Sun 16 Apr 00:16:49.175372 2023
Authorization
రామయ్య చాలా తెలివిగలవాడు. అతడు చెరువు పల్లెలో నివసించేవాడు. ఒకసారి ఆ ఊళ్లో దొంగతనాలు ప్రారంభమైనాయి. రామయ్య తన ఇంటికి ఏ క్షణానైనా దొంగలు వస్తారని, దొంగతనం చేస్తారని అనుకున్నాడు.
అతడు అనుకున్నట్టే మరునాటి రాత్రి దొంగలు అతని ఇంటికి వచ్చారు. వారు వచ్చిన సంగతే నిద్రపోయిన రామయ్యకు తెలియదు. అతడు తెల్లవారి లేచి చూసేసరికి తన ఇంటి తలుపులు బార్లాతెరిచి ఉన్నాయి. ఆ తెల్లవారి ఒకచోట గుమికూడిన ప్రజలు ''ఎవరెవరి ఇళ్ళల్లో దొంగలు పడ్డారు? ఏమేమి సామాన్లు పోయాయి'' అని చెప్పుకుంటున్నారు.
రామయ్య కూడా అక్కడికి వెళ్లి తన ఇంట్లో కూడా దొంగలు పడ్డారని చెప్పాడు. అప్పుడు అక్కడ గుమికూడిన ప్రజలు ''అయ్యో! ఇంత తెలివిగలవాడైన రామయ్య ఇంటిలో కూడా దొంగలు పడి దోచుకుని పోయారంటే వారు సామాన్యులు కాదు'' అన్నారు.
అప్పుడు రామయ్య ''నేను నా ఇంటిలో దొంగలు పడ్డారని చెప్పాను గాని ఏమి ఎత్తుకుపోయారో మీకు చెప్పలేదు కదా! అనవసరంగా ఏమేమో ఎందుకు ఊహిస్తారు. నా ఇంట్లో ఒక్క పైసా కూడా పోలేదు'' అని అన్నాడు.
రామయ్య చెప్పింది విని అక్కడున్నవారంతా అందరూ ఆశ్చర్య పోయారు. ఒకడు ''మరి బంగారం'' అని అడిగాడు. ''అది కూడా పోలేదు'' అన్నాడు రామయ్య. అతని మాటలకు అందరూ ఆశ్చర్య పోయారు.
''నిన్న ఆ దొంగలు మన గ్రామంలోని ఐదు ఇళ్ళను దోచుకుని వెళ్లారు తెలుసా? అందరూ తమ తమ విలువైన వస్తువులు డబ్బు పోయిందని చెబుతున్నారు. మరి నీవేమో నీ వస్తువు ఏదీ పోలేదని చెబుతున్నావు. ఎందుకు అబద్దాలు ఆడతావు'' అని ప్రశ్నించాడు గ్రామ పెద్ద.
అప్పుడు రామయ్య ''నేను అబద్దాలు ఆడడం లేదండీ! మా ఇంట్లో నేను దాచుకున్న డబ్బు, బంగారం అన్నీ అలాగే ఉన్నాయి. కావాలంటే నేను వాటిని చూపిస్తాను పదండి'' అని వారిని తన ఇంటికి తీసుకొని వెళ్ళి తన బంగారాన్ని, డబ్బును వారికి చూపించాడు.
''మరి నువ్వు బంగారాన్ని, డబ్బును ఎక్కడ దాచావు'' అని ప్రశ్నించాడు గ్రామపెద్ద.
అప్పుడు రామయ్య ''అలా అడగండి... చెబుతాను. మన ఊళ్లో దొంగల భయం ఉందని తెలియగానే నా డబ్బును పుస్తకాల మధ్యలో అక్కడక్కడా పెట్టి దాచాను. ఆ దొంగలు ఇల్లంతా వెతికారు కానీ వారికి అక్కడ ఏమీ దొరకలేదు. దొంగలు పుస్తకాలు జోలికి వెళ్లరు కదా! నా ఊహ నిజమై నా డబ్బు నాకు దక్కింది'' అని అన్నాడు.
అప్పుడు మరొకరు ''మరి బంగారాన్ని ఎక్కడ దాచారు? పుస్తకాల్లోనేనా'' అని రామయ్యను ప్రశ్నించారు.''
''లేదు... లేదు... దాన్ని నా టిఫిన్ క్యారియర్ లో పెట్టి ఇంట్లో పైన వేలాడదీశాను. అది బయటనే వేలాడదీశాను. దొంగలకు ఏమీ అనుమానం రాలేదు'' అన్నాడు రామయ్య.
''మరి ఒకవేళ అతనికి ఆ రాత్రి ఆకలైతే ఆ టిఫిన్ క్యారియర్ తీసి చూసేవారు కదా!'' మరొకరు అన్నారు.
దానికి రామయ్య ''అయ్యో! అర్ధరాత్రి ఎవరికైనా ఆకలి అవుతుందా! ఒకవేళ ఖర్మ కాలి ఆకలి అయిందనుకో! అప్పుడు ఆ వేలాడే టిఫిన్ క్యారియర్లో అన్నం ఉందని ఎవరైనా అనుకుంటారా! వంటింట్లోకి వెళ్లి చూస్తారు కానీ!'' అన్నాడు. అతడు రామయ్య తెలివిని మెచ్చుకున్నాడు.
అందరూ రామయ్యను దొంగల బారి నుండి తమ విలువైన వస్తువులు ఎక్కడ దాచాలో చెప్పమని బ్రతిమిలాడారు. రామయ్య వారితో ''ఇది బయటకు చెప్పే విషయం కాదు. అత్యంత రహస్యం'' అంటూ ఒక్కొక్కరి చెవిలో ఒక్కొక్క చోటును చెప్పాడు.
మరి కొద్ది రోజులకు వచ్చిన దొంగలను రామయ్య సలహాతో ఆ గ్రామస్తులు పట్టుకున్నారు. దానితో దొంగల పీడ విరగడై మరెన్నడూ చెరువు పల్లెతో పాటు మిగతా ఊళ్లలో దొంగతనాలు జరగలేదు. అందరూ రామయ్య తెలివిని ప్రశంసించారు.
- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య, 9908554535