నా ఎనిమిదేళ్ల నుండి పద్దెనిమిదేళ్ల వయస్సు వరకూ వరుసగా జరిగిన ఈ దాడులనంతా కలిపి ఒక్కమాటలో చెప్పటానికి వీలుకాదు. నా పద్దెనిమిదవ ఏట కాలేజీలో చేరి ఒకట్రెండు నెలలే గడిచి వుంటుంది. ఒక సాయంకాలం పూట అలవాటు ప్రకారం నన్ను కొట్టటానికి నాన్న చెయ్యెత్తినప్పుడు, అడ్డుకొని ఆపి ఆయన చేతిని పట్టుకొని మెలిపెట్టి, ఆయన అరుపులకు వీధి వీధంతా నిలబడి వేడుక చూశారు. చాలామంది నా అహంకారాన్ని నియత్రించటానికి వీలుకాక ఆగిపోగానే, అన్నేండ్లుగా ఆయననుండి వినీ, వినీ వూరిపోయిన మొత్తం చెడ్డ మాటల్నీ ఆయనకు వ్యతిరేకంగా వీధిలో నిలబడి నేను మాట్లాడటమే నామీద జరిపిన నాన్న చివరి దాడి.
ఇంట్లో పడే దెబ్బల్ని తట్టుకో లేక వీధిలోకి పరుగెత్తింది ఎప్పుడన్నది గుర్తుకు రావటం లేదు. కోపంతో నామీద గదిలో పడే దెబ్బలు ప్రమాదకరమైనవి. చేతికి ఏం దొరుకుతుందో దాన్ని తీసుకొని నామీదికి బలంగా ప్రయోగించటాన్ని తట్టుకోలేకనే వాకిలి దాటి వీధిలోకి పరుగెత్తుకొచ్చింది. నన్ను తరుముకుంటూ పరుగెత్తుకొచ్చే నాన్న నుండి తప్పించుకోవటం నా యవ్వన ప్రాయపు పాదాలకు సులభంగా తోచింది. నేను తప్పించుకున్నానని స్పష్టమయ్యాక, గొణుక్కుంటూ ఇంట్లోకి వెళ్లేవాడు.
సరిగ్గా పెంచలేదని చెడ్డ మాటలు అమ్మవైపుకు మళ్లేవి. అమ్మ ఎదురు మాటలకు దెబ్బలో, లేదూ కాళ్లతో తన్నులో తినటం మామూలై పోయింది మా ఇంట్లో.
నాన్న దగ్గర తప్పించుకొని పారిపోయాక మళ్లీ ఇంటికి రావటానికి నేను చేసే ప్రయత్నాలు ఒక్కొక్కటీ ఒక్కో రకం. ఒక్కోసారీ ఒక్కో రకమైన అవస్థలూ, అవమానాలూనూ. నా ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కాలంలో కవితాత్మకంగా ప్రేమలేఖలు రాసిచ్చి, తీసుకుంటున్నప్పుడూ అది కొనసాగింది.
దెబ్బలు తిన్న ఒంటితో స్నేహితుల ఇండ్లకు వెళ్లటమూ, వాళ్ల అమ్మానాన్నల హితబోధల వల్ల నా తల ఇంకా వాచిపోవటమూ తట్టుకోలేక ఇక స్నేహితుల ఇండ్లు మనం దాక్కోవటానికి పనికిరావని నిర్ణయించుకున్నాను. పూర్తిగా నిర్మాణం కాని ఇండ్లు, కూలిపోయిన ఇండ్ల గోడలమధ్య స్థలం, ఎవరో ఒక పెయింటర్‌తో లేచిపోయిన తర్వాత ఎప్పుడూ మూసివుండే జూలీ అక్క ఇల్లు, మా ఇంటికి వెనకే నాన్నకు తెలీని నేను దాక్కునే ప్రదేశాలు.
ఇవన్నీ నాన్నవల్ల సులభంగా కనిపెట్ట బడ్డాయి. ఆయనవల్ల వూహించి కూడా చూడ్డానికి వీలుకాని ఒక మరుగు ప్రదేశాన్ని మనసులో అనుకొంటున్న సమయంలోనే ఆ దాడి, తరుముకుంటూ రావటం జరిగాయి.
వీధిలోనే పడ్డ రెండు మూడు దెబ్బల తర్వాత ఆయన నుండి తప్పించుకొని పరుగులు పెట్టి పక్కవీధిలోకి దూరి తారురోడ్డును దాటాను. తాళం వేసున్న చర్చిగేటు మీదికెక్కి, కిందికి దూకి వెలుతురులో చూసినప్పుడే సన్నని రక్తపు గాయాన్ని చూడటానికి వీలైంది. అప్పటివరకూ లోపల అణగివున్న నొప్పి మెల్లమెల్లగా తన పనిని ప్రదర్శించటం మొదలుపెట్టింది. చర్చి మెట్లపై కూర్చొని కొంతసేపు ఆలోచించినప్పుడు విప్పదీయలేని వల అల్లికలా నా యవ్వన ప్రాయం మా నాన్న చేతుల్లో చిక్కుకు పోయిందేనన్న దు:ఖం నన్ను కమ్ముకోవటం ప్రారంభించింది.
అయితే ఎన్నో సమయాలలో ఆయన నాపట్ల కురిపించిన అమితమైన ప్రేమ జ్ఞాపకాలు పగిలిన దూదిపింజలా నా ముందు గాల్లో ఎగరసాగాయి. నేను మూడవ తరగతి ముగించేంతవరకూ నన్ను తన భుజంమ్మీద పడుకోబెట్టుకొని వీధిలో నడుస్తూ నాకు కథలు చెప్పిన మనసూ నాన్నదే! నాకు రెండు పాదాల్లోనూ ఆనెలు వచ్చి కాళ్లను కదల్చలేక చాపమీద పడున్నప్పుడు, గుర్రంపేడను సంచిలో వేసుకొచ్చి వేడివేడిగా నా పాదాలకు పట్టించటమూ, నన్ను జట్కాబండిలో సంతపేట మిషన్ ఆసుపత్రికి ఒక నెలరోజులు వెంటబెట్టుకొని తిరిగిందీ ఇదే నాన్నే! హింసకూ ప్రేమకూ మధ్యన నిలబడున్న ఒక ఆవేశపరుడైన హడ్మాస్టరే ఆయన. ఈ జన్మంతా దెబ్బలు తినకుండా వుండటానికి నేను ఏం చెయ్యాలా అని, చర్చిలైటు వెలుతురులో నుండి పక్కకు వెళ్లి వేపచెట్టు క్రింద క్రముకొని వున్న రాత్రి చీకట్లో వెల్లకిలా పడుకొని ఆలోచిస్తూ అలాగే నిద్రలోకి జారిపోయాను.
ఆ దట్టమైన చీకటిని పటాపంచలు చేసిన దేవాలయ గంటల శబ్దం, చలికి ముడుక్కొని వున్న నా ఒంటిపై కరెంటు తీగెలు ప్రవేశించినట్టుగా పట్టుకొని లేపింది. భయమూ ఒంట్లో మిగిలి వున్న నొప్పీ, నేను ఎక్కడున్నాను, నిన్న రాత్రి ఏం జరిగింది, ఇప్పుడేమయ్యింది అన్నదంతా ఒంట్లోకి ప్రవేశించే జ్వరంలా గ్రహింపచేసింది.
లేచి పద్మాసనం వేసుకొని కూర్చున్నాను. శబ్దం నా నుండి పూర్తిగా తొలగిపోయినట్టుగా దూరమైంది. పదునుదేలి, ఎంతో జాగ్రత్తగా పరిశీలించే, ఏదో ఒక వీధి కళ్లకు నేనుండే చోటు గ్రహించటం సాధ్యం కాదు.
గంటల శబ్దం చేస్తూనే వుంది. వదిలి వదిలి రెండు రెండుగా వినిపించిన దాని శబ్దం ఎవరి మరణాన్నో సభకు చెబుతున్నది. ఇలాగే నేను ఈ వేపచెట్టుకు వురి వేసుకున్నా ఈ గంట ఇలాగే శబ్దం చేస్తుందా అన్న ఆలోచన మెదిలింది. నామీద అంటుకొని వున్న ఈ ఏకాంతాన్ని నేను తుడిచే ప్రయత్నం చేస్తున్న సమయంలో, 'దాస్' ఒక బీడీని వెలిగించుకొచ్చి చర్చి మెట్లపైకొచ్చి కూర్చున్నాడు. ఆ రాత్రిని గడపటానికి అతనికి ఆ బీడీ ఘాటైన పొగ చాలన్నట్టుగా వుంది.
ఒక్క క్షణంలో, ఆ మెట్ల మధ్యలో కూర్చొని అతని దగ్గరకు జరిగాను. నన్ను చూసిన క్షణం అతను నిర్ఘాంతపోవటం నాకు తెలుస్తోంది.
ఈ అకాలంలో, ఈ స్థలంలో, దేవాలయంలోని ఒక చిన్న గేటును తెరిస్తే కనిపించే పాత రాతిగది. అందులో నుండి వచ్చిన నా రాక అతనిని అయోమయానికి గురిచేసి, మాటలు రాక మౌనంతో చూడసాగాడు.
నేనే మాట్లాడటం మొదలుపెట్టాను. ''ఏంలేదు, మామూలే... రాత్రి నాన్న ఇష్టమొచ్చినట్టు కొట్టేశాడు.''
''వొయసు మీరిందేని ఆ మడిసికీ జ్ఞానం లేదు, వొయసు వొస్తోందేని నీకూ బుద్ధిలేదు.''
ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని అతను మా నాన్నను బుద్ధిలేనివాడని చెప్పటం అతనిపట్ల అసహనాన్ని కలిగించింది. ఈ గుడి కాపలాదారుడి పనిని నాన్నే అతనికి పెట్టిన భిక్ష అన్నది నాకు తెలుసు.
మాట మార్చటానికి, ''ఎవరు చనిపోయినారు?'' అని అడిగాను.
''దేవానుగ్రహం అయ్యగారి అమ్మ''
ఇంకొక ఆశ్చర్యానికి లోనుకుండా మనసు స్థిమితపడింది.
''నేను ఇంటికి పోతానన్నా.'' అని అక్కడుంటానికి ఇష్టపడక అతను మాటలు మొదలుపెట్టక మునుపే అక్కణ్ణించి కదిలాను. ఎగిరి దూకే అవసరం లేకుండా చర్చి గేటు తెరిచి వుంది.
మంచుకు పలుచగా తడిసి వున్న తారు రోడ్డుమీద ఒట్టి కాళ్లతో నడవటం ఎంతో హాయిగా అనిపించింది. కంటికి కనిపించిన దూరం వరకూ చీకటి కమ్ముకొని వుంది. వీధి ట్యూబ్లైట్లల్లో ఎక్కడో ఒక్క దానికి మాత్రమే ప్రాణముంది. ఆ చీకటి ఈ నా మానసిక స్థితికి చాలా అవసరమనిపించింది. ఏ దిక్కు అయినప్పటికీ లక్ష్యం లేకుండా నడవటానికే ఇష్టపడ్డాను. ఏమీ లేనివాడిగా అన్నింటి మీదా విరక్తి కలిగింది. అయినప్పటికీ, 'వెట్టవెలం' రహదారి క్రాస్రోడ్డుకేసి నడవటం మొదలుపెట్టాను. నాకు నేను తోడులేని తరుణమది.
అన్ని రాత్రులూ ఇలాంటి ప్రశాంతతలోనే మునిగిపోయి వుంటుందాని ఆలోచించాను. నాన్నకూ, అమ్మకూ మధ్యన వాకిట్లో పడుకొని కథలు విన్న రాత్రులు జ్ఞాపకానికొచ్చి వెళ్లాయి.
ఐదు నిమిషాలు కొనసాగిన నా నడక, ఆ చింతచెట్టు చీకట్లో నుండి గబగబ బయటికొచ్చిన ఒక సైకిల్ వల్ల ఆగింది. ఆ వ్యక్తి తన ముఖం ఎవరికీ తెలియకూడదన్న జాగ్రత్తతో, నన్ను తిరిగి చూడకుండా వేగంగా తొక్కుకుంటూ వెళ్లిపోయాడు.
విరగకాసిన చింతచెట్టు వెనక నుండి ఒక పుల్లను తిప్పుతూ ఆమె బయటికొచ్చింది.
విజయ.
ఆమె అసలైన పేరుకూడా అదే అయ్యుండొచ్చు. అయితే ఆ పేరుతోనే ఈ మధ్యనే మా ప్రాంతంలో ఆమె రహస్యంగా తెలుసుకోబడింది. ఆకర్షణీయమైన వొంపు సొంపులు ఆమె సొత్తు. కళ్లు మాత్రమే ఎప్పుడూ బయటికొచ్చి పడిపోతామా అన్నట్టుగా భయం గొలుపుతుంటాయి.
తన గుడిసింట్లో మూడవ తరహా ఆడవాళ్లతో పడుపువృత్తి నిర్వహిస్తున్న డిల్లెమ్మకు విజయ రాక లాటరీనే అని వీధిలో మాట్లాడుకునేవాళ్లు.
ఆరేడు నెలలుగా మా ప్రాంతంలో విజయ తిరుగుళ్లు వయోబేధం లేక మగవాళ్ల మధ్యన ఒకవిధమైన ఆసక్తిని కలిగించింది. పొద్దుపోతున్న కొన్ని సమయాలలో ఎవరైనా ఒక చిన్నపిల్లవాణ్ణి సైకిల్ క్యారియర్‌లో కూర్చోబెట్టుకొని గట్టిగా పాట పాడుతూ ఆమె సైకిల్‌ను తొక్కటాన్ని దొంగతనంగానైనా చూసే కళ్లను నేనెరుగుదును. ముడతలు పడే ఆమె నడుము భాగాన్ని చూసి పెరిగే మగవాళ్ల నిట్టూర్పులతోనూ, నెరవేరని కలలతోనూ వెలగసాగాయి.
అప్పుడప్పుడూ వచ్చే నా కలల కొనసాగింపులో, విజయ సైకిల్ తొక్కే దృశ్యమూ, క్యారియర్‌లో నేను కూర్చొని వుండటమూ, ఆమె పాత ప్రేమ పాటలను పాడుతూ ఎవరూలేని కాలిబాటను దాటటమూ, సుఖమైన అవస్థగా పెంపొందసాగింది.
''ఈ టైమ్‌లో యాణ్ణిండి వొస్తాండావు...?'' అన్న ఆమె ప్రశ్నకు నేను ముఖం తిప్పుకున్నాను.
''నా మింద కోపమా?'' నేను మౌనంగానే నిలబడ్డాను.
''ఈ వొయిసులో నువ్వు సెడిపోతావనే ఆ దినం అట్టా సెప్పినాను.''
నేను తల వంచుకొని నిలబడ్డాను. చింతచెట్టు చీకటి నా మౌనాన్ని కాపాడింది.
కార్తీక మాసం పండుగ రోజుల్లో వూరి ముఖమే మారిపోతుంది. కొత్తకొత్త మనుషులు, కొత్తకొత్త ఆటలు, రంగులరాట్నం, విద్యలు ప్రదర్శించేవాళ్లు, మూడుచీట్లు ఆడేవాళ్లు, సింహం పులి ఎలుగుబంటి చిత్రాలు గీసి డబ్బులు పెట్టమని చెప్పి మోసం చేసేవాళ్లు అంటూ వూళ్లో పలురకాల మనుషులు, పలురకాల వేడుకలతో నిండిపోతాయి.
ట్యూషన్ అయిపోయి ప్రభాకర్‌తో కలిసి వస్తున్న ఒక చీకటి రోజున మునిసిపల్ స్కూలు దగ్గర చుట్టూ నిలబడున్న గుంపు ముందు ఒకడు తన భాషలో విద్యను ప్రదర్శిస్తున్నాడు. పేడతో రుద్దిన వెదురుగంప ఒకపక్కగా పెట్టి వుంది. తన మాటలతో అతను గుంపును కట్టిపడేశాడు. అతని నుదుటికి పూసివున్న నల్లని తిలకమూ, దానిమీదే పెట్టివున్న కుంకుమా, గుడ్డతో కుట్టబడిన ఒక బొమ్మకు అతను చేసిన భయం కొలిపే అలంకరణా ఒక్కరిని కూడా కదలనీయకుండా చేసింది. గుంపు లోకి దూరి తిరిగి చూశాను. ప్రభ కనిపించలేదు. తర్వాతి ఐదవ నిమిషంలో ఆ గుంపు భయం నాలోనూ కమ్ముకుంటున్నప్పుడు పూర్తిగా రంగురంగుల గాజులు తొడుక్కున్న ఒక చేతికి నా చెయ్యి పట్టుబడటం గ్రహించాను. మొరటైన పట్టు అది.
''పక్కకు జరుక్కోరా.'' ఆదుర్దాతో జరిగాను. ఆమె చూపులు కిందికి దిగి నా హాఫ్ నిక్కరుపై పడింది.
''సదువుకునే వొయిసులో...'' అని గొణుగుతూ ఆమె అక్కణ్ణించి కదలటమూ, నామీద పడ్డ అల్ప చూపులను పీకి పడేస్తూ ఎంతో అవమానంతో నేనూ జరగటమే ఆమె ఇవ్వాల్టి పలకరింపు.
''చెప్పు, నా మింద కోపమే కదా?...'' ఇప్పుడు నా చెంపను తాకి, ముఖాన్ని తడిమి అడిగింది.
నాకు బాగా దగ్గరికొచ్చిన ఆమె మీద నుండి తేలి వచ్చిన వాసన నేను గ్రహించనిది. మోహాన్ని కోరుకునేది.
''లేదు... అవును...'' ఫకాలున నవ్వింది.
మృదువైన వేళ్లు నా చెంపపై నుండి విడవడకుండానే ''టీ తాగేదానికి వొస్తావా?'' అంది.
నిరాకరిస్తూ తలూపాను.
''అవును. నాతో వొచ్చేదానికి ఈలుకాదు. నువ్వు ముందు ఎల్లు, నేను కొంచేపయినాంక వొస్తాను.'' అన్న మాటలకు కట్టుబడి 'వెట్టవలం' రహదారి క్రాస్ రోడ్డు కేసి నడిచాను.
ఏ.బి.కె. రైస్‌మిల్లును దాటుతుండగా సెకండ్ షో పూర్తయ్యి ఎవరో ఇద్దరు వ్యక్తులు గట్టిగా మాట్లాడు కుంటూ నన్ను గమనిం చకుండా వెళ్లి పోయారు. ఈ రైస్ మిల్లు నుండి ప్రారం భించి పెట్రోల్ బంక్ వరకూ రోడ్డుకు పడమరన అందమైన గుడిసెలు నిండి వున్నప్పుడు ఈ ఏకాంతపు అవస్థలు లేవు. చలి కాలంలో కూడా ముసుగు వేసుకున్న సన్నిహిత శరీరాలు వీధి చివరన నిద్ర పొయ్యేందుకు పడుండేవి. స్కూలుకు సైకిల్లో వెళుతున్నప్పుడు... కొబ్బరిమట్టల తడిక మరుగున స్నానం చేసి, ఎద వరకూ పైకెత్తి కట్టిన పావడ, భుజం మీద వుండే చీరెతో గబగబా పరుగుపెట్టే రామచిలక అక్క వాలకం కోసం తపించే మనసు... ఎన్నోసార్లు బీడీ పొగను వదులుతూ బండ పెదాలతో కనబడే ఆమె భర్త రూపం చూసి అణగారిపోయేవి.
రోడ్లు, భవనాల శాఖ అద్దెకు తీసుకున్న జె.సి.బి. మొత్తం ఇండ్లను కొన్ని గంటలలోనే నేలమట్టం చేసి, మనుషులను మూలకొకరిగా విసిరేసి, రహదారికి ఇరువైపులా తుడిచెయ్యటం మొదలైనప్పుడు శాశ్వతమైన చీకటీ, భయమూ గుడిసెలకు బదులుగా గూడుకట్టుకున్నాయి.
టీ కొట్టుకు వెళదామా? ఇట్టే ఇంటికి పారిపోదామా? అన్న రెండు ఆలోచనల మధ్య నడుస్తూ వున్నాను.
ఆమెతో మాట్లాడటమూ, ఆమె నన్ను తాకటమూ, అది వివరించలేని అవస్థను కలిగించటమూ, కోరిక పెరిగి సహజ స్థితిలో దాన్ని ఎవరైనా చూసి వుంటే తన కుటుంబానికి ఎంత పెద్ద అవమానమని భావించాను. అయితే సహజ స్థితికి రాకుండా వుండేందుకే మనసు కోరింది.
ఏమేమో ఆలోచనలతో కూడిన నడక టీకొట్టుకు తీసుకెళ్లి నిలిపింది.
విజయ నాకన్నా ముందే అక్కడికొచ్చేసింది. ఆ అంగడికే ఆమె యజమానిలా అక్కడున్న వాళ్లతో గట్టిగా మాట్లాడుతూ నవ్వుతూ ఆ చీకటిని గలగలమంటూ మార్చేస్తోంది. ట్యూబ్‌లైట్ వెలుతురులో ఆమెను దీక్షగా చూశాను. ఆమె వీపు వరకూ వేలాడుతున్న మల్లెల సరం, అప్పుడే పెట్టినట్టుగా చెదరకుండా వుంది. నేను చూడటాన్ని ఎవరైనా చూస్తున్నారేమోనన్న ఆదుర్దానే ఆమెకు నన్ను పట్టించింది. ఈసారి తనలో తాను గుంభనంగా నవ్వుకుంటూ, నాకొక టీ ఆర్డర్ ఇచ్చింది. ఆమెను తాకటానికి ప్రయత్నించి ఆమె చూపుల తీవ్రతకు తట్టుకోలేక ఆమెను తిట్టుకుంటూ కదిలిన డ్రైవరొకడు నన్నూ మొరిచి చూశాడు.
టీ కొట్టువాడు నన్ను అనుమానంగా చూస్తూ టీ ఇచ్చాడు. మా నాన్నతో ఈ రాత్రి గురించి ఇతను చెబుతాడేమోనన్న భయం నాలో ప్రవేశించింది.
''నాకొద్దన్నా'' అని నిరాకరించి మళ్లీ నడవటం మొదలు పెట్టాను. ఎవరూ లేని ఆ తారురోడ్డు మీద కన్నన్ రైస్‌మిల్లును దాటేలోపు ఆమె ఇతనిని సమీపించి ''స్కూలు గ్రవుండు కాడికి వొస్తావా, కొంచిం మాట్టాడాల'' అంది.
''మీతో నేనెందుకు రావాల'' అని చెబుతున్నప్పుడే ఆమెతో వెళితే ఏంటీ? అని భావించాను.
''ఇట్టం లేకపోతే వొద్దు'' అని ఆగిపోయింది.
ఇప్పుడు నాలో ఏర్పడ్డ ధైర్యం నన్ను మా ఇంటికి పంపించింది. ఎవరూ లేని ఇలాంటి రాత్రులు నన్ను ఎక్కడెక్కడికో తీసుకెళ్లిపోతుందేమో అనీ, తీసుకెళ్లాలి అనీ భావించాను.
నిద్రపోతున్న వీధి మీద చీకటి ఒక ముసుగులా కప్పేసింది.
మా ఇంట్లో అన్ని దీపాలూ వెలుగుతూ ఉండటం నన్ను ఆదుర్దాకు గురిచేసింది. మెల్లగా లోపలికి ప్రవేశించి తొంగి చూశాను. అవ్వ మాత్రం కాళ్లను చాపుకొని, చిన్న రోకలిలో తమలపాకును దంచుతూ వుంది.
చిన్న గొంతుతో, ''అవ్వా, నాయినా, అమ్మా యాడీ'' అన్నాను.
ఎక్కువ గాబరా పడకుండా, ''ఏరా యాడికి పొరునావు. ఆ మడిసి ఈ ఆండదాన్ని ఎంటబెట్టుకొని రేత్రంతా నిన్ను ఎతకతాండాడు.'' అంది.
''తిన్నావా?'' అని అడిగిన గొంతు అక్కరతో కరిగి పోయింది.
శబ్దం చెయ్యకుండా మంచం కింద ఒక చాపను పరిచి పడుకున్నాను.
విజయ లోకం గురించి అసూయగా అనిపించింది. ఆమె సైకిల్ తొక్కటమూ, అర్థ రాత్రుల సమయాలలో తిరగటమూ, టీ తాగటమూ, ఎవరితోనైనా స్నేహించటమూ ఎంత స్వాతంత్రాన్ని కలిగి వున్నది అన్న ఆలోచనల్లో కొనసాగుతూ...
వీధిలోకి తరిమి, తరిమి కొట్టే నాన్న ఆమెకు లేకుండా పోవటం ఎంత అదృష్టమైనది అన్న దాంతోపాటూ...
ఆమె వెనక్కు వెళ్లేందుకు, ఇంట్లో ఇలాంటి అర్థరాత్రుల్లో దీపం వెలగకుండా లాగి మూయబడ్డ తలుపు వెనక గురకపెట్టి ప్రశాంతంగా నిద్రపోతున్న ఒక భర్త ముఖం, ఆ అర్థరాత్రి సమయంలో చెడ్డ మాటలు చెప్పి నన్ను తిట్టుకుంటూ లోపలికి వచ్చిన నాన్న గొంతు చెదరగొట్టింది.
తమిళ మూలం : బవా చెల్లదురై
అనువాదం : జిల్లేళ్ళ బాలాజీ
73820 08979
Sun 04 Jul 07:25:10.531301 2021