Sun 29 Aug 05:34:24.293323 2021
Authorization
ఒక ఉదయం రోడ్డు ఓ పక్క నిలబడి ఒకానొక సాహస కృత్యం మీద పందెం వేసుకున్నారు ఇద్దరు కుర్రవాళ్లు. గుడి ఆవరణలో ఉన్న మాధవీ లత పూవుల్ని తెంపుకు రావడం ఆ సాహస కృత్యం. ఇద్దరిలో ఒకడు తను ఆ పని చెయ్యగల నన్నాడు. వినడానికి ఇది పెద్ద విషయం అనిపించక పోవచ్చు కాని నిజంగా ఇది ఒక సాహస కృత్యమే అవుతుందని చెప్పడానికి కొంత వివరణ అవసరం.
స్వర్గస్తుడైన మాధవ చంద్ర తర్క వాచస్పతి భార్య జయ కాళీదేవి.. కృష్ణ దేవాలయానికి ఆమే ఇప్పుడు ధర్మకర్త. గ్రామంలో ఉపాధ్యాయ వృత్తి చేస్తూ గ్రామస్తుల చేత ఉపన్యాసాలు యివ్వడంలో సిద్ధహస్తుడైనందు వల్ల తర్క వాచస్పతి అనిపించుకున్న మాధవ చంద్ర తన భార్య చేత మాత్రం ఆ బిరుదుకు అర్హుడనని అనిపించుకోలేక పోయాడు. వాదించడంలో ఆమెకు ఆయనకంటే ఎక్కువ ప్రతిభ ఉన్నది మరి. అయితే ఆమె ఎక్కువగా మాట్లాడే మనిషేం కాదు. ఎంత పెద్ద వాదనకయినా ఆమె ఒకటి రెండు మాటల్లోనో లేక అసలు నోరే విప్పకుండానో అడ్డుకట్ట వెయ్యగలదు.
జయకాళి పొడగరి. ధృడమైన దేహం కొనదేలిన ముక్కు అన్నింటికీ మించి చురుకైన బుద్ధి కలిగి ఉన్న మనిషి. సరైన వ్యవహర్త కాకపోవడంతో గుడి ఆస్తి దాదాపు హరించుకుపోతున్న సమయంలో మాధవచంద్ర స్వర్గస్తుడైనాడు. భర్తను కోల్పోయిన జయకాళి గుడికి సంబంధించిన వ్యవహారాలను చక్కదిద్దింది. ఎన్నో ఏళ్ళ నుంచి రావలసిన బకాయిలను పైసా కూడా వదలకుండా వసూలు చేసింది.
ఈ మహిళకు పురుష లక్షణాలు చాలానే ఉండడం వల్ల మహిళా స్నేహితులు లేరు. సాటి మహిళలు ఆమెను చూస్తే భయపడే వారు. ఇతరుల గురించి తప్పుడు మాటలు చెప్పడం, అనవసరంగా కన్నీళ్ళు పెట్టుకోవడం ఆమెకు గిట్టేదికాదు. మగ మహారాజులకు కూడా ఆమె అంటే భయమే. మగవాళ్ళ బద్ధకాన్ని, చేతకాని తనాన్ని కేవలం తన కంటి చూపుతో కాల్చి బూడిద చేసేసేది. ఏ మగవాడైనా తప్పు చేశాడని ఆమె మనసు చెప్తే చాలు అటువంటి మగవాడిని ఒకే ఒక్క మాటతో, లేదా అసలేం మాట్లాడకుండా భావ ప్రకటనతో చీల్చి చెందాడేది. గ్రామానికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ ఆధిపత్యం చలాయించేది.
జయకాళి రోగులకు సేవ చేయడంలో దిట్ట, కానీ రోగుల ఆమెకు భయపడ్డట్టు మరణానికి భయపడే వారు కాదు. ఎవరైనా చికిత్సకు సంబంధించిన ఆహార నియమాలను ఉల్లంఘిస్తే జ్వర తీవ్రతకంటే ఆమె ఆగ్రహం అధిక ఉష్ణోగ్రత కలిగి ఉండేది. ఆమె కచ్చితమైన తత్వం కారణంగా ఎవరూ ఆమెను అభిమానించే వారు కాదు గానీ ఎదిరించే ధైర్యం కూడా చేసే వారు కాదు. గ్రామంలో ప్రతి మనిషీ ఆమెకు తెలిసిన వాడే అయినా ఆమె ఒంటరితనాన్నే అనుభవించేది.
జయకాళికి సంతానం లేదు. అనాథలైన ఇద్దరు మేనల్లుళ్ళను పెంచి పోషిస్తున్నది. మగవాని అజమాయిషీ లేకపోవడం వల్ల అత్త గుడ్డి ప్రేమ కారణంగా వారు క్రమశిక్షణగా ఉండరు అనుకోవడానికి వీలులేదు. ఆ ఇద్దరిలో పెద్దవాడికి పెళ్ళీడు వచ్చింది. పద్దెనిమిదేళ్ళ వాడికి పెళ్ళి చేసి అచ్చటా ముచ్చటా చూడాలని ఆమెకు లేదు. పెళ్ళి చేస్తే తన మేనల్లుడు పనీ పాటా లేకుండా ఇంట్లో కూచుని భార్య గారాబంగా చేసి పెట్టే తిండి తిని లావెక్కి పోతాడని ఆమె అభిప్రాయం. అందువల్ల నలిన్ సంపాదించడం మొదలు పెట్టాకే పెళ్ళి చేయాలని నిర్ణయించుకుంది.
జయకాళికి ఉన్న ఆస్తుల్లో అన్నింటి కంటే విలువైనది కృష్ణుని ఆలయం. దేవుడికి అభిషేకం, అలంకారం, నైదేద్య సమర్పణం వంటి విషయాలను ఆమె ఎప్పుడూ నిర్లక్ష్యం చెయ్యలేదు. గుడి పూజారులు ఇద్దరు దేవుడికి భయపడే వారు కాదు కానీ ఆమెను చూస్తే భయంతో వణికేవారు. గతంలో దేవుడికి అందాల్సిన ప్రసాదాలన్నీ, పని మనిషి నిస్తారిణి కారణంగా ఆయనకు పూర్తిగా అందేవి కాదు. నెయ్యి, పాలు, పెరుగు వెన్న స్వర్గానికీ, నరకానికీ సమానంగా పంచబడేవి. ఇప్పుడు జయకాళి ఉక్కు పరిపాలనలో ఆయనకు అందవలసిన ప్రసాదాలన్నీ సంపూర్ణంగా అందుతున్నవి. జయకాళి గుడి ఆవరణలను ఎంతో పరిశుభ్రంగా ఉండేట్టు చూసేది. ఎక్కడా ఒక్క గడ్డి పరక కూడా కనిపించేది కాదు. గట్టిగా వేయబడిన పందిరిని అల్లుకుని మాధవీలత ఉండేది. అది రాల్చిన ఎండుటాకుల్ని ఎప్పటికప్పుడు తీసివేయించేది. గుడి ఆవరణలో పవిత్రతకు ఏమాత్రం భంగం కలిగినా సహించేది కాదు. ఇది వరకు గుడి ఆవరణలో పిల్లలు దాగుడు మూతలు ఆడుకునేవారు. కొన్నిసార్లు మేక పిల్లలు లోపలికి వచ్చి కాళ్లు పైకెత్తి మాధవీలత ఆకుల్ని అందుకునేవి. ఇప్పుడు ఆ అవకాశం లేనే లేదు. ఉత్సవ సమయాల్లో తప్ప పిల్లలు గుడి ఆవరణలోకి రావడానికి వీలులేదు. ఆకలి తీర్చుకోవడం కోసం వచ్చే మేక పిల్లలు కర్ర దెబ్బలు తిని మేమే అని అరుస్తూ తల్లుల దగ్గరికి దౌడు తీసేవి.
పవిత్రత, పరిశుభ్రత, మర్యాద తెలియని వక్తులకు సమీప బంధువులైనా సరే గుడి ఆవరణలోకి ప్రవేశం ఉండేది కాదు. కోడి మాంసం తినే అలవాటు ఉన్న ఆమె బావ దైవ దర్శనానికి వస్తే ఆమె అతన్ని లోపలికి రానివ్వలేదు. ఈ విషయంలో ఆమె అక్కతో పెద్ద గొడవ పెట్టుకుంది. ఆమె దేవాలయం మీద చూపిస్తున్న శ్రద్ధ 'అతి'గానూ పిచ్చితనం గానూ అనిపించేది గ్రామస్తులకు.
ఇతర విషయాలలో ఎంతో కఠినంగా వ్యవహరించే జయకాళి దేవాలయం విషయంలో మాత్రం రాగద్వేషాలకు అతీతంగా తనను తాను సమర్పించుకునేది. ఎంతో హుందాగా, జాగ్రత్తగా, సున్నితంగా వినయంగా ఉండేది. గుళ్ళో ఉన్న రాతి విగ్రహం మాత్రమే ఆమె స్త్రీత్వాన్ని నిలబెట్టుతున్నది. అదే ఆమె భర్త, కొడుకు సర్వస్వం.
2
జయకాళి చేత జపమాలతో వరండాలో కూచుని గుళ్ళో ఉన్న దేవుని విగ్రహాన్ని మాతృత్వపు మమకారంతో తదేకంగా చూస్తున్నది. ఓ పిల్లవాడు వెనుక వైపు నుంచి వచ్చి మాధవీలత క్రింద నిలబడ్డాడు. క్రిందికి ఉన్న పూవులన్నీ పూజ కోసం తెంపి ఉండటం వల్ల జాగ్రత్తగా పందిరి ఎక్కి ఎత్తున ఉన్న కొమ్మకు ఉన్న మొగ్గల్ని తెంపడానికి కాళ్ళు పైకి ఎత్తి చేతులు ముందుకు చాచాడు. పందిరి మీద ఎక్కువ బరువు ఉండటం వల్ల అది పెద్ద శబ్దం చేస్తూ కుప్పకూలింది. కుర్రాడూ తీగా కల్సి నేల మీద పడ్డారు.
శబ్దం విన్న జయకాళి అక్కడికి పరుగున వచ్చి కుర్రావాణ్ణి జబ్బ పట్టుకుని పైకి లేపింది. కింద పడ్డం వల్ల దెబ్బ తగిలింది కాని అది వాడి తప్పుకు సజీవులు వేసిన శిక్ష కాదు గదా! అందువల్ల జయకాళి వాడికి తగిన శిక్ష విధించింది. దెబ్బల వర్షాన్ని వాడు నిశ్శబ్దంగా ఓర్చుకున్నాడు. కంటి నుంచి ఒక్క నీటి చుక్క రాల్చకుండా మేనత్త వాడ్ని గదిలో బంధించింది. ఆ మధ్యాహ్నం వాడికి తిండి పెట్టలేదు. ఆమెకు తిలియకుండా వాడికి తిండిపెట్టడానికి ఎవరూ సాహసించలేదు. పందిరిని బాగు చెయ్యడానికి మనుషుల్ని పిలిపించి మళ్ళీ జయకాళి జపమాలతో వరండాలో కూర్చుంది. కాస్సేపటికి పని మనిషి మోక్షద వచ్చి అమ్మా బాబు ఆకలితో ఏడుస్తున్నాడు. తాగడానికి పాలన్నా యివ్వనా అని అడిగింది. వద్దు అందామె కచ్చితమైన స్వరంతో. మోక్షద వెళ్ళిపోయింది. గదిలో నుంచి నలిక ఏడుపు, వెక్కిళ్ళు అత్త చెవిని పడుతూనే వున్నాయి.
కాస్సేపటికి అలసిపోయిన నలిన్ ఏడుపు శబ్దం ఆగిపోయింది. కానీ మరొక నిస్సహాయ జీవి అరుపులు గుడి ఎదురుగ్గా ఉన్న రోడ్డు మీది నుంచి వినపడసాగేయి. దాని అరుపులతో పాటు మనుషుల కేకలు పరుగెత్తే చప్పుడూ వినపడింది. హఠాత్తుగా గుడి ఆవరణలో అడుగుల శబ్దం వినిపించింది. జయకాళి తలఎత్తి చూసే సరికి ఒక ఆకారం మాధవీలత క్రింద కదులుతున్నట్టనిపించింది. 'నలిన్' అని అరిచిందామె కోపంగా. నలిన్ గదిలోంచి తప్పించుకుని బయటకు వచ్చాడనుకుంది. 'నలిన్' అని అరుస్తూ ఆమె తీగన సమీపించింది. ఒక కొమ్మను ఎత్తి పట్టుకుని నేల మీద దట్టంగా పడున్న ఆకుల మధ్య దాక్కుని ఉన్న ఓ మురికి ప్రాణి భయంభయంగా చూస్తుండటం గమనించింది. పరీక్షగా చూస్తే కనిపించింది ఓ పంది.
ఆవరణలో ఉన్న మాధవీలత బృందావనం లోని తీగ వంటిది. దాని పూల సువాసనలు గోపికల ఉచ్ఛాస నిశ్వాసలన తలపింపచేసేది. యమునా తీరంలో అద్భుతమైన రాసలీలలు స్వప్నాలను తలపింపచేసేవి. పరిపూర్ణమైన భక్తితో జయకాళి ఆ ప్రదేశపు పవిత్రతను కాపాడుతూ వస్తున్నది. ఇప్పుడు ఈ సంఘటనతో అది అపవిత్రమైపోయింది. పూజారి ఒకడు పందిని తరిమేయడానికి కర్ర తీసుకుని వచ్చాడు. జయకాళి దాన్ని ఏమీ అనవద్దని పూజారిని వారించి గుడి గేటుని మూసి వేయమన్నది.
కాస్సేపటికి తాగుబోతుల గుంపు ఒకటి గుడి గేటు ముందుకు వచ్చింది. వాళ్ళంతా తాము బలివ్వబోతున్న జంతువు గుడిలో ప్రవేశించిందని గోలగోలగా అరవసాగారు. గేటు లోపల ఉన్న జయకాళి.
'ఇక్కడేమీ లేదు. తాగుబోతులు గుడి ముందు నిలబడటానికి వీల్లేదు వెళ్ళిపోండి.. దేవాలయాన్ని అపవిత్రం చెయ్యకండి' అని అరిచింది.
గుంపు చెల్లాచెదరయింది. వాళ్ళలో కొందరు పంది గుడిలోపలికి వెళ్ళడం కళ్ళారా చూసి ఉన్నారు. అయినా జయకాళి తన పవిత్రమైన కృష్ణుడి ఆలయంలోకి ఒక మురికి క్షుద్రప్రాణికి ఆశ్రయం ఇవ్వనే యివ్వదని వారు గట్టిగా నమ్మారు.
జంతు బలి అనే సామాజిక దురాచారాన్ని సమర్థించే అల్పస్థాయి దేవుళ్ళకు మాత్రం ఈ సంఘటన ఆగ్రహం తెప్పించి ఉండవచ్చు కానీ ఏదో ఒకనాడు మరణం అనేది తప్పని జీవులందరికీ దేవుడైన వాడు ఈ అద్భుతమైన విచిత్రమైన సంఘటనకు ఎంతో ఆనందపడ్డాడు.
- చింతపట్ల సుదర్శన్, 9299809212