Sat 12 Jun 20:32:07.302217 2021
Authorization
తండ్రి సుబల్ చంద్ర. కొడుకు సుశీల్ చంద్ర.
సాధారణంగా మనుషుల పేర్లకు లక్షణాలకు సంబంధమేమీ ఉండదు. సుబల్ చంద్ర బలమైన వాడేమీ కాదు. సుశీల్ చంద్ర బుద్ధిమంతుడూ కాదు. కొడుకు ఇరుగు పొరుగున ఉన్నవాళ్లను తన అల్లరి చేష్టలతో విసుగెత్తిస్తుంటే వాడిని పట్టుకోవడం కీళ్ల నొప్పులు ఉన్న సుబల్ చంద్రకు వీలయ్యేది కాదు. జింకలా పరుగెత్తే సుశీల్ చంద్ర ఒకవేళ తండ్రికి చిక్కినా తండ్రి దెబ్బలు చెంపపెట్టులు సరిగ్గా ఎక్కడ పడాలో అక్కడ పడేవి కాదు.
ఆ వేళ శనివారం బడి రెండు గంటల వరకే కానీ సుశీల్ చంద్ర బడికి పోవద్దు అని నిర్ణయించుకున్నాడు. అందుకు ఆ రోజు బడిలో భూగోళం పరీక్ష ఉండటం ఓ కారణమైతే తమ వీధిలో ఉండే బోసు బాబు ఇంటి ముందు ఆ రాత్రి టపాకాయలు కాల్చబోతూ ఉండటం మరొకటి. బోసు బాబు ఇంటి దగ్గర ఆ ప్రదర్శనకు ఉదయం నుంచే ఏర్పాట్లు మొదలయ్యాయి. సుశీల్ ఆ రోజంతా అక్కడే గడపాలి అనుకున్నాడు. అందువల్ల బడి వేళ అయినా మంచం మీది నుంచి లేవలేదు.
''ఏమిట్రా ఇంకా మంచం దిగలేదు బడికి వెళ్ళవా?'' అన్నాడు తండ్రి.
''కడుపులో నొప్పి నాన్నా ఇవాళ బడికి వెళ్ళలేను'' అన్నాడు కొడుకు.
సుశీల్ వైపు పరీక్షగా చూస్తూ ''అలాగా అయితే ఈ రోజంతా ఇంట్లోనే ఉండు బయటకు కదలవద్దు. బోసు వాళ్ళింట్లో ప్రదర్శన చూడడానికి హరిని పంపిస్తాలే. నువ్వు తింటావని మిఠాయి తెప్పించాను. కడుపులో నొప్పి ఉన్నప్పుడు మిఠాయి తినడం మంచిది కాదు. కదలకుండా పడుకో. నీ కోసం కషాయం చేసి తీసుకు వస్తాను'' అంటూ గది తలుపు వేసి లోపలికి వెళ్లి చేదు కషాయం తయారు చేశాడు సుబల్.
సుశీల్‌కు తీపి అంటే ఎంత ఇష్టమో కషాయం అంటే అంత అసహ్యం.
రాత్రి నుంచి ఎప్పుడెప్పుడు బోసు బాబు ఇంటిముందుకు వెళ్దామా అనుకున్న వాడు ఇప్పుడు గదిలో బంధింప బడ్డాడు. సుబల్ పెద్ద గిన్నె నిండా కషాయంతో గదిలోకి వచ్చాడు.
అది చూసీ చూడగానే ''నొప్పి పోయింది పూర్తిగా తగ్గిపోయింది నేను బడికి వెళ్తాను'' అంటూ మంచం మీది నుంచి ఎగిరి కిందికి దూకాడు సుశీల్.
''వీల్లేదు కషాయం తాగవలసిందే'' అంటూ కొడుకు చేత బలవంతంగా కషాయం తాగించి బయటకు వెళ్లి గది తలుపు గొళ్ళెం పెట్టేశాడు తండ్రి. మంచం మీద ఏడుస్తూ ఉండిపోయిన సుశీల్ ఒకవేళ నేను నాన్న అంత వయసులో ఉండి ఉంటే ఏది తలుచుకుంటే అది చేసేవాణ్ని నన్ను ఎవ్వరూ ఆపే వారు కాదు అనుకున్నాడు. గది బయట ఉన్న సుబల్ చంద్ర నా తల్లి తండ్రి నన్ను చెడగొట్టారు అందుకే సరిగ్గా చదువుకోలేదు. ఒకవేళ నేను మళ్ళీ చిన్న పిల్లవాడిని అయితే ఒక్క క్షణం కూడా వథా చేయకుండా చదువుకుంటూ ఉండేవాణ్ణి అనుకున్నాడు. సరిగ్గా ఈ సమయానికి కోరికలు తీర్చే దేవత ఆ దారి వెంట వెళ్తూ తండ్రీ కొడుకుల కోర్కెలు విన్నది. పాపం వాళ్ల కోరికలు తీర్చుదాములే అనుకొని తండ్రితో ''రేపటి నుంచి నువ్వు నీ కొడుకు వయసు వాడివి అవుతావు'' అంది. కొడుకుతో ''రేపు నువ్వు మీ నాన్న అంత వయసు వాడివి అవుతావు'' అంది. తండ్రీ కొడుకులు సంబరపడ్డారు.
సుబల్ చంద్రకు రాత్రులు నిద్ర సరిగ్గా పట్టేది కాదు. ఏ తెల్లవారు జాముననో నిద్ర పట్టి పొద్దెక్కే దాకా లేచే వాడు కాదు. కానీ ఆ మరునాడు తెల్లవారకముందే హుషారుగా నిద్ర లేచాడు. చిన్న పిల్లవాడిగా మారిపోయిన సుబల్ మంచం మీది నుంచి కిందికి గెంతాడు, ఊడిపోయిన పళ్ళన్నీ తిరిగి వచ్చేశాయి. గడ్డం మీసం మాయం అయిపోయాయి. తను వేసుకున్న చొక్కా మెడ ఛాతీ మీదకు జారి చేతులు నేలకు అనుకున్నవి. ధోవతి పెద్ద గోనె సంచిలా వేలాడుతుంటే బయటకు దొర్లి రావలసి వచ్చింది.
రోజూ ఉదయాన్నే నిద్ర లేచి చుట్టుపక్కల ఇళ్ళలోకి పరిగెత్తి నానా అల్లరి చేసే సుశీల్ ఆ మర్నాడు ఎప్పటిలాగా లేవలేదు. కళ్ళు తెరిచేసరికి తన దుస్తులన్నీ బిగుసుకుపోయి కుట్లు ఊడి చిరిగిపోయే స్థితిలో ఉన్నాయి. శరీరం అన్ని వైపులా పెరిగి పోయింది. ముఖం సగం తెలుపు నలుపు గడ్డంతో మూసుకు పోయింది. తల మీదకి చేయి పోనిస్తే ఒత్తయిన జుట్టుకి బదులు ఖాళీ స్థలం తగిలింది. పెద్దగా చప్పుడు వచ్చేట్టు ఆవులిస్తూ మంచం మీద ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు దొర్లాడు సుశీల్ చంద్ర. సుబల్ చంద్ర అరుపులకు విసుక్కుంటూ మంచం దిగాడు.
తండ్రీ కొడుకూలిద్దరి కోరికలు తీరాయి కానీ పరిస్థితులు చాలా అధ్వాన్నంగా మారాయి.
సుశీల్ చంద్ర తను తండ్రి అంతటివాడు అయితే కావలసినంత స్వేచ్ఛ ఉంటుందని చెట్లు ఎక్కే వాడినని చెరువులో దూకి ఈదే వాడినని పక్షి పిల్లల్ని పట్టేవాడినని పొలాలవెంట ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడినని బుద్ది పుట్టినప్పుడు ఇంటికి వచ్చి భోంచేసే వాడినని తనను ఎవ్వరూ ఏమీ అనేవారు కాదని అనుకున్నాడు. కానీ తను పెద్దవాడయి పోవడంతో చెట్టు ఎక్కాలనే కోరిక క్రమంగా తగ్గింది. నీటిలో దూకితే జలుబు చేసి చచ్చిపోతానేమో అనిపించేది. ఒకసారి ఇంటి ముందు ఉన్న చెట్టు ఎక్కాలని వెళ్ళాడు. పిల్లవాడిగా ఉన్నపుడు ఉడుతలా గబగబా ఎక్కేసే వాడు ఇప్పుడు వయస్సు పైబడ్డ శరీరంతో చెట్టు ఎక్కబోతే కిందికి వంగి ఉన్న లేత కొమ్మ పెళ్ళున విరిగి దబ్బుమని నేల మీద కూలబడ్డాడు .ఈ వయసులో కుర్రాడిలా అతను చెట్టు ఎక్కడానికి ప్రయత్నించి కూలబడడం చూసి జనం పగలబడి నవ్వారు. సుశీల్‌కు మిఠాయి అంటే ఎంతో ఇష్టం. బడి దగ్గర షాపులో రక రకాల మిఠాయిలు ఉండేవి. ఎప్పుడో తన దగ్గర చిల్లర డబ్బులు ఉన్నప్పుడు ఒకటి కొనేవాడు. కానీ తప్తి కలిగేది కాదు. తండ్రి దగ్గర ఉన్నట్టు తన దగ్గర డబ్బు ఉంటే రకరకాల మిఠాయిలను కొని జేబుల్లో నింపుకునే వాడిని అనుకునేవాడు. ఇప్పుడు ఆ కోరిక తీర్చుకోవచ్చు అనుకొని నౌకరు హరిని పిలిచి ఒక రూపాయి చేతిలో పెట్టి మిఠాయిలు తీసుకురా పో అని ఆజ్ఞాపించాడు. నౌకరు బ్యాగు నిండా తెచ్చిన మిఠాయిల్లో ఒకటి తీసి నోట్లో పెట్టుకున్నాడు. కానీ పళ్ళు లేకపోవడం వల్ల తినలేక పోయాడు. ఇదివరకు పిల్లలంతా అతనితో ఆడుకోవడానికి వచ్చేవారు కానీ ఇప్పుడు పెద్ద వయసులో ఉన్న సుశీల్ చూసి రావడం మానేశారు. ఇదివరకు వీధిలో ఏదైనా ఊరేగింపు వచ్చిందంటే చలిలోనైనా వానలోనైనా పరుగెత్తుకు వెళ్ళి చూసేవాడు కానీ ఇప్పుడు కాళ్ళు చేతులు సహకరించడం లేదు. ఇదివరకు ఊరి చెరువులో స్నానం చేసేవాడు. ఇప్పుడు ప్రయత్నం చేస్తే కాళ్ళు భుజాలు ఉబ్బిపోయాయి. తన వయసు మర్చిపోయి మంచం మీద నుంచి ఒకసారి కిందికి గెంతితే ఎముకలు విరిగినంత పని అయింది. ఒకసారి పాన్ మొత్తం నోట్లో పెట్టుకుని నమల లేక నానా ఇబ్బంది పడ్డాడు. పరధ్యానంగా తల దువ్వుకుంటే బట్ట తల మీద గీతలు పడి నొప్పి పుట్టేది. ఒక్కోసారి తను తండ్రి వయసులో ఉన్నాడనే ధ్యాస లేక ఇదివరకటి ఆకతాయితనం ప్రదర్శించే వాడు. ఆడవాళ్ళ నీటి కుండలను గులకరాళ్ళతో కొట్టేవాడు. పెద్దాయన చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడని జనం తిడితే అవమానంతో తలదించుకునే వాడు.
సుబల్ చంద్ర తను తిరిగి పిల్లవాడు అయితే మంచిగా నడుచుకునే వాడినని సాయంత్రాలు పేదరాశి పెద్దమ్మ కథలు వినడం మాని గదిలో తలుపు వేసుకుని రాత్రి పది పదకొండు గంటల దాకా శ్రద్ధగా చదువుకునే వాడినని అనుకునేవాడు. ఇప్పుడు తను పిల్లవాడు అయిపోయాడు కానీ బడికి పోవాలని అనిపించడంలేదు. సుశీల్ కోపంగా బడికి వెళ్లడం లేదేమని అడిగితే తల గోక్కుంటూ నేల చూపులు చూస్తూ కడుపులో నొప్పిగా ఉంది నేను బడికి వెళ్లను అని గొణగడం మొదలు పెట్టాడు. సుశీల్‌కి బడి ఎగొట్టడానికి చెప్పే కారణాలు అబద్దం అని తెలుసు కాబట్టి అవేమీ పట్టించుకోకుండా సుబల్ని బలవంతంగా బడికి పంపేవాడు. స్కూల్ నుంచి వచ్చి రాగానే సుబల్ పరిగెత్తడం గంతులు వేయడం బిగ్గరగా అరవడం చేసేవాడు. కళ్ళజోడు పెట్టుకొని కత్తిభ రామాయణం చదువుకుంటూ ఉండే సుశీల్, సుబల్ అల్లరిని అరికట్టడానికి చేతికి పలక ఇచ్చి కఠినమైన లెక్కలు చేయమనే వాడు. సాయంత్రాలు పెద్దవాళ్ళు గుంపుగా వచ్చి సుశీల్ గదిలో చదరంగం ఆడే వాళ్ళు.
ఆ సమయంలో సుశీల్, సుబల్కు మాస్టర్ చేత ట్యూషన్ చెప్పించేవాడు. ఆహారం విషయంలో సుశీల్ చాలా కఠినంగా ఉండేవాడు. హఠాత్తుగా కుర్రవాడైన సుబల్కి గుర్రాన్ని కూడా తినేసేంత ఆకలి వేసేది. గతంలో తండ్రికి ఏది తిన్నా జీర్ణం అయ్యేదికాదు. గ్యాస్ ఎక్కి వచ్చేది అని జ్ఞాపకం ఉన్న సుశీల్ తండ్రి అతిగా తినకుండా జాగ్రత్త పడేవాడు. పైగా జబ్బు మనిషి అని అనేక మందులు మింగించే వాడు.
సుబల్ ఇప్పుడు తను ఓ పిల్లవాడు అన్న విషయం మర్చిపోయి పెద్దవాళ్లు పేక ఆడుతుంటే వాళ్ళ పక్కన కూర్చుని మాటలు మొదలు పెట్టేవాడు. వాళ్లు ''పోరా పో ఆడుకో పో'' అని వెళ్ళగొట్టే వారు. ఒక్కోసారి బడిలో చదువు చెప్పే మాస్టర్ దగ్గరికి వెళ్లి కొంచెం పొగాకు ఉంటే ఇవ్వండి అని అడిగేవాడు. మంగలి దగ్గరకు వెళ్లి మూడు రోజుల నుంచి గడ్డం గీయడానికి రాలేదు ఎందుకని నిలదీసేవాడు. ఇదివరకులా కొడుకుని కొట్టబోయే వాడు. ''స్కూల్లో ఇదే నేర్చుకున్నావా వెధవా?'' అని అరిచేవాడు సుశీల్. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి సుబల్ని తిట్టి పోసేవారు.
సబుల్కి పిల్లవాడిగా ఉండడం ఏమాత్రం నచ్చలేదు. కొడుకు సుశీల్ లా పెద్దవాణ్ని అయితే బాగుండును ఈ సమస్యలన్నీ ఉండకపోయేవి అని దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టాడు. సుశీల్ కి కూడా తను పెద్దవాడిగా ఉండడం ఏమాత్రం నచ్చలేదు. తండ్రి సుబల్లా చిన్న పిల్లవాడిని అయితే బాగుండును హాయిగా ఆడుకునేవాణ్ణి అని దేవుడి ముందు చేతులు జోడించాడు.
కోరికల దేవత అటుగా వెళుతూ వచ్చి మీరు కోరుకున్నట్టే జరిగింది కదా అన్నది. ఇద్దరూ ఆమె కాళ్ల మీద పడ్డారు. ''నిజమే మా కోరిక తీర్చారు కానీ ఈ కష్టాలు వద్దు తల్లీ మమ్మల్ని ఇదివరకులా మార్చేయి'' అని ప్రాధేయపడ్డారు.
''సరే రేపు ఉదయం మీరు నిద్రలేచేసరికి ఇదివరకు ఎలా ఉండేవారో అలా అయిపోతారు'' అన్నది దేవత.
మర్నాడు ఉదయం నిద్ర లేచేసరికి సుబల్ ఇది వరకు లాగానే పెద్దవాడు అయిపోయాడు. సుశీల్ ఇదివరకు లాగానే చిన్నపిల్ల వాడయ్యాడు. ఇద్దరూ తాము ఓ కలలో నుంచి మేల్కొన్నాం అనుకున్నారు. ''సుశీల్ వ్యాకరణం బాగా నేర్చుకుంటున్నావా?'' అని అరిచాడు సుబల్. సుశీల్ తల గోక్కుంటూ ''నాన్నా పుస్తకం ఎక్కడో పోయింది'' అన్నాడు.
- కథ మూలం : రవీంద్రనాథ్ ఠాగూర్
అనువాదం: చింతపట్ల సుదర్శన్
సెల్ :9299889212