ఆ గ్రామంలోని మొహంతి కుటుంబం వారు హేమా హేమీలు, తల్చుకుంటే ఎవరినైనా నానా తిప్పలు పెట్టగలరు. అలాంటి వాళ్ళే నోరు మూసుకుని కూర్చున్నారు. వాళ్ళు మాత్రమేనా, ఊరిలో అందరూ నిశ్శబ్దమై పోయారు. ఇపుడు అందరి చూపు ఆ 'పరీదా' వారి ఇంటి వైపే ఉంది.
అమ్మలక్కల గోష్ఠి జరుగుతోంది. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఏదో చెప్పాలని అనుకుంటున్నారు. తమంటే తాము అన్నట్లుగా పోటీ పడుతున్నారు. ఒకమ్మాయి ఏదో అనబోయింది.
''ఏమిటి... ఏమి చెబుతున్నావు నువు..'' ప్రధాన్ కుటుంబం వారి కోడలు రెట్టించి అడిగింది.
''నేను చెప్పానా లేదా..? ఆ పరీదా వారి కోడలికి పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయని... నా మాట ఎవరూ వినలేదు, ఎంతైనా ఆమె భువనేశ్వర్ అమ్మాయి గదా'' బెదరకుండా సమాధానమిచ్చింది ఆ యువతి.
''అలా అని ఎవరూ చెప్పలేదు. ఆవిడకి బాగా తల పొగరు, గర్వం అని మాత్రం అంటారు. నువ్వు మాత్రం ఆమెని తెగ ఆకాశానికెత్తేస్తున్నావు... సిగ్గులేకుండా'' ఇలాంటప్పుడు తన అభిప్రాయం వ్యక్తపరచక తప్పదన్నట్లు చెప్పింది ఓ ముసలావిడ. అంతసేపూ నిశ్శబ్దంగా ఉన్న ఆమె అలా నోరు తెరిచింది.
''మీ నస అంతా ఆపండి, అసలు పరీదా వారి ఇంటిలో జరిగే తతంగాన్ని ఓ కంట గమనిస్తూండండి. మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పుడూ రాదు'' వాదవివాదాలు ముగుస్తుండగా సలహా ఇచ్చింది ఆ అమ్మాయి.
పతాపూర్ గ్రామంలోని కొసన ఉంటుంది పరీదా కుటుంబం వారి ఇల్లు. సనాతన్ తాత, తండ్రులు కూడా ఆ ఇంటిలోనే నివసించారు. ఇతని జీవితం కూడా ఇక్కడే ముగిసిపోయేదే..! కాని అతని భార్య తులసి అలా జరగనీయ లేదు. తులసి ఆ ఇంటికి కోడలిగా వచ్చిన నాటి నుంచే ఆ పాత ఇల్లు అంటే నచ్చేది కాదు. అంతా పూర్వ కాలపు కట్టుబడి... తనకి అది నచ్చేది కాదు. ఆ తలుపులు, కిటికీలు ఇంకా ఆ వాతావరణం అంతా ఏదో పాతదనంతో నిండి ఉంటుంది. భర్త సనాతన్ కూడా భార్య మనసుని అర్ధం చేసుకున్నాడు. ఎంతైనా ఆమె రెవిన్యూ ఇన్స్పెక్టర్ గారి కూతురాయే.
తులసి పెళ్ళయి ఈ గ్రామం వచ్చినపుడు తనతో పాటు ఎన్నో కొత్త వస్తువులు తీసుకువచ్చింది. ఆ ఫ్యాన్సీ ఐటెంస్ని భర్తకి ఇంకా ఇతర బంధువులకి గర్వంగా చూపించింది. చిన్నప్పుడు ఎప్పుడో చూసిన డ్రామాలోని డైలాగులు గుర్తుకు వచ్చాయి సనాతన్ కి..! ఆ మాటనే భార్యతో అన్నాడు ఓ సారి ''చెట్టు ఆకాశంని అంటుకోవాలనుకునే ముందు వేళ్ళు భూమిలోకి గట్టిగా స్థిరపరచుకోవాలి'' అని..!
బహుశా కొత్తగా పెళ్ళయి వచ్చిన ఏ భార్యతోనూ ఏ భర్తా అలా అని ఉండడు. ఉన్న దానితో సరిపుచ్చుకునే మనిషి సనాతన్. తులసి మాత్రం తక్కువదా, సినిమా హీరోయిన్లా మాటకి మాట అంటిస్తుంది.
''అలా అని చెట్టు ఎదగడం మానేస్తే అది ఎప్పటికీ విత్తనంగానే మిగిలిపోతుంది'' అని భర్తకి ప్రత్యుత్తరమిచ్చేది తులసి.
తన భార్య మాటల్లోని తెలివిని చూసి గర్వంగా అనిపించింది సనాతన్కి..! నాకు ఒక మంత్రిలా, సలహా దారిణిలా పనికి వస్తుందిలే అనుకున్నాడు.
ఆ తర్వాత కొన్ని ఏళ్ళు గడిచిపోయాయి. సనాతన్ ఆ ఇల్లు వదిలి ఊరికి కొద్దిగా దూరంగా ఉన్న స్థలంలో కొత్త ఇల్లు నిర్మించుకొని అక్కడికి తరలిపోయాడు. నిజానికి ఆ స్థలంలో సనాతన్ సోదరులు రైస్‌మిల్ కడదామని అనుకున్నారు. మార్కెట్‌కి దగ్గరగా ఉంటుందని వారి భావన. కాని సనాతన్ తన భార్య కోరిక మేరకు అక్కడ ఇల్లు కట్టాడు. మిగతా అయిన వాళ్ళకంటే తనకి భార్య మాటే ఎక్కువ.
సనాతన్ ఇల్లు కట్టుకున్నప్పుడు అక్కడ చాలా ప్రదేశం ఖాళీ గా ఉండేది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆ ఏరియా అంతా బాగా ఇళ్ళు వచ్చేశాయి. రద్దీ పెరిగిపోయింది. సనాతన్ వాళ్ళ ఇంటి పెరట్లో పొడవైన కొబ్బరి చెట్లు చాలా ఉన్నాయి. దగ్గరి లోనే ఓ చెరువు కూడా ఉంది. ఇంటి ముందు భాగం లో ఒక బావి, దాని పక్కనే తులసి చెట్టు గద్దె ఉంటుంది.
సనాతన్ ఇంటిముందు జరుగుతున్న కోలాహలంని గమనించి చుట్టుపక్కల అమ్మలక్కలు ఏమి జరగబోతుందా అని ఓ కన్ను వేశారు. ఉన్నట్టుండి మంత్రి గారి కాన్వారు కారు కీచుమనే శబ్దంతో సనాతన్ ఇంటి ముందు ఆగింది. మందస్తు సమాచారం ఎవరికీ ఉన్నట్లు లేదు. సనాతన్ వాళ్ళ కుటుంబంకి మంత్రి గారు ఎంత క్లోజ్ అనేది చుట్టుపక్కల వారికి తెలుసు. తులసి ఎప్పుడైనా కబుర్లు చెప్పేట ప్పుడు ఇలాంటి గొప్ప విషయాలే చెబుతుంది. మంత్రి గారిని సాదరంగా ఆహ్వానించడానికి సనాతన్ ఇంటి బయటకి వచ్చాడు. మంత్రి గారికి, ఆయనతో వచ్చిన బందానికి అందరకీ కొబ్బరికాయలు దింపి కొట్టించారు. పోలీస్ గార్డ్లకి, డ్రైవర్‌కి, ప్రైవేట్ సెక్రెటరికీ అందరకి..!
మంత్రిగారు ఇంటిలోకి రావడంతో తులసి, సనాతన్ దంపతుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. అప్పుడప్పుడు తులసి తమ గొప్పల్ని అమ్మలక్కలకి వివరించేది, ఫలానా మినిష్టర్ తమ బంధువులని, పోలీస్ డిజిపి తమ ఇంటికి వస్తారని, ఫలాన కలెక్టర్ గారి భార్య తమ ఫస్ట్ కజిన్ అని అలా చెబుతుండేది. మొదట్లో ఎవరూ ఆ మాటల్ని సీరియస్‌గా తీసుకునేవాళ్ళు కాదు. ఈ బడాయిలకేమిలే అనుకునేవాళ్ళు. అంతదాకా ఎందుకు తులసి భర్త సనాతన్ కూడా అంతగా పట్టించుకునేవాడు కాదు.
ఇప్పుడు చూస్తే ఏకంగా ఇలా మంత్రిగారే ఇంటికి రావడం తో అందరి అభిప్రాయం మారిపోయింది. కళ్ళింత చేసుకుని చూడసాగారు. అయ్యో...ఇన్ని రోజులు తులసిని మనం చిన్న చూపు చూశామే అని పశ్చాత్తాప పడ్డారు. మంత్రి గారు తమ గ్రామానికి రావడం అంటే మామూలు సంగతి కాదు. ఏది ఏమైనా ఈ క్రెడిట్ తులసిదే..! మంత్రి గారు తలుచుకుంటే ఊరిలో యువతకి ఉద్యోగాలు రావచ్చు, రోడ్లు రిపేర్లు జరగవచ్చు. గ్రామంలో బంగారు పంటలు పండే అవకాశముంది.
సనాతన్ ఇంట్లో చాలా జరిగిపోతున్నాయి. మంత్రి గారు ఏం చెప్పబోతున్నా తులసి సుతారంగా వారిస్తూ ఏదో తినేదానికి ఇస్తోంది. అంతలోనే జీపు డ్రైవ్ చేసుకుంటూ ఓ లావుపాటి వ్యక్తి వచ్చాడు, సార్ మనం ఇక కదులుదాం అన్నట్లు మర్యాద పూర్వకంగా సైగ చేశాడు. పటాలం మొత్తం కదిలింది.
మంత్రి గారు తులసికి, సనాతన్కి ఇంకా దాపునే ఉన్న అందరకీ నమస్కరించి వెళ్ళి కారులో కిటికీ పక్క కూర్చున్నాడు. దుమ్మురేపుకుంటూ కారు పరుగుతీసింది. ఆ తర్వాత నుంచి తులసి గ్రామంలో ప్రధానమైన వ్యక్తిగా మారిపోయింది. సమస్యలు చెప్పుకోవడానికి, చిన్న చిన్న ఫేవర్లు అడగడానికి ఆమెని కలిసేవారు. వచ్చిన వాళ్ళకి కుర్చీలు వేద్దామని సనాతన్ మొదట్లో ప్రయత్నించేవాడు. కాని సరిపోయేవి కావు. దానితో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. వచ్చే జనాలు కూడా కుర్చీ కోసం కాకుండా తులసిని కలిస్తే చాలు అన్నట్లు వచ్చేవారు.
ఆమె చాలా బిజీగా ఉన్నట్లు అటూ ఇటూ తిరుగుతుండేది. ''ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుతా, ముందు మీ సమస్యల్ని ఓ అప్లికేషన్లో రాసివ్వండి'' అని వచ్చిన వాళ్ళకి చెప్పేది. మొత్తం పతాపూర్ గ్రామంలో మంత్రిగారి పర్యటన ఓ పెద్ద టాపిక్‌గా మారిపోయింది. తులసి కుటుంబానికి ఆయనతో అంత అనుబంధం ఉన్నట్లు అంతదాకా ఎవరికీ తెలియదు. మంత్రి గారు వచ్చే విషయం ఒక్క సర్పంచ్ కే తెలుసు. ఆ ఊరి సబ్ ఇన్స్పెక్టర్కి గాని, చిన్న స్కూల్ హెడ్మాష్టర్‌కి గాని ఎవరికీ తెలియదు. చండబాలి గ్రామంలోని ఆసుపత్రిని ఓపెన్ చేయడానికి వస్తున్నట్లు తెలుసు గాని సనాతన్ కుటుంబంని సందర్శించడం అనేది ఎవరూ ఊహించలేదు.
మంత్రి గారు తమ ఇంటిలో గడిపిన పదినిమిషాలు తన జీవితంలో మరపురాని క్షణాలుగా మిగిలిపోయాయి సనాతన్ కి..! తను చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నించి చివరకి స్వగ్రామం చేరుకున్నాడు. నిరాశ తో మిగిలిన అతనికి ఇక మీదట భవిష్యత్ దివ్యంగా కనిపించసాగింది.
మినిష్టర్ గారి దయ ఉంటే చాలు తన జీవితం లోని కలలన్నీ తీరిపోతాయి. కటక్‌లో గాని, భువనేశ్వర్‌లో గాని పెద్ద ఇల్లు కొనాలనేది తనకి కలగా ఉండేది. ఒక చక్కని కారు కొని నగరం అంతా తిరిగి పోర్టికోలో దాన్ని పెట్టి చూసుకోవాలనేది కూడా తన ఇంకో కల. అంతేకాదు, వాళ్ళ అబ్బాయి మంచి స్కూల్లో చదవాలని, ఇంట్లో అన్ని రకాల గాడ్జెట్లు ఉండాలని, అప్పుడప్పుడు పతాపూర్ వచ్చి తన సంపద ప్రదర్శించాలని... ఇలా ఎన్నో కలలు ఉన్నాయి.
ఆ కలలు ఇప్పటిదాకా ఫలించలేదు, పుచ్చిపోయిన విత్తనాల్లాగా మొలకెత్తలేదు. తులసి పెరట్లోనే ఉంది. వచ్చిన ప్రతి ఒక్కరు తులసిని అడగటమే మంత్రి గారు మీకు ఏమవుతారని..! ఆ ప్రశలన్నిటిని విని ఆమె నవ్వి ఊరుకునేది. వీటన్నిటికీ సమాధానాలిచ్చే తీరిక లేదన్నట్లు మెలిగేది. కొన్నిరోజుల పాటు మంత్రి గారి పర్యటన వార్త ఆ ప్రాంతంలో ప్రముఖంగా నిలిచింది.
పోనుపోను సనాతన్ ఇంటికి వచ్చే జనాలు పెరిగిపోయారు. అది తను ఊహించని విషయం. ముందు ఏదో ఉత్సాహంగా వచ్చినా తర్వాత జనాలు ఏదో పని పెట్టుకొని వచ్చేవారు. ఫలానా సమస్య తీర్చమని అడిగే వారు. తులసిని గాని, సనాతన్ని గాని ప్రైవేట్‌గా కలిసి చెప్పేవారు. వచ్చే వాళ్ళు కూడా ఒట్టి చేతులతో రాకుండా వాళ్ళ అబ్బాయికి ఏవో గిఫ్ట్ లు తీసుకొచ్చేవారు. తల్లిదండ్రులకి మల్లే పేరు తెచ్చుకుంటాడని ఆ కుర్రాడిని ముద్దు చేసేవారు. సనాతన్ ఇబ్బందిగా మొహం పెడితే తులసి అదేం పట్టించుకోవద్దు అన్నట్లు సైగ చేసేది.
వారాంతం వచ్చేసరికి వాళ్ళ ఇంటిముందు కార్లు, జీపులు ఆగి ఉండేవి. డాక్టర్లు, ఇంజనీర్లు, కాంట్రక్టర్లు ఇంకా ఇతర అధికారులు కలవడానికి వచ్చేవారు. వెళ్ళేప్పుడు కవర్లలో డబ్బులు పెట్టి ఇచ్చి వెళ్ళేవారు. సనాతన్కి ఇచ్చేవారు. మొదట్లో కవర్లు సనాతన్ తీసుకోవడానికి వెనకాడితే తులసి వచ్చి వాటిని గభాలున లాక్కునేది. మేడం మీకు ఏది అవసరం పడినా నాకు చెప్పండి అనేవాళ్ళు వాళ్ళంతా..! అంత మొత్తంలో డబ్బుల్ని సనాతన్ ఎప్పుడూ చూసి ఉండలేదు. ఇది చూసి తులసి అనేది ''ఎవరైనా అడిగితే లాటరీ లో వచ్చాయని చెప్పండి'' అని..!
ఇప్పుడి సనాతన్కి ఇంకో దురద పెరిగింది. తులసి మాదిరిగా తాను కూడా జనాలకి హెల్ప్ చేయాలని..! ఈ విషయంలో తులసి పెద్దగా ఆసక్తి చూపలేదు. అవసరమై నపుడు మంత్రి గారి దగ్గరకి నేనే పంపిస్తా తొందర పడవద్దు అనేది. తులసి పాపులారిటీ రోజురోజుకీ పెరిగిపో సాగింది. ఆవిడ ప్రస్తుతం ఏకంగా మంత్రిగారికే క్లోజ్ గదా..! సనాతన్ అంటే ఊరిలో చాలామందికి అసూయ పెరిగింది. దానితో బాటు భయం కూడా..! తను రేషన్ షాప్‌కి వెళితే గోవింద కూడా మిగతా కష్టమర్లని ఆపుజేసి మరీ తనకి సామాన్లు ఇస్తున్నాడు. సబ్ ఇన్స్పెక్టర్ కూడా సెల్యూట్ చేస్తున్నాడు. అంతేకాదు తినడానికి ఏదో ఒకటి ఆఫర్ చేస్తున్నాడు.
ఆ గ్రామంలోని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సనాతన్ తో దేశభవిష్యత్ గూర్చి చర్చిస్తూ ఎంతో ఆనందించే వాడు. సర్పంచ్ కూడా సనాతన్ని రోజు విడిచి రోజు కలుస్తూ తన గురించి మేడంకి చెప్పండంటూ రిక్వెస్ట్ చేసేవాడు. ఆ బ్లాక్ లోని అధికారులు, గ్రామ సెక్రటరి ఎప్పుడూ సనాతన్ తో మాట్లాడే అవకాశం వదులుకునేవాళ్ళు కాదు. తులసి భర్త ని భువనేశ్వర్ పంపించేది కాదు, అది ఆమెకి ఇష్టం ఉండేది కాదు. అయితే ఒకరోజు స్థానికంగా ఉండే యూత్ క్లబ్ సెక్రటరి మాత్రం ''సార్, టాక్సీలో భువనేశ్వర్ వెళ్ళి మినిష్టర్ గార్ని కలుద్దాం రండి'' అన్నాడు. వాళ్ళు త్వరలో తమ అసోషియేషన్ వార్షికోత్సవం జరపబోతున్నారు. ఆ కార్యక్రమానికి మినిష్టర్ని ముఖ్య అతిథిగా పిలుద్దామని సెక్రటరి
ఆలోచన. అయితే తులసి మాత్రం వేరే పని ఉందని ఆ జర్నీని తప్పించుకుంది. ''మేడం మీరు కూడా ఆ ఫంక్షన్ కి ఓ అతిథి గా రావాలి సుమా'' అన్నాడు సెక్రటరి.
వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పిల్లవాడిని రెడీ చేసి స్కూల్ కి పంపించింది తులసి..! ఉన్నట్లుండి ఆకాశం అంతా నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. గాలి, దుమ్ము భయంకరంగా రేగింది. భయం వేసి గడియ వేసుకుని పడుకుంది. కాసేపటికి గాలి ఆగింది, వర్షం పడుతూనే ఉంది. సనాతన్ క్షేమంగా రావాలని దేవుడిని వేడుకుంది.
ఆ రాత్రి సనాతన్ తిరిగివచ్చాడు. అతనికి నిద్ర పట్టక, పక్కంతా దొర్లుతున్నాడు. బయట కప్పలు బెకబెక లాడుతున్నాయి.
''ఏమయింది, మంత్రి గారిని కలిశారా..?'' అడిగింది తులసి.
''అసలు నేను భువనేశ్వర్ కి వెళ్ళకపోయినా బాగుండును'' సనాతన్ నిట్టూర్చాడు.
''మీరు మంత్రి దగ్గరకి వెళ్ళినపుడు ఆ యూత్ క్లబ్ సెక్రటరీ కూడా ఉన్నాడా..?'' తులసి ప్రశ్నించింది.
''అతను అప్పుడు లేడులే''
''హమ్మయ్యా...బతికి పోయాం''
''నాతో అబద్ధం ఎందుకు చెప్పావు'' సనాతన్ అడిగాడు.
''ఏ అబద్ధం ''
''నీకు అది బాగా తెలుసు.. మళ్ళీ న్నెందుకు అడగడం''
''ప్రతి ఒక్కరూ ఏవో గొప్పలు చెబుతూనే ఉంటారు. నాకు చెప్పడానికి ఏమి ఉంది, అంతకంటే ఏమి చేయను మరి'' జాలిగా అంది తులసి.
సనాతన్ లేచి కూర్చున్నాడు. ఆమె మొహంలోకి చూశాడు. తప్పు చేసిన భావం ఏ మాత్రం ఆమెలో కనిపించడం లేదు.
''అసలు ఏమయింది చెప్పండి'' అడిగింది తులసి.
''ఏమయిందా... అసలు ఆ మినిష్టర్ నన్ను గుర్తుపట్టనే లేదు. మన ఊరు వచ్చినప్పటి సంగతులు గుర్తు చేశాను. ఆ రోజు ఎవరో జ్యోతిష్యుడు రథశర్మ అనే ఆయన ఇంటికి వెళ్ళబోయి పొరబాటున మన ఇంటికి వచ్చారట. ఆ డ్రైవర్ చేసిన పొరబాటు వల్ల అలా జరిగిందట..'' చెప్పాడు సనాతన్.
తులసి ఇకిలించింది. సనాతన్కి మండిపోయింది. ''ఎందుకు నవ్వడం.. నవ్వడానికి ఏముంది దాంట్లో'' అరిచాడు.
''ఏదో చాన్నాళ్ళకి గొప్పలు చెప్పడానికి ఒక అంశం దొరికిందని కానిచ్చాను. ఆ మాయలో జనాల్ని కొన్నాళ్ళు ఉండనివ్వండి'' అంది తులసి.
సనాతన్ భార్య మొహంలోకి చూశాడు. ఆ ముద్దుమోము అంతుబట్టని విషయంలా తోచింది.
ఒరియామూలం: గౌరహరి దాస్
తెలుగు : మూర్తి కె.వి.వి.ఎస్.
సెల్: 7893541003
Sun 11 Jul 07:36:18.394022 2021