Authorization
Wed March 19, 2025 12:27:12 pm
- రాంకీ ప్రతినిధులకు స్పెషల్ సీఎస్ అరవింద్‌కుమార్
- జవహార్‌నగర్ డంపింగ్‌యార్డు పరిసరాల్లో పర్యటన
- ఆయా శాఖల అధికారులతో సమీక్ష
నవతెలంగాణ-సిటీబ్యూరో
జవహార్‌నగర్ డంపింగ్‌యార్డు నుంచి వచ్చే లీచెట్‌ను శుద్ధి చేయడానికి ప్లాంట్ పనులను త్వరగా పూర్తిచేయాలని రాంకీ ఎన్వీరో ప్రతినిధులను రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ ఆదేశించారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, వాటర్‌బోర్డు, హెచ్ఆర్డీసీఎల్, ఎస్ఎన్డీపీ, రాంకీ, జవహార్‌నగర్, నాగారం, దమ్మాయిగూడ ప్రజాప్రతినిధులతో కలిసి బుధవారం అరవింద్‌కుమార్ పర్యటించారు. జవహార్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్, నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మూడు ప్రాంతాల్లో ఉచిత తాగునీటి సరఫరా పథకాన్ని అమలు చేయాలని వాటర్‌బోర్డు అధికారులకు సూచించారు. హెచ్ఆర్డీసీఎల్ ఆధ్వర్యంలో 26.15కిలోమీటర్ల మేర 10 మిస్సింగ్, లింకు రోడ్ల పనులు టెండర్ దశలో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు నీటమునగకుండా వరదనీటి కాలువలను నిర్మించాలని ఎస్ఎన్డీపీ అధికారులను ఆదేశించారు.
చెరువుల మరమ్మతులు సీసీ రోడ్ల నిర్మాణం వంటి పనులను పూర్తిచేయాలని హెచ్ఎండీఏ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, ప్రజారోగ్యశాఖ ఈఎన్సీ ఆర్.శ్రీధర్, జీహెచ్ఎంసీ ఈఎన్సీ జియావుద్దీన్, అధికారులు పాల్గొన్నారు.