Sun 22 Aug 06:10:58.442824 2021
Authorization
ఎమో నీరసంగ అవుపిస్తున్నవ్..
హా..
ఏమాయె'..
ఏమో.... సఫరింగ్ విత్ కోల్డ్ అండ్ కాఫ్ లాస్ట్ టూ డేజ్..
నైట్ సెంట్రీ డ్యూటీ వల్లనా
కాదు..
ఇంక..
నీకు తెలుసుగా, జలుబు కారణంగా మనవాళ్లు జ్వరాల బారిన పడుతున్నరు.. సం ఆఫ్ దెం ఫేసింగ్ బ్రీతింగ్ ప్రాబ్ ఆల్సో..
హా.. వానాకాలం గద.. సాధారణ జలుబులే అనుకుంటున్నా....
న్నో..
మరి..
మేబీ ఇట్ ఈజ్ కరోనా..
వాట్..
ఎస్..
మనకా..
రోగం రాకుండా ఉండాలంటే.. వంట్లో వ్యాధి నిరోధకశక్తి ఉండాలి పోరాట గుణమున్నంత మాత్రాన కాదు....
అప్పుడైతే నీ నీరసానికి కారణం కూడా..
హా..మీ టూ..
డీజీపీ కార్యాలయం నిశ్సబ్దంగా ఉంది.. నక్సల్స్ ప్రభావ ప్రాంతాల పోలీస్ కమిషనర్లతో డీజీపీ మాట్లాడుతున్నాడు.. 'దళాల ఏరివేత ఎప్పటికప్పుడు తాత్కాలిక చర్య అవుతోంది తప్ప శాశ్వత పరిష్కారం లభించట్లేదు... ఈ దళాన్ని మట్టుబెడితే ఇంకో దళం ప్రత్యక్షమవుతోంది ఆదళాన్ని ఏరివేస్తే మరొకటి పుట్టుకొస్తోంది'' ఎప్పటికప్పుడు అడవులు ఖాళీ చేయించ గలుగుతున్నాం.. కానీ అంతలోనే మరొక దళం ఆక్రమించుకుంటోంది.. టులెట్ బోర్డ్ పెట్టించటం కాదు మనం చేయాల్సింది నో ఎంట్రీ టు ఎక్స్‌ట్రీమిజం హెచ్చరిక అడవి సరిహద్దుల్లో మొలిపించాలి'.. కాస్త ఎమోషనల్‌గా అన్నాడు... చప్పట్లతో ఆ సమావేశం ముగిసింది.
పేపర్ చూశావా..
హా.. జూశ్నా
పాపం కదా సందర్శకుల వల్ల జూలో సింహాలకు కరోనా వచ్చింది..
హా అవునంట
నీకేం అనిపించింది
అదో వార్త అనిపించింది
చల్.. నీతో షేర్ చేసుకోవటం వేస్ట్..
హే.. కూల్ కూల్ ఏందో జెప్పు
మన వల్ల ఈ అడవి జంతువులు, పక్షులూ ఎఫెక్ట్ అయ్యే రిస్కుంది.. ఇప్పటికే దళంలో దాదాపు వంద మందికి కరోనా లక్షణాలున్నారు.. మన సంచారం వల్ల, వాడుతున్న ఈ సెలయేర్ల నీళ్ల వల్ల, గాలి వల్ల, పారేస్తున్న మాస్కుల వల్ల, నాప్ కిన్స్ వల్లనో అవి రిస్క్‌లో పడటం న్యాయమా.. అడవి మనకు ఆశ్రయమిచ్చింది.. దాన్ని పచ్చగా ఉంచుదాం ఎడారి కానీయొద్దు..
'స్లోగన్ సంస్కతి లోపించటం వల్ల మన ఉద్యమమే కాదు వామపక్ష భావజాల వ్యాప్తికి అవరోధం అవుతోంది కామ్రేడ్ దీన్ని మనం పునరుజ్జీవింపచేయాలి.. తద్వార ఉద్యమాన్ని బలోపేతం చేద్దాం.. ఈసారి అమరుల వారోత్సవాల్లో వాల్ రైటింగ్స్కు ప్రాధాన్యతివ్వాలని సెంట్రల్ కమిటీ నిర్ణయించింది.. డెబ్బరు, ఎనభరు దశకాల్లో అప్పటి ఉడుకు రక్తాలను ఉక్కు నరాలను ఉర్రూతలూగించిన ఆ బుల్లెట్ లైన్స్ తో పాటు ప్రస్తుత అభ్యుదయ కవుల చైతన్య ప్రభోధవాక్యాలను సేకరించి వీధి గోడలకు ప్రాణం పోద్దాం'.. అని ప్రసంగించాక పిడికిలి బిగిస్తూ 'ఇంక్విలాబ్ జిందాబాద్' అంటూ గట్టిగా నినదించే యత్నం చేశాడు.. అకస్మాత్తుగా దగ్గు సాంబన్నను ఉక్కిరిబిక్కిరి చేసింది.. కాసేపు దగ్గి నినాదాన్ని మళ్లీ ఎత్తుకునే ప్రయత్నంలోనూ విఫలమయ్యాడు అంతే దగ్గుతుండటంతో మంచినీళ్ల బాటిల్ అందించాడు రామన్న..
జూం మీటింగ్ నిర్వహిస్తున్నాడు ఎస్పీ.. 'గుడ్ మార్నింగ్ డియర్ ప్రెస్ పీపుల్స్.. ఇది కోవిడ్ పాండమిక్ సిట్యుయేషన్ కనుక ప్రెస్‌మీట్ ఇలా వర్చ్యువల్‌గా ఏర్పాటు చేయాల్సొచ్చింది'.. అని అంటున్నాడు జర్నలిస్ట్‌లు వాళ్ల ఇళ్లు, ఆఫీసుల్లో ఎస్పీ చెప్పేది రాసుకోటానికి సిద్ధంగా ఉన్నారు..
సీపీ ప్రెస్ మీట్ పెట్టిండంట..
హా నేనుగూడ జూస్తన్న వాట్స్ ఆప్‌ల.. జన జీవన స్రవంతి ఎజెండా మరోసారి తెరమీదకు తెచ్చిండు..
కరోనాకు బలవుదామా, పోలీసులకు లొంగిపోదామా..
ఇది మనిద్దరిదే కాదు..
హా.. మన వాళ్లందరి తరుపున అడుగుతున్నా..
కొందరు రికవరీ అవుతున్నరు గదా..
హా అది వాళ్ల ఇమ్యూనిటీ పవర్‌ను బట్టి..
ఈసారి మీటింగ్‌ల చర్చకు బెడదంలే..
ఈలోగా మనకు అప్పగించిన పనులు పూర్తిచేద్దాం...
దండకారణ్యంలో అమరుల వారోత్సవాల సన్నాహక సమావేశం జరుగుతోంది.. 'అమరుల వారోత్సవాలను ఘనంగా జరపాలి కామ్రేడ్స్.. ఉద్యమ వీరుల నెత్తుటి త్యాగాలను గుండెలకు హత్తుకోవాలి.. మన ఉనికి చాటే విధంగా యాక్షన్ జరపాలి.. ఎప్పుడూ వాళ్ల యాక్షన్‌కు మన రియాక్షన్ అవుతోంది కానీ ఈసారి మనదే పైచేయి కావాలి'.. అని ఆవేశంగా ప్రసంగిస్తున్నాడు సాంబన్న..
దండకారణ్యంలో కొండవాగు జలపాతం, పచ్చగడ్డి మోపు లెక్క కిందకు దూకుతాంది... వాళ్ళిద్దరు దానికి కుడి ఎడమలుగా నిలుసున్నారు ఆరోజు ఆలివ్ గ్రీన్లోకాక క్యాజువల్స్లోఉన్నరు.. ..
'రెక్కీడ్యూటీకి బోతన్న, నిన్ను మల్లెప్పుడోజూసుడూ'
'గిది కూంబింగ్ టైం వర్గశతవు అలికెడెక్కువున్నది జాగర్త'
'మనకు ప్రాణమ్మీద ప్రేముంటదా'
'ప్రేమ కోసమైనా ప్రాణముండాలిగా'..
'నువ్వూ నీ అసైన్ మెంట్ కి బోవాలెగదా'...
'హా.. ఇప్పుడిక్కడికెల్లి మనపాదాలు కదిలితే ఇగ నువ్వోదిక్కు నేనోదిక్కు'
'మళ్లెప్పుడో కలుసుడు'
'కలుసుడు కలిసుండుడు ఉద్యమకారుల భాషలో కొట్టివేసిన పదాలు' ..
'హా కలిసుండుడుకంటె విడిపోవుడే ఎక్కువగద.. ఇగ రేపటికెల్లి నేనంటె నీభుజాన కిట్ బ్యాగును ఇప్పటిసంది నువ్వంటె నాశేతుల్ల ఎస్ఎల్ఆర్'
గా కొండవాగును మధ్యకు చీల్చి రెండు చేశినట్టు.. గామరుక్షణం యువ మావోయిస్టులు సరళ, క్రాంతి చెరోదిక్కుకు కదిలిన్లు..
'అన్న నేనుబోయొస్త' అని అంటూనే తుమ్మింది సరళ.. 'జాగర్త శెల్లె'.. అన్నడు సాంబన్న టెంటు ముంగట సెంట్రీ డ్యూటీలో ఉన్న రామన్న 'ఏం గాదన్న గావందూళ్లల్ల మన ఇన్ ఫార్మర్లున్నరు' అన్నది సరళ.. 'జాగర్తగా శతవు గురించి కాదమ్మ'.. అన్నడు సాంబన్న తుపాకి భుజం మార్చుకుంటూ.. అలా.. ఎందుకన్నాడో సరళకు అర్థమయ్యింది.. అక్కడి నుంచి వెళ్తుండగా.. 'శెల్లె' అని పిలిశిండు రామన్న.. ఎందుకో అన్నట్టు ఆమె వెనక్కు తిరిగింది... 'అచ్చినంక మీపెండ్లి ముచ్చెట మాట్లాదుదమన్నడు సాంబన్న'.. అనంగనే ఆమె సిగ్గుపడింది..
సరళ వాల్ రైటింగ్స్ రాస్తూ రాయిస్తూ ఆ నినాదాలు చదివి మైమరుస్తోంది... ఒకరోజు అడ్విల నడుస్తాంది సరళ ఆమె పక్కనే ఒక కార్యకర్త సైకిల్‌కు పెయింటు డబ్బలు గట్టుకొని నడుస్తున్నడు.. ఇంతల ఆమెకు జెరం దగిల్నట్టు అనిపించెటాలికె బ్యాగులోకెల్లి నల్ల రగ్గు దీశి కప్పుకుంది.. అది సూసి వాల్ రైటప్ రాస్తున్న కామ్రేడొకరు 'అక్కా ఏమయ్యిందీ అని అక్కడి నుంచే ఆందోళణగా అడిగితే.. 'జెరింత ఒల్లెచ్చ బడ్డట్టుంది'.. అనంగనే 'డాక్టర్ దగ్గరికి బోదమా' అని అడుగుతంటె 'వద్దులే గనీ గీ మందులు దెచ్చియ్యి అంటూ తెల్ల కాగితం మీద ఏదో రాశిచ్చింది..'
సిటీలో.. యాక్షన్ చేబోయే ప్రాంతాన్ని బైనాక్యులర్‌తో పరిశీలిస్తున్నడు క్రాంతి మరికొందరు దళ సభ్యులు మారు వేషాల్లో ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నరు....
ఊళ్ళల్లో తెల్లగోడపై వాల్ రైటింగ్ ముమ్మరంగా నడుస్తోంది... అందులో భాగంగా ఆ నినాదం పక్కనే సుత్తి కొడవలి చిహ్నం అచ్చు వేస్తున్నాడొక వ్యక్తి.. ఆ చిహ్నాన్ని చూడగానే సరళకు క్రాంతి గుర్తొచ్చాడు... ఆరోజు విడిపోయేటప్పుడు... తన భుజం సంచిలో నుంచి ఆ చిహ్నాన్ని బయటకు తీసి ఇచ్చాడు.. తను దాన్ని చేతుల్లోకి తీసుకొని ప్రేమగా చూసిన క్షణం గుర్తొచ్చింది..
తార్రోడ్డు పక్కన కిలోమీటర్ రాయిపై కూర్చోనున్నడు క్రాంతి.. అతని సహచరులు ఇతర పనుల్లో నిమగమై ఉన్నారు.. తన జేబులో నుంచి ఎర్రగుడ్డ బయటకు తీశిండు క్రాంతి.. దాని పైకెత్తి పరిశీలనగా చూస్తంటె... 'ఇగో ఇది కట్టుకో' అన్నదామె.. 'ఏందిది అంటూనే ఓ.. మాస్కా' అన్నడు.. 'హా.. నా చీర చింపి తయార్జేశా'.. అంటుంటె.. మన యాంబ్లం సుత ఉన్నదిగా అన్నడు క్రాంతి ఆశ్చర్యంగా. 'అది నేనేకుట్టిన' అన్నదామె.. క్రాంతి ఆమె ఆలోచనల్లో నుంచి బయటకస్తూ మాస్కు నోటికి కట్టుకున్నడు..
'క్రాంతి సమాచారం పంపిండన్నా రెక్కీ ఓకే అంట ఇక నువ్వు ఆదేశిస్తే యాక్షన్‌కు దిగటమే' అని అన్నడు టెంట్ దగ్గరకొచ్చిన రామన్న.. సాంబన్న దగ్గు వినపడకపోగా సమాధానం రాకపోవటంతో లోనికి తొంగిచూశాడు.. నిర్జీవంగా పడున్న సాంబన్నను చూసి పెద్దగా కేకపెడుతూ కుప్పకూలి పోయాడు.. యాక్షన్ ఆదేశం కోసం సిటీ శివార్లలో ఎదురు చూస్తున్న క్రాంతికి ఉన్నట్టుండి ఒక్కసారిగా శ్వాస ఆడటంలేదు... కిలోమీటర్ రాయి మీద నుంచి లేవబోతుండగా అతని ఊపిరాగింది..
'అరెస్టుల భయంతో మీరు అడవి దాటి ఆసుపత్రులకెళ్ళటం లేదు..అలానేఉంటే.. మావో వచ్చి మంత్రమేయడు, ఇప్పుడు కరోనా సూపర్ పోలీస్, కోవిడ్ 19 గ్రేహాండ్ డాగ్ మీరు బతకాలంటే ఇక మీ అలియాస్‌లను చంపక తప్పదు' ..డీజీపీ అన్నలకు పత్రికా ప్రకటన విడుదల చేశాడు..
లేత సూర్యకాంతి అప్పుడే ఆవరిస్తోంది... పాఠశాల ఆవరణలో నేలమీద పడుకుంది సరళ ఆమెదురు ఇంటి గోడ మీద నినాదం రాసుంది అది రాస్తుండగా చూస్తూ నిద్ర పోయుంటుంది ఇప్పుడైతే ఆమెలో చలనం లేదు, నిర్జీవంగా మారి చాలసేపే అయ్యింది... సూర్యుడు పైకి లేచాడు ఎండ మరింత పెరిగింది.. గోడమీద పెట్టిన యాంబ్లం నీడ సుత్తి కొడవలి చిహ్నంగా సరళ మొకం మీదపడుతోంది ఆమెకు అంతిమ నివాళిగా..
- శ్రీనివాస్ సూఫీ, 9346611455