Sun 04 Apr 00:43:40.880688 2021
Authorization
'మేడమ్ మీ బండి రెడి' అంటూ రాకేష్ బండి తీసుకొచ్చి ఇస్తూ 'పర్మిషన్ లేకుండా బాగుచేయించాను ఏమనుకోకండి మిమ్ముల్ని ఆ పరిస్థితుల్లో చూసి కాస్త జాలేసి' అని ఏదో చెప్పబోతుంటే 'పర్లేదు కానీ జాలికంటే ప్రేమ గొప్పది ఎవరినైనా ప్రేమించడానికి ప్రయత్నించండి' కొంచెం సీరియస్ మొహంతో వెళ్ళిపోయింది....
''మేరా కుచ్ సామాన్, తుమ్హారే పాస్ పడాహై'' ...ఇజాజత్లో లతా పాడిన పాట వినవస్తుండగా ''సురభి'' అని పిలిచారెవరో సురభి వంటింట్లో గ్యాస్ బండ బిగిస్తూ ఆపి బయటికొచ్చింది 'ఎందుకు ఎప్పుడు ఆపాటే వినిపిస్తుంది మీ ఇంట్లో ఎదురింట్లో పెద్దాయన ఇందాకటి నుండి నిన్నే పిలుస్తున్నారు వినపడట్లేదా' అంది పక్కింటి అంటీ కూతురు మయూరి ....
'హా వెళ్తాను బ్యాంక్ కెళ్ళి ఆటం లో డబ్బులు తెమ్మన్నారు అంకుల్ అందుకే అయ్యుంటుంది నేను వెళ్తాలే' అంది సురభి మయూరిని వెళ్ళమన్నట్లు...'రాత్రంతా సరిగా నిద్రపోలేదు ఇప్పుడు ఆఫీస్ కి వెళ్తానంటావ్ నీ ఆరోగ్యం పాడైతే ఎట్లమ్మా'' నాయనమ్మ గునుగుడు వినివిని ఉన్న సురభి 'సర్లే జాగ్రత్తగా ఉంటా ఇక వదిలేరు నాయనమ్మా' అంది... 'ఏమయదారి కళ్లుపడ్డాయో పిల్ల జీవితం నాశనమయ్యింది, నేను పోయాక దీని బ్రతుకెలాగో 'దేవుడి గదిలో దీపం పెడుతూ అనుకుంటుంది నాయనమ్మా...' హబ్బా తిను నాన్నా ఆఫీస్ టైం అవుతుందిరా నీక్కూడా ఆన్లైన్ క్లాసులు ఉన్నాయిగా కానివ్వు' అని సురభి పిల్లాడిని బ్రతిమిలాడుతుంది...' నువ్వు తిన్నావా మరి' మయూరి వాళ్ళమ్మ అడిగింది పక్కింట్లో ఉంటారు వాళ్ళు...' తింటాను వీడికి తినిపించి' అంది సురభి...' ఇలా అంటున్నానని ఏమి అనుకోకమ్మా
రోజు ఏవో పాటలు పెడతావ్రొదలా ఉందని చుట్టుపక్కల వాళ్ళు నీమీద కంప్లైంట్ పెట్టొద్దని నేను అనను... అందరికి నచ్చేవి పెట్టరాదు కాస్త చల్లబడతారు' అంటూ వంటింట్లో కూరేదో పెట్టి వెళ్ళిపోయింది... ఎప్పుడూ వినే మాటలే మళ్ళొక్కసారి విని ఆఫీస్‌కి బయల్దేరింది సురభి...
బండి స్టాండ్ తీసి ఎక్కి కూర్చోగానే టైర్ పంచరయిందని అర్థమైంది .... కోపము బాధ అలసటతో రోడ్డు దాకా తీసుకెళ్ల గలిగింది కానీ రెండురోజుల నుండి సరిగ్గా తినకపోవడం వల్ల నీరసంగా ఉంది...
చెమటలు పడుతున్నారు పోనీ వదిలేసి ఆటోకెళ్దాం అంటే సాయంత్రం ఏవో సామను లిస్ట్ తెచ్చేది ఉంది... ఒకవైపు ఆఫీస్ టైం అవుతుంది... రాత్రి అదాటున మంచం కోడు కాలికి తగిలి నొప్పి కూడా... మెకానిక్‌కి కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు
వీధి మలుపులో ఉండే బుక్ స్టాల్ అబ్బారు అటువైపు పోతూ 'ఏమైందండీ' అని అడిగాడు సురభి చిన్నదే పర్లేదు అని మోహమాటపడుతూ చెప్పడం చూసి 'మీరెప్పుడు ఇంతే అతి మంచితనం మీకు మంచిది కాదు.. మీరు నా స్కూటీ తీసుకొని వెళ్ళండి సాయంత్రం బుక్ స్టాల్ దగ్గర బండి ఇచ్చేస్తాను' అన్నాడు... మానవత్వం మంచితనం ఇంకా బ్రతికే ఉంది అనుకుంటూ ఆక్టివా వేసుకొని వెళ్ళిపోయింది సురభి... బాస్ కొంచెం సీరియస్‌గానే ఉన్నాడు 'బడ్జెట్ టైం ఇంత లేట్‌గా వస్తే ఎలా అమ్మా సురభి పనిచేసేవాళ్ళు బద్దకిస్తే ఏంచేయాలి' అన్నాడు... ఇవాళ అనుకోకుండా ఏదో చెప్పబోయింది సురభి 'సరేలే అర్జెంట్‌గా కొటేషన్ రెడీ చెరు...
లాగిన్ అవ్వు ఇప్పటికే లేట్' బాస్ పక్కన ఉన్న ముకుందం బాగా దగ్గరగా వచ్చి చెబుతున్నాడు
చీర సర్దుకుంటూ 'కాస్త దూరం జరిగితే స్టార్ట్ చేస్తా' అంది మయూరి మోహమంతా మాడ్చుకొని తన ప్లేస్ లోకెళ్లి కూర్చున్నాడు ముఖుందం... 'మీకేదో కొరియర్ మేడమ్ మొన్నే వచ్చింది. మీరు నిన్న మొన్న రాలేదుగా ఆఫీస్‌కి అందుకే ఇప్పుడిచ్చా' అంది ప్యూన్ నర్సమ్మ...
బాగా బరువుంది ఏమయ్యుం టుంది అసలెక్కడి నుండి వచ్చిందని అడ్రస్ చెక్ చేసింది .. అడ్రస్ కార్డ్ మీద టూ అడ్రస్ తప్ప ఫ్రమ్ అడ్రస్ లేదు... కవర్ చింపి చూసింది డిక్షనరీ, రెండు పెన్నులు, ఒక డైరీ ఉన్నారు... నాకోసం ఎవరు పంపారు ఇంకా ఇవన్నీ పంపేవారు ఉన్నారా సురభి ఆలోచనల్లో పడింది... 'ముందు పనికానివ్వు అమ్మారు బాస్ చూస్తున్నాడు' కొలీగ్ వాణి కసురుకుంది...
ప్లాస్టిక్ కవర్లో వచ్చినవాటిని పెట్టేసి పనిమొదలెట్టింది సురభి...' లంచ్ టైం వెల్దామా క్యాంటీన్ కి'' అంది వాణి 'నాకు ఆకలి లేదు నువ్వెళ్ళి తిను' అంది సురభి 'పిచ్చా పిల్లా రెండురోజులైంది నువ్వు తినక ఏమనుకుంటున్నావ్ అసలు... ఎవరతను ఏమంటున్నాడు నీతో నాకైనా చెప్పవే తల్లీ'
బ్రతిమిలాడింది వాణి... తిందాం పద మాట దాటేసి బాగ్ సర్దుకొని బయల్దేరింది సురభి
సాయంత్రం 5 గంటలు 'ఈ సామానంత ఏంటమ్మా' అడిగాడు బాబీ 'నాకీ పెన్ను కావాలి... డైరీ కూడా వాడేదో చెబుతున్నాడే వినవే' అంది నాయనమ్మ వాడిస్టమ్ లే నాయనమ్మ... నేను బుక్ స్టాల్ అబ్బాయికి బండి ఇచ్చి నా బండి తీసుకొని వస్తాను అని బయటికెళ్లింది సురభి...
'మేడమ్ మీ బండి రెడి' అంటూ రాకేష్ బండి తీసుకొచ్చి ఇస్తూ 'పర్మిషన్ లేకుండా బాగుచేయించాను ఏమనుకోకండి మిమ్ముల్ని ఆ పరిస్థితుల్లో చూసి కాస్త జాలేసి' అని ఏదో చెప్పబోతుంటే 'పర్లేదు కానీ జాలికంటే ప్రేమ గొప్పది ఎవరినైనా ప్రేమించడానికి ప్రయత్నించండి' కొంచెం సీరియస్ మొహంతో వెళ్ళిపోయింది....
'ఈ అమ్మాయిలు సమజ్ కారు' అనుకుంటూ అప్పటిదాకా ఆమె మీదున్న ఇది కాస్త తగ్గిందతనిలో...' ఎందుకంత చిరాకు కాస్త సౌమ్యంగా ఉండొచ్చుగా' వాణి ఆఫీస్‌లో అప్పుడప్పుడు అనే మాటలివి సురభి విషయంలో ... కానీ పదును తెలితేనే దేన్నైనా తెగ్గొట్టేయగలం సురభి మనస్తత్వం...' చెబితే విన్నావా చూడు ఇప్పుడేమైందో' పక్కింటి ఆంటీ అరుపులు విని కిటికిలో నుండి తొంగి చూసింది సురభి మయూరి ఏడుపులు అమాయకంగా అందంగా ఉండే మయూరి అంటే సురభికి ఇష్టం కానీ ఆ అమ్మాయి ఆతి భయస్తురాలని కొంచెం నొచ్చు కుంటుంది...
ఏడుపు విని మేడ మీద గదిలోకి వెళ్ళింది గదిమూలన తలవంచుకొని కాళ్ళుమూడుచుకొని అందులో తలాన్చి ఏడుస్తుంది ...' ఏమైందిరా ఆఫీస్ నుండి వచ్చి రాగానే ఎందుకిలా ఏదన్నా ఇబ్బందా' అని కొంగు మయూరికిస్తూ అంది సురభి.. 'అప్పటికి చెప్పాను నేను బండి మీద వెళ్ళనని అమ్మే డబ్బులు కలిసొస్తారు తెలిసినబ్బారు అని పంపింది' మళ్లీ ఏడుస్తూ చెప్పింది మయూరి...
అతను నిన్ను టచ్ చేసాడా అంది సురభి కోపమంతా దాచుకుంటూ... 'హా నీకెలా తెలుసు .. తెలిసినట్టే చెబుతున్నావ్ అమ్మ చెప్పేసిందా' అంది మయూరి...' ఇంతకుముందు ఇలా ఎప్పుడైనా ప్రవర్తించాడా' ... 'లేదు సురభి ఈరోజే నేను కాస్త నవ్వుతూ మాట్లాడాను'... అంటుండగానే....' తప్పు నీదే కదా' ... 'నవ్వడము తప్పేనా' అని మయూరి అమాయకంగా అడిగింది...' లేదు హద్దు మనము దాటం వాళ్ళు దాటి కారణం మనం అంటారు నవ్వినా అవతలి వారి చూపుల్లో తేడా గమనిస్తూ నవ్వు లేదంటే ఎక్కడికో వెళ్ళిపోతారు ఊహల్లో'... మనకూ ఇష్టమన్న భ్రమలో వాళ్ళు చేసేపనులకు మనమే మూలాధారం అవుతాం...
ఇంకా చెబుతూనే ఉన్న సురభిని చూసి మయూరికి అనుమానం వచ్చింది... 'సురభి నిన్ను ఒకటి అడుగుతాను చెబుతావా' అంది చెప్పు కానీ ఏడవడం అపి చెప్పు అంది సురభి... 'బాబీకి నాన్న ఉన్నారా' అని అడిగింది .. 'ఉన్నా లేనట్లే ఉండీ చేసేదేం లేదు' అంటూ తాత్వికంగా సమాధనమిస్తున్న సురభిని అలాగే చూస్తుండిపోయింది మయూరి... సురభికి పెళ్ళైన మొదటి ఏటనే భర్త జవాన్‌గా జమ్మూకాశ్మీర్ లో నియమింపబడ్డాడు... మూడు రాత్రులు జరగకుండానే అతను బోర్డర్ వెళ్ళిపోయాడు ఒకానొక రాత్రి ఆమె బావ ఆమె నిద్రిస్తున్న గదిలో తప్పతాగి వచ్చి బలాత్కారం చేయబోయాడు తప్పించుకుని పుట్టింటికి
వచ్చి భర్తకు ఉత్తరం రాస్తే అతను పుట్టింట్లోనే ఉండని సలహా ఇచ్చి కనీసం మళ్లీ తీసుకెళ్లేందుకు కానీ అతను ఎక్కడ ఉన్నాడన్నది కాని ఆచూకీ తెలియకుండా ఆమెకు దూరంగా ఇంకో పెళ్లితో సెటిల్ అయిపోయాడు... పెద్దలు బంధువులు నిలదీస్తే ఆమె ఆత్మా భిమానాన్ని వాళ్ళ అన్న దగ్గర తాకట్టు పెట్టిందని ఏవో నిందలేసి జరిగిన అత్యాచారాన్ని అతనివైపుగా చెప్పుకున్నాడు.. ఊరు ఊరంత ఆమెను నిలదీస్తూ ఏవో చెడు మాటలు ప్రచారం చేయడంతో ఊరొదిలి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో రెసెప్షనిస్ట్ గా చేరింది...
అబార్షన్ చేయించుకుంటున్న ఎందరో పెళ్లికాని అమ్మాయిల్ని చూసి తల్లడిల్లిపోయేది... పశ్ఛ్ సైకాలజీ చదివి కొంతకాలం కాలేజ్ లో లెక్చరర్‌గా చేసింది... అక్కడే రామన్ పరిచయం ప్రేమ విడిపోవడం జరిగింది.... ఒకసారి రామన్ రానిరోజు బండి పాడైందని ఇంకో కొలీగ్ బండిమీద యింటికెళ్లిందని నీకువాడికి ఏంటి సంబంధం అని అడిగాడు రామన్... నీకు నాకు కూడా ఏ సంబంధం లేదని వచ్చేసింది సురభి.... మయూరి గట్టిగా భుజం తడుతూ 'సురభి బాబీ పిలుస్తున్న ట్టున్నాడు' అని అనగానే గతంలో నుండి బయటికొచ్చింది సురభి....
నాయనమ్మకు బాగ దగ్గుగా ఉంది నెను మెడికల్ షాప్‌లో మందులు కొనుక్కోస్తా అని బయల్దేరిన సురభికి అక్కడే ఏవోమందులు కొంటున్న రామన్ కనపడ్డాడు...'సురభి.నిన్నే ఒక్కసారి నామాట విను నీతోమాట్లాడాలి' అంటూ అమెవెనుకే ఇంటికొచ్చాడు బాబీని చూసి ఆశ్చర్యపోయి విషయం సగంలో వదిలేసి వచ్చిన దారినే వెళ్ళిపోయాడు... 'నాయనమ్మ బీపీ ఎక్కువగా ఉంది' అంటూ కొబ్బరినీళ్లు కొట్టిస్తున్న సురభి కళ్ళలో నీళ్ళు...ఈలోపు వాణి 'ఇవాళ ఆఫీస్ కి రాలేదేమి' అని అంటూ లోపలికి రాగానే సురభి కంట్లో నీళ్లు...ఎప్పుడు ఎడవని సురభి ఏడవడం చూసిన వాణి మళ్ళీ ఏమయ్యింది అని అడిగింది వేరే రూంలోకి సురభిని తీసుకెళ్తూ...
'బాబీని కొంతకాలం నే తీసుకెళ్తా' అంది వాణి 'వాడులేకుండా నేను ఒక్క క్షణం ఉండలేను' అంది సురభి 'ఎలానే తల్లీ ఇలా ఒంటరిగా' రోజు చావడం కన్నా నాకుఒంటరితనమే బాగుంది'
'వాడు పెద్దాడయ్యాక నీదగ్గర ఎందుకుంటాడు అప్పుడు ఇంకా ఒంటరితనం.. నామాట విని పెళ్లిచేసుకో' అంది వాణి 'ఈమాట చెప్పడానికే వస్తే ఇంకెప్పటికి రాకు నాదగ్గరికి' అంది సురభి...'' అయినా ఎవరో కుప్పతొట్లో వదిలేస్తే వాణ్ణి తెచ్చుకుని పెంచుకుంటూ నీకెందుకు ఇన్ని బాధలు' అందివాణి కాస్త కోపంగానే...'' మానవత్వం ప్రేమలేని మనుషులు ఎంతకాలం బ్రతికినా ఏం లాభం.... నేను ప్రేమించేది మనుషుల్ని మగాలనో బొమ్మల్నో కాదు...
నన్ను ఇలాగే వుండనీ ఇంకెప్పుడు బాబీ ముందు ఈవిషయాన్ని ప్రస్తావించకు వాడు నొచ్చుకుంటే ఇబ్బంది'' అంటూ నాయనమ్మకు మందులెయ్యడానికి ఆమె రూంలోకి బయల్దేరింది సురభి.. సురభి గతం తోపాటు తన మానవతా హృదయం తనకు తెలుసుకనుక పెద్దగా ఆశ్చర్యపోలేదు.. తనకు స్నేహితురాలినైనందుకు గర్వపడింది.. బాబీ పలక మీద ఎదొ రాసేందుకు ప్రయత్నిస్తున్నాడు.. వాణి వాడి దగ్గరకెళ్లి..అ..అంటే అమ్మ అని అక్షరాభ్యాసం చేయిస్తోంది..
- సుభాషిణి తోట