Authorization
Thu March 20, 2025 08:33:23 am
- సమన్వయ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-సిటీబ్యూరో
వచ్చే నెల 1 నుంచి 10 తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామనీ, విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో రాకుంటే అనుమతించమని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఛాంబర్లో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సెంటర్లలో విద్యార్థులకు అవసరమైన తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతామని, పరీక్షల సందర్భంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఆయా శాఖల సహకారంతో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు. పరీక్షల సందర్భంగా ఆర్టీసీ సర్వీసులు, విద్యుత్‌కు అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 121 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామనీ, 64,490 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో డీఐఈవో ఒడ్డెన్న, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.