Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని నటించిన పాన్ ఇండియా చిత్రం 'దసరా'. శ్రీకాంత్ ఒదెల దర్శకుడు.
కీర్తి సురేష్ కథానాయికగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన దీక్షిత్ శెట్టి మీడియాతో శనివారం 'దసరా' చిత్రానికి సంబంధించి పలు విశేషాలను షేర్ చేసుకున్నారు. ''మీట్ క్యూట్' వెబ్ సిరీస్‌లో చేశాను. 'దసరా'లో ఈ పాత్రకి ఆడిషన్ జరిగినప్పుడు 'మీట్ క్యూట్'కి పని చేసిన కో డైరెక్టర్ వినరు ఈ పాత్రకి నన్ను రిఫర్ చేశారు. అక్కడి నుంచి జర్నీ మొదలైయింది. ఇందులో నా పాత్ర పేరు సూరి. క్లోజ్ ఫ్రెండ్ క్యారెక్టర్. సినిమా అంతా ఉంటుంది. చాలా కీలకమైన పాత్ర. రోలర్ కోస్టర్ రైడ్ లాంటి సినిమా దసరా. మంచి కంటెంట్‌తో అన్నీ ఎలిమెంట్స్ మిక్స్ చేసిన అద్భుతమైన ఎంటర్టైనర్. 'దసరా' లాంటి పాన్ ఇండియా మూవీలో భాగం కావడం చాలా గొప్పగా, అనందంగా ఉంది. నా వరకూ 'దసరా' ఆల్రెడీ ఒక పెద్ద విజయం. ఈ సినిమా ద్వారా తెలంగాణ యాస, బాడీ లాంగ్వేజ్, నడవడిక ఇలా చాలా విషయాలు నేర్చుకున్నాను. దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దగ్గర ఒక స్ట్రక్చర్ ఉంది. తనకి ఎలా కావాలో ఫుల్ క్లారిటీ ఉంది. ఆయన అనుకున్న పాత్రని ఆయన కోరుకున్నట్లు చేయడం పట్లే ఫోకస్ పెట్టాను. నానితో దాదాపు పది నెలల పాటు ప్రయాణించాను. ఆయన నుంచి చాలా స్ఫూర్తి పొందాను. కీర్తి సురేష్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటానని అనుకోలేదు. ఆమెతో కలిసి పని చేయడం మంచి అనుభవం. ఈ పాత్రను నేను చేయగలనని బలంగా నమ్మిన నిర్మాతలకు రుణపడి ఉంటాను' అని దీక్షిత్ శెట్టి చెప్పారు.