Sun 18 Apr 02:24:05.793572 2021
Authorization
జనం గగ్గోలు పెడు తుండటంతో గ్రామ పెద్ద గాభరా పడ్డాడు. తప్పట్లోయ్ తాళాలోయ్ బజంత్రీలోయ్ బాజాలోయ్ అని చాటిం పేయించాడు. జనం చప్పట్లు చరిచారు పళ్ళాలు బాదారు పులిని భయపెట్టి పారిపోయేట్టు చెయ్యడానికి ఎలక్ట్రిసిటీ బల్బులు, బుడ్ది దీపాలు, ప్రమిదలూ కొవ్వొత్తులూ వెలిగించి హాశ్ హూశ్ అన్నారు. పోవే పులీ! పోపోవే పులీ! రాకే మరీ అని అరిచి గీ పేట్టేరు.
ఊళ్ళోకి పులి వచ్చిందనే వార్త గుప్పుమంది. అడవిలో ఉండాల్సిన పులి ఊళ్ళోకి రావడమేమిటి? ఎవడో కూస్తాడు. కూసే గాడిదలకు మేసే గాడిద వత్తాసు. ఉట్టి పుకార్లే తప్ప అని కొట్టేశారు కొంతమంది. పులిని నువ్వు నీ కళ్ళతో చూశావా షేక్ హేండ్ ఇచ్చావా అని నిలదీశారు మరికొందరు. అదిగో పులి అంటే ఇదిగో తోక అంటారు పులీ లేదూ తోకా లేదుఅని కొట్టిపారేశారు ఇంకొందరు.
మొత్తం మీద ఊళ్ళోకి పులి వచ్చిందీ లేనిదీ ఎవరికీ స్పష్టం కాలేదు కానీ నిజంగా పులి వచ్చి ఉంటే ఏం జరుగుతుందో తల్చుకున్న వాళ్ళకు దగ్గూ జలుబూ దడుపు జ్వరమూ వచ్చినయి. పులి ఊళ్ళోకి వస్తే ఎక్కడుందీ? అని వెతికే కళ్ళకి నల్లచారల పసుపు పచ్చ కోటు తోడుక్కుని ఉండే పులి కనిపించలేదు. కాలవగట్టు మీద ఒకడు చచ్చిపడున్నాడని, బస్సు స్టాండ్ వెనకాల ఇద్దరు కళ్ళు తేలేశారని ఆ వీధిలో ఒకడు మైనస్ అచితూ ఈ వీధిలో మరో నలుగురు గల్లంతయ్యారనీ వార్తలు ఊరంతా కలియ తిరిగేయి.
ఇప్పుడు ఊళ్ళో పులి తిరుగుతున్నదన్న మాటను చాలా మందికి కొట్టి పడెయ్యడానికి వీలవలేదు. జనం గగ్గోలు పెడు తుండటంతో గ్రామ పెద్ద గాభరా పడ్డాడు. తప్పట్లోరు తాళాలోరు బజంత్రీలోరు బాజాలోరు అని చాటిం పేయించాడు. జనం చప్పట్లు చరిచారు పళ్ళాలు బాదారు పులిని భయపెట్టి పారిపోయేట్టు చెయ్యడానికి ఎలక్ట్రిసిటీ బల్బులు, బుడ్ది దీపాలు, ప్రమిదలూ కొవ్వొత్తులూ వెలిగించి హాశ్ హూశ్ అన్నారు. పోవే పులీ! పోపోవే పులీ! రాకే మరీ అని అరిచి గీ పేట్టేరు.
ఏం చేస్తే ఏం? ఏం కూస్తే ఏం? ఊళ్ళోకి వచ్చిందంటున్న పులి ఊరొదిలి వెళ్ళిపోవడం మాత్రం ఎవరూ చూసిందిలేదు. జనం గుంపులుగా తిరగొద్దని, రచ్చబండ దగ్గరా మఱ్ఱిచెట్టు నీడనా కిళ్ళీ బడ్డీ దగ్గరా గుంపులుగా చేరి పోచికోలు కబుర్లు సినీ తారల పుట్టుపుర్వోత్తరాలు గంటల కొద్దీ ముచ్చటించటానికి వీల్లేదని గ్రామంలో చాటింపు వేయడమైనది. మరో ముఖ్యమైన సందేశం అందరి చెవుల్లోనూ పడ్డది. ముక్కూ నోరూ కనిపించకుండా ముసుగు వేసుకుని, జేబు రుమాళ్ళు చుట్టుకునీ ఉన్నవాళ్ళని పులి ఎదురైనా ఏమీ చేయలేదని ముక్కూ మూతీ కనిపించని వాళ్ళని చూసి భయపడి పులి కుక్కలా తోక తిప్పుతూ అడుగులు వెనక్కి వేస్తూ పారిపోతున్నదని ఆ సందేశం. ఇంకేం వుంది. ఊరంతా ముసుగు మనుషులే. ఇప్పుడు అదిగో పులి ఇదిగో టెయిలూ కాదు ఖుద్దుగా ఎదురుగ్గా నిలబడి చూసిన వాళ్ళున్నారు. వాళ్ళ ముఖాలకు ముసుగులు చూసి పులి తోక ముడవడాన్ని కథలు కథలుగా చెప్పే వాళ్ళున్నారు.
ఇల్లు వదిలి బయటికి రాని వాళ్ళు ఇళ్ళల్లోకి పోకుండా వీధులంట తిరగడం మొదలెట్టారు. ముసుగుందిగా అని కొందరు ముసుగు ఉండనీ లేపోనీ పులి మాత్రం మన ఊరి వాళ్ళంటే బాగా ఝడుసుకుంది. జనాలకి కనపడకుండా తోక కాళ్ళ సందున ఇరికించుకుని భయం భయంగా తిరుగుతున్నది అని మరికొందరు ఆఁ పులా! తోకా! అని నాలుక చప్పరించే వాళ్ళు కొందరు తయారయ్యేరు.
పులి అంటే భయం పోయింది జనాలకి. పులా? పులి అయితే యేంటి? పులి మెడలు వంచాం పులికి దడలు పుట్టించాం అని జనం మీసాలు తిప్పేరు. అవి తిప్పడానికి అడ్డుగా ఉందని ముసుగులు పీకిపారేశారు.
ఊళ్ళోకి ఎన్నికలొచ్చేయి. నాయకులొచ్చేరు. కార్యకర్తలు ఊరంతా రౌండ్లేశేరు. ఎవ్వరికీ పులి భయం లేదు. ఎవ్వరూ ముసుగులు వెయ్య లేదు. మీసాలు దువ్వడం మానలేదు. పండ గలొచ్చేయి పబ్బాలొచ్చేయి పెళ్ళిళ్ళూ పేరంటాలూ పేట్రేగేయి. అందరూ పులి ఇంకా ఊళ్ళో ఉన్నదన్న సంగతే మర్చిపోయేరు. పులా? అదెలాగుంటుంది? అని అడిగే వాళ్ళు ఎక్కువయ్యేరు.
ఊళ్ళోకి జాతర వొచ్చింది. ఎక్కడెక్కడ్నించో వచ్చి జనం పోగయ్యేరు. ఇక ఎలాగూ వెళ్ళిపోక తప్పదని జనం అంతా జతర సందడిలో ఉన్నారని తన దారిని తను పోవడానికి ఊరు దాటడానికి బయలుదేరింది పులి.
ఎవడో ఒకడు పులిని చూడనే చూశాడు. పులి పారిపోతుందిరోరు! అని అరిచాడు. అంతే జనం విరగబడ్డారు. పారిపోతున్న పులి వెంటపడ్డారు. 'నువ్వంటే నాకు భయం పోయింది. ఎక్కడికే పారిపోతున్నావు?' అని అరిచారు కొందరు. కొందరు పులి చుట్టూ తిరిగారు. వెళ్ళిపోతున్న పులి పోకుండా దాన్ని తోక పట్టి వెనక్కి లాగారు. కొందరు దాని మీసాలు పట్టుకు పీకారు. ముఖాలకి ముసుగులు చూసి భయపడ్డ పులి ముసుగుల్లేవని మనుషులు తనతో ఆడుకోవడం సహించలేకపోయింది. పెద్దపెట్టున గాండ్రిస్తూ వెనక్కి తిరిగి జనంలో జొరబడి పంజా విసరడం మొదలెట్టింది.
- చింతపట్ల సుదర్శన్,
9299809212