''ఎన్నిసార్లు చెప్పాలి రఘూ! నేను ఆ పల్లెటూరు రాను. ఆ రోజు న్యూయార్క్‌లో ప్రోగ్రామ్ ఉంది కదా? ఆ విషయం వాళ్ళకి చెప్పలేదా?'' అంది కోపంగా మధురిమ...
'చెప్పానమ్మా! అయినా వాళ్ళు వినటం లేదు... మళ్ళీ ఈ రోజు ఇతన్ని పంపేరు. ఆ రోజు వాళ్ళ ఊళ్ళో వేంకటేశ్వరుడి గుడి ప్రారంభోత్సవమట. అది కేంద్రమంత్రి ఊరట... అతను మీరే రావాలని పట్టుబడుతున్నారట... నిన్ననే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి అయ్యగారి ఆఫీసుకి ఫోన్ కూడా వచ్చిందట... ఎలాగైనా ఒప్పుకోండమ్మా! లేకపోతే చాలా సమస్యలు'' అంటూ నీళ్ళు నముల్తూ చెప్పాడు రఘు...
అతని మాటల్లో ఒక వేడికోలు... ఒక ఆవేదన... రఘు ఆమె దగ్గర ఐదేళ్ళ నుంచి పియ్యేగా పనిచేస్తున్నాడు... చాలా నిక్కచ్చి మనిషి... ప్రలోభాలకు లొంగని వ్యక్తిత్వం... చాలా చక్కగా ఆమె కార్యక్రమాల వ్యవహారాలన్నీ చూస్తుంటాడు...
మధురిమ రాష్ట్రంలో పేరున్న సంగీత విద్వాంసురాలు... కర్నాటక సంగీతంలో ఆమె దిట్ట. సంగీతాన్ని తన ఐదవ సంవత్సరం నుంచే ఔపాసన పట్టింది. గమకాలు ఆమె గాత్రంలో అలవోకగా పలుకుతుంటాయి.
చిన్నప్పట్నుంచీ ఆమె గాత్ర శుద్ధి, పాటల పట్ల ఆమెకుండే ఉత్సాహాన్ని చూసి ఆమె తండ్రి రఘునాథశర్మ 5వ సంవత్సరం నుంచే సంగీతంలోని ఓనమాలు నేర్పటం మొదలు పెట్టాడు.
రఘునాథశర్మ ఆ పల్లెలోని పాఠశాలలో ఉపాధ్యాయుడు. అతనికి మధురిమ ఒక్కర్తే కూతురు. పెళ్ళైన ఐదు సంవత్సరాలకు పుట్టిన మధురిమ అంటే భార్యాభర్తలిద్దరికీ అపురూపం. శర్మగారి భార్య విమలకు కూడా సంగీతంలో మంచి అభినివేశం ఉండటం వల్ల కూతుర్ని చదువుతో పాటు సంగీతాన్ని కూడా ప్రోత్సహించింది.
అలా మధురిమ సంగీతాన్ని ఒక యజ్ఞంలా ప్రారంభించింది. చదువుకి భంగం కలగకుండా సంగీతాన్ని అభ్యసించింది. దానికి కారణం ఆమె తండ్రి శర్మ... ''విద్య లేనివాడు వింత పశువు అన్నారు... - మనుషుల్ని జంతువులు, పక్షుల్నించి వేరు చేసేది విద్య... విద్య మనిషికి జ్ఞానాన్నిచ్చి అజ్ఞానాన్ని పారద్రోలుతుంది. చతుర్వేదాల్లో సామవేదంలో సంగీతం గురించి చెప్పబడింది. కేవలం సంగీతం నేర్చుకుంటే సరిపోదు... సాహిత్యం లేనిదే సంగీతం రక్తి కట్టదు... త్యాగయ్య, అన్నమయ్య లాంటి వాళ్ళు వాగ్గేయకారులు... అంటే సంగీత, సాహిత్యాల్లో గొప్పవాళ్ళు...'' అని చెప్పటంతో ఆమె చదువుని ఏనాడూ అశ్రద్ధ చెయ్యలేదు...
వర్ణాలను, రాగాలను, సరళీ స్వరాలనూ ఎలా ఔపాసన పట్టిందో చదువులో భారత, భాగవత, రామాయణాలను, గణితం, భౌతిక, రసాయన శాస్త్రాలు, ఇంగ్లీషు వీటి గురించి క్షుణ్ణంగా చదివి ఇంటర్మీడియెట్‌లో వాళ్ళ కాలేజీ లెక్చరర్లను ఆశ్చర్యచకితుల్ని చేస్తూ జిల్లాకి ప్రథమంగా నిలిచింది.
ఆమెని ఒక రోజు కాలేజీ ప్రిన్సిపల్ పిలిచి ''మధురిమా! నీమార్కులు చూసాను... నీ గురించి మీ లెక్చరర్లు చెప్పిన మాటలు విన్నాను... నువ్వు ఎమ్ సెట్ మీద కేంద్రీకరించు. సంగీతాన్ని విడిచిపెట్టు అది నీకు ఏవిధమైన కూడూ పెట్టదు... అదే ఇంజనీరింగ్ చదివితే హాయిగా అమెరికా వెళ్ళవచ్చు. బోలెడు ధనం, కీర్తి సంపాదించవచ్చు'' అనీ చెప్పాడు.
ఆరోజు సాయంత్రం తండ్రి ఇంటికి రాగానే ప్రిన్సిపల్ గారు చెప్పిన విషయాలను చెప్పింది మధురిమ.
ఆ మాటలు వినీ శర్మగారు చాలా బాధపడ్డారు. తండ్రి మౌనం చూసి ''నాన్నగారూ! మా స్నేహితురాళ్ళు కూడా సంగీతం వద్దు అంటున్నారు... కంప్యూటర్స్, మొబైల్స్ కాలంలో కూడా ఆ పాత చింతకాయ పచ్చడి లాంటి సంగీతం ఏమిటే... హాయిగా చదువుకోకుండా అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు'' అంది చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ.
శర్మగారికి ఆ మాటలు ఆవేశం తెప్పించాయి. ''సంగీతం ఈనాటిది కాదు. వేదాలు, పురాణాల్లో సంగీతానికి సమున్నత స్థానం ఇవ్వబడింది. మన దేశంలోనే కాదు పాశ్చాత్య దేశాల్లో కూడా... అమెరికన్ సమాజం బీతోవిన్ సంగీతమంటే చెవులు కోసుకుంటుంది. సంగీతం కూడా శాస్త్రమే... మనిషిని దైవం దగ్గరకు చేర్చే శాస్త్రం... ''త్రివర్గ ఫలదాస్సర్వే దాన యజ్ఞ జపాదయాః ఏకం సంగీతం విజ్ఞానం చతుర్వర్గ ఫలప్రదమ్'' అనీ పండిత లోకం సంగీతాన్ని స్తుతించింది. పైగా సంగీతం చదువుకి ఎంతగానో ఉపయోగపడుతుంది'' అని చెప్పడంతో ఆమె ఇంక వెను తిరిగి చూడలేదు. సంగీతం, చదువు రెండింటినీ రెండు కళ్ళలాగా భావించి రెండింటినీ కొనసాగించింది.
సంగీతం ఆమూలాగ్రం నేర్చుకుంది. అనతికాలంలోనే కచేరీల స్థాయికి చేరుకుంది. ఆమె రెండవ సంవత్సరంలో ఉన్నప్పుడే అరంగేట్రం చేసింది... యూనివర్సిటీ కాలేజీ వార్షికోత్సవంలో ఆమె గాత్ర కచేరీ మొట్టమొదటిసారిగా జరిగింది... ఆ సభలో ఆమె పాడిన ''ఎందరో మహానుభావులు'' అనే పంచరత్న కీర్తన ఆహుతుల్ని సమ్మోహనపరచింది. వైస్ ఛాన్సలర్ ఆమె గాత్రానికి ముగ్ధుడై ప్రత్యేకంగా అభినందించారు.
ఆ మర్నాడు పేపర్లలో ఆమె గురించిన వార్తలు... యూనివర్సిటీలో ఎక్కడా చూసినా ఆమె గురించిన కబుర్లే...
అదొక చిన్న చినుకు... అనతికాలంలో అదొక కుంభవష్టిగా మారింది. ఆంధ్రా ఎం.ఎస్. సుబ్బలక్ష్మి అన్నారు. మరొక బాలమురళీ అని కీర్తించారు.
కీర్తి అనేది ఎలా ప్రారంభమవుతుందో ఎటువైపు తీసికెళుతుందో ఎవరికీ తెలియదు. అది కావాలంటే వచ్చేది కాదు... అందలాన్ని ఎక్కిస్తుంది... కొన్ని కోట్ల ఆస్తి ఉన్నా కొనుక్కోలేనిది...
ఆ కీర్తి మధురిమని వరించింది.
ఇక జీవితంలో ఆమె వెనుతిరిగి చూడలేదు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇలా ఎన్నో దేశాల్లో కచేరీలిచ్చింది. దేశవిదేశాల్లో తన సంగీతంతో అభిమానుల్ని ఓల లాడించింది.
ఈ పేరుతో ఆమె ఉక్కిరిబిక్కిరి కాసాగింది. అనేక ఛానళ్ళు, హిందులాంటి పేపర్లలో ఇంటర్వ్యూలు... చివరకు సినిమాల్లో కూడా సంగీతపరమైన పాటల్ని పాడటం మొదలు పెట్టింది...
ఆ సమయంలో ఆమెకు ఆనంద్‌తో పెళ్ళెంది. అతను ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మొదట్లో అతను ఆమెను ప్రోత్సహించినా రానురాను భార్యకొస్తున్న పేరుని, కీర్తిని సహించలేకపోయాడు.
దీంతో ఆమె సంసార జీవితంలో చిన్న అలజడి రేగింది... చదువుకున్న వాడు కాబట్టి తనని అర్థం చేసుకుంటాడనీ ఆశించిన ఆమెకు అతని ప్రవర్తన బాధ కలిగించ సాగింది...
రానురాను వాళ్ళ మధ్య అంతరం కొద్ది కొద్దిగా పెరగసాగింది. ఆమె వాటన్నింటినీ సహిస్తూ కూడా తన సంగీత ప్రయాణాన్ని కొనసాగించ సాగింది.
అటువంటి సమయంలోనే రఘు ఒకరోజు వచ్చి ఓ పల్లెటూళ్ళో కచేరీ చెయ్యాలని చెప్పాడు... కేంద్రమంత్రి వత్తిడి, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో ఆమె ఒప్పుకోక తప్పలేదు...
లిలిలి
వారం రోజుల తరువాత ఆమె ఆ ఊరుకి రఘుతో కలసి బయలుదేరింది. అది ఉత్తరాంధ్రలో ఓ చిన్న పల్లెటూరు... పేరు సుమిత్రాపురం...
విజయనగరంలో ట్రైన్ దిగి కార్లో ఆ ఊరు బయలుదేరింది. అక్కడికి ఆ ఊరు చేరుకోవాలంటే రెండుగంటల ప్రయాణం. గంట తరువాత కారు సుమిత్రాపురం ఊళ్ళోకి ప్రవేశించింది. ఊరి పక్కన కొండ.. కొండ చుట్టూ పూదండలా ఏరు... ఏటి ఒడ్డున ఊరు... పల్లెటూళ్ళంటే మురికి కూపాల్లాగ ఉంటాయన్న ఆమె అభిప్రాయానికి భిన్నంగా ఉంది సుమిత్రాపురం... ఇలా ఆలోచిస్తూ ఉండగానే కారు ఓ ఇంటి ముందర ఆగింది... అది రెండంతస్తుల ఇల్లు... చాలా విశాలంగా ఉంది. ఇంటి ముందర కొబ్బరి ఆకులు చుట్టూ మామిడి తోరణాలతో పందిరి వేసి ఉంది... ఆహ్వానం పలుకుతూ గేటు దగ్గర కొబ్బరి చెట్లు...
''అమ్మా! ఇది ఈ ఊరి సర్పంచ్ గారిల్లు... అతని పేరు అభిరాం గారు... అతని భార్య ప్రియంవద గారే ఈ ఊరి గుడిని కట్టించారుట... చాలా మంచి కుటుంబం అని అందరూ చెబుతారు... వాళ్ళ మేడ మీద మనకు విడిది ఏర్పాటు చేసారు'' అంటూ చెబుతుండగానే ఆకుపచ్చటి రంగు చీర, గులాబీ రంగు జాకెట్టు, పొడవైన జడతో తెల్లటి మహిళ వస్తూ కనిపించింది.
చూడటానికి ఆమె చాలా అందంగా ఉంది... ముఖంలో తెలియని ఒక ఆకర్షణ కనిపిస్తోంది...
ఆమె పరుగున కారు దగ్గరికి వచ్చి ముకుళిత హస్తాలతో మధురిమకు నమస్కారం పెడుతూ ''రండి... నా పేరు ప్రియంవద'' అంది....
మధురిమ కూడా ఆమెకు నమస్కారం పెడుతూ 'మధురిమ... ఇతను రఘు నా సెక్రెటరీ' అంది కారు దిగుతూ...
ఆమె వెనకాలే ఇంట్లోకి నడిచింది... ఇల్లు చాలా విశాలంగా, అందంగా ఉంది... ఇంతలో వంటమనిషి వెండి గ్లాసులతో కాఫీ తెచ్చింది.
ఇంతలో ''ప్రియా! మంత్రిగారికి ఫోన్ చేసావా?'' అని ఒకతను వచ్చాడు... ఆరడుగుల పొడవున్నాడు. ''మావారు అభిరామ్'' అనీ అతన్ని పరిచయం చేసింది.
కాఫీ చాలా రుచిగా ఉంది... ముఖ్యంగా అది తాగుతుంటే వచ్చే పరిమళం... తన చిన్నప్పుడు అమ్మ పెట్టిన కాఫీని గుర్తుకు తెచ్చింది..
ఇంతలో ముగ్గురు వ్యక్తులు వచ్చి ''అమ్మగారూ! గుడి ముందర మీరు చెప్పినట్లు మొక్కలు నాటాము... పందిరి పూర్తైంది... ధ్వజస్తంభానికి పూలదండలు కట్టేసాము...'' అని చెప్పారు.
''సర్లెండి... సంతర్పణ వంటల్ని దగ్గరుండి చూడండి. రుచిగా ఉండాలి... చెడ్డ పేరు రాకూడదు... అన్నీ ఊళ్ళను పిలిచారు కదా?'' అని అడిగింది.
''ఆరూళ్ళ వాళ్ళనీ పిలిచామమ్మా'' అనీ చెప్పాడు అందులో ఒకతను...
వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత ''రండి... మేడమీద మీ బస... హాయిగా స్నానం చేసి ఫ్రెష్ అవండి...'' అనీ చెప్పి మధురిమని మేడమీదకు తీసికెళ్ళింది.
స్నాన పానాదులు ముగించింది. వేడినీళ్ళతో స్నానం హాయిగా ఉంది. ముఖ్యంగా ఆ ఇంటి బాత్ రూమ్ స్టార్ హౌటళ్ళను మైమరిపించినట్లుంది.
హాల్లో కొచ్చి విశాలమైన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర జడను దువ్వుకుంటూ చుట్టూ చూసింది. ఒక పక్క షెల్ప్ నిండా వందల పుస్తకాలు... షెల్ఫ్ని తీసి పుస్తకాలను చూసింది... వేయిపడగలు, అమతం కురిసిన రాత్రి, మహాప్రస్థానం, కర్నాటక సంగీత దర్పణము, త్యాగరాయ కీర్తనలు, కూచిపూడి నాట్యం... భారత, భాగవత, రామాయణాలు, షేక్ స్పియర్, ఆస్కార్ వైల్డ్, టెన్నీసన్, ఛార్లెస్ డికెన్స్, ఐయాన్ రాండ్ పుస్తకాలు... ఆ పుస్తకాల మీద ప్రియం వద పేరు....
ఇంతటి ఉద్గ్రంథాలను చదివే మహిళ ప్రియంవదంటే ఆమెకు ఆశ్చర్యం కలుగుతోంది. హాల్లో గోడల మీద పికాసో గోయిర్నింకా, డావిన్సీ లాస్ట్ సప్పర్, మోనాలీసా... రవివర్మ... యిలా ఎన్నో గొప్ప చిత్రకారుల చిత్రాలు...
అలా గంటసేపు వాటన్నింటినీ చూసిన తరువాత ప్రియం వద గురించి ఆమెకు పూర్తిగా అర్థం అయింది. సాధారణంగా కనిపిస్తున్న ఆమె ఓ గొప్ప మహిళలా కనిపించింది. ఇంతలో ప్రియంవద వచ్చి 'పదండి! భోజనం చేద్దాం' అంది...
మధురిమ ఆమె రాకని గమనించి 'మేడం! ఈ గ్రంథాలయంలోని పుస్తకాలన్నీ మీరు చదివారా? మీరు సంగీతం నేర్చుకున్నారా?'' అంది విస్ఫారిత నేత్రాలతో...
ప్రియంవద నవ్వుతూ ''రండి! భోజనం చేస్తూ మాట్లాడుకుందాము'' అంది.
మధురిమ ఆలోచిస్తూ ప్రియంవద వెనకాల కిందకు వెళ్ళింది...
పెద్ద డైనింగ్ టేబుల్... మధ్యలో ఘుమ ఘుమలాడిస్తున్న వంటకాలు... వంటకాల వాసన నాసికకు సోకుతోంది. కంచాలు, పాత్రలు... అన్నీ వెండివే... సూర్యకిరణాలు పడి అవి మిలమిల మెరిసిపోతున్నాయి. ఇంతలో అభిరామ్... వెనకాల ఇద్దరు పిల్లలు వచ్చారు. ఇద్దరూ ముద్దుగా ఉన్నారు...
ప్రియంవద వాళ్ళని చూపిస్తూ మా ఇద్దరు పిల్లలు కేదారగౌళ... ఆదిత్య... ఇప్పుడే స్కూలు నుంచి వచ్చారు అంది.
''హారు ఆంటీ! నమస్తే'' అన్నారు వాళ్ళిద్దరూ. ఆ తరువాత ప్రియంవద ఆమెకు కొసరి కొసరి వడ్డించింది. టమోటా పప్పు, వంకాయ పచ్చడి, సాంబారు, బంగాళదుంపల వేపుడు, ఉలవచారు... తియ్యటి పెరుగు... ఆమెకు వాటిని తిన్న తరువాత భుక్తాయాసం వచ్చింది. అన్నీ రుచిగా ఉన్నాయి.
''ఇందాక మీరు సంగీతం గురించి చెబుతానన్నారు'' అని అడిగింది మధురిమ.
''సంగీతం నేర్చుకున్నాను... ఇక్కడ నేను ఓ సంగీత పాఠశాలని నడుపుతున్నాను... మనం గుడికి వెళ్ళేముందు అక్కడికి వెళదాం...'' అంది.
భోజనాల తరువాత విశ్రమించి నాలుగు గంటలకి లేచింది మధురిమ. ప్రియంవద టీ తీసుకొచ్చింది. అది తాగిన తరువాత ఇద్దరూ పాఠశాలకు వెళ్ళారు...
అది వీధిలో చివర్లో ఉంది. విశాలంగా ఉన్న భవనం అది... ఘంటసాల సంగీత పాఠశాల'' అని ముందర బోర్డ్...
ఐదు క్లాసురూములు... అన్నింట్లోను ఏభైమంది దాకా సంగీతం నేర్చుకుంటున్నారు.... ఒక రూములోంచి ''ఎందరో మహానుభావులు'' ఇంకొక పక్క నుంచి ''జగదానందకారకా...'' వేరొక పక్క నుంచి ''భావయామి...'' ఇలా భక్తి పారవశ్యంతో పాడుతున్న విద్యార్థినులు... ఎక్కువమంది ఆడపిల్లలు...
ఒక క్లాసురూమ్ బోర్డ్ మీద ''ఆరోహణ సరిగమపదని... అవరోహణ నిదపమగరిస... స- షడ్జమం , రి - రిషభం, గ - గాంధారం, మ - మందరం, ప - పంచమం, ద - దైవతం, ని - నిషాదం వీటి సంక్షిప్త రూపమే సరిగమనపదని...'' అనీ వ్రాసి ఉంది...
మేడం! ఈ పాఠశాలని చూస్తే నాకాశ్చర్యం కలుగుతోంది. సిలబస్‌తో సహా ఇంత శాస్త్రబద్దంగా చెబుతున్న పాఠశాలని నేనిదివరకు ఎక్కడా చూడలేదు. అయినా మీరిన్ని పనులు చేస్తున్నారు... మీ భర్త గారి ప్రోత్సాహం ఉందా?'' అంది మధురిమ సంభ్రమాశ్చర్యాలతో.
''మేడం! మీరిన్ని పనులు చేస్తున్నారు. మీ భర్త గారి ప్రోత్సాహం ఉందా?''
''అతని సహకారం లేకపోతే ఇన్ని పనులు చేసే అవకాశం ఉండేది కాదు. అతను నా వెంట నీడలా ఉంటారు''
''నిజంగా మీరు చాలా అదష్టవంతులు...'' అని అంది మధురిమ... ఆ తరువాత వాళ్ళు గుడి ప్రాంగణం చేరుకున్నారు....
తెల్లటి పాలరాతితో కట్టిన శ్వేత సౌధంలా ఉంది ఆ గుడి... దూరంగా గుడిగంటల శబ్దం వినిపిస్తోంది. మైకులో 'బ్రహ్మ కడిగిన పాదము' అన్న ఎమ్మెస్ సుబ్బలక్ష్మి పాట వీనుల విందు చేస్తోంది.
గుడి శిఖరం మీద తెల్లటి పావురాలు ఎగురుతూ ఒక పవిత్రతని ఆపాదిస్తున్నాయి.. గుడి ప్రాంగణంలో వేల మంది కూర్చునే పెద్ద తాటాకుల చలువ పందిరి...
''ఈ ప్రదేశంలో మా తాతగారు వందేళ్ళ క్రితం ఈ గుడిని కట్టారు... అది జీర్ణావస్తకు చేరుకోవడంతో నాన్నగారి కోరిక మీద ఈ గుడిని జీర్ణోద్ధరణ చేసాము... ఇది పూర్తవటానికి రెండు సంవత్సరాలు పట్టింది...'' గుడి ఊళ్ళో ప్రజలను సక్రమ మార్గంలో నడవటానికి దోహదపడుతుంది అని ఈ పనికి పూనుకున్నాను'' అనీ ప్రియంవద చెబుతుండగా కలెక్టర్, కేంద్ర మంత్రుల కార్లు అక్కడికి చేరుకున్నాయి.
ముందుగా కలెక్టర్ మాట్లాడుతూ ''ఈ రోజు చాలా గొప్పదినం. ఇంత మంచి గుడి ప్రారంభోత్సవంలో పాల్గొనడం నా అదష్టం. దీని నిర్మాణం వెనక ఉన్న గొప్ప స్త్రీమూర్తి గురించి చెప్పుకోవలసిన అవసరం ఉంది. ఆమెకు హంగు ఆర్భాటాలంటే ఇష్టం ఉండదు... గొప్ప విదుషీమణి అయినా ప్రచారం కోరుకోని వ్యక్తి... ఆవిడే ప్రియంవద' అని చెప్పగానే వేల చప్పట్లు...
ఆ సభకు భారీగా వచ్చారు జనం...
''ఆమె, ఆమె భర్త అభిరాం ఈ చుట్టు పక్కల గ్రామాల అభివద్ధికి ఎంతో కషి చేశారు. ఇవాళ ఏటి మీద ఆనకట్ట కట్టి కాలువల ద్వారా చుట్టుపక్కల గ్రామాల పొలాలకు నీళ్ళు అందుతున్నాయంటే ఈ దంపతుల కషే... అలాగే ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు... ఇలాంటి తెర వెనక వ్యక్తుల్ని మనం స్పూర్తిగా తీసుకోవాలి'' అనీ చెప్పి తన ప్రసంగాన్ని ముగించారు.
ఆ తరువాత కేంద్రమంత్రి చేతుల మీదుగా ధ్వజారోహణం జరిగింది. సాయంత్రం ఆరుగంటలకు మధురిమ కచేరీ మొదలైంది.
కచేరీకి ముందు ప్రియంవద మధురిమ ఎంత గొప్ప గాయకురాలో చెప్పింది. ఆమె మాటలు విన్న మధురిమకి అవి పొగడ్తల్లా అనిపించాయి. ఇక్కడికొచ్చే దాకా తాను చాలా గొప్ప గాయకురాలినన్న అహంభావం ఉండేది... అందుకే చిన్న చిన్న పట్నాలకు కచేరీలకు వెళ్ళేది కాదు... వాటికి ఆ స్థాయి లేదనీ ఆమె భావించేది... కానీ ఈ రోజు ఈ పల్లెకు వచ్చి ప్రియంవదని చూసిన తరువాత ఆమె చక్షువులు తెరుచుకున్నాయి.
అందుకే అన్యమనస్కంగానే కచేరీ మొదలు పెట్టింది... ''ఎందరో మహానుభావులు, జగదానంద కారకా... అలకలల్ల లాడెనే... భావయామి గోపాల బాలం....'' ఇలా చాలా కీర్తనలు ఆహుతుల కోరిక మీద పాడింది.
ప్రతీ కీర్తనని అక్కడికొచ్చిన వాళ్ళు ఎంతో భక్తితో ఆలకించి చప్పట్లతో ఆమెని ఆశీర్వదించారు.
చివర్లో కలెక్టర్ గారి కోరిక మేరకు ప్రియంవద ''భావయామి పాడుతుంటే'' అన్న కీర్తన పాడింది. 13 నిముషాల పాటు అనర్గళంగా, గుక్క తిప్పుకోకుండా ఎన్నో గమకాలను జాలువారిస్తూ పాడిన ఆ కీర్తన ఆహుతులను విశేషంగా ఆకట్టుకుంది.
ఆ తరువాత మధురిమని కేంద్రమంత్రి ద్వారా శాలువా కప్పించి సత్కరించి ఆమెకు రెండు లక్షల రూపాయల చెక్ ఇప్పించింది ప్రియంవద...
ఆ తరువాత మధురిమ వాళ్ళందరికీ వీడ్కోలు పలికి కారు దగ్గరకు నడిచింది...
ప్రియంవద పరుగున ఆమె దగ్గరికి వచ్చి బొట్టు పెట్టి ఆమెకు పట్టుచీర, పట్టుపంచె వెండి పళ్ళెంలో పెట్టి ఇస్తూ ''మధురిమ గారు... మీరీ పవిత్రమైన రోజున రావడం మా ఊరు చేసుకున్న అదష్టం'' అంది...
ఆ మాటలు విన్న మధురిమ ప్రియంవద చేతులు పట్టుకొనీ 'మేడం! మీరు సుమనస్కులు కాబట్టి అలా అన్నారు కానీ నేనే అదష్టవంతురాల్ని... మీలాంటి గొప్ప వ్యక్తిని కలుసుకునే అదష్టం కలిగింది''.
''ఈరోజు నా అంతఃచక్షువులు తెరుచుకున్నాయి. ప్రచారాలు, ఆర్భాటాలు వల్ల వచ్చే గొప్పదనం నీటి బుడగ లాంటిది. అదెన్నాళ్ళో ఉండదు. గొప్పవారు కావాలంటే విద్య, వినయంతోపాటు జ్ఞానం కావాలి... అవన్నీ మీలో ఉన్నాయి కాబట్టే అందరి మన్ననలు పొందుతున్నారు... మీ నుంచి ప్రేరణ పొందిన నేను ఈ రోజు నుంచి సంగీత మూలాలను ఆమూలాగ్రం తెలుసుకుంటాను. నా విద్యని మీలాగే పది మందికి పంచుతాను... ఆడంబరాలకు, కీర్తికండూతులకు దూరంగా ఉంటాను... నేను మొదటగా ఆలపించిన త్యాగయ్య 'ఎందరో మహానుభావులు' అన్న కీర్తన మీకు సరిగ్గా సరిపోతుంది' అంది కార్లో కూర్చుంటూ...
ప్రియంవద ఆమె తలమీద చెయ్యివేసి మనసారా దీవించింది... ఆ తరువాత కారు బయలుదేరింది.
- గన్నవరపు నరసింహమూర్తి
Sat 15 May 22:19:29.084245 2021