''గంగ దేవమ్మ జాతరొస్తుంది. నా బిడ్డ అనితమ్మకు పట్టులంగా వోణి తేవాలె. పొద్దుగాల లేశి మిరాలగూడెం పోయి పెద్ద షాపుల కొనుక్కొస్త. పట్టులంగా వోణేసుకొని నా బిడ్డ నడుస్తుంటే అచ్చం లచ్చుమమ్మోరు నట్టింట తిరిగినట్టు ఉంటది'' అని పొద్దంతా పొలం పనులు చేసి అలసిపోయి ఇల్లు చేరి ఇంత అన్నం తిని ఆరుబయట వాల్చిన నులక మంచం మీద ఒరిగి తనలో తాను మాట్లాడుకుంటూ నిద్ర పోయిండు కాశయ్య.
తనకున్న రెండెకరాల పొలంను భార్య సత్తెమ్మ, ఒక్కగానొక్క బిడ్డ అనితల సాయంతో పండించుకుంటూ ఉన్నంతలో నిమ్మలంగా జీవితం సాగిస్తున్న సన్నకారు రైతు. కాశయ్యకు భార్య, బిడ్డలంటే పంచప్రాణాలు. అంతేకాదు చుట్టాలన్నా చాలా ఇష్టం చూపించేవాడు. ఎంత మంది చుట్టాలుంటే అంత ధైర్యం అనుకునేవాడు. తన ఒక్కగానొక్క బిడ్డకు వాళ్ళంతా అండగా నిలుస్తారనుకొని బీరకాయ పీసులా ఎంత దూరపోళ్ళు అయినా నా వాళ్లే అన్నట్టు భావించే సగటు మనిషి.
కోడికూతతో మేల్కొన్నాడు కాశయ్య.
''సత్తెమ్మా ఇయ్యాల నువ్వే పొలానికి పో. నేను మిరాలగూడెం బోయి మన అనితమ్మకు మంచి బట్టలు కొనుక్కొస్తా, అట్నే జాతరకు మన సుట్టాలందరిని పిలవాలె గదా వంటకు గావల్సిన ఉప్పు పప్పులన్నీ తెస్తా. రేపు లేదు ఎల్లుండేనాయె జాతర. ఎల్లుండి పొద్దుగాలనే రమ్మన్న సుట్టాలందరిని.''
''సరే సరే ఇంగ నేను పొయ్యొస్తా. సంచి దేపోవే''.
''ఇగబట్టయ్య సంచి. నువ్వు కుడుమంటే పండగంటవు అయ్యాల కియ్యాలకు పండగని, జాతరని ఏదో తీర్గ సూట్టాల్ని పిలుస్తనే ఉంటవు. ఇగ నాకు పొయ్యి కాడ పనే పని. తేపో సమాను. కానీ మన అనితమ్మకు మాత్రం మంచి రేటుకల్ల బట్టలు కొనుక్కరా. నేను పొలం పని సూసుకుంట''.
''నాయిన! ఓ నాయిన!''
''పచ్చ రంగుకు ఎర్రంచు ఉన్న లంగా వోణి సెట్టుతే. నాకు ఆ రంగు చానా ఇష్టమని నీకు తెలుసుగా. అదే తెస్తవులే నోరాగక చెప్తున్న''
''సరే మరి తల్లీ బిడ్డలు పనులు సూసుకోరి నే పొయ్యొస్త''.
''అనితమ్మ ఇయ్యాల ఎండ బగ్గ గొడుతుంది. నువ్వు ఇంటి కాడనే ఉండు. నేను పొలంకాడికి పోయి దబ్బున వస్త.''
''అట్నే అమ్మా. నేను నువ్వొచ్చేసరికి సందెగాకిలి తీస్త. ఆకిట్ల నీళ్లు సల్లుత''.
''పొయ్యొస్త బిడ్డా, భద్రం''.
అనిత ఇంటి పనంతా చేసి తల్లిదండ్రుల రాక కోసం ఎదురుచూస్తుంది.
గన్మ కానుంచే ''బిడ్డా! అనితమ్మ!నాయిన వచ్చినాడె?''
''ఏడమ్మా! ఇంకా రాలే''.
''వస్తడులే తల్లీ యాల్లయింది వస్తడు''.
''అమ్మా నాయిన్నే, నూరేండ్లు నాయిన నీకు. ఏమేం దెచ్చినవు? ఇటియ్యి సంచి''.
''అబ్బ నా లంగా సూపరుంది నాయిన''.
''మస్తు నచ్చింది''.
''ఇంగ నువ్వు మురుసుడు మీ నాయిన సంబురం బానే ఉంది గని ఎల్లుండి గంగదేవి లగ్గం గదా అయ్యాల ఏసుకుందువు. లోపల దాపెట్టి నాయినకు, నాకు ఇంత చాయి సుక్క తేపో బిడా''.
''అట్నే అమ్మా ''
''ఇంతకు ఎన్ని పైసలు కర్సయినయయ్యా?''
''ఎన్నో లేవే గదంత నేను సూసు కుంట. నువ్వు మాత్రం బిడ్డని మంచిగ తయారు చేయి. సుట్టాలకు మాట బోకుంట వండి పెట్టు. ఒక్క యాట పోతును కొనేది మిగిలింది. గొర్ల బేరగాడు ఎల్లయ్య ఇంటికి పోయి ఒక చిన్న పాటిది మేక పోతు ఉందేమో జెర్ర అగ్గువకు బేరమాడి తెస్త. రేపు ఇంటి ముంగల గుంజలు పాతి పందిరెయ్యాలె. నలుగురొచ్చినా కూసుం టందుకు బాగుంటది. ఎల్లయ్య ఇంటి దాన్క పొయ్యొస్తనే''.
జాతర సంబరమంత కాశయ్య ఇంట్ల కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఏర్పాట్లన్నీ పూర్తయినయి.
సుట్టాలంత ఒకరొ కరిగా రావడం తో కాశయ్య ఇంట్ల పండుగ వాతా వరణం నెలకొంది.
లంగా వోణి ఏసుకున్న అనితలో నిజంగనే లక్ష్మికళ ఉట్టి పడుతుంది. కాశయ్య కుటుంబం, వచ్చిన సుట్టాలు అంతా జాతర జరిగే గుడి కాడికి పోయిండ్రు. దేవుని కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. గుడి మాన్యంతో అందరికీ భోజనాలు కూడా పెట్టిండ్రు. అంతా తిని మళ్ళీ కాశయ్య ఇంటికి చేరిండ్రు. తెల్లారి అగ్ని గుండాలు చూసి సల్లబడ్డంక గానీ ఎక్కడోళ్ళు అక్కడకి పోరు. సాయంకాలం అయింది.
దూరపు సుట్టం వెంకయ్య కండ్లన్నీ అనిత మీదనే.
ఆగబట్టలేక వెంటనే ''కాశయ్య బావ! అనితమ్మ పెండ్లి చేయవా ఏంది. పెండ్లీడు పిల్లను ఇంట్ల బెట్టుకొని గింత పికరు జేస్తలేవు. ఏంది బావా! పిల్లగాడిని నాకు చెప్పకుండనే దోలాడినవా ఏంది''
''అయ్యో! గట్ల మాట్లాడతవు ఏంది బావ. అనితమ్మ పది సదివి ఏడాదేగా అయ్యింది. పెండ్లి గురించి ఇంకేం సోచాయించలేదు బావ''
అవునా, సరే బావ మంచి పిల్లగాడు ఉన్నడే. మా ఊర్ల ఈరమ్మ అని నాకు దూరం చుట్టమే. ఆమెకు ఒక్కడే పిల్లగాడు. ఆళ్ళకు గూడ ఇంత పొలం ఉంది. ఆ పిల్లగాడు గూడ పది సదివిండు. ఎవుసాయం పని అంత నేర్సుకుండు. మీ తాకతుకు ఆళ్ళు ఆళ్ళ తాకతుకు మీరు సరిపోతరు. ఎక్కువ సంబంధాల జోలికి పోయి ఏడ నెగుల్తవు. చిన్నతనాన పెండ్లి చేస్తేనే నీకు బాధ్యత పోతది. ఎంత గార్వంగ సాత్తె మాత్రం ఓ ఇంటికి ఇయ్యాల్సిన బిడ్డేగా. చెల్లె సత్తెమ్మ చెవిన గూడ ఈ మాటెయ్యి బావ''.
''సర్లే బావ మీ చెల్లెకు చెప్తతిరు. ముందు భోజనాలకు లేద్దురు పారి అందరు''
లింగన్నా! మల్లక్కా!
ఓ సూరమ్మత్తా! భద్రి మామా లేవురే! తిందురు పారి''.
''తమ్మీ! కాశయ్య! మర్యాదంటె నీదేరా దేనికి ఎల్తి గానియ్యవు''
''అవునవును గింత లోటు గానియ్యడు తమ్ముడు''
''లింగన్నా! మల్లక్కా! మీకంటే ఎక్కువేముందే నాకు. మీరందరు నాకు అండే''.
కల్లు కుండ కతమయింది. సీసాలు ఖాళీ అయ్యాయి. ఏది తాగేటోళ్ళకి అది పోసిండు కాశయ్య. మధ్య మధ్య సత్తెమ్మ చేసిన అప్పలు, వండిన తునకలు ఉండనే ఉన్నాయి. అన్నిటినీ పీకల దాకా పట్టించ్చిండ్రు. నడిరేయి అయితుందని సత్తెమ్మ పిలుపుతో సుట్టాలందరు అన్నానికి లేచిండ్రు. కొందరికి లేవబుద్ది కాకున్నా తప్పదన్నట్లు లేచిండ్రు.
లి లి లి
తెల్లారింది. అందరు యాప పుల్లలు ఏసుకొని కాలు మొకం కడుక్కున్నరు. సత్తెమ్మ వేడి వేడి ఉప్మా చేసింది. అంత తిన్నరు. అగ్నిగుండాల తంతు చూస్తానికి పోయిండ్రు.
ఈలోగా సత్తెమ్మ బిడ్డ అనితమ్మ కలిసి మళ్ళీ మధ్యాహ్నం భోజనాల ఏర్పాట్లు చేసింది. ఇంట్ల తిరుగాడే కోళ్ల తలలన్ని సుట్టాల కంచాలల్ల కమ్మని ముక్కలైనయి. మందు గిందు తంతు తంతే.
మొత్తానికి సాయంత్రమయింది. చిన్నగ సుట్టాలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళ ఇంటి దార్లు పట్టిండ్రు. వెంకయ్య మాత్రం బావా! నేను చెప్పింది గుర్తుందిగా అన్నట్లు కాశయ్య వైపు చూసిండు.
''కాశయ్య తలాడించిండు''.
వర్షం వెలిసినట్టు అనిపించింది సత్తెమ్మ, అనితలకు.
మిగిలిన అన్నం ముగ్గురు తిని సొక్కిపోయి నిద్ర పోయిండ్రు.
తెల్లారింది. మళ్ళీ షరా మాములే. పొలం పనులు.. కాశయ్య మాత్రం మళ్ళ ఏ పండుగొస్తదా ఇంకే కారణం దొరుకుద్దా.. సూట్టాలను పిలుస్తానికి అని ఎదురు చూస్తూనే ఉంటడు.
పొలానికి పొయ్యొచ్చిన తర్వాత కాశయ్య అనితమ్మ నిద్ర పోయింది చూసి ''సత్తెమ్మా! మన వెంకయ్య బావ ఏములపెల్లిల మంచి సంబంధం ఉందని చెప్పిండే. మన అనితమ్మకు పెండ్లి చేద్దాం. పక్కూరే కాబట్టి ఎప్పుడంటే అప్పుడు బిడ్డను సూశి రావొచ్చు. ఒక్కడే పిల్లగాడట. ఏమంటవే?''
''బిడ్డను సూడకుంట ఉండాల్నంటే బాధయితుందయ్యా. కాని ఎప్పుడైనా పెండ్లి చేయక తప్పుతదా? లేటు అయితాంటె కడుపుల గుబులు ఎక్కువైతది. మళ్ళ మన తాకతుకు సరిపోయే సంబంధం రావడం గూడ కష్టమయితదేమోనయ్య. సూడు మరి మంచి, చెడు కనుక్కో. మరె కట్నం ఎంత అడుగుతరో ఏమో!''
ఎంత అడి గినా మనకున్న దంత మన బిడ్డకే. అందాక ఎకరం పొలం పిల్లగాని పేర్న రాశి, భారీగ లగ్గం చేసి పంపిస్తనని చెప్తా అయినా పిల్లగాన్ని, ఆళ్ళ ఇల్లు, పొల్లు సూశినంక గదా గీ కట్నకానుకల ముచ్చట. ముందుగాల నీకిష్టమేనా గది జెప్పు''.
''బిడ్డకిప్పుడు పదిహేడు పడే. ఇంగ ఆపుకొనుడు ఎందుకు చేద్దాం లేయ్య. మంచోళ్ళని వెంకయ్య అన్న చెప్పిండు అన్నవుగా''
''అయితే మంచిరోజు చూసి వెంకయ్య బావని పిల్లగానోళ్ళని పెళ్లిసూపులకి తోల్క రమ్మంటా''.
పిల్లగానోళ్లకి అనితమ్మ నచ్చడం, కాశయ్య, సత్తెమ్మలకు పిల్లగాడు నచ్చడంతో చూస్తుండగానే అనితమ్మ పెండ్లి జోరుదారుగ జరిగి పోయింది.
అనితమ్మ భర్త పేరు ఆంజనేయులు. దగ్గరోళ్లు అంజి అంటరు.
ఆంజనేయులు మంచివాడు. కాకపోతే పొలం పనులు చేయడం తప్ప పెద్దగా లోకం తెలియదు. ఇతని తల్లిదండ్రులకు ఎక్కువ కట్నం తెచ్చే పిల్ల తమ కోడలిగా వస్తే బాగుండు అని మనసులో ఉన్నా కొడుకు చదువు, తెలివి తేటలు తెలుసు కనుక కాశయ్య సంబంధం ఒప్పుకున్నారు. అనిత అత్తగారింట కాలు పెట్టింది.
కొత్తగా పెళ్ళైన జంటగా ఆంజనేయులు, అనితల సంసారం అన్యోన్యంగా సాగుతున్న సందర్భం చూడ చక్కగానే ఉంది. ఇంతలో అనితకు అనుకోకుండా వాంతులు కావడంతో ఊళ్ళ డాక్టరుకు చూపించారు.
డాక్టర్ అనితను పరీక్షించి ఆంజనేయులుతో ''అనిత గర్భవతి. ఇప్పుడు రెండో నెల. అమ్మాయి చాలా బలహీనంగా ఉంది. చిన్న వయస్సులో గర్భవతి కావడం వల్ల ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. పండ్లు, పాలు రోజూ ఇవ్వండి. మందులు రాసి ఇస్తాను. ప్రతి నెల చెకప్‌కి తీసుకురండి''. అన్నాడు
''సరే డాక్టర్ తప్పకుండా తీసుకొస్తా. వెళ్ళొస్తాం డాక్టర్''.
''అనితా పద పోదాం''
వాళ్లిద్దరు ఇల్లు చేరారు.
ఆంజనేయులు తల్లిదండ్రులకు విషయం చెప్పాడు.
వాళ్ళు కూడా సంబరపడ్డారు.
శుభవార్తను కాశయ్య వాళ్ళకు తెలియజేసారు.
''సత్తెమ్మా! నేను తాతనైతున్నానే''
''అబ్బో అక్కడికేదో నువ్వొక్కడివే తాత అయితున్నట్టు. నేను గూడ అమ్మమ్మనైతున్నతిరు''
''రేపు బిడ్డను సూశి వద్దామే సత్తెమ్మ''
''సరేయ్య నేను పొయ్యి బెట్టి పిండొంటలు చేస్త అనితమ్మకు ఇష్టమైనయన్ని వంత'' అంటూ కాశయ్య, సత్తెమ్మ సంతోషంతో పొంగిపోయారు. వాళ్ళిద్దరి కళ్ళు సూర్యుడి రాక కోసం ఎదురు చూస్తున్నాయి.
తెల్లారింది.
అనితమ్మ ఇంటికి పండ్లు, పిండొంటలు ఎన్నో తీస్కొని పోయిండ్రు.
''నాయినా! అమ్మా! బాగున్నారే మూడు నెల్లు దాటి పోయిందే మిమ్మల్ని సూడక''.
అనిత ఆనందానికి హద్దులు లేవు.
కాశయ్య, సత్తెమ్మలు కూడా తల్లి కాబోతున్న బిడ్డను చూసి తెగ ఆనందపడ్డారు.
సత్తెమ్మ వియ్యపురాలితో ''వదినా! నాల్రోజులు అనితమ్మను మా ఇంటికి తోల్కపోతా పంపరాదు''.
''అయ్యో! బానే ఉంది వదినే నీ సక్కదనం ఎవ్వలైన రెండో నెలల తల్లిగారింటికి కోడల్ని అంపుతరా. ఐదు పడ్డంక తీస్కపోదువు తిరు''.
''అట్నే వదినే అట్నే తీస్కపోత గాని. జర్ర చేతగాక పంతే పని గిట్ల జేస్తలేదని అనుకోకు వదినే. ఏదో నా తుప్తి కోసం చెప్తున్న. ఏమనుకోకు'' అంటూ అనితమ్మకు జాగ్రత్తలు జెప్పి కాశయ్య, సత్తెమ్మలు తిరిగి ఇంటికి పయనమైండ్రు.
మూడు నెల్లు గడిచిపోయాయి. కాశయ్య, సత్తెమ్మలు ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. అనితను అత్తగారింటి కాడ నుండి తీసుకొచ్చుకుండ్రు.
పూలల్ల పెట్టి చూసుకుంటుండ్రు.
లోకమంతా కరోనా సెకండ్ వేవ్ ప్రబలుతున్న రోజులు.
అనితకు ఎనిమిదో నెల వచ్చింది. కాశయ్య, సత్తెమ్మలు అనితను అత్తగారి ఊళ్ళ ఉన్న డాక్టర్ దగ్గరే నెలనెలా చూపిస్తుండ్రు. చెకప్ కోసం దవాఖానకు భద్రంగ పోయి వస్తున్నరు. ఒకరోజు కాశయ్య, సత్తెమ్మ, అనిత రాత్రి అన్నం తిని టీవీల వార్తలు చూస్తున్నారు.
లాక్ డౌన్.. లాక్ డౌన్
దేశమంతా కరోనా ఉదతి విపరీతంగా ఉండడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేపటి నుండి లాక్డౌన్ ప్రకటించాయి అని చెప్పారు.
కాశయ్య, సత్తెమ్మలలో ఏదో తెలియని భయం.
''అనితమ్మ సల్లగ బైట పడాలి. నెలలు పెరుగుతుంటే నాకెందుకో గుండెల్ల దడొస్తుందయ్యా ''
''అవునే సత్తెమ్మ నాక్కూడా గట్నే ఉంది''.
''భయపడ్డది సాల్లేమ్మ. నాకు బంగారం అసవంటి బిడ్డ పుడతది. ఇగో అమ్మమ్మా, తాతలు రెడీగుండురి. మనవరాలికి చాకిరీ చేస్తానికి'' అని నవ్వుతూ నిద్ర పోయింది అనిత.
''సత్తెమ్మా! ఈ కరోనా మాయరోగం ఇంకా పోతలేదేమె. ఇప్పుడొచ్చే కరోనకు మూడు రోజుల్లనే సస్తుండ్రట''.
''అవునయ్యా! మొన్న అనితమ్మను దవాఖానకు తీస్కపోయిన కదా అయ్యాల లెస్స భయమైందయ్యా. చానా మంది కరోనా రోగులు ఉండ్రయ్యా ఆడ. మనకు తెలుస్తలేదు కాని మన ఊళ్ళ గూడ చానా మంది కరోనా వచ్చినోళ్లు ఉండ్రంట. నువ్వు లేచింది పొద్దుగ పొలానికి పోతుంటివి. నేను ఇంటికాడ ఉండబట్టి ఆళ్ళ నోటా ఈళ్ళ నోటా ఇనబడితి. నీతో జెప్తే నువ్వు ఇంకింత అదురుకొని అనితమ్మను అదరగొడతవు అందుకే నోరుమూసుకున్న. బిడ్డ ఎట్ల కంటదో గుబులు అయితుందయ్యా ''.
''ఏం కాదు కాని ఇంగ పండుకోవే''
''నువ్వు గూడ పండుకో''
తెల్లార్గట్ల నుండి అనిత ఒకటే దగ్గుతుంది.
''అనితమ్మ ఏందే గట్ల దగ్గుతున్నవు. తీపియి గూడ ఏం పెట్టనైతి''.
ఏమో అమ్మా ఇందాక నుంచి గొంతుల పట్టేసినట్టే ఉందే. ఊకె ఊకె దగ్గొస్తుంది. ఏం చేతనైత లేదే''.
''జర్ర ఓపిక జేసుకోని లే బిడ్డ. ఇన్ని పాలు తెస్త. తాగుదువు. ఆసర పడితే చేతనైతది. తెస్త ఉండు''.
''నాయినా! నాకు కడుపు బిర్రు అనిపిస్తుందే. ఓ నాయిన నా కడుపుల మెలిబెట్టినట్టు అయితుందే''.
''ఓ సత్తెమ్మ! బిడ్డ అల్లాడుతుందే, కడుపు బిర్రు అంటుంది దబ్బున రాయే''
''వస్తున్ననయ్యా. వామ్మో బిడ్డ పొట్ట ఇంత బిర్రు అయిందేంది. దవాఖానకు తీస్కపోదాం పాయ్య. ఆటో పిల్సక రాపో''.
కాశయ్య ఊళ్ళ ఆటో స్టాండ్ దగ్గరకు పోయిండు. ఒక్క ఆటో గూడ లేదు. ఆన్నుంచి పోతున్న ఆటో రాజునడిగిండు. పరిస్థితి చెప్పిండు. ఆటో రాజు కాశయ్య ఇయ్యాల లాక్డౌన్ ఎవ్వరు రారు. ధైర్నం జేసి ఆటో తీసిండ్రో, పోలీసులు మక్కెలిరగ్గొడతరు. ఇట్ల కాదు కాని అంబులెన్సు నెంబర్ జెప్తా. పోనుందిగా కొట్టు''.
''సరే చెప్పు రాజు ''
కాశయ్య రాజు చెప్పిన ప్రైవేటు అంబులెన్సుకి పోను చేసిండు. విషయం చెప్పిండు.
కొద్దిసేపట్లోనే అంబులెన్సు వచ్చింది.
కాశయ్య, సత్తెమ్మ అనితను తీసుకొని ఎప్పుడూ చూపించే ఏమలపెల్లి దవాఖానకు తీసుకెళ్లారు.
కాశయ్య అల్లుడు ఆంజనేయులుకు ఫోన్ చేసి సంగతి చెప్పిండు. ఆగమేఘాల మీద ఆంజనేయులు అతని తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు.
సత్తెమ్మ ''డాక్టరమ్మా! మా అనితకు తెల్లారుగట్ల నుంచి అల్లాడుతుంది. సూడమ్మా అంది''.
డాక్టర్ అనిత పరిస్థితి గమనించింది.
''అమ్మాయికి కరోనా లక్షణాలు కొట్టొచ్చినట్లు కనపడుతున్నాయి. పైగా ఉమ్మనీరు తక్కువైనట్టుంది. అందుకే కడుపు బిర్రు అయింది. నేను కేసు పట్టలేను. నా వల్ల కాదు. సిటీకి తీసుకెళ్లండి''.
''డాక్టరమ్మా నువ్వే అట్లంటే ఎట్లమ్మా. జర్ర సూడు తల్లి''
''లేదమ్మా, మీరు ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది. తర్వాత మీ ఇష్టం''.
''వామ్మో, ఓ యమ్మో అనితమ్మా'' అని సత్తెమ్మ బోరున ఏడుస్తోంది.
''ఇగ లేటు చెయ్యొద్దు మామా! పారి పట్నం పోదాం. మామా నా కాడ పదెయ్యిలు ఉన్నయి. నువ్వు పైసలు తెస్తున్నవా, పట్నం ఆసుపత్రి అంటే పైసలు మస్త్ గయితయి''.
''అల్లుడూ! నాల్రోజుల కిందనే ఇరవై ఎయిలు పెద్ద ఆసామి కాడ మిత్తికి దెచ్చిన. అనితమ్మ నెలలు నిండుతున్నయని ముందే దెచ్చి పెట్టిన''.
''సాల్తయో లేదో మామా!''
దార్ల చౌటుప్పల కాడ లింగన్నను అడుగుదాం అల్లుడు. లింగన్న మా పెదనాయన కొడుకు. అడిగితె కాదనడు ''.
''సరే మామా''
డ్రైవర్ బాబు జర్ర మా అల్లుడు ముంగట కూసుంటడు. నేను, మా సత్తెమ్మ అనితమ్మతోటి ఎనక కూసుంట'' అని డ్రైవర్ ని బతిలాడి అంబులెన్సు ఎక్కిర్రు.
''వో యమ్మ! వో నాయిన! నా పానం పోయినట్టయితుందే. నా కడుపుల నొప్పి. నా తాన అయితలేదు వామ్మా...''
''బిడ్డా! జర్రోర్సుకోవే నా బిడ్డ. నీకేం కాదే. ఇగో మీ నాయినను సూడు నీకేం కాదు బిడ్డా!'' అని సత్తెమ్మ పైకి ధైర్యం చెప్తూ లోపల వణికిపోతుంది.
''డ్రైవర్ బాబూ! తొందరగా పోయ్య. మా అనితమ్మ బాధ సూడలేకపోతున్న'' అని కాశయ్య అనడంతో డ్రైవర్ ఇంకాస్త వేగం పెంచిండు. చాలా తొందరగానే చౌటుప్పల్‌కు చేరుకున్నారు.
కాశయ్య ''ఇగో గీ సందులనే మా అన్న లింగన్న ఇల్లు''.
''ఒక్క నిమిసం ఆపుకో డ్రైవరయ్యా'' అన్నడు కాశయ్య.
కాశయ్య దిగి గన్మట్ల కాలు పెట్టడంతోనే లింగన్న కాశయ్యను ఎగా దిగా చూసిండు.
''లింగన్నా! అన్నా! మన అనితమ్మకు ఆపదొచ్చిందే. జెర్ర సాయం జేయి. పదిరవైయేలన్నా సర్దు మళ్ళ నిమ్మల పడంగానే ఇస్తా''.
''నా కాడ పైసలు ఎక్కడియి. పైసలన్ని ఇంటికే పెడితె. అయినా కరోనా కాలంల గిట్ల ఇంటి దాన్క అంబులెన్సు ఏసుకొని వస్తవా?'' అని చిటపటలాడాడు.
మంచిగున్నప్పుడు తనింట్ల తిని తాగిపోయిన లింగయ్య నిజానికి బాగా డబ్బులున్నోడు.
ఆపద కాలానికి కాశయ్య సాయం చేయకపోగా ఎందుకొచ్చావు అన్నట్టు మాట్లాడాడు. చేసేది లేక కాశయ్య అంబులెన్సు ఎక్కి ''అల్లుడూ! డబ్బు తర్వాత కడతా, పొలం అమ్మి తెస్తా. ముందుగాల జాయిను చేసుకొమ్మని దవాఖానోళ్ళని అడుగుదాం. ఇంగ ఏడ ఆగొద్దు. పారి పోదాం''.
అంబులెన్సు కదిలింది.
కాశయ్యకు పట్నంల ఉండే సుట్టపోళ్ళు యాది కొచ్చిండ్రు.
పట్నంల ఉండే మల్లమ్మకు పోను కల్పిండు.
''అక్కా! మల్లక్కా! గట్టిగ ఏడ్శిండు''.
''ఏంది, కాశయ్య ఏమైంది?''
''అక్కా! అనితమ్మకు బాలేదు. జర్ర నువ్వే సాయం చేయాలె. సత్తెమ్మకు ధైర్నం జెప్పాలె. జర్ర గీ హయతునగర్ సంటర్ కాడుంటం వస్తవా? అక్కా?''
''అట్నా! కాశయ్య బిడ్డకెంత ఆపదొచ్చె నీ నొచ్చి ఏం జేస్త గాని మంచి ఆసుపత్రికి తీస్కపో. కరోన కాలమాయె. ఉంట మరి'' అనడంతో కాశయ్యకు ఇంకింత దిగులయింది.
ఇంతల ఓ ప్రవేట్ ఆసుపత్రి వచ్చింది. అంబులెన్సు ఆపి అనితను గేట్ దగ్గరకు తీసుకెళ్లిండ్రో లేదో నర్స్ వచ్చి చూసి వెంటనే లోపలకు వెళ్ళి డాక్టర్‌కు చెప్పింది.
డాక్టర్ హల్లోకి వచ్చి అనితను చూసి ''ఈ అమ్మాయికి కరోనా ఉన్నట్లుంది. బాగా దగ్గుతుంది. లేదు మా దగ్గర పడకలు ఖాళీలేవు. వేరే హాస్పిటల్ కి తీసుకెళ్లండి'' అంది.
సత్తెమ్మ వాళ్ళు ఎంత బతిమిలాడినా అనితను జాయిన్ చేసుకోలేదు.
తప్పదంటూ మళ్లీ అనితను అంబులెన్సులో ఎక్కించుకొని మరో ప్రైవేటు దావఖానకు తీసుకెళ్లడానికి సిద్ధమయ్యారు.
అంబులెన్స్‌లో పోతున్నప్పుడు కాశయ్యతో పాటు సత్తెమ్మ కూడా చుట్టాలకు తెలిసినోళ్లకు ఫోన్లు చేస్తూనే ఉంది. కానీ రకరకాల కారణాలు చెప్తూ ఎవ్వరూ ఏ సాయానికీ ముందుకు రాలేదు.
వరుసగా ఐదు ఆసుపత్రులకు తిరిగారు. ఎవ్వరు అనితను జాయిన్ చేసుకోలేదు. ప్రైవేట్ హాస్పటల్ వాళ్ళందరూ కాశయ్య తాహతు కనిపెట్టినోళ్లే. ఒక్కొక్క హాస్పటల్లో ఒక్కో కారణం చెప్తున్నారు.
చివరికి అంబులెన్స్ డ్రైవర్ ''అయ్యో! ఇట్ల కాదు గాని కోఠి సర్కారు దావాఖానకు తీస్కపోతే తప్పకుండ సూస్తరు'' అనిజెప్పిండు.
అందరు సరే అనుకొని అక్కడికి వెళ్లారు.
అంబులెన్స్ నుండి అనితను కిందికి దింపి గేటు దగ్గరికి తీసుకెళ్లారు. అప్పటికి మధ్యాహ్నం అయింది.
''డాక్టర్ ఒకరు వచ్చి చూసి అయ్యో! ప్రాణం పోయింది. లోపల బిడ్డ ప్రాణం కూడా పోయే ఉంటది. అసలేమైంది'' అని అడగడంతో సత్తెమ్మ ''పొద్దుగాల నుండి ఐదు దావకాన్లు తిరిగినం ఒక్కరు కూడా చేరిక చేసుకోలేదయ్యా! నా బిడ్డ పోయిందాయ్యా!'' అని లబోదిబో మొత్తుకుంది.
ఆస్పత్రి సిబ్బంది అనితను అక్కడి నుండి తీసుకెళ్ళమని తొందర పెడుతున్నారు. చనిపోయిన అనిత కరోనా పేషెంట్ అని వాళ్ళ అనుమానం. ఇంటిదాకా తీసుకువెళ్లడం మంచిది కాదని అక్కడే దగ్గరలో ఉన్న స్మశాన వాటికలో దహనం చేయమని ఉచిత సలహా ఇచ్చారు. చేసేదిలేక కాశయ్య, సత్తెమ్మ, ఆంజనేయులు మళ్లీ అంబులెన్స్‌లో అనితను తీసుకొని ఏడుస్తూ బయల్దేరారు.
అప్పటికే సాయంత్రం దాటడం, కరోనా ఉన్న బిడ్డని అల్లా ఇంటికి తీసుకొచ్చిర్రేందని ఊరోళ్ళు ఏమంటారోననే భయం ఒకవైపు. కాశయ్య, సత్తెమ్మ ఆంజనేయులు బాగా ఆలోచించుకున్నారు. ఏడ్చుకుంటూనే పట్నం దగ్గర్లో ఉన్న స్మశాన వాటికకు తీసుకెళ్లారు. అక్కడ కూడా ఎదురుదెబ్బే తగిలింది కాశయ్య వాళ్లకు.
కాటికాపరి ''ఈ అమ్మాయి గర్భంతో ఉంది. గర్భంతో ఉన్న ఆడబిడ్డను అట్లాగే కాల్చకూడదు. అది ఊరికే అరిష్టం. తల్లి బిడ్డను వేరు చేసి తీస్కరారి. అప్పుడే నేను దహనం చేస్తా'' అనడంతో ముందే పుట్టెడు దుఃఖంలో ఉన్న కాశయ్య, సత్తెమ్మలు బిత్తరపోయారు.
''అయ్యా! అట్టనమాకు నా బిడ్డ బంగారమయ్యా! దాన్ని సూసి దేవునికే కన్ను కుట్టిందయ్యా. దండం పెడతా! దానం చేయయ్యా!'' అని సత్తెమ్మ గుండెలవిసిపోయేలా ఏడుస్తుంది.
కాశయ్య ఏకంగా కాళ్ళు పట్టుకొని బతిమిలాడిండు. అయినా కాటికపరి మనసు కరగలేదు.
''నేను దానం చేస్తమ్మా, కానీ తల్లీ, బిడ్డను ఏరు చెయ్యాల'' అంటుండు ఎంత సేపటికి. ఇక ఏదైతే అదే అయిందని తమ ఊరికి వెళ్లిపోయిండ్రు కాశయ్య వాళ్ళు. ఇల్లు చేరేసరికి బాగా చీకటయింది. ఊరంతా విషయం పాకిపోయింది. అంబులెన్స్ డ్రైవర్ ''మీ బిడ్డ లాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. నిజానికి నా అంబులెన్స్ బిల్లు ముప్పై వేలు. కానీ నాకు ఒక్క రూపాయి కూడా వద్దు. దహన కార్యక్రమాలు అయిపోయాక నేను వెళ్తాను'' అని పక్కకు వెళ్లి కూర్చున్నాడు.
డ్రైవరయ్య నీకున్న పాటి జాలి ఎవరికీ లేకపాయెనయ్యా అంటూ కాశయ్య, సత్తెమ్మలు గట్టిగ మొత్తుకుండ్రు. తెల్లవార్లు ఏడుస్తూనే ఉన్నరు.
''తల్లినీ బిడ్డను వేరు చేసే డాక్టర్ కావాలి. లేకుంటే ఎవ్వరు దానం జేయరంట'' అని నేలకు తల బాదుకొని ఏడుస్తుంది సత్తెమ్మ. విషయం మీడియాకు తెలిసింది. తెల్లవారేసరికి ఎంతో మంది మీడియా వాళ్ళు కాశయ్య ఇంటికి చేరుకున్నారు. మీడియా జోక్యంతో విషయం నలుమూలలకు పాకింది. ఈ వార్త తెలుసుకున్న సుబ్బారావు డాక్టర్ మిరాలగూడెం నుండి నేరుగా కాశయ్య ఇంటికి చేరుకున్నాడు.
''కాశయ్యా! నేను డాక్టర్ని. అమ్మాయి ప్రాణం పోయింది. దాన్ని నేను తెచ్చియ్యలేను. ఈ వార్త విని నా గుండె బరువెక్కింది. తట్టుకోలేకపోయాను. అందుకే వచ్చాను. ఇంకా మూఢ నమ్మకాలు సమాజాన్ని పట్టి పీడిస్తూనే ఉన్నాయి. నేను నీ బిడ్డ అనితకు సర్జరీ చేసి తల్లీ బిడ్డలను వేరుచేయగలను. కానీ అది ముమ్మాటికీ అమానుషత్వం. అరిష్టం పేరుతో మిమ్మల్ని చాలా బాధ పెట్టారు. నిజానికి సరైన సమయంలో సాయం అందితే అనిత ప్రాణం పోయేదే కాదు. సాయం చేయలేని మనసుల్లో పేరుకుపోయిందే ఆ మాలిన్యమే అసలైన అరిష్టం. ఈ అమ్మాయి దహన కార్యక్రమాలు నేను దగ్గరుండి జరిపిస్తాను. మీరు కాస్త బాధను దిగమింగుకోండి. ఇలా ఎవ్వరికీ జరగకూడదు'' అని డాక్టర్ కాశయ్య, సత్తెమ్మలకు ధైర్యం చెప్పిండు.
కాశయ్య, సత్తెమ్మలు డాక్టర్ని పట్టుకొని ''ఓ డాటరయ్య! నిన్న నీ కాడికన్న రాకపోతిమి. గింత ఎరక లేదాయెనయ్యా. నా బిడ్డ బంగం అయిపాయెగదయ్యా!'' అని ఆగకుండా ఏడుస్తున్న వాళ్ళను సముదాయించిండు డాక్టర్. దగ్గరుండి అంత్యక్రియలు పూర్తి చేయించి వెళ్ళిపోయిండు.
కాశయ్య ఇంటిముందర చేరిన ఇరుగుపొరుగు వాళ్లు, పక్క ఊరి జనాలు, చుట్టాలు, పత్రికలవాళ్ళు అంత ఏదేదో మాట్లాడుతున్నరు. ఎన్నో జాలి మాటలు కాశయ్య సత్తెమ్మల చెవిన పడుతూనే ఉన్నయి. కానీ ఇవేవీ పట్టనట్టుగా కాశయ్య, సత్తెమ్మలు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నరు. ఇద్దరి మనసుల్లో ఒకే రకమైన ఆలోచనలు.
ఆపతికి రాని బలగమంతా ఇప్పుడొచ్చి ఏం లాభం? పోన్లల్ల రకరకాలుగా మాట్లాడినోళ్ళు ఇప్పుడు జాలి సూపిస్తుండ్రు. ఎంతో మంది సుట్టాలను దగ్గరకు తీసిన. నా చేతనైంది చేసిన. కానీ ఒక్కరు కూడా నా బిడ్డను ఆదుకోలేక పోయిండ్రు. ముక్కు మొహం తెలియని అంబులెన్స్ డ్రైవర్‌కున్న కనికరం కూడా మనల్ని ఎరిగినోళ్లకి లేదు. సుట్టాల మాటలు విని మన బిడ్డకు చిన్నతనాన పెండ్లి చేసినం. పది సదవంగనే సదువాపినం. తెలివి లేకుండ పొద్దు గడిపినం. మన ఊళ్ళనే పెద్దాస్పత్రి ఉంటే మన బిడ్డ బతికేది. అక్కరకు రాని మనుషుల్లా మనం బతక్కూడదు. అట్నే మన అనితమ్మ పరిస్థితి ఎవ్వరికి రాకూడదు. మనం ఏదన్నా చెయ్యాలి. ఆపతిలున్న మనుషుల్ని ఆదుకోవాలి. అప్పుడే మన బిడ్డ ఆత్మకు శాంతి. అవును శాంతి అనుకుంటూ కాశయ్య, సత్తెమ్మలు కదిలారు.
- ఉప్పల పద్మ
9959126682
8340933244
Sat 05 Jun 20:35:42.835931 2021