Authorization
Wed March 19, 2025 07:08:57 am
- తమిళనాడు మాజీ గవర్నర్ పీఎస్ రామ్మోహనరావు
- జస్టిస్ ఎన్వీరమణకు అక్కినేని జీవన సాఫల్య పురస్కారం ప్రదానం
నవతెలంగాణ-కల్చరల్
సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తన 16 నెలల పదవీకాలంలో న్యాయవ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని తమిళనాడు మాజీ గవర్నర్ పీఎస్ రామ్మోహనరావు అన్నారు. న్యాయపర సంస్కరణలు చేయాలని ఆలోచన ఆయనకు ఉన్నా పదవీ కాలం సరిపోలేదని అభిప్రాయం వ్యక్తంచేశారు. శుక్రవారం తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్ కళా మందిరంలో ప్రముఖ సాంస్కృతిక సాహితీ సంస్థ రసమయి నిర్వహణలో అక్కినేని రసమయి జీవన సాఫల్య పురస్కారం సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ప్రదానోత్సవ సభ ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. రామ్మోహనరావు హాజరై మాట్లాడుతూ హైకోర్టులలో న్యాయమూర్తుల నియామకం పెద్ద ప్రహసనం అని, సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వానికి మధ్య సామరస్యత ఉంటేనే నియామకాలు సాధ్యమని వివరించారు. సభా అధ్యక్షత వహించిన మాజీ ఎంపీ డాక్టర్ సుబ్బిరామి రెడ్డి మాట్లాడుతూ అక్కినేనికి సంస్కృతి సంప్రదాయంపై మక్కువ ఎక్కువ అని, రమణకు భాషా సంస్కృతిలపై గౌరవమని పోల్చారు. ప్రముఖ కవి ఆచార్య కొలకలూరి ఇనాక్ మాట్లాడుతూ విశ్వ మానవ ప్రేమను అరాధించిన అక్కినేని పురస్కారం రమణకు బహుకరించటం సముచితంగా ఉందన్నారు. నటుడు మురళీ మోహన్, శాంత బయోటెక్ అధినేత డాక్టర్ వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణ, దీక్ష, పట్టుదల అక్కినేనిని, రమణను గ్రామంలో సామాన్యుల స్థాయి నుంచి అసమాన్యుల స్థాయికి చేర్చాయని కొనియాడారు. అక్కినేని కుమార్తె నాగ సుశీల, మనుమరాలు సుప్రియ, నరసింహప్ప తదితరులు పాల్గొన్న సభకు డాక్టర్ రాము స్వాగతం పలుకుతూ అక్కినేనితో తన సన్నిహిత్యాన్ని వివరించారు. అంతకు ముందు డాక్టర్ రాము రచించిన అక్కినేని నత్య రూపకం కళాకారులు హృద్యంగా ప్రదర్శించారు.