Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మా నాన్న కుమ్మరి. మా ఇంటి ముందు ప్రతి రోజు స్వయంవరం ఉంటుంది. ఈ స్వయం వరం పద్ధతే వేరు. కొలిమిలో బాగా కాలిన అందమైన కుండలు, కండ్లకు ఆకర్షించే కూజలు, చిన్న చిన్న పెరుగు పాత్రలు చక్కగా అలంకరించబడి తమ తమ సొగసులతో వేచి ఉంటాయి.
మా నాన్న ముంగలిలో మంచం వేసుకొని దానిపై కూర్చొని గడ గడా హుక్కా తాగుతూ వచ్చే పోయే వాళ్లను గమనిస్తూండే వాడు. మమ్మల్ని ఎన్నుకునే ప్రతివాడికి అతనిదో షరతు ఉండేది.
ఓ సారి పన్నేండేళ్ల కుర్రాడొక డొచ్చాడు. అతడు అక్కడున్న అన్ని కుండల్లోంచి నన్ను ఎన్నుకున్నాడు. రెండు చేతుల్లో నన్ను ఎత్తుకున్నాడు. నన్ను తన వేళ్లతో కొట్టి చూశాడు. అటు ఇటు తిప్పి చూశాడు. నాకు ఈ కుర్రాడు బాగా నచ్చాడు. అతని మెడలో స్వయంవరం పూల దండ వేయాలనిపించింది. నాకు మా కుమ్మరి నాన్న స్వయవరం షరతు పెట్టుతాడు. దీన్ని అమలు పరచడం ఆ కుర్రాడి కర్తవ్యం.
ఇంతలో ఓ స్త్రీ లోనికొస్తూ అంది, ''అరె మంకా నువ్వు ఇటెలా వచ్చావు?''
నాకర్థం అయిపోయింది. అందమైన ఆ కుర్రాడి పేరు మంకె అని. ఆ వచ్చిన స్త్రీ అతడి అమ్మ అని తెలిసిపోయింది.
మంకా వెంటనే జవాబిచ్చాడు, ''అమ్మ మర్చిపోయావా? ఇవ్వాళ కొత్త కుండ కొనవా?''
మంకె నన్నెత్తుకొని మంచంపై కూర్చున్న మా నాన్న దగ్గరికెళ్లాడు. మా నాన్న తన షరతును తెలిపాడు.
''మూడు ఆణాలు''
మంక అమ్మ తన కొంగులోంచి డబ్బులను తీసి లెక్క పెట్టసాగింది. ఇక నా తనువులోంచి పప్పు సువాసన వెదజల్లుతుందనుకున్నాను. నా లోనుంచి బియ్యం పరిమళం వస్తుంది. నా కన్యతనం ముగిసిపోతుంది. నాకు అంపకం జరుగుతుంది. నేనీ ఇంటికి పరాయిదాన్నైపోతాను. నా మంకె నాలో ఉన్నవి కెలకి కెలకి ఆరగింస్తాడు. అత్తమ్మ నన్ను ప్రతి రోజు బూడిదతో బాగా తోమి తోమి శుభ్ర పరుస్తూంటుంది.
''మంకె కుండ తీసుకోవాలి. కాని నా దగ్గర కేవలం మూడు అణాలే ఉన్నాయి. పప్పేలా కొనను. ఉప్పు కారం ఎక్కణుంచి తీసుకొని రాను?''
ఒకేసారి నా సున్నిత మనసు చలించిపోయింది.
''అమ్మ... కుండ తీసుకోకుండా నువ్వు పప్పు ఎందులో వండుతావు?'' నా మంకె ఓ మంచి మాట అన్నాడు.
అమ్మ ఓ నిమిషం నిశ్శబ్దంగా ఉండి అంది, ''ఇవ్వాళ పప్పు ఉడకదు. రెండు అణాల బెల్లం తీసుకొంటాను. దానితోనే రొట్టెలు తినేద్దాం.
నా మంకె నా వైపు మరో సారి చూశాడు. ఓ చూపు గుమ్మం వైపు వేశాడు... నా మంక నాకు పథ్విరాజ్ చౌహాన్ లా అనిపించాడు. నేను సంయోగిత. నన్ను అతడు తన బాహువుల్లో బంధించి గుర్రంపై అధిరోహించే వాడిలా ఉన్నాడు.
'కుండను పక్కన పెట్టేసి ఇంటికెళ్లు!'' మంకా అమ్మ అంది.
మంక నన్ను ఆశగా చూస్తూ యెదో చెప్పబోతూండగా, అదే సమయంలో వయసు మళ్లిన వాడు ధనాంధకారంలో డొల్లుతూ మూడు అణాలు మా నాన్న మంచంపై పడేసాడు. నన్ను మంకె చేతుల్లోంచి లాకున్నాడు.
''అయ్యో! ఇదేలాంటి స్వయంవరం?'' నా నోట్లోంచి పెద్ద కేక వెలువడింది. ఎవరో దయహీనుడైన రాజు తన ధన బలంతో దండెత్తి నా మంకేను పరాజితం చేసి నన్న బలవంతంగా తన మహల్లో బంధి చేయడానికి తీసుకెళ్లుతున్నాడనిపించింది. 'ఈ మహల్ వాళ్లకు కుండల అవసరమేమొచ్చింది?' నాకు ఆశ్చర్యమేసింది.
నన్ను మహల్ లాంటి ఇంట్లోకి తీసుకొచ్చారు. నా గుండె అదర సాగింది. ఎవరో నా మొహానికి నల్ల రంగు పూసారు. నన్ను ఓ దయ్యం మొహంలా తయారు చేశారు. నా కడుపులో ఒక కొయ్య పెట్టి నిర్మిస్తూన్న భవనం గడపకు నన్ను వేలాడదీశారు 'దిష్టి బొమ్మ!'గా. అందంగా నిర్మిస్తూన్న ఆ భవనానికి ఎవరి దిష్టి తగలకుండా ఉండాలని!
నా చుట్టుపక్కల వెకిలి నవ్వుల ధ్వనులు మారుమోగాయి.
కుంపటిపై ఉండాల్సిన నాకు యేలాంటి గతి పట్టింది? దిష్టి బొమ్మ! నాకు నా దీనావస్థ పై యేడుపొచ్చింది.
ఆ ఇంటి ఇరుగుపొరుగు వారి మానవత్వంపై నాకు అనుమానం వచ్చింది. ఈ ఇంటి శోభపై వీరికి కన్ను కుట్టుగా ఉంటుందేమో! కాని ఇలా చేయడం పొరుగువారికి, ఆ ఇంటి ముందు నుంచి వెళ్లే రహదారులకు అవమానం చేయడమే!
ఎవరైతే న్యాయ సంబంధంగా సంపాదిస్తారో... కలసిమెలసి తింటారో... తను బతుకుతూ ఇతరులను కూడా బతకనిస్తారో... వారి మనసులలో ఇలాంటి దిష్టి దుష్ట ఆలోచనలుండవు. కష్టపడి సంపాదించిన సొమ్ముపై ఎలాంటి దిష్టి తగలదు. మరి ఇది ఎలాంటి సంపాదన!? ఎలాంటి సంపాదనతో ఈ ఇల్లు కట్టబడుతూంది?
ఈ ఇంటికి దష్టి దోషం కలిగే ప్రమాదమేమిటో? ఈ ఇంటికి ప్రతిసారి మనుషుల దిష్టి ఎలా కలుగుతుంది!
కొందరు ఈ ఇంటిని దగ్గర్నుంచి చూస్తూ, దీన్ని పొగుడుతూ వెళ్తూండే వారు. కాని నన్ను చూడగానే జడుసు కొంటుండేవాళ్లు.
రెండవ రోజు ఓ అబ్బాయి గుడిసెలో నుంచి పరుగెడుతూ రావడం చూశాను. అతను ఇంటిముందు నిలబడి ఉన్న చౌకీదార్‌ను చూశాడు. ఆ తర్వాత నా వైపు చూశాడు. నేనతన్ని గుర్తు పట్టాను. అతను నా మంకె. నా ప్రియుడు. అతడు మరోసారి చౌకీదార్ వైపు చూసాడు. అతని ముఖకవళికలు మారి పోయాయి. ఈ చౌకీదారే నన్ను మంకె చేతుల్లోంచి లాక్కొని ఇక్కడికి తీసుకొచ్చాడు.
మంక నా వైపు చూసాక అతని గుండె ద్రవించి పోయింది. నన్ను కుండ నుంచి దయ్యం మొహంలా చేసినందుకు.
కోపంతో మంకె పిడికిళ్లు గట్టిగా మూసుకున్నాయి. నాకు ఓ సంతప్తి కలిగింది. మంకె ఎలాగైన నన్ను ఈ పిశాచ జీవితం నుంచి ముక్తి కలగించి, నన్ను యధావిధిగా కుండ జీవితం ప్రసాదిస్తాడని. నా శరీరంలో నుంచి పప్పు ఉడికినప్పుడల్లా సువాసన వస్తుంది... నాలో బియ్యం వండినప్పుడు అన్నం పరిమళం వెదజల్లుతుంది.
ఆ నూతన ఇంట్లో కొత్త కొత్త సామానులు రాసాగాయి. విలువైన చాదర్ లు, కార్పెట్లు, టెబుల్ మేజ్-కుర్చీలు, విలువైన నగిషీలతో చేసిన మంచాలు, రేడియో, రిఫ్రేజిరేటర్. యజమాని భార్య పిల్లలు, అతని ఆఫీసు ఫర్నీచర్ వగైర వగైరా...
ఓ రోజు ఒక అమాయక నాజూకు అమ్మాయి ఆ ఇంట్లోకొచ్చింది. ఆమె కూడా నాలాగే ఓ కుమారి కుండలా అనిపించింది. ఎందుకో నా మనసు శంకించింది. ఈమె కూడా ఈ ఇంట్లోకి రాగానే నాలాగే తన మొహంపై మసి పూయబడుతుందా? మసి పూసిన కుండ... దిష్టి బొమ్మ!
ఆఫీసు గదిలో నుంచి రోజంతా మషీన్పై ఆమె టక టక కొట్టుతూన్న చప్పుడు నా చెవులకు వినిపించేది. ఆమెను అందరు మిస్ దాస్ అని పిలిస్తూండే వారు.
ఓ రోజు ఆమె ఆ బిల్డింగ్ పై కొచ్చింది. నేనక్కడ ఒక కట్టె సహయంతో వేలాడబడి ఉన్నానక్కడ.
ఆమెతో ఓ నవ యువకుడు కూడా ఉన్నాడు.
అతనితో ప్రాధేయ పడుతూ అంది, ప్రేమ్! నువ్వు నా ఆఫీసుకు రాబాకు''
''ఎందుకు? నా రాకతో నీ ఆఫీసులో అడ్డంకులేముంటాయి. నేను లంచ్ టైం లోనే వస్తానుగా''
''నేనెలా నీకు అర్ధం అయ్యెలా చెప్పాలి. ఈ సమయం కూడా సరైనది కాదు.''
''నువ్వు సూటిగా చెప్పెయ్యరాదు... నీ హదయంలో నా కోసం ఇక స్థానం లేదని!''
''ప్రేమ్! వచ్చే జన్మలో కూడా నీతో నన్ను ఎవరూ వేరు చేయలేరు!''
''మరి...ఇప్పుడొచ్చిన కష్టమేమిటి?''
''అసలు విషయమేమిటంటే... నువ్వు ఇలా రావడం మా బాస్‌కు నచ్చదు''
''నీ బాస్‌కు కేవలం ఆరు గంటల డ్యాటీయే కదా కావల్సింది. లేక ఇంకేమైనా..?''
''బాస్, బాస్ యే అవుతాడు ప్రేమ్! అతని ఆజ్ఞానుసారమే నడచుకోవల్సుంటుంది. నా పై అతనికి మంచి ఇంప్రెషన్ ఉంది. క్రితం నెలలో నా సాలరీ పెంచాడు. ఓ ఆఫీసులో నా తమ్ముడి కోసం ఉద్యోగానికి రికమెండేషన్ కూడా చేశాడు. అంతేకాదు బాస్‌తో క్యాంప్‌లో ఉన్నన్నాళ్లు నాకు జీతం రెట్టింపులో ఉంటుంది!''
''అంటే... నువ్వు అతనితో పట్టణం బయటికి కూడా వెళ్లుతుంటావు?''
''అవును ప్రేమ్! వెళ్లాల్సిందేగా... బాస్ లెటర్స్లన్నీ నేనేగా టైప్ చేసేది...నేనే...''
''కమలా! నాకు ఈ ఉద్యోగం ఇష్టం లేదు.''
''కాని దీన్ని తప్పిస్తే పనెలా నడుస్తోంది? ఎంతో కష్టం మీద ఈ ఉద్యోగం దొరికింది. నువ్వే చెప్పుతూండే వాడివిగా... ఏదైనా ఉద్యోగం చేయమని''
''కాని... ఉద్యోగం దొరికాక నువ్వు చేయి జారి పోయేలా ఉన్నావు కమల!''
''ఉష్...'' అంది సైగ జేస్తూ కమల.
నేను గట్టిగా అరుస్తూ అన్నాను, ''మిస్ దాస్! మిస్ దాస్! నువ్వు ఎవరూ ముట్టని కుండవు. నీ బాస్ నీ మొహన్ని పిశాచంలా మార్చగలడనే విషయం నీకు తెలియదు. నువ్వు మసి పూసిన కుండ...దిష్టి బొమ్మ గా మారి పోగలవు! ఓ చూపు నా పై కూడా వేరు''
కమల వీపు నా వైపు ఉంది. ఆమె నా వైపు చూడలేక పోయింది. కమల చెవుల్లో బాస్ ఇచ్చిన నోట్లే నిండి ఉన్నాయి. అందుకే నా ఒక్క మాట కూడ వినలేక పోయింది.
మూడవ రోజు, బాస్ తన పెద్ద కారులో క్యాంప్ కెళ్లాడు. మిస్ దాస్ కూడా బాస్ కార్లో కూర్చుంది. మిస్ కమల దాస్!... నా గుండె వేగంగా కొట్టుకో సాగింది...
లిలిలి
ఓ వారం రోజుల తర్వాత బాస్ క్యాంప్ నుంచి తిరిగొచ్చాడు. కార్లో నుంచి దిగిన మిస్ దాస్ మొహాన్ని చూశాను. ఆమె మొహం అచ్చం నాలాగే దిష్టి బొమ్మలా కనిపించింది. మిస్ దాస్ కారులో నుంచి దిగి భవనం లో కొచ్చింది. ఆమె చాలా భయకంపితురాలై ఉంది.
ఆఫీసులో కెళ్ల లేదు. నాకు దగ్గరగా ఉన్న పిట్ట గోడపై కూర్చొని ఏడ్వసాగింది.
మేమిద్దరం ఏడ్వసాగాం!
ఉన్నట్టుండి ఒకేసారి ఇంట్లో గొడవ మొదలైంది. పోలీస్ ఇంటికి నలువైపులా చుట్టుముట్టింది. బాస్‌కు బేడీలు వేయబడ్డాయి. పిల్లలను మహిళలను ఎక్కడికో పంపించేశారు. పోలీసులు ఆఫీస్ స్టాఫ్‌ను బయటికి గెంటేశారు. తలుపులను మూసేసి దానిపై పెద్ద తాళం బిగించారు. సీల్ చేసేశారు.
యజమాని ఏదో గవర్నమెంట్ స్కాం చేశాడని జనాలు చెప్పుకొంటూంటే విన్నాను.
ఎన్నో రోజులు గడచి పోయాయి!
ఎన్నో రాత్రులు వెళ్లిపోయాయి!!
ఆఫీసుకు వేసిన సీల్ తొలగించబడింది. ఇంట్లోంచి సామానంతా బయటికి తీసుకొచ్చారు. వాటికి వేలం పాట వేశారు. విలువైన కార్పెట్లు, చాదర్లు, మంచాలు, అల్మైరాలు, కుర్చీలు, టేబుల్స్, రేడియో, రిఫ్రెజిరేటర్ వగైర వగైరాలు అన్నీ అక్కణుంచి తీసుకోబడ్డాయి... ఒకటి తప్ప... అది నేను! మసి పూసిన నేను... దిష్టి బొమ్మను!
ఓ రాత్రి మదువైన చేతివేళ్లు నా శరీరానికి తగిలాయి... చిన్ని చిన్ని ... చల్లని చేతి వేళ్లు... నేను ఆశ్చర్యంగా చూడసాగాను. మంక నెమ్మదిగా జాగ్రత్తగా నన్ను ఖైదు నుంచి విడిపించసాగాడు. ఎలా వచ్చాడో? ఎవరెవరి కండ్ల చూపుల్ని తప్పించి వచ్చాడో? నన్ను చేరుకున్నాడు.
ఎందుకో నా ఆలోచనలలో మిస్ దాస్ గుర్తుకొచ్చింది. బహుశ ఈ సమయంలో ఆమె ప్రియుడు కూడా తన బాహుల్లోకి తీసుకొని ఆమెను సాంత్వనం పరుస్తున్నాడేమో!
నా మంక నన్ను తన జబ్బ కింద అంటిపెట్టుకొని, పక్క నున్న ఇంటి పిట్ట గోడ దూకి అక్కడి మెట్ల నుంచి కిందికి దిగి, తన గుడిసెలోకి వెళ్లాడు. చప్పుడు రావడంతో మంక అమ్మ నిద్రలోంచి మేలుకొంది.
ఆమె జంకుతూ అడిగింది, ''ఇదేమిట్రా మంకె''
''అమ్మ నువ్వు పక్కవాళ్ల దగ్గర్నుంచి తీసుకొచ్చిన కుండను తిరిగిచ్చేసేరు. ఇది నా కుండ. నేను తీసుకొచ్చాను.''
''అరే ఇది దిష్టి బొమ్మ రా!''
''దీన్ని తోమి కుండగా మార్చెస్తాను.''
''కాని... దీనిపై తంత్ర మంత్రాలు జేయబడ్డాయి.''
''అమ్మ నేనిప్పుడే దీనిపై ఉన్న తంత్ర మంత్రాలన్నీ తీసేస్తాను. నువ్వు బెంగ పడకు. దీనిపైన మసి పూసి ఉంది. అంతే! నేను ఈ మసినంతా తీసేసి శుభ్ర పరుస్తాను.''
''ఇది మంచి పద్ధతి కాదు రా మంకె!... ఇందులో ఉడికిన పప్పు నువ్వు తింటే... నీకేమైనా అవుతే?''
నేను మంకె చేతులనుంచి తప్పించుకొని అమ్మ కాళ్లపై పడ్డాను. ''అలాంటిదేమి లేదు అమ్మ! నాలో ఉడికిన పప్పు తింటే మంకె కేమి కాదు. నేను పాపిష్టి కుండను కాదు. ఈ మసి నేను నా మొహం పై పులుముకో లేదు. ఓ దుర్మార్గుడు చేసిన పని ఇది.''
అమ్మ నా మాట విందో లేదో...కాని ఆమె మంకె మాటను వింది. అతనితో కలసి నా మొహం పై ఉన్న మసిని తొలగించింది. నాకు మిస్ దాస్ మాటలు గుర్తుకొచ్చాయి. బహుశా ప్రేమ్ కూడా ఆమె ప్రియురాలి కొంగుకు తగిలిన మసిని శుభ్రపరిచాడేమోనని ఆలోచించాను.
ఇప్పుడు నా రంగు రూపమే మారిపోయింది. నాకు మరో జన్మ లభించినట్లనిపించింది. నాలో బియ్యం ఉడికి వాటి సువాసనలు వెదజల్లసాగాయి. ఈ రోజు నేను ధనవంతుల ఇంటి దిష్టి బొమ్మను కాను. ఈ రోజు నేను ఓ బీద కుటంబం లోని కుంపటికి అలంకారిణి... ఓ వ్యక్తి గుడిసె లోకి ప్రవేశించాడు.
''మంకె! ఇది విన్నావా లేదా?''
''ఏమిటి?''
''అరె...ఎదురుగా ఉన్న కొత్తింట్లోకి వస్తూ వెళ్లుతూండే అమ్మాయి ఈ రోజు బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది...''
''ఏ అమ్మాయి?''
నా మంకెకేమి అర్ధం కాలేదు. నాకంతా అర్ధం అయి పోయింది... ఈ రోజు ఓ అమ్మాయి.. ఎంతో అందమైన కొత్త కుండ... పగిలిపోయింది. కారణం సమాజంలో స్వచ్ఛమైన ప్రేమ జలం కరువై పోయింది. పవిత్రమైన ఆ కొత్త కుండ ఏ పొయ్యి మీద అలంకరించ బడలేదు.
ఎవరి దగ్గర ఆమె కొంగుకు అంటిన మచ్చల్ని కడిగే ప్రేమ జలం లేదు. ఆ మచ్చను ఎవరూ తుడుప లేదు.
మూలం : అమ్రిత ప్రీతం
తెలుగు అనువాదం: అమ్జద్