Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ సామాన్యుడి జీవితంలో జరిగిన పలు ఆసక్తికర సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం 'సూరీడు'. ప్రయోగాత్మక చిత్రాల దర్శకుడు డా||పి.సి.ఆదిత్య దర్శకత్వంలో మహాబోధి క్రియేషన్స్ పతాకంపై భూతం విమల నిర్మించారు. ఈ చిత్రాన్ని ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ -2023కి ప్రదర్శన నిమిత్తం ఎంపిక చేశారు. ప్రముఖ రచయిత భూతం ముత్యాలు ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రంలో శివాజీరాజా, లక్ష్మీరాజ్, ఆచార్య కృష్ణ, స్వప్న, సుష్మ నైనిక, మాస్టర్ చరణ్ తదితరులు ఇతర పాత్రలను పోషించారు. ఈనెల 19వ తేదీ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్‌లోని అశోక్ హోటల్లో ఈ ఫెస్టివల్‌కి ఎంపికైన చిత్రాలను ప్రదర్శిస్తారు. అనంతరం విజేతలను ప్రకటించనున్నారు. తొలి ప్రయత్నంలోనే మా 'సూరీడు' చిత్రం ప్రదర్శనకు ఎంపిక అవ్వడం అదృష్టంగా భావిస్తున్నామని నిర్మాత బి.విమల ఆనందం వ్యక్తం చేయగా, తాను రాసిన కథ 'సూరీడు'గా ప్రదర్శితమవ్వడం తనలోని రచయితకి ఎంతో ప్రోత్సాహం దొరికిందని రచయిత భూతం ముత్యాల చెప్పారు. ఈ చిత్రాన్ని ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శిస్తున్నందుకు దర్శకుడు పి.సి.ఆదిత్య సంతోషం వ్యక్తం చేశారు.