Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్న చీమల గుంపులాంటి ఓ విద్యార్థుల సమూహం నల్లగొండ నుంచి మాచర్ల వెళ్ళే బస్ ఎక్కింది. సీట్లలో కూర్చున్నరో లేదో... బస్సును కాస్తా క్లాస్ రూంగా మార్చేసారు. ఓ.. న్యూస్ పేపర్ తెగతిప్పేస్తున్నారు. ఇద్దరు సినిమా పేజీ చూస్తుంటే, మరో ఇద్దరు స్పోర్ట్స్ పేజీ, ఇంకో ఇద్దరు మాత్రం మొదటి పేజీనీ, ఎడిటోరియల్ పేజీనీ అటూ ఇటు తిప్పి చదువుతూ, ఏదో చర్చిస్తున్నారు. కృష్ణా గోదావరి బేసిన్లో పద్నాలుగు ట్రిలియన్ క్యూబిక్ అడుగుల గ్యాస్ నిల్వలను, నూట నలభై మీటర్ల చమురు సంపదను సింగిల్ బిడ్ ద్వారా ప్రభుత్వం రిలయన్స్‌కు అక్రమంగా, నిబంధనలకు విరుద్దంగా అప్పగించిందని ఆ వార్తల కథనం.
ఇంత సంపద మన పక్కనే ఉత్పత్తి అయితుంటే గ్యాస్, ఆయిల్ ధరలు ఇంతగా ఎందుకు పెరుగుతున్నాయో! మార్కెట్లో చేపలకు వంద రూపాయ లుంటే, మన ఊరు చెర్వులో చేపలు పట్టినపుడు ముప్పై, నలభై రూపాయలకే ఇస్తారు కదా! మరి ఆ రకంగా మన దగ్గర ఉత్పత్తి అయ్యే గ్యాస్, ఆయిల్ కనీసం మన రాష్ట్రానికైనా తక్కువకు ఇవ్వడం లేదు ఎందుకనేది వారి డిస్కర్షన్ సారాంశం. బస్ నాగార్జునసాగర్ హిల్ కాలనీ, పైలాన్ కాలనీ దాటి రైట్ బ్యాంక్‌కు చేరుకోగానే స్టూడెంట్స్ దిగి నడుస్తున్నారు.
'నాకు అర్థం కాక అడుగుతున్న జ్వాలా! మనం టూర్‌కు పోతున్నమా? అంబాని మీద యుద్ధానికా?'
'మనం ఎవరితో ఉన్నాం? టూర్‌ను యుద్ధంగా, యుద్ధాన్ని టూర్‌గా మార్చ గలిగే స్మరణ్‌తో ఉన్నామన్నది మర్చిపోతే ఎట్లా ఆదర్శ్?'
'అవును అట్లనే ఉంది బస్ ఎక్కినప్పటి నుంచి. కొద్దిసేపైనా ఎంజారు చేద్దాం.'
'ఆ చేద్దాం కానీ ఇప్పుడేం తక్కువైంది? నాపై కామెంట్స్‌తో ఎంజారు చేస్తూనే ఉన్నారు కదా!' లాంచీ స్టేషన్ చేరుకున్నారు.
ఇది కృష్ణానది ప్రవాహపు రేపటి పూత. నల్లమల కొండల సానువుల్లో నిగనిగలాడే నీటిపూల తోట. తేట తెలుగు గుండె ముంగిళ్ళ తడి గొంతుల దాత నాగార్జునసాగర్. శాంతిసిరి లాంచి నాగా ర్జున కొండకు బయలుదేరింది. జ్వాలా, స్మరణ్ ఇద్దరూ లాంచి వెనుకాల మెట్లపై కూర్చుని మాట్లాడుకుంటున్నారు.
'మన వాళ్ళంతా అక్కడుంటే మనం మాత్రం ఇక్కడెందుకు జ్వాల? వాళ్ళను కూడా పిలుద్దాం.'
'నువ్వేమన్న పిల్లలకోడివా స్మరణ్? ఊరికంటే అందరిని వెంటేసుకుని ఉండాలా? మనం కొంచెం మాట్లాడు కోవాలి. లివ్ అజ్ ఎలోన్ అనీ నేనే ఆదర్శ్‌కు చెప్పిన.'
'అవునా! ఏం మాట్లాడాలి జ్వాలా?'
'నేను నిన్ను ఫస్ట్ టైం ఎప్పుడు చూసానో తెలుసా?'
'నువ్వెప్పుడు చూసావో నాకెలా తెలుస్తుంది?'
'హలో స్మరణ్ అపుతావా నీ సెటైర్లు. నన్ను పూర్తిగా మాట్లాడనివ్వు. ఈ రోజు నువ్వేం మాట్లాడొద్దు. నేను మాట్లాడేది మాత్రమే వినాలి.' అంటూ భుజం మీద కొట్టింది.
'సరే.. సరే చెప్పు'
'మనం విజయవాడ మీటింగ్‌కు వెళ్తున్నప్పుడు రెడ్ టీ షర్ట్ బ్లాక్ జీన్స్ వేసుకుని వచ్చావు. మాంచి హైట్‌తో పాటు ఫిట్‌గా ఒక మిలటరీ మ్యాన్ వలె భలే ఉన్నావు. అప్పుడే నిన్ను ఫస్ట్ టైం చూశాను. అక్కడికి నాతో వచ్చిన మన జిల్లా అమ్మాయిలకు ఫుడ్ పాయిజన్ అయితే హాస్పిటల్లో ఉండి నువ్వు చాలా జాగ్రతగా చూసుకున్నావు. నీ కమిట్మెంట్, నమ్మిన దాని కోసం వెనుదిరగని నైజం నాకు బాగా నచ్చాయి. అందుకే అక్కడ ఇచ్చిన క్రెడెన్షియల్ ఫామ్‌లో నచ్చిన హీరో అంటే నీ పేరే రాసాను. స్మరణ్ అని పలకడం, రాయడమే ఒక మంచి డిఫరెంట్ అనుభూతి తెలుసా!'
'ఇందాకటిదాక బాగానే ఉన్నావు కదా జ్వాలా! ఏదేదో మాట్లాడుతున్నావు ఏమైంది!'
'ఆ బాగుంట ఎందుకు బాగుండను? నువ్వు లేనప్పుడు బానే మాట్లాడుతా. నీ వల్లనే ఇలా అవుతుంది.'
'ఐతే నేను అలా పక్కకెళతాను. నువ్వు ప్రశాంతంగా మాట్లాడుకునిరా.'
'హలో స్మరణ్! వేళాకోలమా? నిన్ను ఈ వాటర్లోకి నెట్టేస్తాను. ఈతగొట్టుకుంటూ వస్తేగానీ సక్కగైతావు.' అని ఏదో మాట్లాడుతుండగానే నిశబ్దమైపొయాడు స్మరణ్.
'ఇంత అందమైన వాతావరణంలో సడెన్‌గా సైలెంట్ అయ్యావేంటీ? ఈ జర్నీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా! ఆ కొండలు ఎంత పచ్చదనంతో నిండిపోయాయో!' జ్వాల తన ఎక్సైట్మెంట్ను ఎక్ప్రెస్ చేస్తుంది.
'అవును. ఈ రిజర్వాయర్ నిండుగా ఉండడానికి, ఆ పచ్చదనం అంత అందంగా రావాడానికి ఎక్కించిన ఎర్రని రక్తం ఎవరిదో తెలుసా? మన లాంచి కింద మునిగిపోయి ఉన్న ఎన్నో గిరిజన గ్రామాలవి. ఇదిగో ఇక్కడే మన కింద నీటి లోతుల్లో నంది కొండ అనే ఊరుండేదట. ఆ ఊరు నుంచి వారు ఆ గుట్టల్లోకి వెళ్ళి పచ్చదనమయ్యారు. వారి త్యాగ ఫలితం, వారు కోల్పోయిన గత జ్ఞాపకాలు, అస్థిత్వం ఫలితమే మన అన్నం మెతుకులు, ఆనందాలు జ్వాల. అందుకే నాకు ఈ నీటి లోపల చిక్కుకున్న వారి గూడెం, గుడిసె, తండాలు, భూములు, అడవికి పత్రహరితమైన వారి జీవితాలు కనిపిస్తున్నాయి. మన నాగరిక ప్రభుత్వాలు ఇప్పటికీ వారికి ఏ నష్టపరిహారం ఇవ్వకపోవడం ఎంత దారుణం చెప్పు?'
'కొంచెం మా త్యాగాల్ని కూడా గుర్తించండి.' అని గొణుక్కుంది
'ఏంటి జ్వాలా?'
'ఏం లేదు. నువ్వు సైలెంట్ అవడానికి కారణం ఇదా! అంటున్నాను అంతే'
'సైలెన్స్ అని కాదు జ్వాలా. ఇక్కడున్నాం కదా! ఒక్కసారిగా ఆ విషయాలన్ని అలా ముసురుకున్నాయి. కానీ నీవన్నట్లు వాతావరణం బాగుంది. మనం వెళ్ళే ఐలాండ్ మీద ఇంకా చాలా బాగుంటుంది.'
ఇంజన్ స్పీడుకి ఎగజిమ్ముతున్న నీటి తుంపర్లు కొన్ని స్మరణ్ ముఖంపై పడుతున్నాయి. బ్లాక్ చుడీదార్పై వేసుకున్న జ్వాల వైట్ దుపట్టా సితాకోక చిలుకలా ఎగిరి, స్మరణ్ ముఖం మీదున్న నీటి బిందువులను ముద్దాడుతుంది. అలల చప్పుళ్ళ మధ్య తన అంతరంగాన్ని అస్పష్టంగా వినిపించే ప్రయత్నం చేస్తుంది జ్వాలా. చిన్న తడ వచ్చినా చాలు అవతలికి దూకేద్దామన్నట్టు గేట్లను తాకుతూ కాసుకున్న నాగార్జున సాగరంలా, ఏ చిన్న అవకాశం దొరికినా తన గుండెల నిండా ఉన్న ప్రేమనంతా ఈ రోజే చెప్పేయాలని చూస్తుంది. అమాయకపు కళ్ళతో ఓ ప్రాణ భాష పలికిస్తుంది. ఎదురుగా ఉన్న స్మరణ్ మాత్రం ఆ భాషకు బదులు పలకడం లేదు.
'హలో ఏంటి మీరు వెనుక కూర్చుని ఏం చేస్తున్నారు? కొంపదీసి బోట్‌ను ముందుకు తోసేదైతే మీరు కాదుగా!' అంటూ సెటైర్ విసురుతూ చిప్స్ ప్యాకెట్ ఇచ్చి వెళ్ళాడు ఆదర్శ్.
'ఏంటట ఆదర్శ్! ఆ జంట పక్షులేదో డీప్ డిస్కర్షన్లో మునిగి ఉన్నారు!'
'వాళ్ళదేముంటుంది మధు! తమ ప్రయాణం ఎప్పటికీ స్నేహమై నిలవాలని ఒకరనుకుంటుంటే, ఆ స్నేహం ప్రేమై వెలగాలని మరొకరు భావిస్తున్నారు. స్మరణ్ తనను ఫ్రెండ్‌గా చూస్తాడు. జ్వాలయేమో తను లవర్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అసలు విషయం చెప్పాలంటే ఇన్ని ఇయర్స్ నుంచి తను ఆర్గనైజెషన్లో ఉండడానికి కారణం, జ్వాలా తెగింపు అంతా స్మరణ్ ఉన్నాడనే కావచ్చు.'
'మరి ఇది స్మరణ్‌కు తెలుసా ఆదర్శ్?'
'ఏమో తెలియకపోవచ్చు మధు. ఈమె చెప్పాలి కదా ఆయనకు తెలియాలంటే. అందుకే మనలాగే జ్వాలా కూడా తనని ఒక ఫ్రెండ్‌గా ఇష్టపడుతుందనే అనుకోవచ్చు. నిజంగా చూస్తే స్నేహానికి, ప్రేమకు వ్యత్యాసం ఏముంది? గతం తాలూకు పుట్టుక, ఆధునిక కాలం ఆలోచనల కలగాపులగంలో వాటిని ఎలా నిర్వచించగలం? సహబంధాల, సమ బంధాలను విడదీసి ఎలా చూడగలం? అందుకే వారిది స్నేహ అనుబంధాల, ప్రేమ సంబంధాల అంతర్యుద్ధం. అది అంతే ఇక తెగదు, ముడివడదు. అయినా జ్వాల వాలకం చూస్తుంటే ఈ రోజు అటో ఇటో తేల్చుకునేలా ఉంది. మనం కూడా కాసేపు వాళ్ళనలా వదిలేద్దాం.'
ఆకాశంలో జెట్ విమానంలా నీటిలో లాంచి దూసుకు పోతుంది. అచ్చం జెట్ ఫ్లైట్ పొగదారిలానే లాంచి వెనుకాల నురుగుతో ఓ వాటర్ వేవ్ ఏర్పడి చూడ్డానికి చాలా బాగుంది. కొండల మధ్య సాగే సాగర ప్రయాణంలో ఎన్నో మలుపులు. అలాంటి ఓ మూల మలుపులో హెల్ప్ అని అడిగినట్లు ఒక పుట్టిలోని జాలర్లు చేతులూపుతున్నారు.
'అయ్యో స్మరణ్ ఈ నీళ్ళలో వాళ్ళకేమయిందో ఏమో పాపం. అంతగా కేకలేసి పిలుస్తున్నారు.' అని జ్వాలా స్మరణ్కి చెప్తుండగానే లాంచి వారి దగ్గరకు చేరుకుంది. పుట్టిలోంచి కొంత మంది లాంచి ఎక్కగానే ఆ మూలమలుపులోంచి మెరుపు వేగంతో మరో మూడు పుట్టీలు లాంచి దగ్గరకు వచ్చాయి. సియెర్రా మయస్త్రా కొండల్లోంచి వచ్చిన చేగువేరా స్నేహితుల్లా ఆలీగ్రీవ్ దుస్తులు ధరించి, తుపాకులు పట్టుకున్న యోధులు క్షణాల్లో లాంచి ఎక్కారు.
'హేరు స్మరణ్ ఎవరు వాళ్ళు పోలీసులా?'
'కాదు జ్వాలా. వాళ్ళలో ఎవరైనా దుక్కల్లా మెక్కిబలిసి నట్లున్నారా? వారి కదలిక చురుకుగా ఉన్నా, శారీరకంగా ఎంతో బలహీనంగా ఉన్నారు. అయినా పోలీసులైతే ఇలా పొంచి ఉండి చేపలు పట్టే కార్మికుల్లా కష్టపడి రావాల్సిన అవసరం వారికి లేదు.'
'మరి ఎవరు?'
'అన్నలు'
'అన్నలా!'
'అబ్బా.. నోరు అంత పెద్దగా తెరిచి అరవకు జ్వాలా. సైలెంట్ గా వెళ్ళి మనవాళ్ళందరినీ ఇటువైపు రమ్మను.'
'ఏంటీ స్మరణ్? గ్రేహండ్స్ పోలీసులొచ్చారేంటని చూస్తున్నాం' అంటూ ఆదర్శ్, మధు, శైలు, సతీష్, కిషోర్ వచ్చారు.
'గ్రేహండ్స్ కాదు వారు గెరిల్లాలు.'
'అన్నలా!'
'అన్నలే కానీ మరీ అంత గట్టిగా అరవకు. ఏదో జరగబోతుం దన్న అనుమానం వస్తుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ.'
'ఫస్ట్ టైం అన్నలను చూడడం. నిన్ను గుర్తుపడతారా స్మరణ్?'
'నన్నెందుకు గుర్తుపడతారు ఆదర్శ్? నువ్వు భలే అడుగుతావు!'
'వాళ్ళు న్యూస్ పేపర్ చూస్తారు కదా! పైగా నువ్వు ఎప్పటి నుంచో మన స్టూడెంట్ ఫెడరేషన్ లీడరువి! అందుకే గుర్తు పడతరేమో అని అడిగిన.'
'నన్నడిగితే అడిగినవ్ కానీ, నీ కోతి చేతలతో వాళ్ళనడిగేవు సుమా!'
'అడుగుతా భయమేంటి? వాళ్ళు మనల్నేం చేయరు కదా? వాళ్ళను చూసి దోరలకు, దోపిడిదార్లకు, ప్రజలను మోసగించే వారికి భయం మనకెందుకు? మనం విద్యార్థుల కోసం పోరాడే వెళ్ళాం. అంతేకాదు, కే.వి.రెడ్డి ప్రజల భూముల్ని ఆక్రమించు కుంటే జెండాలు పాతి జైలుకు కూడా పోతిమి. అప్పుడు జైల్లో ఉన్న అన్న అడవిపురి రాములు కూడా కలిసె. మంచిగనే మాట్లాడే!'
'హలో ఎవరక్కడీ ఇంతసేపు మిమ్మల్ని సూడలే. ముచ్చట్లాపి ఇటు రండి. సెల్‌ఫోన్స్ ఉన్నయా తీసి ఈ సంచిలెయుర్రి.' అన్నడు తుపాకి కంటే కొంచెం పొడుగున్న ఒక అన్న. అందరు ఒక్కసారిగా స్మరణ్ వైపు చూశారు. నోకియా మొద్దు ఫోన్ తీసి ఆ సంచిలో వేశాడు.
'ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తలేదా మీకు. ముందుకు రండి. అందరు అక్కడుంటె మీరు ఎనుకున్నరేంది? ఎవ్వరు కదలొద్దు.'
'మేము స్టూడెంట్స్ అన్న. ఫ్రెండ్స్ అంత కలిసి టూర్‌కు వచ్చినం. నా దగ్గర రిలయెన్స్ ఫోన్ ఉంది. కాకపోతే సిగల్ లేదు.' ఆదర్శ్ కూడా ఫోన్ ఆ సంచిలో వేశాడు.
'ఆ ఇప్పుడు మీరు రిలయన్స్ కొనుర్రి. రేపు వాడు సాంతిమి దేశాన్ని కొంటడు. ఇది మీలాంటి సదువుకున్నోళ్ళకు ఎప్పుడు అర్థం అయిద్దో ఏమో కానీ, రండి అటు ముందుకు రండి.'
లాంచిలో క్లాసుగా, నాజూకుగా ఉండి, మేకప్ టచ్, ఇన్‌షర్ట్ టక్ వేసిన యూఎస్ పోలో బ్రాండ్ బాపతిగాళ్ళు భయపడుతు న్నారు అన్నల చూసి. అదేంటో కానీ అన్నల చూసినందుకు చాలా మంది కళ్ళలో ఆనందమే కనిపిస్తుంది. అందరిని మళ్ళీ మళ్ళీ చెక్ చేసి సెల్‌ఫోన్స్ సంచుల్లో వేయించుకున్నారు. అన్నలు లాంచి బోరు దగ్గర డబ్బులిచ్చి చాక్లెట్స్ తీసుకుని పిల్లలకు పంచారు.
'ప్రియమైన ప్రజలారా భయపడకండి. సామ్రాజ్యవాదుల దళారీ ప్రభుత్వం నుంచి, పెట్టుబడిదారుల దోపిడీ నుంచి, అడవులను మైనింగ్ చేసి దోచుకుంటున్న బహుళజాతి కంపెనీల నుంచి ఈ దేశాన్ని విముక్తి చేయడం కోసం పోరాడుతున్నాం. గనులు, గ్యాస్ నిక్షేపాలు, సహజ వనరులను, ప్రజా సంపదను వేళ్ళ మీద లెక్కబెట్టగలిగే కొద్ది మందికి ప్రభుత్వమే కట్టబెట్టింది. జాతి సంపదను భావితరాలకు మిగల్చకుండా రిలయన్స్ అంబానీ లకు అప్పజెప్తుంది. ఈ దళారి బేరాన్ని అడ్డుకుని కార్పోరేట్లను తన్ని తరిమేస్తున్న అన్నలను చంపుతుంది. ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతోని అన్ కౌంట్ బడ్జెట్లు కేటాయించిన పాలకులు బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారు. కాబ్టట్టి ఈ విధానాల పట్ల నిరసన తెలిపేందుకు కొండకు చేరుకోగానే ఈ లాంచిని తగలబెడతాం. చివరిగా ఒక్కమాట భగత్ సింగ్ పార్లమెంట్లో బాంబు వేసి బ్రిటీష్ వారికి హెచ్చరిక పంపినట్లే మేము కూడా ప్రభుత్వానికి హెచ్చరిక పంపేందుకు తప్పని స్థితిలో దీన్ని కాల్చేస్తున్నాం. మీరు అసౌకర్యంగా భావించకండి, ప్రశాంతంగా ఉండండి. మాకు సహకరించండి. అధికార్లు తర్వాత వచ్చి పడవల మీద మిమ్మల్ని తరలిస్తారు. పరిస్థితిని సానుకూలంగా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం ప్రజలారా లాల్ సలాం.'
'కొండ వచ్చింది ప్రయాణికులందరు జాగ్రతగా దిగండి.' చిన్న పిల్లలను అన్నలే ఎత్తుకుని ఐలాండ్ మీద జాగ్రతగా దించారు. ఎవరైనా వస్తారనే భయం కొంచెం కూడా అన్నలకు లేదు. చాలా ఆత్మవిశ్వాసంతో యాక్షన్ కు దిగారు.
'వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే మనం ఇక్కడ ఏం చేస్తాం తిందాం రండీ..'
'మరి మన ఫోన్స్ స్మరణ్!'
'ఇంతజేసి వాళ్ళు ఫోన్స్ ఎలా ఇస్తారు ఆదర్శ్? ఇవ్వరూ, ఇవ్వకూడదు. అయినా వాళ్ళ ప్రాణాలకంటే మన ఫోన్స్ ఎక్కువేం కాదు రండీ.' ఐలాండ్ లోని హోటల్‌కి వెళ్ళారు.
'ఇంత జరుగుతుంటే ఎలా తిందామంటున్నావ్? భయమేయ ట్లేదా స్మరణ్?' అని శైలు వేసిన అమాయక ప్రశ్నకు నవ్వుతూ సమాధానమిచ్చింది జ్వాలా.
'భయం ఎందుకు? ఇందాక వాళ్ళు దేశం గురించి చెప్పిన విషయాలన్నీ నిజమా అబద్దమా?'
'నిజమే'
'అవన్నీ కండ్ల ముందే జరుగుతుంటే వేయని భయం ఇప్పుడెందుకు? అప్పుడు మనం రోజూ దర్జాగ తినగాలేనిది ఇప్పుడెందుకు తినొద్దు. వాళ్ళ మార్గమేదో వారిది. మన మార్గమేదో మనది. ఎవరికి చేతనైంది, ఎవరి మార్గాల్లో వాళ్ళు చేస్తారు కానీ ముందు తినండి. యాజ్ ఇట్ ఈజ్ ఇదే డైలాగ్ కదా స్మరణ్ ఇప్పుడు నీ నోటి నుంచి వచ్చేది?'
'డైలాగ్ నువ్వు చెప్పి నాకు క్రెడిట్స్ ఇస్తావెందుకు జ్వాలా? నాకంటే నువ్వే బాగ చెప్పావ్.'
లాంచిని తగలబెట్టి, స్లోగన్స్ ఇస్తూ పొద్దు తరుముతున్న సూర్యుల్లా పుట్టీలెక్కి పడమర దిక్కుకి వెళ్ళిపోయారు అన్నలు. సెల్ఫోన్ల సంచి ఇక్కడే వదిలేసి వెళ్తున్నారని ఎవరో అరుస్తున్నారు.
'అప్పుడే వెళ్ళిపోతున్నారా తినడం అయిపోయింది కదా! అక్కడికి వెళాదాం.' అందరూ పరుగెత్తారు. కానీ స్మరణ్, జ్వాల మాత్రం ఇక్కడే కూర్చున్నారు.
'స్మరణ్ నీకు కొంచెం టెక్ కదా?'
'టెక్కా! ఎందుకు జ్వాలా?'
'నేను నిన్ను ఫైవ్ ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను. నేను లవ్ చేస్తున్నానని నీకు కూడా తెలుసు. కానీ పట్టించుకోవు. కనీసం నావైపు సరిగా చూడవు. నీకు కొంచెం.. కాదు కాదు. చాలా ఎక్కువగానే టెక్కు. నేనంటే నీకు ఎందుకు ఇష్టం లేదు? నేను ఏమంత స్టైల్ గా ఉండను, బాగోననే కదా?'
'నువ్వు బాగోవని ఎందుకనుకుంటున్నావు జ్వాలా? నువ్ తలకు వైట్ రిబ్బన్ రెడ్ స్టార్ వేసుకుని విద్యార్థుల మధ్య నిలబడి, పచ్చని అడవిలో మోదుగుపూవులా పిడికిలెత్తి స్లోగన్స్ ఇచ్చింది నాకు ఇంకా గుర్తుంది. రేషనలైజెషన్ పేరుతో జీ.ఓ.64 తీసుకొచ్చి ప్రాథమిక పాఠశాలలు ఎత్తివేస్తే, గ్రామీణ పిల్లలు చదువులకు దూరమవుతారని డిఈఓ ఆఫీస్ ముందు జరిగిన ఉద్యమంలో నిన్ను చూస్తే, సావిత్రిబాయి పూలే వలె రేపటి కన్నతల్లి ఈ రోజే పోరాడుతున్నట్టు అనిపించింది. భాను టాకీసులో భూతు సినిమాలు ఆడించొద్దని ఎంత చెప్పినా వినకుంటే మనం ఆ టాకీసును తగలబెట్టడానికి ర్యాలీగా వెళ్ళాం. అక్కడ అడ్డుకుంటున్న పోలీసులను చాకచక్యంగా తప్పించుకుని, నువ్వు థియేటర్ లోపలికి వెళ్ళి క్యాబిన్ తగలబెట్టినప్పుడు నీలో ఓ సివంగిని చూసాను. ఇందాక లాంచిలో తుపాకి పట్టుకుని నిలబడ్డ అక్కకి నువ్వేం తక్కువకాదు జ్వాలా. పోలీసులు అరెస్ట్ చేస్తున్నప్పుడు నన్ను వాళ్ళకు వదలకుండా, తీసుకెళ్ళకుండా అడ్డుపడి అరగంటకు పైగా పోరాడి, పోలీసులను ముప్పుతిప్పలు పెట్టినప్పుడు ఓ అర్భన్ గెరిల్లాలాగా కనిపించావు.'
'హలో కామ్రేడ్ స్మరణ్.. ఇవన్నీ నీ రివ్యూ మీటింగ్‌లో చెప్పుకో బాగుంటారు. నేను ఏమడుగుతున్నా నువ్వేం చెప్తున్నావ్? నేను అందంగా ఉండననే కాదా! ఇవన్నీ చెప్తున్నవ్! ఇందాక కూడా అంతే. నేను నిన్ను ఎప్పుడు చూశాననేది చెప్తుంటే ఏదో సెటైర్ వేసి మ్యాటర్ మార్చేసావు. ఇప్పుడు కూడా అంతే. అలుసై పోయాను. నేను నీ కళ్ళకు ఆనడంలేదు.'
'అబ్బా.. లేదు జ్వాలా. నువ్వు నన్ను లవ్ చేస్తున్నానని ఎప్పుడైనా చెప్పావా? లేదు కదా! అప్పుడు నాకు అవాయిడ్ చేసే అవకాశమే లేదు కదా? నీ కనులు కనే కలేంటో రెప్పలకైనా తెలుస్తుందా చెప్పు. నీ వాదన ఎలా ఉందంటే పరీక్ష రాయకుండానే ఫెయిల్ చేసారనే గొడవలాగుంది. నువ్వు చెప్పకుండా నాకెలా తెలుస్తుంది? అయినా నిన్ను అందంగా లేవని ఎవరన్నారు? అన్ని నీకు నువ్వే అనేసుకుంటే ఎలా? రేగడి నవ్వులా, మంచు పువ్వులా స్వచ్ఛమైన మనసు నీది. గొంగడిపైన మెరిసే ఎర్రంచు రూపం నువ్వు. ఎర్రజెక్క నేలల్లో విరభూసిన నల్ల చందమామవు. బృందా నుదుటన మెరిసే సింధూరానివి. యూ ఆర్ ఏ నేచర్ క్యూటీ, నాచురల్ బ్యూటీ. అందం పేరుతో ఆత్మ విశ్వాసం కోల్పోతావు ఎందుకు? ఇదంతా ఒక ఫ్రెండ్‌గానే చెప్తున్నాను. ఇక నువ్వు నన్ను లవ్ చేస్తున్న విషయంలో అప్పుడప్పుడు నీ ప్రవర్తన నాకు డౌట్ వచ్చేది. కానీ నాకు నేను ఎలా నిర్ధారణ చేసుకోగలను? అది స్నేహపూర్వక దగ్గరితనం కావచ్చు అనుకునేవాడిని. రియల్లీ సారీ, ఐ మిస్ యూ జ్వాలా. యామ్ ఆల్రెడీ ఇన్ లవ్ విత్ వివిధ. నీవెప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్ వే.'
కంగ్రాట్స్ చెప్పినట్టు జ్వాల స్మరణ్కి చేయందించిది తప్ప ఏం మాట్లాడటం లేదు. అలాగే తన చేయి పట్టుకుని నడుస్తుంది. దూరం నుంచి చూసిన ఆదర్శ్ ఏదో అరవబోయాడు. స్మరణ్ వద్దన్నట్టు సైగ చేయడంతో, స్నేహమే ఫైనల్ అయిందని అర్థమై సైలెంట్ అయిపోయారు. కొండ నుంచి పడవల్లో రైట్ బ్యాంక్ చేరుకుని నల్లగొండ బస్ ఎక్కి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. జ్వాలకు ఇంటికెలా చేరిందో, రాత్రెప్పుడయిందో, ఎప్పుడు తెల్లారిందో అర్థమే కావడం లేదు. పొద్దున్నే లేచి న్యూస్ పేపర్ ఓపెన్ చేసింది. తన కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. బరువెక్కిన గుండెతో ఊపిరాడటంలేదు. నిన్నటి బాధ నుంచి ఇంకా తేరుకోనేలేదు. అంతలోనే నాగార్జునసాగర్ లాంచిని హైజాక్ చేసిన కృష్ణపట్టె దళం. కమాండర్ బోడ సాయిలుతో పాటు మరో పది మంది అన్నలను ఎన్కౌంటర్ చేసిన పోలీసులు అనే వార్త పతాక శీర్షిక. కొన్ని గంటల కింద కండ్ల ముందు కనిపించి పిల్లలను ఎత్తుకుని ముద్దుచేసి చాక్లెట్లు పంచిన అన్నలు హతమైపోయారు. నిన్నటిదాక సొంతమైతాడనుకున్న వాడు పరాయి వాడయ్యాడు. రెండు బాధలు ఏకధారగా ఉబికి వస్తున్నాయి. ఏమీ అర్థంకాని స్థితిలో కూరుకుపోయింది జ్వాల. తను చదువుతున్న పేపర్ మీద కన్నీళ్ళు టపటపమని రాలుతున్నాయి. ఏడుస్తున్న బిడ్డను గమనించింది తల్లి.
'ఏంది బిడ్డా ఏమైంది?' అంటూ దగ్గరికి వచ్చేసరికి దిగ్గున లేచి, అమ్మను గట్టిగా అల్లుకుని పూడుక పోయిన గొంతుతో, గుక్కపట్టి ఏడుస్తుంది జ్వాల.
- ఎం. విప్లవ కుమార్,
9515225658