నేను ఒకప్పుడు మహా వైభవంగా వెలిగిపోయి ఇవాళ పూర్తిగా దివాళా తీసిన కళావిహీనురాలిని. నా గత వైభవోజ్వల చరిత్ర అంతా యింతా కాదు. అది గుర్తుకొస్తే చాలు నాకు దు:ఖాశ్రువులు జాలువారుతాయి. మనుషులైన మీకే కళ్ళున్నాయనుకుంటారేమో, మీకూ కళ్ళున్నాయి. ఆ కళ్ళు కనే కలలున్నాయి. నను జీవించి వుండగా ఈ లౌకిక ప్రపంచంలోని ఎన్నెన్ని సంఘటనలకు సాక్షీభూతంగా నిలవలదు!
నేను ప్రతిరాత్రీ పొద్దపోయాక హాయిగా వెల్లకిలా ఇంటి ముందర పరచుకొని నిద్రించేవాణ్ణి! తెల్లవారకముందే అమ్మ లేచి తలుపు గడియ తీసి వాకిట్లో కొచ్చేది! నా గుండెల మీద దట్టంగా పరచుకుని వున్న దుమ్మును ఆ తల్లి చీపురుతో ఇష్టంగా చిమ్మేది. అమ్మ నడుమొంచి అలా ఊద్చుతుంటే నాకు కితకితలు పెట్టినట్లు వుండేది. అనంతరం ఆవిడ బకెట్టు నీళ్ళలో పేడ కలిపి ఆప్యాయంగా కల్లాపి చల్లుతుంటే నా ఎద ఝల్లుమనేది! ఒళ్ళంతా చల్లబడేది! సొంత బిడ్డకి స్నానం చేయిస్తున్నట్లుగా తన పనిలో లీనమయ్యేది. ఇప్పుడు చూడండిక నా చక్కదనం! అద్దంలా ఆపైన లేత ఆకుపచ్చ పేడ రంగుతో నేనొక చిన్నపాటి హరిత స్థలం. అంతేనా! ఆ మీదట అమ్మ తన బిడ్డ చెక్కిలిమీద చుక్క పెట్టినట్లు నా బుగ్గల మీద వెండి ముగ్గులేయగానే నేను ముసి ముసి సిగ్గుల కన్నెపిల్లగా మారిపోయేదాణ్ణి! ఇప్పుడిక.. దాదాపు అమ్మ పని అయిపోయినట్లే!
నేనెప్పుడూ నా ఒళ్ళన్నీ కళ్ళు చేసుకుని అన్నార్థులకై ఎదురు చూసేదాణ్ణి! అనుకున్నట్టే... పొద్దున్నే భిక్షకులు ''అమ్మా! అన్నం పెట్టు తల్లీ!'' అంటూ దీనంగా అరిచేవాళ్ళు. ఎన్ని పనుల్లో తలమునకలై వున్నా అమ్మ పిడికెడు అన్నం వాళ్ళ గిన్నెలో వేయడం ఆలస్యం విచిత్రంగా నా కడుపు నిండిపోయేది! ఎప్పుడైనా ''మళ్ళీ రా పో వెధవా'' అని కసిరితే గుడ్ల నీళ్ళు గుడ్లలోనే కుక్కుకునేదాణ్ణి! ఒక్కోసారైతే రాత్రి ముణ్ణాలుగు గంటలపుడు గంట వాయిస్తూ బాల సంతు లాయన వచ్చేవాడు. నాకు నిద్రాభంగం! ఇంట్లోనూ నిద్రాదేవి మాయం! ముఖ్యంగా ఇల్లాలికి. చాలాసేపు ఘంటాపథంగా బిచ్చానికి వచ్చేవాడాయన. నిద్ర కళ్ళతో లేచిన అమ్మ చేటనిండా ధాన్యం పోసుకుని అతని జోలెలో పోసేది! నా సంతోషాతిరేకం చెప్పనలవి కానిది!! ఐతే బిచ్చం వేశాక్కూడా ఈ మనిషి కదలడే! మరలా ఓ పదినిముషాల పాటు ఆ యింటి వంశావళి దాదాపు చదివి ''చల్లగా బతకండి'' తల్లీ అంటూ నిష్క్రమించేవాడు. ఏరు దాటగానే తెప్ప తగలేసే లోకంలో బిచ్చం వేసిం తర్వాత కూడా నిలబడి అట్లా కుటుంబ చరిత్ర చదవడం ఆశ్చర్యం! కృతజ్ఞతకు మారు పేరు బాలసంతులవాళ్ళే మరి! మరికొన్ని సార్లు గంగిరెద్దులొళ్ళు వచ్చి నా ముంగిట నిలిచి ఎద్దుతో నిన్యాసాలు చూపిస్తుంటే గుడ్లప్పగించి అప్పళించి చూసే దాన్ని!
వేసవికాలంలో నా మీద బాగా ఎండ పడిన తరుణంలో నా బతుకు పండేది! మట్టిలో మట్టిలా కలిసిపోయి ఆరుగాలం కష్టపడి ఇంటికి తీసుకొచ్చిన ధాన్యాన్ని రైతు భార్య నా ఒళ్ళో ఆరబోసేది! అలా ఆ గింజల్ని నా ఎదల మీద పరుస్తుంటే నా మురిపెమే వేరు. నా అందచందాలే వేరు! వరి ధాన్యం ఎండ బోసినపుడు అది చూపరులకు బంగరు బుక్కుపుడకల్లా మెరిసేది నా గుండెలపైనే! జొన్నలు ఆరబోస్తే ముత్యాల తీరు! పచ్చి పెసర్లు ఎండబోస్తే పచ్చల సౌరు!! ఒలిచిన మక్క గింజలైతే బంగారు దంతాల రీతి... అప్పుడప్పుడూ ఇల్లాలొచ్చి వంగి చేతి వేళ్ళతో ధాన్యాన్ని బాగా ఆరడానికి వీలుగా కిందామీదా చేస్తూ నెరపినా మురిపెమే! నిలబడి కాళ్ళతోనే కదిపినా సంబరమే! అవి ఆరబోసిన ఎండుగులు కావు- నా బతుకులో పండిన పండుగలు.
బడికి వెళ్ళివచ్చిన పిల్లలు నా సముఖంలో ఆడుకుంటే క్షణాల్లో నేను పసిపిల్లన అయ్యేదాన్ని! వాళ్ళ మూర్తీభవించిన అమాయకత్వం అమాంతం నాలో ప్రసరించి నిలువెల్లా పులకించిపోయేదాన్ని! కొంతసేపు వాళ్ళు గోలీలాడేవాళ్ళు. కన్నార్పకుండా ఆ గోళీల్లోని లోపలి డిజైన్లు చూసి అబ్బురమే అబ్బురం! గురి తప్పకుండా వేళ్ళతో ఒక గోళీని పట్టుకుని మరో దాన్ని కొడుతుంటే, ఈ లోకంలోని చెడునంతా ఎవడో ఓ కుర్రాడు 'మంచి'తో తన్నాలని అనుకునేదాన్ని! పిల్లల్ని చూసి నేను మరీ వెర్రిబాగుల దాన్ని అయిపోతున్నానా ఏం? వెర్రిబాగులు కాదేమో ఆ సమాసం వెర్రీ పాగలా ఏం అని బుర్ర గోక్కునేదాన్ని! పాగల్ అంటే పిచ్చే కదా మరి! ఇంకా పిల్లలు రింగాలు అడేవాళ్ళు. బాల్ బాడ్మింటన్, షటిల్ మొదలైన క్రీడలకు నేనే పూర్వరంగం. ఆట మైదానం కచ్చితంగా కొలతలతోనూ, నెట్‌తోనూ వుంటుంది గానీ... దానికి ముందు బ్యాట్‌కు బంతి తాకుతుందా లేదా అన్నదీ, ఎట్లా తాకాలో అన్నదీ అంతా నా సమక్షంలో జరిగిన కసరత్తే! పిల్లలంటే గుర్తొచ్చింది... ఆడపిల్లలూ ఆడేవాళ్ళు. ఇద్దరాడపిల్లలు చేరి తమ చేతుల్ని సాచి, ఆ వెనుక వాటిని ఇంటూ గుర్తులా మార్చి పరస్పరం ఒకరి చేతివేళ్ళను మరొకరు లాక్ చేసుకుని 'దాల్ దడి దశన్న పొడి' అని ఎగిరెగిరి గుంతులేస్తూ చుట్టూ తిరుగుతూ వుంటే నాది తల్లి మనస్సే అయ్యేది సుమా! అష్టచెమ్మ, తొక్కుడు బిళ్ళలు ఆడుతుంటే నేనే పిల్లదాన్ని అయ్యేది.
పిండారబోసినట్లు, పాలు పారబోసినట్లున్న నిండు పున్నమి వెన్నెల రాత్రి నా జన్మకు సాఫల్యం లభించేది! ఏం కోలాహలం... ఎంత సందడి... ఎన్ని ఆటలు... ఎన్నెన్ని పాటలు... బోలెడు కబుర్లు.. బొచ్చెడు ముచ్చట్లు... పొద్దంతా నడుం టింగ్ మనేలా పని చేసిన ఇల్లాండ్రు ఒక్కచోట చేరి కోలలు వేస్తుంటే, వేస్తూ లయబద్దంగా తిర్గుతుంటే, తిరుగుతూ పాటలు పాడుతుంటే... అది ఆటనా, పాటనా, నాట్యమా, సామూహిక లాస్యమా తెలియక సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోవటం నా వంతు. అర్ధరాత్రి దాటేదాక మగ పిల్లల చెడుగుడు.
సంక్రాంతి ఎప్పుడొస్తుందా అని ఎదరుచూపులు. అమ్మ దీక్షగా నన్ను ఆపాద మస్తకం ముగ్గులతో అలంక రిస్తుంది. ఆ రోజు నేను ఏడు వారాల నగలు దిగేసుకున్న అపురూపమైన ముత్తైదువును. బాటసారులు సైతం ఆగి కాసేపు నా అందచందాలు ఆస్వాదించి పోవాల్సిందే! అన్నట్లు విశాలమైన నాకు ఓ పక్కన గేదె కోసం ఏర్పరచిన పాక, దూడ కూడా వుండేది! రాత్రంతా ఈ రెండూ నాకు మంచి నేస్తాలు. కట్టుకొయ్యకు బంధించబడిన గేదె తన ముందర వేసి గడ్డి అయిపోగానే అదో రకంగా అరిచేది- ఇంటి యజమాని లేచి మరలా గడ్డి వేసేదాకా నాకు నిద్రపట్టదు- గేదె ఆకలి నాకు ఆకలిగా అనిపించేది. అదుగో... యజమాని దాని క్షుద్బాధను తీర్చుతున్నాడు. నేను తృప్తిగా నిట్టూర్చాను. ఓ పెద్ద మబ్బుల అమ్మ ఇత్తడి సర్వ పట్టుకుని తలుపు గడియ తీస్తుంది. ఆ పాత్రలోని నీళ్ళు గేదె పొదుగుమీదా, చన్నుల మీద చల్లి శుభ్రం చేస్తుంది. దూడను విడుస్తుంది. అది ఎగబడుతుంది. కొన్ని పాలు తాగతానే అమ్మ దాన్ని కట్టిపడేస్తుంది. చేపిన చన్నులను పట్టుకుని ఆ తల్లి చేతుల్ని లయాత్మకంగా కిందికీ మీదకీ గుంజుతూ పాలు పితుకుతున్నపుడు వచ్చే జుయ్యి జుయ్యి క్షీరధారలు రవళి నా బతుక్కి గొప్ప సంగీత కచేరి!
కొన్ని పర్యాయాలు నేను ఓ చినపాటి రంగస్థలాన్ని! చుట్టుపక్కల చిన్న పిల్లలందరూ చేరి డ్రామాలు వేస్తారు- చాలా సార్లు ఈ ఆరు బయలు హరికథలకు నేను కార్య క్షేత్రాన్ని. ఆటా, మాటా, పాటా పిట్టకథలు హస్యమూ, అద్భుత నాట్యమూ... అన్నీ కలగలసిన ఆ కథలకు నా చెవులూ మనస్ఫూర్తిగా ఒగ్గేవి!
బతుకమ్మ పర్వదినం.. నా పాలిట నిజమైన పండుగ రోజు. సాయం సందెవేళ తాంబాళాల్లో చక్కగా పేర్చి తెచ్చిన పెద్ద బతుకమ్మలతో నేను కళకళలాడేదాన్ని! వయస్సుతో నిమిత్తం లేకుండా స్త్రీలందరూ చుట్టు తిరుగుతూ
''ఇద్దరక్క చెల్లెండ్రు ఉయ్యాలో ఒక్కూరికిచ్చి ఉయ్యాలో
ఒక్కడే మాయన్న ఉయ్యాలో
రాకనే పోయే ఉయ్యాలో
ఎట్లొస్తుచెల్లెలా ఉయ్యాలో
ఏరడ్డమాయె ఉయ్యాలో'' వంటి పాటలతో నేను పరవశించి పోయేది! ఎన్ని రంగుల బతుకమ్మలు! ఎన్నెన్ని హంగులతో వున్న ఆడవాళ్ళ చీరలు!! ఎన్నెన్ని ఆనందాల పొంగులు!!!
మరో సంగతి.. అప్పుడప్పుడు సాయంకాలాల్లో నా మీద చాపలు పరిచి చుట్టుపక్కల పురుషులంతా చేరి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ చీట్ల పేక ఆడటం స్పురణలో వుంది. అది డబ్బులు పెట్టి ఆడిన ఆట కాదు- కాలక్షేపం కోసం. నాకు ముందేమో రోడ్డు వుండేది! ఈ బజారు సంగతి నేను చెప్పను గాక చెప్పను. ఐతే నా వెనుక ఇంట్లోకి వెళ్లే ద్వారానికి ఇరువేపులో రెండు అరుగులుండేవి! ఆహా..! ఎంత గొప్ప అమరిక అవి ఇంటికి. వచ్చే పోయే వాళ్ళకొక విడిది. అవతలి పేటలోని వారసంతకు వెళ్ళేవాళ్ళు. సేద దీరేందుకు అది అమ్మ ఒడి. ఎక్కడి నుండి ఎవరు అరుగుదెంచినా నీళ్ళు అనగానే అమ్మ పరుగున వచ్చి బావిలోని నీళ్ళు యివ్వగానే ఆ అతిథి దాహంతో పాటు నా దప్పీ తీరిపోయేది! ఏదో చల్లని సంతృప్తి నాకు. కొందరైతే అలిసిపోతే హాయిగా మేను వాల్చేవాళ్ళు. తలగడ లేదు అన్న కొరతే లేదు. అరుగులకు చివర తలగడలాంటి సిమెంటు దిండు. ఇంకా కొందరు పిల్లలు చేరి ఆ గచ్చు మీద వేసిన పులి జూదం ఆటలో మునిగేవాళ్ళు. నాకేనాడూ బోరు కొట్టింది లేదు- విసుగొచ్చింది లేదు. ఎప్పుడూ ఏదో కోలాహలం ఆ వేడుకలన్నీ కళ్ళారా చూడాలన్న కుతూహలం. పండో ఫలమో అమ్ముకునే ముదిరాజ్ స్త్రీలు ఇల్లిల్లూ తిరిగి కాసేపు అరుగుల మీద కూచుని 'ఉల్లో... మామిడి పండ్లుల్లో'' అని అరిచేవాళ్ళు గట్టిగా. కొనడానికి వచ్చిన వాళ్ళను చూసి నా కడుపు పండు తిన్నంతగా నిండిపోయేది!
ప్రతి శుక్రవారం నాడు ఇల్లాలు పుజ చేసి... ఎప్పుడో ఓసారి కొబ్బరికాయ కొట్టడం ఆనవాయితీ! అలా కొట్టి చాకుతో పచ్చి కొబ్బరి తీసి ముక్కలు చేసి వాటిని ఓ పళ్ళెంలో వుంచి వాటికి, పుట్నాలూ చక్కెరా కలిపి ఇంటి ముందరికొచ్చే పలారముల్లో అని బిగ్గరగా అరిచేది! చుట్టుపక్కల వాళ్ళు వచ్చి భక్తి శ్రద్ధలతో ఆ తల్లి ఇచ్చిన ముక్కని నోట్లో వేసుకుని వెళ్ళిపోవడం చూసి నాలోనూ, ఏదో భక్తిభావం పొటమరించేది- ఇట్లా అన్నింటికీ నేను సాక్షీభూతురాలిని. ఇప్పుడు కాలం మారిపోయింది. అవునూ... కాలం అనగానే కష్టకాలమూ, సుఖ సమయమూ వుంటుంది. ఇంట్లో పెళ్ళి లాంటి శుభకార్యం జరుగుతుంటే నా ఆనందానికి అవధులుండవు. వివాహానికి ఇంటి ముందర పచ్చని పెండ్లి పందిరి తప్పనిసరి. నాలుగు వేపులా నాలుగు గుంతలు తవ్వుతుంటే చక్కిలిగిలి. గుంజలు పాతుతుంటే గగుర్పాలు. వాటి మీద అడ్డమూ పొడుగూ కర్రలు దగ్గర దగ్గరగా వేసి తుంగ పరుస్తుంటే ఆ నీడంతా నా మీదే పరుచుకునేది. పైగా అది చల్లనిదే కాదు, పచ్చని ఛాయ. ఇంకా తోరణాలు కట్టి వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా పెండ్లి అవుతుంటే నేనే కల్యాణవతిని అయినట్లు గొప్ప అనుభూతి. ఐతే... ఇందాకే అనుకున్నట్లు శుభకార్యాలే కాదు, జీవితంలో కష్టాలూ వుండటం సహజం. అశుభాలూ మనం ఆపితే ఆగేవి కావు. ఇంట్లో ఎవరేనా మరణిస్తే... నా మనస్సు మనస్సులో వుండేది కాదు- ఇంటి పెద్ద పరలోకగతుడైతే నా బాధ వర్ణనాతీతం. మంగళ వాయిద్యాలు మోగిన వాకిట్లోనే చావు డప్పులు వినవలసి రావడం పెను విషాదం. మనుషులైతే ఒకరి దు:ఖాన్ని మరొకరు పంచుకుంటారు మరి నా సంగతి ఏమిటి? ఇది ఎటువంటి దుర్గతి- ఎంతటి దురవస్థ! నా ఎదల మీదే రెండు మూడు కట్టెలు తెచ్చి నిప్పు రాజేస్తారు. ఈ అగ్గినే చితి అంటించడానికి తీసుకుని వెళతారు కదా! కా హృదయం మీదే పాడె కడతారు. పచ్చటి తాజా తాటి కమ్మలు కొట్టుకొచ్చి పాడె మీద వేస్తారు. వీటన్నింటి కన్నా దు:ఖకరమైన ముచ్చట ఏమిటంటే రాత్రి చనిపోయిన శవంతో ఏ ఒక్కరూ జాగరణ వుండకపోవటం- అంతేనా? మనిషి పోగానే మమతలు మాయమేనా? జీవిత కాలమంతా భార్యాపిల్లలు కొరకు తండ్లాడిన పెద్దాయనతో బంధం యింత పుటుక్కున తెగిపోతుందా? కుటుంబ సభ్యుల్లో కొందరైతే అదే రాత్రి ఎంగిలి పడ్డారు. ముద్ద ఎట్లా నోట్లోకి దిగుతుంది! బీపీలూ, షుగర్లూ వుంటే వేరు- ఏమైనా నాకు పరిపరివిధాల పరివేదన! యజమాని శవాన్ని చూసి నిలువునా నీరయ్యాను. పాడుకాలం! నన్నూ శవాన్ని చేశారుగా!! ఈ నాటి కొంపలకు వాకిళ్ళే లేకుండా చేశారు కదా!! ఉన్న స్థలమంతా ఇల్లే అయితే వాకిలెక్కడిది? ఆ సందడెక్కడిది? అప్పట్లో నేను ప్రాభవంతో వెలిగిన వాకిలిని. ఇప్పుడు వెక్కి వెక్కి దు:ఖిస్తున్న పొక్కిలిని. మీ యిళ్ళ ముందరి ఒకనాటి బహిరంగాన్నే కాదు ఒకప్పుడు గుండె బద్దలై రోధిస్తున్న వాకిలి అంతరంగాన్ని.
- నలిమెల భాస్కర్,
సెల్ :9704374081
Sun 04 Jul 07:09:50.216172 2021