Authorization
Fri April 04, 2025 03:46:58 pm
గాయాలు నడుస్తాయి
గాయాలు నవ్వుతాయి
గాయాలు ఏడుస్తాయి
శీతోష్ణ సుఖదుఃఖాలకు
చలించే గాయాలు
ఈ భూమ్మీద
ఇంకా సజీవంగానే ఉన్నాయి.
ఒకింత మాంసం
ఒకింత చీమూ నెత్తురు
కలగలిసిన గాయాలీ
రంగస్థలంపై
నకిలీ నవ్వు
పులుముకుంటాయి.
అవి ఎంతకైనా తెగిస్తాయి.
కట్నాల సంతలో
కొడుకుల్ని నిలబెట్టి
ముక్కు పిండి
వసూలు చేస్తాయి.
కొన్ని గాయాలు
రుతువుల చట్రంలో
దీనంగా తల వాల్చి
వధ్యశిలపై
బలిపశువులు అవుతాయి.
ధన సమూహ ప్రయత్నంలో
జన సమూహహననానికి కూడా
వెనుకాడవు.
కూటికీ నీటికీ
అంగలార్చే మరికొన్ని గాయాలు
రాత్రంతా పిచ్చిగా తిరుగాడి
ఏ వేకువజామునో
ప్రమత్త స్థితిలో
కూలపడతాయి.
ఇప్పుడు దెబ్బతిన్న గాయాలకు
స్వాంతన చేకూర్చడమే
మనముందున్న కర్తవ్యం.
- ఆవుల వెంకటరమణ
9494088110