రువు ఎట్లాయె దేవ దేవా
మందికి చూడ కయ్యము గోడ సాటుకు పోయి వియ్యము అయ్యో రాజకీయాలు బహురూపాలు అయ్యయ్యో ప్రజలకు అయ్యేను శాపాలు ''వాడు ''
దసరాకు వస్తిమని కస్సుబుస్సు లాడక పంతులుకు పదివేలం మాకు పప్పు బెల్లాలు మీ పిల్లవాండ్లము గాన మేము వస్తిమి మాకు ఇచ్చిపంపుండ్రి వేగ ''వీడు''
అడగకున్నా ఓటుకు నోటీస్తరు మీ సేవ కోసమే నిలబడ్డ అంటరు నువ్వు ఉరికినా దొరకనే దొరకరు దొరుకుతే ఏందపి అస్సలే అడగరు. ''వీడు దేశద్రోహి''
చెట్టు పేరు చెప్పి కాయలమ్ముతుంటరు గతం చెప్పి నిన్ను హతగతం చేస్తుంటరు అగ్గువ సగ్గువకు అన్ని అమ్ముతుంటరు పదీ పరకకు దొరికిందని గడ్డి వేస్తుంటరు దూప అయినంక బాయి తవ్వు తుంటరు ''వీడు''
తాగిన చోటే దెబ్బ తాకుతుంటది అబ్బా అమ్మా అని విలవిలలాడితే అమ్మ తోడు ఫాయిదా ఏమీ ఉండదు రైతు విద్యార్థి చస్తే శోకం వీని చెవికెక్కదు
ఎంతసేపు పందికొక్కులా తోడుకోవడం వీడు తోటకూర దొరుకైనప్పుడే పట్టుకుంటె గజదొంగై మనల్ని గజగజ వణికియ్యవట్టే ఓటు సోయితో వేస్తే ఈ పాట్లు తప్పు కదా అన్నా తమ్మీ అక్కా చెల్లీ అవ్వా నాయనే ''వీడు'' - జూకంటి జగన్నాథం