Sat 08 May 23:34:04.613285 2021
Authorization
మనోజ్ మంచి తెలివిగల విద్యార్థి. బాగా చదువుతాడు. మంచి స్వభావం. పదో తరగతి పరీక్షలు రాసాడు. ఉదయం ఫలితాలు వచ్చాయి. మనోజ్‌కి పదికి పది పాయింట్లు. ఏ వన్ గ్రేడ్‌తో ఉత్తీర్ణుడయ్యాడు. మనోజ్ అమ్మానాన్న చాలా సంతోషించారు. ఎలాగూ ఏ వన్ గ్రేడ్ వస్తుందని మనోజ్‌కి తెలుసు. అది చాలా సాధారణంగానే తీసుకున్నాడు. తనకి డాక్టర్ కోర్సు చదవాలని చాలా కోరిక. రేపు ఇంటర్ అయిపోయిన తరువాత డాక్టర్ కోర్స్ ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంక్ వస్తేనే తనకి ఆనందం. అదే తన తెలివికి కొలమానం అనుకున్నాడు మనోజ్.
''మనోజ్.. చాలా సంతోషం బంగారం! పదికి పది పాయింట్లు వచ్చాయి. మీ నాన్నగారు కూడా బాగా హ్యాపీ! ఇంకా పది రోజుల్లో నీ పుట్టిన రోజు వస్తుంది. ఈసారి బాగా గొప్పగా చేయాలని నాన్న అంటున్నారు. నాన్నకి ప్రమోషన్ కూడా వచ్చింది. మంచి స్థాయికి వెళ్లారు. రెండూ కలిసి వస్తాయని, బాగా చేద్దామని అంటున్నారు. వచ్చే ఏడు నువ్వు ఇంటర్ చదువుతూ ఎక్కడో వుంటావు. అందుకే ఈ ఏడాది బాగా చేద్దాం. నీ స్నేహితులూ, తెల్సినవాళ్లూ అందర్నీ పిలువు. మేం కూడా మన దగ్గర బంధువుల్ని పిలుస్తాం. నీ స్నేహితులు మొత్తం ఎంత మందో ముందుగా చెబితే దాన్ని బట్టి ప్లాన్ చేసుకుందాం!''
''పుట్టిన రోజు ఇంకా పది రోజులు వుంది కదమ్మా? తొందరేముంది?''
''పది రోజులు ఎంతలో వస్తాయి? ఇప్పట్నించే ప్లాన్‌గా వుంటే బాగుంటుంది. అన్ని ఏర్పాట్లూ చక్కగా చేసుకోవచ్చు. ముందు జాగ్రత్తతో వుంటే ఎలాంటి లోటూ, లోపం లేకుండా జరుపుకోవచ్చు. అప్పటికప్పుడు అనుకుంటే ఇబ్బంది పడతాం. ఇంతకు ముందుకంటే ఈసారి మరింత ఎక్కువ మందిని పిలిచి బాగా చేద్దాం అంటున్నారు నాన్నా!''
''నాకు మరో ఆలోచన వుందమ్మా! ఈసారి కొత్త పద్ధతిలో జరుపుకుందాం అనుకుంటున్నాను''
''సరే అలాగే నాన్నా! నీ ఇష్టం. నీ పుట్టినరోజు. నువ్వు ఎలా చెబితే అలా!'' అంది అమ్మ.
అమ్మతో మాట్లాడి పైన ఉన్న తన గదిలోకి వెళ్లాడు మనోజ్. కిటికీ తలుపులు తెరిచి కూర్చున్నాడు. కొత్తగా ఏర్పడుతున్న కాలనీ అది. ముందుగా తాము, మరో నలుగురు ఇళ్లు కట్టుకున్నారు. ఇప్పుడు చాలా ఇళ్లు నిర్మాణంలో వున్నాయి. మనోజ్ వాళ్ల ఇంటి చుట్టూ చాలా ఖాళీ ప్రదేశాలు. ఆ స్థలాల్లో డేరాలూ, పట్టలూ, రేకులూ, తాటాకులూ లాంటి వాటితో ఆవాసాలు ఏర్పాటు చేసుకుని చాలా మంది పని వాళ్లు నివశిస్తున్నారు. ఆ నివాసాలు పక్షుల గూళ్ళంత వున్నాయి. వాటిలో వాళ్లు ఎలా నివశిస్తున్నారో మనోజ్‌కి ఆశ్చర్యం! మనిషి నిలబడి వెళ్లడానికి లేదు. పూర్తిగా వంగొని వెళ్లాల్సిందే!
నగరంలో ఇళ్ల నిర్మాణపు పనులు చేసుకోవడానికి, ఎక్కడెక్కడి గ్రామాల నుంచో వచ్చిన వాళ్లు, గ్రానైట్, మార్బుల్ పని చేయడానికి రాజస్తాన్, ఒరిస్సా, బీహార్ రాష్ట్రాల నించి వచ్చిన వాళ్లు కూడా వున్నారు.
గదిలో కూర్చుని చదువుకుంటూ రోజూ వాళ్లని గమనించడం మనోజ్‌కి అలవాటైపోయింది. ఆ నివాసాల్లోని పెద్దవాళ్లు పనులకి వెళ్తారు. తనకంటే కొంచెం చిన్న పిల్లలు, పదీ పన్నెండేళ్ల వాళ్లు మరీ చిన్న పిల్లల్ని ఆడించడం, పాలు తాగే పిల్లల్ని ఎత్తుకుని తిప్పడం చేస్తుంటారు. వాళ్ల కాళ్లకి చెప్పులు వుండవు. తలకి నూనె వుండదు. సరిగా స్నానాలు వుండవు. ఆడపిల్లలకి సైతం సరైన బట్టలు వుండవు. వాళ్లకి చదువుల్లేవు. ఆ పిల్లలు చాలా మంది మనోజ్‌కి తెలుసు. అప్పుడప్పుడూ తమ ఇంటికి నీళ్లకి వస్తుంటారు. అమ్మ చెప్పిన చిన్న చిన్న పనులు చేస్తుంటారు. బాగా ఎండ వున్న సమయంలో బయట తమ ఇంటి గోడల నీడలో కూర్చుంటారు. ఆడుకుంటారు.
ఆ పిల్లల్ని చూస్తున్న మనోజ్‌కి ఇంతకుముందు వచ్చిన ఆలోచన గట్టిపడింది.
''పుట్టిన రోజు విషయం ఏం నిర్ణయించావు కన్నా? మొన్న కొత్త పద్ధతిలో చేద్దాం అన్నావు. ఎలా చేద్దాం?'' రెండు రోజుల తరువాత అమ్మ అడిగింది.
''ఇప్పటివరకు ప్రతిఏడూ మీరు నాకు బర్త్‌డే జరుపుతున్నారు. మనం పిలిచిన అందరూ వస్తారు. ఏవో గిఫ్టులు తెస్తారు. గ్రీటింగ్స్ చెపుతారు. తింటారు. రిటన్ గిఫ్టులు తీసుకుని వెళ్లిపోతారు. బాగా చేసారూ, గ్రాండ్‌గా చేసారు అంటారు. అంతే, రోటీన్. ఎప్పుడూ వుండే విషయమే కదా ఇది? ఇందులో కొత్తదనం లేదు. ఎవరికీ ఉపయోగం లేదు. ఈసారి అలా చేసుకోవడం ఇష్టం లేదమ్మా! మన ఇంటి చుట్టుపక్కల గుడిసెల్లో చాలా మంది పిల్లలున్నారు. ఆ పిల్లల్లో ఒక్కరికి కూడా సరైన బట్టల్లేవు. పుట్టిన రోజు ఫంక్షన్‌కి అయ్యే డబ్బుతో ఆ పిల్లలకి బట్టలు తెస్తే వాళ్లు చాలా సంతోషిస్తారమ్మా! ఎవరి పుట్టిన రోజు వాళ్లకి పండగే! అందులో ప్రత్యేకత ఏముంది? కానీ ఇతరులు కూడా ఆ పుట్టిన రోజుని పండగగా భావిస్తే ఎంత బాగుంటుంది? మన పుట్టిన రోజుని మనమే కాదు, ఎదుటివాళ్లు కూడా పండగ్గా చేసుకుంటే ఎంత ఆనందం!''
''సరే నాన్నా! మీ నాన్న వచ్చిన తరువాత మాట్లాడదాం!'' అంది అమ్మ.
సాయంత్రం వాళ్ల నాన్న ఆఫీసు నించి వచ్చాడు. మనోజ్ తన అభిప్రాయం చెప్పాడు.
''మంచి ఆలోచన మనోజ్! చాలా మంచి పని. ఈ గుడిసెల్లోనూ, డేరాల్లోనూ మొత్తం ఎంత మంది పిల్లలో జాబితా తయారు చెరు! ఆ పిల్లలు అందరికీ బట్టలు ఇద్దాం. రెడీమేడ్ బట్టలు కంటే మనం బట్ట తీసుకొచ్చి, మన టైలర్‌తో వాళ్లు సైజులకి సరిపడా కుట్టించి ఇద్దాం. వాళ్లు చాలా కాలం చెప్పుకుంటారు. ఎంతో కాలం గుర్తు పెట్టుకుంటారు!'' అన్నాడు నాన్న.
వాళ్ల ఇంటి చుట్టూ 30 మంది పిల్లలు వున్నట్లు లెక్క తేలింది. పుట్టిన రోజున మనోజ్ ఆ పిల్లలు అందర్నీ పిలిచాడు. బట్టలు ఇచ్చారు. చక్కగా మంచి భోజనాలు పెట్టారు. ఆ పిల్లలు ముఖాలు చాలా ఆనందంతో వెలిగిపోయాయి. వాళ్లు సంతోష తరంగాలలో తేలిపోతూమ ఎగిరెగిరి గెంతులు వేసారు. నిజంగా ఆ పసి మొగ్గలకి పండుగే పండుగ.
- మొలకలపల్లి కోటేశ్వరరావు
9989224280