Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక చేయి రక్షిస్తే, మరో చేయి ఖడ్గమై ప్రాణాలను తీస్తుంది .(అవినీతిపరుల ప్రాణాలను) అలాంటి వారు తూర్పు పడమరలుగా, ఎదురెదురుగా నడుస్తూ ఉంటారు. ఒకరు శస్త్రమైతే మరొకరు మరణశాస్త్రమై యుద్ధానికి ఆనవాళ్ళుగా నిలబడతారు. అలా నిలబడిన సందర్భంలో ఎవరిది గెలుపో, ఎవరిది ఓటమో ఎలా తేల్చుకోవాలి అనే ప్రశ్న కూడా పుడుతుంది. స్నేహమే మళ్ళీ విడిపోయిన వారిరువురిని కలుపుతుంది కూడా. అనే భావన ఈ పాటలో అంతరార్ధం. స్నేహబంధం విలువను తెలుపుతూ, అది ఎలాంటి వారినైనా కలిపే సమ్మోహనాస్త్రమని సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ పాట ద్వారా వివరించాడు.
పాట
పులికి విలుకాడికి తలకి ఉరి తాడుకి/కదిలే కార్చిచ్చుకి కసిరే వడగళ్ళకి/రవికీ మేఘానికీ దోస్తీ దోస్తీ/ఊహించని చిత్ర విచిత్రం
స్నేహానికి చాచిన హస్తం/ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో/బడబాగ్నికి జడివానకి దోస్తీ/విధిరాతకి ఎదురీతకి దోస్తీ/పెను జ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ
అనుకోని గాలి దుమారం/చెరిపింది ఇరువురి దూరం
ఉంటారా ఇక పై ఇలాగ వైరమే కూరిమై/నడిచేది ఒకటే దారై
వెతికేది మాత్రం వేరై/తెగిపోదా ఏదో క్షణాన స్నేహమే ద్రోహమై/ఓ తొందర పడి పడి ఉరకలెత్తే
ఉప్పెన పరుగుల హూ../ముందుగ తెలియదు ఎదురు వచ్చే
తప్పని మలుపులే హూ..
ఒక్క చేయి రక్షణ కోసం/ఒక్క చేయి మృత్యువిలాసం
బిగిశాయి ఒక్కటై ఇలాగ తురుపు పడమర/ఒక్కరేమో దారుణ శస్త్రం ఒక్కరేమో మరణ శాస్త్రం/తెర తొలిగిపోతే ప్రచండ యుద్ధమే జరగదా/తప్పని సరి అని తరుణమస్తే జరిగే జగడములో/ఓటమి ఎవరిదో గెలుపెవరిదో తేల్చే వారెవరో..
సీతారామశాస్త్రి అంటేనే గంభీర మైన పదబంధాలకు, ఉన్నతమైన భావసౌందర్యాలకు పెట్టింది పేరు. గీతరచయితగా ఆయన తొలి సినిమా అయిన 'జననీ జన్మభూమి'(1984) మొదలుకొని ఇప్పుడు రాబోతున్న'RRR', 'ఏం చేస్తున్నావ్?' సినిమాల వరకు పరిశీలించినట్లయితే ప్రతీపాట ప్రత్యేకమే. సందర్భాన్ని కవిత్వం చేయడానికి ఆయన పడే తపన అంతా ఇంతా కాదు. అతనిలో ఒక సాగరమథనమే జరుగుతుంది. ఏ కవికైనా ఇది జరిగేదే. కాని, సినీకవికైతే మరీ తప్పనిసరి అని చెప్పాలి. ఒక పాటను ఎంతవరకు కవితాత్మకంగా తీర్చిదిద్దాలి.. దాని పరిధి ఎంత.. అని ఆలోచించుకునే సూక్ష్మ దృష్టి, సమయ స్ఫూర్తి సీతారామశాస్త్రికి ఉంది. అందుకే.. ప్రతీపాటలో హిమాలయ మంత ఎత్తుగా, అగాథమంత లోతుగా, పైరగాలి అంత స్వచ్ఛంగా, నిర్మలంగా శబ్దభావబంధాల్ని ఇమిడ్చి మనకందిస్తాడు. అందుకే మరి వాటికంత మేలిమి.
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న 'RRR', సినిమా కోసం సీతారామశాస్త్రి రాసిన టైటిల్ సాంగ్ ఎంతో ప్రత్యేకమైనది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ పాటే ఆ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ.. సినిమాకథ అంతా ఆ పాటలో ప్రతిఫలిస్తుంది. 'అల్లూరి సీతారామరాజు', 'కొమురం భీం' వంటి వీర యోధుల సాహస కృత్యాలను మనం ఈ సినిమాలో చూడవచ్చు. అయితే అల్లూరి ఆశయం వేరు. కొమురం భీం ఆశయం వేరు. ఇద్దరి ఆలోచనల తీరులోన చాలా తేడా ఉంది. వారిద్దరి మధ్యన దోస్తీ కుదరడమన్నది ఆశ్చర్యకరమైన విషయం. ఆ విషయాన్ని ఈ పాటలో అద్భుతంగా చెప్పాడు సీతారామశాస్త్రి. అతను నేడు మన మధ్య లేకున్నా అతని పాట శాశ్వతంగా మనకు వినబడుతూనే ఉంటుందన్నది వాస్తవ సత్యం.
సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్య్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు అల్లూరి సీతారామరాజు. గిరిజనుల కోసం నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా శైలిలో పోరాటం చేసినవాడు కొమురం భీం. ఒకరు పులి అయితే మరొకరు విలుకాడు. ఒకటొకటికి పరస్పర విరుద్ధం. ఎప్పుడూ పోరు ఉంటుంది. ఇక్కడ - పులి కొమురం భీం అయితే విలుకాడు అల్లూరి. ఈ ఇరువురిని కదిలించేది మాత్రం ఆకలి, ఆత్మరక్షణ. పులికి, విలుకాడికి దోస్తీ కుదిరితే ఎలా ఉంటుందో అల్లూరికి, కొమురం భీంకి దోస్తీ కుదిరితే అలా ఉంటుందన్న మాట. అంతే కాదు- తలకి, ఉరితాడుకి కూడా వైరుధ్యమే. కదిలే కార్చిచ్చుకి, కసిరే వడగళ్ళకు కూడా దోస్తీ కుదిరిందని చెబుతున్నాడు. నిప్పు, నీరు వంటి రెండు విరుద్ధమైన భూతాల మధ్య విచిత్రమైన స్నేహం కుదిరినట్లుగా వివరిస్తున్నాడు. సూర్యుడికి, మేఘానికి కూడా పడదు. సూర్యున్ని మేఘం కప్పేస్తుంది. సూర్యుడు అగ్ని స్వరూపం. మేఘం జల స్వరూపం. అవి ఒకదానికొకటి ఆకాశాన్ని అలుముకొని వెలుగు చీకట్లను ప్రసాదిస్తాయి. ఇలా మనం పైన చెప్పుకున్న ప్రతీ ఒకటి బద్ధ శత్రువులే అయినా అవి అనుకూలిస్తే ప్రశాంతం. చెలరేగితే ప్రమాదమని చెబుతున్నాడు. అందుకే వాటి మధ్య వైరం కన్నా స్నేహం ఉండాలని అంటున్నాడు కవి.
ఇక్కడ - అల్లూరి, కొమురం భీం ఇద్దరి గమ్యాలు వేరు. కాని వారు వెళ్ళే దారి ఒకటే. అదే పోరాటం.. అందుకే వారిద్దరి మధ్యన వైరం ఉన్నదన్న విషయం చెప్పబడింది. వారి దారి ఒకటే కావున ఆ వైరం స్నేహమైతే బాగుంటుందని కూడా చెప్పబడింది. ఊహించని చిత్ర విచిత్రంగా వీరిద్దరికి స్నేహం కుదిరింది. కాని, ఆ స్నేహం చిరకాలంగా ఉంటుందో? లేదో? అది ప్రాణాన్ని పోస్తుందో? తీస్తుందో? తెలియని సందిగ్ధావస్థను కూడా ఈ పాటలో తెలియజేయబడింది. ఒకరు బడబాగ్నిలా కడలిలో రగిలితే, మరొకరు జడివానలా కుండపోతగా కురుస్తారు. విధిరాతకు, ఎదురీతకు మధ్యన కుదిరిన స్నేహమిది. అలాంటి పరస్పర భిన్న ధ్రువాల వంటి ఆలోచనలు కలిగిన వీరిని స్నేహమనే బంధం అందంగా కలిపింది. ఈ పాటలో - 'పెనుజ్వాలకి హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ' అనే ప్రయోగం చాలా గొప్పది. అంటే - ఎత్తుకెగిసిన జ్వాలలకి కరిగిన మేఘం నింగి నుంచి వర్షమనే కౌగిలితో ఆ జ్వాలలను తాకి ఆవిరవుతుంది. అలా ఇద్దరి మధ్యన ఏర్పడిన బంధం కొన్ని కారణాల వల్ల విడిపోతుంది. దూరం పెరుగుతుంది.
దేశ ప్రజల కష్టాల కోసమే పోరాటం చేస్తున్నవారు కాబట్టి వారిద్దరిని ఆ పోరాట లక్ష్యమే కలిపింది. ఈ శత్రుత్వమే స్నేహమైంది.. కాని, మళ్ళీ ఆ స్నేహమే శత్రుత్వమైతే ఎలా? వారిద్దరి మధ్య అపార్థాలు చెలరేగితే ఎలాంటి పరిస్థితులు, ప్రమాదాలు, ఘర్షణలు ఎదురవుతాయో కదా? అంటూ కథను, చిత్ర సన్నివేశాల్ని ఈ పాట ద్వారా కళ్ళముందుంచుతాడు సీతారామశాస్త్రి. సినిమాలో బ్రిటిష్ వారి అకృత్యాల వల్ల వారిరువురి స్నేహం తొలగి శత్రుత్వం ఏర్పడుతుంది. అదే విషయాన్ని ఈ పాటలో పొదిగి చెప్పాడు. ఉరకలెత్తే వారి ప్రయాణంలో ఉప్పెనలవంటి పరుగుల వల్ల ఏవో తెలియని మలుపులు ఎదురై వారిని విడదీస్తుంది.
ఒక చేయి రక్షిస్తే, మరో చేయి ఖడ్గమై ప్రాణాలను తీస్తుంది .(అవినీతిపరుల ప్రాణాలను) అలాంటి వారు తూర్పు పడమరలుగా, ఎదురె దురుగా నడుస్తూ ఉంటారు. ఒకరు శస్త్రమైతే మరొకరు మరణశాస్త్రమై యుద్ధానికి ఆనవాళ్ళుగా నిలబడతారు. అలా నిలబడిన సందర్భంలో ఎవరిది గెలుపో, ఎవరిది ఓటమో ఎలా తేల్చుకోవాలి అనే ప్రశ్న కూడా పుడుతుంది. స్నేహమే మళ్ళీ విడిపోయిన వారిరువురిని కలుపుతుంది కూడా. అనే భావన ఈ పాటలో అంతరార్ధం. స్నేహబంధం విలువను తెలుపుతూ, అది ఎలాంటి వారినైనా కలిపే సమ్మోహనాస్త్రమని సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ పాట ద్వారా వివరించాడు.
( ప్రముఖ సినీగేయరచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి నివాళిగా...)
- తిరునగరి శరత్ చంద్ర