ఎమ్.ఎన్.జె.ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ డిపార్ట్మెంట్ ఐ.సి.యు వార్డు సమయం ఉదయం 8 గంటలు.
రాత్రంతా మెళకువ గా ఉండి తండ్రి ఆయాసం చూడలేక ట్రీట్మెంట్ కోసం డాక్టర్ల చుట్టూ తిరుగుతూ అలసి పాలిపోయిన ముఖంతో ఆందోళనతో చిక్కిశల్యమైన కొడుకు రఘు వంశ్ను తండ్రి చంద్రవంశ్ దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. వినపడనట్లుంది.
''ఒరేరు నాన్నా... బాబూ ఇలా ఓసారి రా...!'' అన్నాడు ఆయాస పడుతూ గొంతు పెగిలించుకుని చేతిని పైకి లేపి తన కొడుకు వైపు చూపించి పిలుస్తూ చంద్రవంశ్.
బయటకు చూస్తున్న రఘు తండ్రి గొంతు విని ఒకింత తెచ్చిపెట్టుకున్న ఆనందంతో... ''ఏంటి నాన్న గారూ? ఇప్పుడెలా ఉంది. పొద్దున్నే డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ చేసి వెళ్ళాడు. మీరు ఆయాసపడుతుంటే నాకు చాలా భయం వేసింది. ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది ?'' అంటూ మంచం పక్కనే ఉన్న కుర్చీ లాక్కుని కూర్చుంటూ అన్నాడు కొడుకు.
కొడుకు చేతిని తన చేతుల్లోకి తీసుకొని ఆపేక్షగా చూసాడు తండ్రి.
''ఏంటి నాన్నా అప్పుడే లేచారు? వేడిగా టీ తాగుతారా...? పోసివ్వనా ...? ఏమైనా తినాలనిపిస్తుందా ? చెప్పండి నాన్న గారు తీసుకుని వస్తాను'' అన్నాడు రఘువంశ్.
కొడుకు చేతులు మరికాస్తా గట్టిగా నొక్కి కళ్ళనిండా నీళ్ళు నింపుకుని జీరబోయిన గొంతుకతో ''రఘూ నేను బతుకుతానా...?'' అన్నాడు.
''ఆ అనుమానం ఎందుకు వచ్చింది నాన్నా ...! మీకేం కాదు డాక్టర్ ట్రీట్మెంట్ మరికొన్నాళ్లు తీసుకుంటే ఫలితం కనిపిస్తుంది అన్నాడు. అయినా మీకు ఆ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి. మీకు నేనున్నాను నాన్నా. ఇక్కడ డాక్టర్ల తో కాకపోతే అమెరికా నుండి పెద్ద డాక్టర్లను పిలిపించమన్నాను. వాళ్ళు 'ఆ అవసరం రాదు' అని చెప్పారు'' అన్నాడు రఘు.
తండ్రి కంటి నిండా నీళ్ళు పెట్టుకుని కొడుకు వైపు దీనంగా చూడసాగాడు.
''ఎందుకు నాన్న కన్నీళ్లు'' అన్నాడు రఘు
మీ అన్నా వదినలు అక్కలూ అందరూ వచ్చారుగా...?
''హా.. వచ్చారు నాన్నా. ఇక్కడ ఎక్కువ జనాలు నిలబడ వద్దని వార్డ్ బోరు అందరినీ బయటకు పంపేసాడు. నేను వాళ్ళను లోపలికి పంపి నేను బయటే నిలిచున్నాను. అయినా మీతో మాట్లాడడానికి వచ్చారుగా..? మీరు మాట్లాడలేదా నాన్నా. ఏమన్నారు'' అన్నాడు ఆత్రంగా రఘు.
''వచ్చారు బాబూ...'' బొంగురు బోయిన కంఠంతో అన్నాడు చంద్రవంశ్.
నాతో పత్రాలపై సంతకాలు పెట్టించుకుని వెళ్ళిపోయారు.
''ఏం పత్రాలు నాకేం చెప్పలేదే...!!''
''పవరాఫ్ పట్టాణి''పై నా సంతకాలు రా ''వ్యాపార లావాదేవీలు చూడడం చాలా కష్టంగా ఉందట. ప్రతీదానికీ నా సంతకాలు అవసరం వస్తున్నాయి. మళ్ళీమళ్ళీ ఇక్కడికి రావడానికి ఇబ్బంది అవుతుంది కదా. మీ పెద్దన్నయ్య తన పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు'' అన్నాడు తండ్రి.
''అది కూడా నిజమే కదా... మనం ఇంకా ట్రీట్మెంట్ కోసం నెలరోజులు ఇక్కడే ఉండాల్సి రావచ్చు. అప్పటిదాకా మన వ్యాపారాలు దెబ్బతినవూ...!! ఇప్పుడు మీరు నిశ్చింతగా ఉండొచ్చు'' అన్నాడు రఘు.
'డాక్టర్ ఏం చెప్పి ఉంటాడో నాకు తెలియదనుకున్నావా..? నా ఆరోగ్య పరిస్థితి ఏంటో నాకు బాగా తెలుసు. కీమోథెరపీ తీసుకోడం వల్ల నా శరీరం చాలా సున్నితం గా తయారైంది. ఏదీ తట్టుకోలేక పోతుంది' అనుకున్నాడు మనసులో...
'ఈ బాధ పడే కన్నా చావు తొందరగా వస్తేనే ఉపశమనం కలుగుతుంది' అని మనసులో అనుకునే మాట బయటకే అన్నాడు తండ్రి.
'అంత మాట అనకండి నాన్న గారు. ఏదైనా రోగం వచ్చినప్పుడు ఊరికినే తగ్గుతుందా...? దానికి కావాల్సిన చికిత్స తీసుకోవడం ద్వారా తగ్గుతుంది' అన్నాడు.
మీరు చిన్నప్పుడు అనేవారు గుర్తుందా...?
ఏమిటని కొడుకు వైపు చూసాడు చంద్రవంశ్.
మాలో ఎవరికైనా జ్వరం వస్తే మీ జ్వరం నాకొచ్చినా బాగుండేది బాధ నేను పడేవాడిని అనే వారు.
ఆ విషయం ఇంకా గుర్తుందా అన్నట్లు చిరునవ్వు నవ్వాడు.
'మీ ఆయాసం నేను తీసుకునే అవకాశం ఉంటే కాస్త భాగం పంచుకునే వాడిని. ప్చ్.. అలాంటి అవకాశం లేదు' అని రఘు అనకముందే కొడుకు నోరు మూసేసాడు చంద్రవంశ్.
'అలాంటి కోరికలు కోరుకోవద్దు బాబూ ఇలాంటి వ్యాధి పగవాడికి కూడా రాకూడదు. ఇంత ఆయాస పడుతున్నా నీవు నాపై చూపించే పిచ్చి ప్రేమనే నాకు బతకాలనే కోరిక కలిగిస్తుంది' అని కొడుకు నోరు మూస్తూ అన్నాడు చంద్ర వంశ్.
''మరి... మీరు అలాంటి పిచ్చి ఆలోచనలు మానుకోండి. ప్రశాంతంగా ఉండండి. మీకు నేనున్నాను ఏం కావాలన్నా నాకు చెప్పండి? మీరు పూర్తిగా కోలుకవడమే నాకు ముఖ్యం అన్నాడు'' రఘు.
చంద్రవంశ్కు తొమ్మిది మంది సంతానం. అందులో నలుగురు కుమారులు అందరినీ పెంచి పెద్ద చేసి అందరికీ పెళ్లిళ్లు చేశాడు. తన తండ్రి ఇచ్చిన ఆస్తిని నాలుగింతలు చేశాడు. తరగని ఆస్తిపాస్తులు ఉన్నాయి. తన పిల్లలకందరికీ ఏ లోటు లేకుండా పెంచాడు. కూతుళ్ళకు కూడా బాగానే ముట్టజెప్పాడు. పిల్లలందరూ కూడా తండ్రిని చాలా గౌరవించే వారు. నాన్నగారు అంటూ తనను కాదని ఏపనీ చేసేవారు కాదు. తన అదష్టానికి తానే మురిసిపోయేవాడు. కొన్ని నెలల క్రితం హఠాత్తుగా ఆరోగ్యం పాడైంది. దగ్గువచ్చినప్పుడు నోట్లో నుంచి రక్తం పడడం జరిగింది. మొదట వేడిచేసిందేమో అనుకున్నారంతా. ఎందుకైనా మంచిదని పరీక్షలు చేయించారు. రిపోర్టులో బ్లడ్ క్యాన్సర్ సెకెండ్ స్టేజ్ అన్నారు. హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసారు. అంతవరకు బాగానే ఉంది. జాయిన్ చేసిన తర్వాత ఒక్కరూ మళ్లీ తిరిగి చూడలేదు. ఎలా ఉందో అని కనీసం అడగలేదు. దాదాపుగా ఆరునెలల తర్వాత ఈ రోజే వచ్చి పత్రాలపై సంతకాలు పెట్టించుకున్నారు. నేను వాళ్ళను గుండెలపై మోసాను. తెలివైన వారని ఎంతో గారాబంగా పెంచాను. ఎవరి వ్యాపారాలు వారికున్నాయి. ఏం తక్కువ చేసానని. తలుపుబయట నిలబడిన కోడళ్ళు మాత్రం బయట నుండే చూసి భర్తలు బయటకు వెళ్ళాక మామయ్య ను ఇక్కడే ఉంచడం మంచిది. మన పిల్లలు చిన్నవాళ్ళు. ఇన్ఫెక్షన్ వస్తుంది అని చెప్పడం ఆయన చెవిలో పడింది. చంద్రవంశ్ మనసు చివుక్కుమంది.
తమది పెద్దబంగళా ఏదో ఒక గదిలో తనకు చోటుదొరకదా...? అయినా రఘు ఒక్కడే ఎంతకాలం ఉంటాడిక్కడ...? అమాయకుడు ఏమీ తెలియదు అని ఎప్పుడూ వాడికి ఏమీ ఇవ్వలేదు. వాడు కూడా ఇంతవరకూ ఇది కావాలి నాన్నా అని ఏమీ అడగలేదు. డిఎస్సీ పరీక్ష కూడా వదులుకుని ఇక్కడే ఉన్నాడు. వాడి కోసమైనా మాకూ బాధ్యత ఉంది కొన్నాళ్ళు మేమూ చూసుకుంటాం అని ఆలోచించడం లేదు వీళ్ళంతా అనుకున్నాడు.
రఘు నా దగ్గరే ఉండి ఎంతో ధైర్యం చెబుతున్నాడు. కానీ ఎక్కడో నిరుత్సాహం బాధ వీడికి ఏమీ చేయలేదు. చదువులో వెనుకబడి పోయి ఎవరు ఏది చెప్తే ఆ పని చేసేవాడు. అందరూ రఘును తమతమ పనులకు పని వాడిలా వాడుకునే వారు. ఎవ్వరినీ పల్లెత్తు మాట అని ఎరుగడు. అందరూ అంటే అనొచ్చు కానీ తండ్రై ఉండి తనుకూడా అలాగే చేసాడు కదా ...?
అందరినీ సమానంగా చూడలేకపోయాను...! మిగితా కొడుకులు, కోడళ్ళు ఎలాగోలా బతుకుతారు. ఆ ధైర్యం ఉంది. వీడి జీవితం ఎలా..? నేను ఎంత బాధ పెట్టినా వీడీకి నాపైన కోపం లేదా...? ఏమీ జరగలేదన్నట్లు ఎంత ప్రేమగా ఉంటున్నాడు...? నాన్నా... నాన్నా ... ఏమాలోచిస్తున్నారు...?
'చెప్పండి. పాలు బ్రెడ్ ఉంది కాస్తా తిందురు గానీ లేవండి' అనే రఘు మాటలకు ఈ లోకంలోకి వచ్చాడు చంద్రవంశ్.
రెండు బ్రెడ్ ముక్కలు తినిపించి వేడిగా పాలు తాగించి పడుకోబెట్టాడు తండ్రిని... రాత్రంతా ఆయాసంతో నిద్ర సరిగా లేదేమో మత్తుగా నిద్రలోకి జారుకున్నాడు.
'మీరు పడుకోండి నాన్నా... డాక్టర్ గారు పిలిచారట ఏమిటో కొనుక్కుని వస్తాను' అని వెళ్ళాడు.
''ఏమిటి డాక్టర్ గారు పిలిచారట?'' డాక్టర్ క్యాబిన్లోకి వెళ్లి అన్నాడు రఘువంశ్.
వచ్చారా రఘు నేను చెప్పేది శాంతంగా వినండి. రాత్రి చేసిన టెస్ట్ తాలూకు రిపోర్ట్లు వచ్చాయి. మీ నాన్నగారి వ్యాధి ముదిరింది. చివరి స్టేజ్లో ఉన్నారు. ఒక వారమో పదిహేను రోజులో చెప్పలేం.
వారిని ఇంటికి తీసుకుని వెళ్ళి ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండే విధంగా చూసుకోండి అన్నాడు డాక్టర్ రవి.
ఏమంటున్నారు డాక్టర్ గారు...? అంత మాట అనకండి ...! ఎలాగైనా మా నాన్నగారిని బతికించండి మీ కాళ్ళు పట్టుకుంటాను అన్నాడు రఘు.
అలాకాదు రఘు మా శాయశక్తులా ప్రయత్నించి చూసాం మీరు కూడా చూసారుగా..? గుండె నిబ్బరం పెంచుకోండి. మీరెప్పుడైనా తీసుకుని వెళ్ళొచ్చు కానీ ఆయనకు అనుమానం రాకుండా చూడండి.
ఇంక చేసేదిలేక వెనుదిరిగాడు. రఘు చాలా సేపు హాస్పిటల్ బయట చెట్టుకింద కూర్చుని ఏడ్చి తనను తాను సముదాయించుకుని ముఖం కడుక్కుని లోపలికొచ్చాడు.
డాక్టర్ ఏమన్నాడు రఘూ అంటూ కొడుకును అడిగాడు తండ్రి.
ధైర్యం తెచ్చుకుని గొంతు సవరించుకుంటూ అదే నాన్నా ''రాత్రి టెస్ట్ చేసారు కదా ..!!'' రిపోర్ట్స్ వచ్చాయి. ఇప్పుడు మీరు కాస్తా కోలుకుంటున్పారట. ఇంటికి తీసుకుని వెళ్ళి ప్రతినెలా రండి అన్నాడు.
మరి మీరేమంటారు ''ఇంటికెల్దామా మరో రెండురోజులు ఉందామా'' అన్నాడు రఘు.
అవునా వెళ్ళమన్నాడా... అయితే వెళ్దాం... ఇంకా ఇక్కడెందుకు...?
ఎప్పుడెప్పుడు ఇంటికెళ్ళాలా అనిపిస్తుంది. ఒక్కక్షణం కూడా వద్దు అన్నాడు చంద్రవంశ్.
ఇంటికెళ్ళిగానే వెంటనే రఘుకు ఏదైనా చేయాలి అని మనసులో అనుకున్నాడు.
డాక్టర్ చెప్పినట్లే వారం లోపలే కొడుకుతో నీ చేతితో కాఫీ తాగాలనిపిస్తుంది రఘు అన్నాడు. తెచ్చి తాగించాడు రఘు. అంతే ఆతరువాత కాసేపటికే అంతా అయిపోయింది. అదే ఆయన చివరి మాట.
దిన వారాలు పూర్తయ్యాయి. ఇల్లంతా శుభ్రం చేస్తున్నారు. తండ్రి బట్టలు సర్దుతూ ఉంటే తలగడ కింద ఒక ఉత్తరం కనిపించింది. ఆత్రుతగా విప్పిచూసాడు రఘు. అందులో ఇలా ఉంది.
ప్రియమైన రఘువంశ్కు
నీ తండ్రి ఆశీస్సులతో వ్రాయునది ఏమనగా...!!
నీ భవిష్యత్తు కోసం రాసే డిఎస్సీ ని కూడా వదిలిపెట్టి నాకే సేవ చేసావు. నీది ఎంత మంచి మనసు నాన్నా చిన్నవాడివై పోయావు లేకపోతే నీ కాళ్ళు మొక్కే వాడిని. నీకు చిన్నప్పటి నుంచి ఏవిషయంలోనూ న్యాయం చేయలేకపోయాను. ఇంటికొచ్చాక నీ బతుకు తెరువు కోసం నీపేర ఏదైనా రాద్దామనుకున్నాను. నా వల్ల కోల్పోయిన ఉద్యోగానికి బదులు గా ఏదైనా వ్యాపారం చేసి బాగుపడతావనుకున్నాను. ఇంటికొచ్చాక చూస్తే అంతా తారుమారైంది. ఆస్తులన్నీ మీ అన్నా వదినల పేర చేసుకున్నారు. ఇదేమిటని అడిగితే ఈరోజో రేపో పోతావ్. ఇంకా నీకు ఈ ఆస్తులేందుకు...? అన్నారు. ఏడుపొచ్చింది రఘు. ఇంత ఆస్తిపాస్తులు ఉండి ఏం లాభం చివరి నిముషంలో నాచేతిలో చిల్లిగవ్వ లేదు. నాకు బాగా బుద్దొచ్చింది. నీకిప్పుడు నా ఆశీస్సులు తప్ప ఏమీ ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను. నీవు నేను జన్మనిచ్చిన ఒక్క కారణంతోనే చివరి క్షణాలను అనందంగా గడిపే విధంగా చూసుకుని తండ్రి రుణం తీర్చుకున్నావు. మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కడుపున పుడతాను. ఈ జన్మకి ఇంతే... నేను ఏలోకంలో ఉన్నా నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాను. జాగ్రత్తగా ఉండండి.
నన్ను క్షమిస్తావుకదూ...
ప్రేమాశీస్సులతో...
మీనాన్న గారు.
ఉత్తరం అంతా చదివి ఇది చాలు నాన్నగారు మీ ఆశీర్వాదం ఉంటే చాలు నాన్నా. ఆస్తులెందుకు నేను మీకు చేసిన సేవల వల్ల మీరు సంతప్తిగా ఉన్నారు. నాకు అది చాలు మీ నోటితో మీరే అన్నారు కదా నేను తండ్రి రుణం తీర్చుకున్నానని ఆ తప్తి చాలదా నాన్నా... నా జీవితం... భవిష్యత్తు అంటారా నాకేం అంగవైకల్యం లేదు. నా కాళ్ళూచేతులూ బాగానే ఉన్నాయి. చదివించారు. కష్టపడి ఎలాగైనా ఉద్యోగం సంపాదించి స్తిరపడతాను. మీ చేతులతో రాసిన ఉత్తరాన్ని ఒక జ్ఞాపకంగా జీవితాంతం వరకూ భద్రపరుచుకుంటాను అంటూ కన్నీళ్ళు తుడుచుకుని లెటర్ మడిచి తన బీరువాలోని సొరుగులో భద్రం గా దాచుకున్నాడు రఘు.
- జయంతి వాసరచెట్ల, 9985525355
Sun 08 Aug 05:54:46.417931 2021