Sun 16 Apr 00:13:28.857313 2023
Authorization
కళ్ళు కనురెప్పలను చూడలేవేమో కానీ కనురెప్ప ఎప్పుడూ కంటిని కనిపెట్టుకునే ఉంటుంది. తల్లి మనసూ అలాంటిదే! దూరంగా బిడ్డ ఉన్నా అతని క్షేమం కోసం అనుక్షణం ఆరాట పడుతూనే ఉంటుంది. ఆర్ద్రత నిండుగా ఉన్న ఆమె హృదయ భాండాగారంలోకి చూడగలిగే కొడుకులు ఎందరు?
''అమ్మా! బై! బై!'' అంటూ టాటా చెబుతూ దూరంగా వెళ్లిపోతున్నా కొడుకు 'కిరణ్' ని కళ్ళలో దాచుకోవాలని 'కృష్ణవేణి' ప్రయత్నిస్తుంటే కన్నీళ్లు తావివ్వమంటూ మొత్తమంతా ఆక్రమించుకుంటున్నాయి.
''అరె! నా బిడ్డను కాసేపయినా చూడనివ్వరేం?'' అనుకుంటూ చీర కొంగుతో రెండు కళ్ళను వత్తుకుంది ఆమె.
కన్నీళ్ళతో శుభ్రం అయిన కళ్ళు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కానీ వాటికి కిరణ్ కనిపించలేదు. అప్పటికే అతను రోడ్డు మలుపు తిరిగాడు. మసకగా అన్నా చూసే అవకాశాన్ని నిమిషం కోల్పోయానని ఆమె బాధపడింది. తల్లి మనసు అలాగే ఆలోచిస్తుందేమో!
'అందుకే ఉన్నదానితో తృప్తి పడమనేది. లేని దాని కోసం ప్రాకులాడవద్దనేది' సమయం దొరికింది కదా అని అంతరంగం సామెతలు వదలటం ప్రారంభించింది.
'ఇదొకటి! ఎప్పుడు టైము దొరుకుతుందా అని కాచుకు కూర్చుంటుంది. తనను హాయిగా ఆలోచించుకోనివ్వదు. బాధ పడనివ్వదు' అని విసుక్కుంది మనసులోనే.
'అంతే లేమ్మా! మంచి మాటలు చెబితే ఎవరికీ ఎక్కవు. అదే చెడు మాటలు అయితే బాగా ఎక్కించుకుంటారు. మెచ్చుకుంటారు. ఎన్నిసార్లు తిట్టినా నాకే బుద్ధి ఉండదు. వెంటబడి సుద్దులు చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటాను.'
ఆమెకు వినిపించేట్లే సణుక్కుంది అంతరంగం.
కిరణ్ మళ్ళీ వారం దాకా కనిపించడనే దిగులుతో ఆమె దాన్ని పట్టించుకోలేదు. లేకపోతే దాని అలక తీర్చేదే!
వాడి కోసం ఇప్పటి నుంచే ఎదురు చూపు ప్రారంభం. ఆరు రోజుల తర్వాత కానీ రాడని తెలిసినా!
ఏమిటో ఎప్పుడూ 'కిరణ్! కిరణ్!' అని కొట్టుకుంటూ ఉంటుంది తన చిన్న గుండె. వాడేమో అసలు అదేమీ పట్టించుకోడు. ఒక్కోసారి అనిపిస్తుంది వాడి చేతిలో 'సెల్'నయినా బాగుండేది అని. ఎందుకంటే దానిని ఒక్క క్షణం కూడా వదలడు కదా! ఎప్పుడూ మెసేజ్లిస్తూనో, మాట్లాడుతూనో ఉంటాడు స్నేహితులతో. అలాంటివారు వాడి కెంత మందో? అందులో ప్రాణం పెట్టేవారు చాలా మందే ఉన్నారు. అదీ సంతోషమే!
అందరినీ మెప్పించేవాడు తనతో సరిగ్గా మాట్లాడక నొప్పిస్తాడే. పైగా ''ఏదైనా మాట్లాడరా'' అంటే ''ఏం మాట్లాడను?'' అంటాడు.
ఏం మాట్లాడమని చెప్పాలి? అది కూడా తెలియదా? నేనే చెప్పాలా?
అమ్మతో చెప్పటానికి కబుర్లే ఉండవా?
చిన్నప్పుడు తామిద్దరూ కూర్చుని ఎన్నెన్ని కబుర్లు చెప్పుకునేవారు. వాడు తన పెద్ద పెద్ద కళ్ళను తిప్పుతూ చెబుతుంటే తను కళ్ళార్పకుండా అలా చూస్తూనే ఉండేది. తన దిష్టే తగులుతుందేమోనని దిష్టి తీసేది. ఆ రోజులేనా తనకు మిగిలేది? ఇప్పుడు వాడి ప్రేమను తను పొందలేదా?
కాస్త ఖాళీ దొరికితే చాలు ఎదురింట్లోకి పరిగెడుతాడు. వాళ్ళతో గంటలు గంటలు కబుర్లు. పగలు చాలదు. రాత్రిళ్ళు కూడా. నిద్ర మానుకొని ఒంటి గంట దాకా హస్క్. రమ్మని పిలిస్తే కానీ రాడు. ప్రొద్దున్న పన్నెండు గంటల దాకా లేవడు. ఎంత చెప్పినా వినడు. చెప్పి చెప్పి విసుగు వచ్చి ''ఈ కాలంలో పిల్లలు అంతే'' అని తనకు తనే సరిపెట్టుకోవల్సి వస్తోంది.
వస్తాడు. వెళతాడు. అదేదో దోమల యాడ్ లా. తనకు మాత్రం హాయ్ మమ్మీ, బాయ్ మమ్మీనే మిగిలేది. అదేంటిరా అని నిలదీస్తే 'ఏం చేసాను?' అంటాడు. ఏం చేస్తున్నాడో వాడికి తెలియదా?
ఎంత సేపూ ఆడ పిల్లలతో పార్కులకు వెళ్ళటం, షాపింగుకు పరిగెత్తటం. వచ్చేది ఇక్కడికైనా ఉండేదంతా అక్కడే.
ఈ మధ్య తన భర్త కూడా ఈ విషయంలో విసుక్కుంటున్నారు. 'ఇలాగయితే వాడినసలు రావద్దని చెప్పేసెయ్' అని కూడా అనేసారు.
తాను ఆ మాట అనగలదా? అలా అంటే వాడిని కనీసం చూడను కూడా చూడలేదే?
ఆ బాధ ఆయనకు మాత్రం ఉండదా?
తనది కనిపించే ప్రేమ అయితే ఆయనది కనిపించని ప్రేమ. వాడి విషయంలో ఎంత బాధ పడితేనో కదా అలాగన్నారు. అది అర్ధం చేసుకోడు. దాని వెనుక ఎంత ప్రేమ ఉందో గ్రహించడు.
'ఇంటికి రావద్దంటావా చెప్పు మానేస్తాను' అంటాడు.
ఇవేనా ఈనాటి ఆప్యాయతలు, అనురాగాలు అనిపిస్తుంది ఒక్క క్షణం. ఈ విషయంలో ఎన్నో సార్లు మాటలు తూటాల్లా పేలేవి.
యుద్ధ భీభత్సం అంతా ఇంట్లోనే.
అదే సమయంలో ఉత్తరాఖండ్లో వరదలూ, ఉప్పెనలు. ఆ ఉప్పెనలో కొట్టుకుపోతున్న జనాలు. అంతా ఆర్తనాదాలే!
ఉధృతం నుంచీ బయటపడినా, తమ వారిని కోల్పోయామన్న బాధలో ఒక్కొక్కరి ఏడుపు హృదయాలను ద్రవింప చేస్తోంది.
టి.వీ లలో అన్ని చానల్స్ లో నిరంతరం వార్తలను ప్రసారం చేస్తున్నారు. ఆర్తులను ఆదుకోమని విన్నపాలు స్క్రోలింగ్ లూ కనిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో సహాయం చేయమని ఒకరు చెప్పాలా?
ఇంతలో ఒక బిడ్డ రోదన ''అమ్మా! నాన్నా! నన్ను ఒంటరివాడిని చేసి వెళ్లిపోయారు. నన్నెవరు చదివిస్తారు? చదువంటే నాకు ప్రాణం. మీరిద్దరూ లేనప్పుడు నేనెవరి కోసం బ్రతకాలి?'' అంటూ శవాల మీద రోదిస్తున్న తీరు హృదయాలను కలిచివేస్తోంది.
సరిగ్గా అతనిది కిరణ్ వయసే!
తమకు ఒక్కడే పిల్లాడు. పోనీ అతనిని తీసుకు వచ్చి పెంచుకుని చదివిస్తే. ఆమెలో అనుకోకుండా వచ్చిన ఆలోచన కార్యరూపం దాల్చటానికి ఎంతోసేపు పట్టలేదు.
ఎందుకంటే కృష్ణవేణి, గోపినాథ్లది అన్యోన్య దాంపత్యం. వారిద్దరి మధ్య పొరపొచ్చాలు ఉండవు. మాట తేడాలు అసలే రావు. ఒకరు ఒక మాట అన్నారంటే రెండోవారు అంగీకరిస్తారు.
వెంటనే ఆ ఛానెల్ వారికి ఫోన్ చేసి తామా బిడ్డను దత్తత తీసుకుంటామని ప్రకటించారు.
ఆ విషయం విన్న అతని కళ్ళలో ఆనందభాష్పాలు. దానితో 'ఉదయ్' తమ రెండో బిడ్డ అయ్యాడు. వాడి ప్రేమ చూసాక తను ఇన్నాళ్ళూ ఏం కోల్పోయానని బాధపడుతుందో అది చేరువ అయినట్లుంది.
ఉదయ్ ఉన్నంతసేపూ ''అమ్మా! అమ్మా!'' అంటూ చిన్న పిల్లాడిలా తన చుట్టూ తిరుగుతాడు. ఆదివారం అయిపోతుంటే 'వెళ్ళాలా' అని బిక్క ముఖం వేస్తాడు.
''మళ్ళీ ఆదివారం ఎంతలో వస్తుంది. నువ్వు బాగా చదువుకో. చదువు అయిపోయాక అందరం ఒక చోటే ఉందాం'' అని ప్రతీసారీ చెప్పి అనునయించి చెప్పి పంపాల్సిందే.
రోజూ నిద్రపోయేటప్పుడు ఫోను చేసి ఆరోజు ఏమేమి జరిగింది అంతా వివరంగా చెప్పేవాడు.
'ఏదైనా పని ఉంటే చెప్పండి నాన్నగారూ! చేసిపెడతాను' అని ఉన్న రెండు రోజులూ ఆయన్ని పదే పదే అడిగేవాడు.
ఇదంతా కిరణ్కి కంటికింపుగా లేదని ఆమె గమనించలేదు. అదంతా ఆమె తప్పు కాదు. ఉదయ్ అందించే అనురాగం అలాంటిది. ప్రేమ ఊయలలో వాళ్ళిద్దరినీ ఊగించాడు మరి.
కిరణ్కి తన తప్పిదం ఏమిటో ఇప్పుడు తెలిసి వస్తోంది. అయినా దానిని అంగీకరించలేకపోతున్నాడు.
కన్నకొడుకు కాకపోయినా ఎంత ప్రేమగా చూసుకుంటున్నారు? కనీసం తనని ఒక్క మాట కూడా అడగలేదు. 'ఉదయ్ని తెచ్చుకోవటం నీకిష్టమేనా' అని.
'నిజంగా నువ్వు కన్నకొడుకులా ప్రవర్తిస్తున్నావా? ఏదో సత్రం భోజనం, మఠం నిద్ర అన్నట్లు వచ్చి వెళ్ళేవాడివి. అలాంటి నీకు ఆ విషయం చెప్పకపోయినా తప్పు లేదు' అంతరంగం సమయం చూసి మరో వ్యంగ్య బాణాన్ని విసిరింది. దానికతని దగ్గర సమాధానం లేదు. మౌనం పాటించాడు. అలా అని ఊరుకోలేదు. ఆ కోపాన్ని ఉదయ్ మీద ప్రదర్శించేవాడు. దాన్ని ఆ దంపతులు అడ్డుకునేవారు. అది అసలు భరించలేకపోయేవాడు. ఒక వారం ఇంటికి రావటం మానేసాడు.
'ఇనుము కాలుతున్నప్పుడే మరో దెబ్బ వేయాలి. అప్పుడే వంగుతుంది' అనుకుని అతన్ని పట్టించుకోనట్లే ప్రవర్తించసాగారు అతని అమ్మా నాన్నా.
అది కిరణ్ ని మరింత బాధించింది. మరుసటి వారం తనే బింకం సడలించుకుని ఇంటికి వచ్చాడు.
పైకి మామూలుగా ప్రవర్తిస్తున్నా, లోలోపల ఉదయ్ మీద కక్ష పెంచుకోసాగాడు.
ఎలా అతన్ని దెబ్బ కొట్టాలా అని శతవిధాల ఆలోచించటం ప్రారంభించాడు. కళ్ళు మూసినా తెరిచినా అవే ఆలోచనలు అతని కళ్ళ ముందు మెదిలేవి.
అడ్డు తొలగించుకోవాలని కసి. ''రౌడీలకు డబ్బులిచ్చి కొట్టిస్తే? అప్పుడు ఇంకా వీళ్ళకు ప్రేమ ఎక్కువైపోతోంది''.
''పోనీ మాయం చేస్తే..?''
''అమ్మో! మర్దరా! కొంపతీసి బయట పడిందంటే జీవితాంతం జైలే! అంతకన్నా ఈ బాధే నయమేమో! ''
అతనిలో సంఘర్షణ. లోలోపల నలిగిపోవటం గమనించారు వాళ్ళిద్దరూ.
ఇక అతనిని అంతకన్నా ఘర్షణకు గురి చేయటం మంచిది కాదనిపించింది.
దగ్గరకు తీసుకున్నారు.
అప్పటిదాకా అతనిలో లావాలా పొంగిన కోపం చప్పున చల్లారిపోయింది.
ప్రేమ నది లాంటిది. దాని మహత్యం అంతా ఇంతా కాదు. దానితో కిరణ్ కూడా ఉదయ్ని ప్రేమించటం మొదలుపెట్టాడు. ఒక వయసు వారు కావటంతో తొందరలోనే ప్రాణస్నేహితులుగా మారారు. అలాగే తల్లితండ్రులకు ప్రేమను పంచటంలో కూడా పోటీ పడుతున్నారు.
వారికి ఇంత కంటే కావాల్సింది ఏముంటుంది?
కళ్ళు కనురెప్పను వీడవు. ఇది నిత్యం. ఇదే సత్యం.
- యలమర్తి అనూరాధ, 9247260206