Sun 04 Apr 00:41:03.102857 2021
Authorization
చీమ తన తప్పును తెలుసుకొని, ఒకరితో పోల్చుకోకూడదని, జ్ఞానం తెచ్చుకొని మర్రి చెట్టు దగ్గరకు వెళ్లిపోయింది. తప్పిపోయిన చీమ తిరిగి వచ్చినందుకు తన స్నేహితులు కుటుంబసభ్యులు సంతోషించారు.
ఒక ఊరిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రిచెట్టు తొర్రలో పెద్ద చీమల పుట్ట, అందులో చీమలన్నీ రోజు ఆహారం కోసం వెతుక్కుంటూ చాలా దూరం ప్రయాణించి వాటికి కావలసిన ఆహారాన్ని తెచ్చుకొని ఆపుట్టలో దాచుకునేవి.
ఒకరోజు ఆ చీమల గుంపులో ఒక చీమ దారితప్పి ఆహారం కోసం వెతుక్కుంటూ ఊర్లోకి వెళ్లిపోయింది. ఆ ఊరి పొలిమేరలో ఒక అమ్మవారి గుడి ఉంది.
ఆ గుడిలో..... గుడి ముందున్న ధ్వజస్తంభం దగ్గర ప్రసాదం కనిపించింది ఆ చీమకు . ఆ ప్రసాదం చూసిన చీమ ''హమ్మయ్య ఈ రోజుకి నాకు ఆహారం దొరికింది'' అని సంతోషపడి ప్రసాదం దగ్గరికి వెళ్ళింది.
ఆ చీమ కడుపునిండా తిని హమ్మయ్య అని ఆ పక్కనే ఉన్న ఒక చెట్టు దగ్గర విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఆహారం అయితే దొరికింది కానీ... ఇంటికి చాలా దూరంగా వచ్చిన చీమ తిరిగి వెళ్లలేక దారి తప్పి ఇంకా ఆ చెట్టు దగ్గరే ఉండిపోయింది.
రోజు గుడికి వెళ్లడం, గుళ్లో ప్రసాదాన్ని ఆహారంగా స్వీకరించడం. ఇలా కొన్నాళ్లు తన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చింది.
ఒకరోజు ఆ గుడిలో అమ్మవారి జాతరకీ భక్తులందరూ అమ్మవారిని దర్శించుకోవటానికి తెల్లారుజామునే వచ్చి పెద్ద క్యూ కట్టారు.
రోజులాగే ఆ చీమ ఆహారం కోసం గుడికి నడుచుకుంటూ వచ్చింది. తీరా చూస్తే గుడికి ఒక రెండు మూడు మీటర్ల దూరం వరకు, జనాలతో కిటకిటలాడుతూ కనిపించింది గుడి.
గుడిలోకి వెళ్ళాలి అంటే ఆ జనాల కాళ్ల కింద పడి నలిగి చచ్చిపోతాను ఏమో అని భయపడి సాయంత్రం వరకూ అక్కడ చెట్టు కిందే కూర్చుని చూస్తూ ఉంది. కానీ ఆకలితో కడుపు మల మల మాడిపోతు ఉంది. ఎప్పుడు గుడి కాళీ అవుతుందా? ఎప్పుడు ఆహారం దొరుకుతుందా?అని వేచి చూస్తూ ఉంది చీమ.
ఈలోగా సంబరంలో అమ్మవారి ఊరేగింపుకని తీసుకు వచ్చిన ఒక పెద్ద ఏనుగు కాలికి ఏదో గుచ్చుకొని ఒకటే హడావిడి చేసి పెద్దగా కేకలు వేస్తూ ఆ గుడి ప్రాంగణం మొత్తం అల్లరి చేసింది. ఆ ఏనుగును చూసి జనాలందరూ భయబ్రాంతులతో పారిపోయారు.
కాసేపయ్యాక ఆ ఏనుగు గుడి ప్రాంగణంలో కట్టిన అరటి దవ్వలు , అరటి పండ్లు తిని వెళ్ళిపోయింది. ఏనుగు వెళ్ళిపోయిన కాసేపటికి చీమ మెల్లగా పాకుతూ గుడిలోకి చేరుకుంది.
ఎప్పుడు యధావిధిగా ద్వజ స్తంభం దగ్గర ప్రసాదం పెట్టే పూజారిగారు, ఈ రోజు ఏదో పిండి లాంటిది ధ్వజస్తంభం దగ్గర చుట్టూత చల్లారు.
''దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వకపోవడం అంటే ఇదేనేమో''
ప్రసాదం దొరికినా తినే భాగ్యం దక్కలేదు. అనుకుంటూ ఆకలితో విచారంగా అక్కడే నిలబడి చూస్తూ ఉంది చీమ.
ఈలోగా రాత్రి అయిపోయింది.ఏ దేవుడు వరం ఇచ్చాడో మరి ఆ చిమకి, సాక్షాత్ ఆ అమ్మవారే దిగివచ్చి చీమకు కనిపించింది.
తెలిసో తెలియకో రోజు గుడికి వెళ్లి అక్కడ ప్రసాదం తినడం వల్ల ఆ చీమకి అంత భాగ్యం దక్కింది.
దిగులుతో బాధగా ఉన్న చీమకి అమ్మవారు ఏదైనా కోరిక కోరుకో అని వరం ఇచ్చింది. ''నీ కోరిక ఏదైనా తీరుస్తాను అని మాట ఇచ్చింది.''
ఆకలితో ఉన్న చీమ , మొదట ఆహారం కోరుకుందాం అనుకుంది. కానీ ఈ ఒక పూటకి ఆహారం కోరుకుంటే మళ్లీ రేపు ఇంకా పెద్ద కష్టం వచ్చి ఆహారం దొరకకపోతే... ఈ రోజు లాగే పస్తులు ఉండాలి ఏమో అని అనుకుంది. అందుకే ముందుచూపుతో ఆలోచించి ఇంకేదైనా పెద్ద కోరిక కోరుకోవాలి అని నిర్ణయించుకుంది.
అప్పుడు చీమకి ఏనుగు గుర్తు వచ్చింది. ఏనుగు లాగా పెద్ద శరీరం ఉంటే అందరూ చూసి భయపడతారు. అని భావించి అమ్మవారిని తనకి భారీ శరీరం ప్రసాదించమని కోరుకుంది పిచ్చి చీమా!
అందుకు అమ్మవారు ఇది లోక విరుద్ధం. అలా చేస్తే నీకు సమస్యలు కొని తెచ్చుకున్నదానివి అవుతావు మరొకసారి ఆలోచించుకో అని చెప్పింది.
అయినా కూడా చీమ అమ్మ వారి మాటలు వినిపించుకోకుండా భారీ శరీరాన్నే కోరుకుంది.
అందుకు ''అమ్మవారు సరే నీ కర్మ అ అని నవ్వుతూ తథాస్తు అని అంటుంది.''
ఒకేసారి అమాంతంగా ఆ చీమ పెద్దగా అయిపోతుంది. పట్టలేని సంతోషంతో ఇంటిని వెతుక్కుంటూ ఆ మర్రిచెట్టు దగ్గర ఉన్న పుట్ట దగ్గరికి వెళుతుంది.
ఆ చీమను చూసి తన స్నేహితులు బంధువులు అయినా మిగిలిన చీమలు భయభ్రాంతులకు లోనవుతారు. ఏదో వింత జంతువు తమ పైకి దాడి చేయడానికి వచ్చింది అని భావించి పారిపోయారు.
ఒంటరిగా ఇన్నాళ్లు గడిపిన చీమ మళ్లీ ఒంటరయిపోయింది. పైగా ఊర్లో వాళ్లంతా ఇదేదో వింత జంతువు అని కర్రలతో కొట్టడం బాధించటం లాంటి చర్యలకు పాల్పడ్డారు.
ఆ దెబ్బలకు బాధలకు తట్టుకోలేక చీమ అడవికి వెళ్లిపోవాలని నిశ్చయించుకుంది.
చీమకు మళ్లీ అక్కడ సవాలే ఎదురయ్యింది చిమకీ... అడవిలోని జంతువులు ఈ చీమను చూసి ఇదేదో కొత్త వింత జంతువులా ఉంది. ఈ జీవిని మనం ఎప్పుడు చూడలేదే... ఈ పొద్దు మన అడవిలోకి ఎలా వస్తుంది. అని మిగిలిన జంతువులన్నీ కలిసి అడవి మొదట్లోనే ఆపేశారు.
అందుకు చీమ మిత్రులారా! ''నేను మీలాంటి జీవినే... కాకపోతే నేను పుట్టలో చీమలతో పాటు జీవించే దాన్ని దేవుని వరం వల్ల నాకు ఈ శరీరం సంప్రాప్తించింది.అని దాని కథ అంతా చెప్పింది.
అయినా జంతువులన్ని చీమ మాటలు నమ్మలేక పోయాయి. జంతువులన్నీ గుమికూడి సమావేశం ఏర్పాటు చేశాయి. ''ఆ ప్రాణి మహా శక్తివంతమైనది అయితే మనకు చాలా ప్రమాదకరం. పైగా దేవుడు వరం పొందిన శరీరం అని కూడా చెప్తుంది. ''
''మన అందరిని తినేస్తే ! అప్పుడు మనకి నష్టం వస్తుంది.అందుకే మనం బలపరీక్ష పెడదాం ! మనలో ఏ జంతువుతో అయితే అది పోరాడి గెలుస్తుందో తెలుసుకుందాం. మనకన్నా అది బలహీనమైతే అప్పుడు అడవిలోకి అనుమతి ఇద్దాం. అని అన్ని జంతువులు కలిసి మాట్లాడుకున్నాయి.''
వాటి నిర్ణయాన్ని చీమకు తెలియజేస్తాయి. తప్పని పరిస్థితుల్లో ఇక ఊరిలో ఉండలేక చీమ పోటీకి ఒప్పుకుంటుంది. భారీ శరీరం అయితే కోరుకుంది కానీ చీమ! దాని శరీరంలో ఉన్న శక్తి సామర్ధ్యాలు మాత్రం అంచనా వేయలేక పోయింది.
అన్ని జంతువులు మాట్లాడుకొని మొదటగా నక్కని పోటీకి పంపించాయి. నక్క ఒక్కవేటుకే చీమ రెండు కాళ్ళు కొరికి పడేసింది. దెబ్బకు మూలుగుతూ కింద పడిపోయింది చీమ.
అది చూసిన మిగిలిన జంతువులు హేళనగా నవ్వి దీని సామర్థ్యం ఇంతేనా... చూస్తే అంతా పెద్ద శరీరం ఉంది. అని నవ్వడం మొదలు పెట్టాయి. సిగ్గుతో చీమ తల దించుకొని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
చేసేది ఏమీ లేక ఏడుస్తూ మళ్లీ ఆ గుడి దగ్గరికి పాక్కుంటూ వెళ్ళింది.
అమ్మవారిని ప్రాధేయ పడుతూ మళ్లీ ఒకసారి కనిపించు అని వేడుకుంది. చీమ మొర ఆలకించిన అమ్మవారు చీమపై దయకలిగి ప్రత్యక్షమవుతుంది. అమ్మ వారిని చూసిన చీమ చాలా సంతోషించి ....తనకు జరిగిన అన్యాయం మరియు అవమానం గురించి వివరించింది.
అది విన్న అమ్మవారు చీమకి హితోపదేశం చేస్తుంది. భగవంతుడు సృష్టిలో ప్రతిజీవికి దాని పరిమాణం బట్టి దాని శక్తి సామర్థ్యాలను బట్టి జీవన విధానాన్ని ఏర్పాటు చేస్తాడు. సృష్టికి విరుద్ధంగా వింత కోరికలు కోరుకుంటే జరిగే పరిణామాలు ఇవే! నువ్వు ఏనుగులా పెద్ద శరీరం కావాలని కోరుకున్నావు కానీ ఏనుగు వంటి బలం కావాలని కోరుకోలేదు. ఏనుగు యొక్కశక్తి సామర్థ్యాలను చెప్పటం చాలా కష్టం.
ఒక ఒక పెద్ద ఏనుగు సింహాన్ని కూడా చంపేగలదు. దాని శక్తి సామర్ధ్యాల ముందు ఏ జీవి నిలబడలేదు.
అందుకే నీకు ఈ దుస్థితి కలిగింది. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని నిజానిజాలు గమనించి నీ శక్తి సామర్థ్యాలను గుర్తించి ఉన్న దాంట్లో నువ్వు సంతోషంగా బతుకు అని చెప్పి చీమకి పూర్వపు శరీరాన్ని ప్రసాదించి అదృశ్యమయింది అమ్మవారు.
చీమకి యధావిధిగా తన పూర్వపు శరీరము లభించింది బుద్ధి తెచ్చుకున్న చీమ తన తప్పును తెలుసుకొని, ఒకరితో పోల్చుకోకూడదని, జ్ఞానం తెచ్చుకొని మర్రి చెట్టు దగ్గరకు వెళ్లిపోయింది. తప్పిపోయిన చీమ తిరిగి వచ్చినందుకు తన స్నేహితులు కుటుంబసభ్యులు సంతోషించారు.
- జ్యోతి మువ్వల,
9008083344