Authorization
Mon April 07, 2025 12:37:37 pm
నిదురనో
మెలకువనో అర్థంకాని ఊగిసలాటగా కలవరపెడుతూనె
కళ్ళ ఆకురాళ్ళపై
కత్తులు నూరుతుంది
రాత్రి
ఒక్కుమ్మడిగా
తలలోకి చొరబడిన
కురులన్నీ
గజిబిజిగా
అల్లుకుపోతాయి.
విడదీయరాని చిక్కు.. చిరాకు..
చిత్రవిచిత్రమైన ఊహలు,
ఆలోచనలు,
జ్ఞాపకాలు, కలలు, కల్లలు
చిక్కని చీకట్లో
ఆ చిక్కుల సాలెగూడులో
విడదీస్తున్నాననుకునే భ్రమలో
ఇరుక్కు పోతుంది మనసు.
అదో... కళ్ళులేని నల్లతుమ్మెద.
ఆడని రెక్కలతో
అటూ ఇటూ కొట్టుకుని
ఏమీ చేయలేక
ఎటూ కదల లేక
అలసి సొలసి
మత్తిల్లి పడిపోతుంది.
అప్పుడు
వచ్చి వాలుతుంది నిదుర
ఏమి చెప్పకుండానే
కనీసం ఏ సంకేతమూ లేకుండానే
ఒక నడిరాతిరి
కనురెప్పలకు హాయిజిగురు అలదినట్లుగా...!
- మడిపల్లి రాజ్‌కుమార్
9949699215