Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నాంది' వంటి హిట్ చిత్రాన్ని అందించిన హీరో అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ 'ఉగ్రం'తో వస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. నేడు (శుక్రవారం) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్బంగా ఉగ్రం చిత్ర యూనిట్ నిర్వహించిన మీడియా సమావేశంలో పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు అల్లరి నరేష్ సమాధానాలు చెప్పారు.
ఇకపై మిమ్మల్ని ఉగ్రం నరేష్ అని పిలుస్తారా?
- నన్ను ఎలా పిలుస్తారో తెలీదు కానీ ఈ ఉగ్రం మాత్రం ఒక ప్రత్యేకమైన సినిమాగా అలరిస్తుంది. 'నాంది' చేసినపుడు ఎంత గర్వంగా అనిపించిందో 'ఉగ్రం' కూడా అలానే అనిపించింది.
హాస్య నటులు సీరియస్ పాత్రలు చేస్తే మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారా?
- కామెడీని మనం చిన్న చూపు చూస్తాం. కానీ కామెడీ చేసిన వాళ్ళు ఏదైనా చేస్తారు. నవరసాల్లో కష్టమైనది హాస్యం. నవ్వించడం కష్టం .. ఏడిపించడం సులువు.
ఇందులో పోలీస్ పాత్ర చేయడం ఎలా అనిపించింది ?
- దర్శకుడు విజరు టాస్క్ మాస్టర్. ముందే నా బలాలు, బలహీనతలు చెప్పారు. పాత నరేష్ ఎక్కడ కనిపించకూడదని చెబితే, ఆయన ఏం చెప్పారో అది చేశాను. తను యాక్ట్ చేసి మరీ చూపించారు. నా కెరీర్లో ఇలాంటి పోలీస్ పాత్ర చేయలేదు. నాకే నేను చాలా కొత్తగా కనిపించాను. పోలీస్ గెటప్‌లో చేసిన బ్లేడ్ బాబ్జీ,కితకితలు మంచి విజయాలు సాధించాయి. అయితే అవి కామెడీ రోల్స్. ఉగ్రంలో సీరియస్ రోల్. చాలా నిజాయితీగా చేసిన సినిమా.
ఉగ్రం సక్సెస్ పై మీ అంచనా?
- ఇటీవల సినిమా చూశాను. నా హయ్యెస్ట్ గ్రాసర్ అవుతుంది ఒక్కమాటలో చెప్పాలంటే 'నాంది'కి మూడింతలు కలెక్ట్ చేస్తుంది. ఈ సినిమా విషయంలో మా దర్శక, నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా చేశారు. అది స్క్రీన్ మీద కచ్చితంగా కనిపిస్తుంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను ఈ చిత్రం తప్పకుండా అందుకుంటుంది. మొత్తమీద్మ ఓ మంచి హిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.