Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రేమించే వయసు వచ్చాక యువహృదయాల్లో చెలరేగే తలపుల ప్రవాహానికి అంతు ఉండదు. కొత్త కొత్త కోరికలు, ఏవేవో తెలియని అనుభూతులు, వింత వింత పరవశాలు.. ఇలా ఇవన్నీ ప్రేయసీ ప్రియుల హదయాలను గిలిగింతలతో ముంచెత్తేవే. తనను చేరిన తోడు తన జీవితంలో తెచ్చిన కొంగ్రొత్త మార్పుకు.. ప్రేయసి, అలాగే - తనను చేరిన నీడ తన మనసున కలిగించిన సరికొత్త సంతోషానికి.. ప్రియుడు - ఒకరికొకరు రుణపడిపోతుంటారు. ఇదే ఆనందం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటుంటారు. ఈ అనురాగపు తీయందనాలకు ప్రతీకగా, ఈ రుణానుబంధానికి సంకేతంగా నిలిచిన అద్భుతమైన పాటను 'నిశ్శబ్దం' (2020) సినిమాలో 'శ్రీజో' రాశాడు.
ప్రియుడి రాక వల్ల ప్రేయసి జీవితంలో కలిగిన మార్పు ఆమె ఉజ్జ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతుంది. అది మధురాతిమధురంగా ఆమెకు తోస్తుంది. అందుకే నీ రాక వల్ల మనసున ఏదో తెలియని పరవశం చెలరేగిందని, అది మధురంగా ఉందని, మొట్టమొదటిసారిగా ఎదని హాయిగా తాకే మేలుకొలుపు స్వరాన్ని విన్నానని, ఆ స్వరం నీదేనని, అది నీ హదయం నుంచి ప్రయాణమై నన్ను చేరిన మహిమ అని ప్రేయసి ప్రియునితో తన అనుభూతిని తెలియజేస్తుంది.
ప్రియునితో ప్రేయసి చేసే ఈ స్నేహం, సాగించే ఈ ప్రయాణం తనకు తననే కొత్తగా చూపించిందట. అది అరచేతిలోకి ఆకాశాన్ని దించినంత కొత్తగా.. అరచేతిలో ఆకాశాన్ని చూపించడం అసాధ్యమే. కాని అతనితో చేసే వలపు ప్రయాణం ఆకాశాన్ని అరచేతుల్లో దింపుకునేంతటి ధైర్యాన్ని, విశ్వాసాన్ని, అంతటి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగించిందని ఇక్కడ అర్థం. కలలన్నీ రంగు రంగుల విన్యాసాన్ని తెలిపాయి. జీవితం సంతోషాల వెల్లువలో పరుగులెత్తుతుంది. ఇదంతా నీ చెలిమి మాయేనని ప్రేయసి ప్రియునితో అంటున్న మాటలివి.
నీతో కలిసి చేసే ఈ ప్రయాణం నేనడగని ఒక వరం. నేను కోరకుండానే అది నన్ను చేరింది. స్నేహమంటే ఇంత అందంగా ఉంటుందా? అని అనిపిస్తుంది. నాకు ఒక కొత్త జన్మ ఎదురైందా? నేను కొత్తగా మళ్ళీ పుట్టానా? అన్నంత హాయిగా ఉన్నానని, నాలోని మౌనమంతా ఒక కావ్యమై నేడు కరిగింది వినమని..అంటూ ప్రేయసి తన భావనను వినిపిస్తుంది.
ఆమె పొందిన పరవశాన్నే ప్రియుడు కూడా పొందుతున్నాడు. ఆమె తలపులతోనే బ్రతుకుతున్నాడు. అందుకే.. నీ హదయం సముద్రమైతే, నా ఇల్లు మేఘాల్లో ఉంది. అప్పుడు నా ప్రణయం చినుకై నీ వైపు చేరుతుంది. నీలో కలుస్తుంది. నీ కదలిక ఓ గానమైతే, దానికి నా ఊపిరే గమకమౌతుంది. అది నీ ప్రాణమై స్పందిస్తుంది. నిజానికి నువ్వు అంటే నేనే. ముమ్మాటికీ అది నిజమే. మనసు ఒకటై, మనమే ప్రేమై కలకాలం జతగా, హాయిగా కలిసి ఉండిపోవాలి. అంటూ ప్రియుడు తన ఎదలోని ప్రేమమాధుర్యాన్ని ప్రేయసితో పంచుకుంటాడు.
చాలా చక్కనైన పదాలతో, చిక్కనైన భావాలతో సాగిన పాట ఇది. అందమైన ప్రేమబంధానికి భాష్యం చెప్పిన పాట ఇది. ప్రేయసీ ప్రియుల హృదయాల్లోని ప్రేమను ఎంతో సున్నితంగా ఆవిష్కరించిందీ పాట..
పాట
మధురమిదే మధురమిదే
మనసున ఈ పరవశమే
తొలిసారి ఎదని తడుముతూ
మేలుకొలుపే స్వరమే విన్నా
అది నీ ఎద నుండి పయనమై నన్ను చేరే మహిమ..
అరచేతిలో గగనం చూపింది ఈ చెలిమే
వర్ణాల విన్యాసం తెలిపె కలలే
నీతోటి సావాసం నేనడగనీ వరమే
ఇంత అందమా స్నేహం..
నీతో కొత్తలోకం ఊహించనిదే
మరుజన్మై ఎదురైతే నాలో మౌనమంతా కావ్యమై కరిగింది వినమని..
కడలేమో నీ హదయం మేఘాన నా నిలయం
ప్రవహించే నీ వైపే చినుకై ప్రణయం
నీ కదలికే గానం నా ఊపిరే గమకం
స్పందించే నా ప్రాణం..
నువ్వంటేనె నేను..అంటే నిజమే
మనసొకటై అది మనమై ప్రేమై కాలమంతా ఉండిపో గుండెల్లో జతపడి..
- తిరునగరి శరత్ చంద్ర,
6309873682