Sun 12 Sep 06:09:25.889476 2021
Authorization
ఒక ఊరిలో ఒక యువకుడు ఉండేవాడు. వాడు చానా అందగాడు. తెలివైనవాడు. కానీ పెద్ద సోమరిపోతు. వాని జేబులో ఎప్పుడూ ఒక అద్దం ఉండేది. తన అందాన్ని తానే అద్దంలో పదేపదే చూసుకుంటూ తెగ మురిసి పోయేటోడు. గంటకు పదిసార్లు మొహం కడిగితే ఇరవై సార్లు తల దువ్వుకునేవాడు. కానీ ఇంటిలో ఒక్క పని గూడా చేసేటోడు కాదు. చూసీ చూసీ వాళ్ళ నాయనకు పీకల్దాకా కోపం వచ్చింది. ''తల్లిదండ్రులు ముసిలోళ్ళు అవుతున్నా ఎటువంటి సాయం చేయక, వాళ్ళ మీదనే పడి తిని తిరిగే నీలాంటి ఎదవలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే'' అంటూ ఇంట్లోంచి బైటకు తరిమేశాడు.
వాడు ఆ ఊర్లో ఎవరికీ మొహం చూపించలేక పక్కనే వున్న ఇంకో ఊరికి బైలుదేరాడు. మధ్యలో పెద్ద అడవి ఉంది. సగం దూరం పోగానే ఒక పెద్ద మర్రిచెట్టు కనబడింది. అప్పటికే నడిచీ నడిచీ కాళ్ళు బాగా పీకుతా వున్నాయి. దాంతో కాసేపు విశ్రాంతి తీసుకుందామని చెట్టు కింద కూలబడ్డాడు.
వీడు ఏ చెట్టు కిందయితే కూలబడ్డాడో సరిగ్గా ఆ చెట్టు మీదనే వేయి సంవత్సరాల నుంచీ ఒక బ్రహ్మరాక్షసుడు నివసిస్తా ఉన్నాడు. వాడు అడవిలో ఒంటరిగా అటువైపు వచ్చేటోళ్ళని, పోయేటోళ్ళని పట్టుకొని కమ్మగా తినేస్తా వున్నాడు. దాంతో ఆ బ్రహ్మరాక్షసుని గురించి తెలిసిపోయి చుట్టుపక్కల ఊర్ల జనాలు అటువైపు రావడమే మానేశారు. దాంతో వానికి చాలాకాలం నుంచీ జంతువులు, పక్షులు, కాయగూరలే తప్ప మనిషి మాంసం కరువైంది.
ఈ యువకుడు ఆ చెట్టు కింద కూలబడ్డం ఆలస్యం కమ్మని వాసన ఆ బ్రహ్మరాక్షసుని ముక్కు పుటాలకు తగిలింది. ''ఆహా... ఎన్నాళ్ళకెన్నాళ్ళకు ఒక మనిషి దొరికాడు. అదీగాక బాగా కొవ్వు పట్టి పందెంకోడి లెక్క నిగనిగ లాడుతా వున్నాడు. ఈ రోజు పండగే పండగ'' అనుకుంటూ ఎగిరి వాని ముందు దూకి సంబరంగా నాట్యం చేయసాగాడు. ఆ యువకు నికి రాక్షసున్ని చూడగానే పై ప్రాణాలు పైన్నే పోయాయి. పారిపోవడానికి అటూఇటూ చూశాడు. కానీ వాని కన్ను తన మీదనే ఉంది. అడుగు పక్కకు వేస్తే చావడం ఖాయం.
సరే ఏమైతే అదే అయిందను కొని భయం కొంచం కూడా మొహంలో కనబడనీయకుండా పకపక నవ్వుతా ఆ రాక్షసునితో పాటు తాను గూడా ఎగిరి నాట్యం చేయడం మొదలు పెట్టాడు. అది చూసి ఆ బ్రహ్మరాక్షసునికి ఏమీ అర్థం కాలేదు.
''ఎవడు వీడు. నన్ను చూస్తే చాలు సగానికి సగం మంది అక్కడికక్కడే గుండె ఆగి చస్తే, మిగతా సగం మంది కాపాడమంటూ కాళ్ళు పట్టుకుంటారు. కానీ వీడేంది ఇలా సంబరంగా చిరునవ్వుతో చిందులు తొక్కుతా వున్నాడు. వీడు అందరిలా మామూలు మనిషేనా... కాదా...'' అని అనుమాన పడుతా నాట్యం ఆపేసి... ''ఎవర్నువ్... నా ముందే ఇంత ధైర్యంగా తైతక్కలాడుతా ఉన్నావు'' అని అడిగాడు.
దానికి వాడు పెద్దగా నవ్వుతా ''నా గురించి తెలీదా... ఈ చుట్టుపక్కల అరవయ్యారు ఊర్లలో నా అంత పెద్ద మంత్రగాడు ఎవడూ ఉండడు. మా రాజుకు ఒక నయం కాని వింత వ్యాధి వచ్చింది. వందమంది బ్రహ్మరాక్షసులను పట్టుకొని వాళ్ళ రక్తంతో స్నానం చేసి, వాళ్ళ గుండెకాయలతో కూర చేయించుకొని తింటే తప్ప అది తగ్గదని రాజవైద్యులు చెప్పారు. దాంతో ఎవరైతే వందమంది బ్రహ్మరాక్షసులను పట్టుకొస్తారో వాళ్ళకు ఏడుబండ్ల బంగారం ఇస్తానని రాజ్యమంతా దండోరా వేయించాడు. ఇప్పటికే నాకు తొంభైతొమ్మిదిమంది చిక్కారు. వాళ్ళ ఆత్మలన్నీ ఇంటిలో బంధించి వచ్చా. ఇప్పుడు నువ్వు నూరోవానివి. ఇదిగో నా మంత్రశక్తితో నీ ఆత్మ కూడా పట్టేస్తున్నా'' అంటూ గట్టిగా ''ఓం... హ్రీం... భం భం చుక చుకా... వీని ఆత్మను పట్టుకో గబగబా'' అంటూ జేబులోంచి అద్దం తీసి వాని ముందు పెట్టాడు. ఆ బ్రహ్మరాక్షసుడు అద్దంలోకి చూసి అదిరిపడ్డాడు. అందులో వానికి తన మొహం కనిపించింది. వానికి అద్దం గురించి అస్సలు తెలీదు. దాంతో ఆ మంత్రగాడు తన ఆత్మను పట్టుకొని తన దగ్గరున్న వస్తువులో బంధించి వేశాడనుకొని బెదిరిపోయాడు.
దాంతో గజగజా వణికిపోతా వాని కాళ్ళ మీద పడి ''అయ్యా... నీ మంత్రశక్తి తెలియక నీ మీదకు వచ్చాను. దయచేసి నన్ను వదిలిపెట్టు. ఇకపై ఈ అడవిలోనే కాదు చుట్టుపక్కల అరవయ్యారు ఊర్లలో ఎక్కడా కనిపించను. నన్ను గనుక దయతో వదిలేస్తే ఏడుబండ్ల బంగారం ఏమి ఖర్మ ఏకంగా డెబ్భైఏడుబండ్ల బంగారం నీ చేతిలో పెడతా'' అన్నాడు.
దానికి వాడు కాసేపు ఆలోచించినట్లు నటిస్తా ''నువ్వు చెప్పేది నేనెట్లా నమ్మడం. నిజంగా నీ దగ్గర అంత బంగారం ఉందో లేదో నాకెట్లా తెలుస్తుంది'' అన్నాడు.
దానికి ఆ బ్రహ్మరాక్షసుడు ''అయ్యా... నాకు ఆకలైతే మనుషులను తింటాను గానీ వాళ్ళ వంటి మీద బంగారం తినను గదా... అలా ఈ వెయ్యేళ్ళ నుంచీ నాకు చిక్కిన మనుషులను తిని వాళ్ళ వంటి మీది బంగారాన్నంతా ఈ చెట్టు కింద ఉన్న పెద్ద పుట్టలో వేస్తా వున్నా... అదంతా తీసుకొని నన్ను వదిలెయ్యి'' అంటూ చెట్టు కింద వున్న పుట్టను తవ్వి చూపించాడు. అంత బంగారం చూసి వాని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దగయ్యాయి. ''పదితరాలు పనీపాటా చేయకుండా కాలు మీద కాలేసుకొని కమ్మగా తిన్నా తరగనంత సంపద'' అని సంబరపడ్డాడు.
కానీ దాన్ని పైకి కనిపియ్యకుండా ''సరే... నీకున్న శక్తులతో ఈ బంగారాన్నంతా మా ఇంటికి చేర్చి, నేను చెప్పిన పనులు చెప్పినట్టు నోరు తెరవకుండా గమ్మున చెరు. ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా, వినయంగా మసలుకుంటే వదిలేస్తా... లేదంటే జీవితాంతం ఇందులోనే బంధిస్తా ... ఏం సరేనా'' అంటూ అద్దాన్ని జేబులో వేసుకున్నాడు. బ్రహ్మరాక్షసుడు ''అలాగే'' నంటూ ఆ బంగారాన్నంతా గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రి వాళ్ళ ఇంటికి తరలించేశాడు.
ఆ యువకునికి ఊరి బైట ఒక పెద్ద పాడుబడిన పొలముంది. కానీ దాని నిండా రాళ్ళు, పెద్ద పెద్ద గుళ్ళు, పిచ్చిమొక్కలు వున్నాయి. అది ఎందుకూ పనికిరాదు. ఆ యువకుడు ఆ బ్రహ్మరాక్షసునితో ''పో... పోయి... నా చేనంతా శుభ్రంగా రాళ్ళు, గుండ్లు, పిచ్చిమొక్కలు తీసేసి, బాగా దున్ని, నీళ్ళు పడేలా పెద్దబావి తవ్వి రాపో... నిన్ను వదిలేస్తా'' అన్నాడు.
బ్రహ్మరాక్షసుడు సరే అని ఊరి బైటికి పోయి ఆ చేను బాగు చేసే పనిలో పడ్డాడు. ఎర్రటి ఎండలో చెమటలు కారిపోయేలా పని చేస్తా వున్న వాన్ని ఇంకో బ్రహ్మరాక్షసుడు చూశాడు. ''ఏందిరా ఇది. నా జన్మలో బ్రహ్మరాక్షసులు ఇట్లా పొలంలో బుద్ధిగా మనిషి లెక్క పని చేయడం నేనెక్కడా చూళ్ళేదు. ఏమైంది. ఎందుకిట్లా గసబెడతా మండుటెండలో కష్టపడి పని చేస్తా వున్నావు'' అన్నాడు. ఆ మాటలకు ఆ బ్రహ్మరాక్షసుడు ''ఏం చెప్పమంటావన్నా నా బాధ... పోయి పోయి ఒక మంత్రగాని చేతిలో చిక్కి గిలగిలా కొట్టుకుంటా వున్నా'' అంటూ జరిగిందంతా చెప్పాడు.
ఆ మాటలకు రెండో బ్రహ్మరాక్షసుడు ''అదేంది మన పేరు వింటే చాలు గుండె పగిలి అక్కడికక్కడే చచ్చే మనిషి మనల్నే జుట్టు పట్టుకొని ఆటాడించడమా. వాడెంత... వాని బతుకెంత... నాకు వాని ఇండ్లు చూపియ్యి. లోపలికి పోయి కరకర నమిలి మింగేస్తా'' అన్నాడు. ఆ మాటలకు వాడు ''పని మధ్యలో ఆపేసి వస్తే ఆ మంత్రగాడు మరలా నన్నెప్పటికీ వదలడు. నీకు దూరం నుండే ఇల్లు చూపిస్తా. నువ్వు పోయిరా'' అన్నాడు. రెండో బ్రహ్మరాక్షసుడు అలాగే అని వాని ఇండ్లు ఎక్కడుందో కనుక్కొని ఒక్కడే బైలుదేరాడు.
ఆ యువకునికి లెక్కలేనంత బంగారం దొరికింది గదా... దాంతో వాళ్ళింట్లో సంబరం సంబరం గాదు. వాళ్ళమ్మ ఆ రోజు చేపలకూర చేద్దామని ఒక పెద్దచేప కొనుక్కొచ్చి వంటింట్లో పెట్టింది. కానీ అప్పుడే ఒక దొంగపిల్లి కిటికీలోంచి దూరి ఆ చేపను పట్టుకొని మెరుపులా మాయమైంది. అది చూసి ఆమెకు పిచ్చి కోపం వచ్చింది.
''ఈ దొంగపిల్లి వంటింట్లో దూరి రోజుకొకటి ఎత్తుకుపోతా వుంది. ఎట్లాగైనా సరే ఇంకొకసారి అది ఈ ఇంటి చుట్టుపక్కలకు గూడా రాకుండా బుద్ధి చెప్పాల'' అనుకొని ఒక మాంసం ముక్క తీసుకొని పిల్లికి కనబడేలా కిటికీకి ముందు కట్టి, మాంచి పదునైన పెద్దకత్తి తీసుకొని కిటికీ వెనుక దాచిపెట్టుకొని ఎదురు చూడసాగింది. అదే సమయానికి ఆ రెండో బ్రహ్మరాక్షసుడు ఆ ఇంటి దగ్గరికి వచ్చాడు. ''ఇంట్లో ఎవరెవరున్నారు, ఏమేమి చేస్తా వున్నారో'' గమనిద్దామని అడుగులో అడుగు వేసుకుంటా కిటికీ దగ్గరికి వచ్చాడు. ఒక పిల్లిలా మారి కిటికీ ఊచల గుండా నెమ్మదిగా లోపలికి తల దూర్చాడు.
ఎప్పుడైతే వాడట్లా తల దూర్చాడో మరుక్షణం వాళ్ళమ్మ ''దొరికిందిరా దొంగపిల్లి'' అనుకుంటా సంబరంగా బలమంతా ఉపయోగించి కత్తి తీసుకొని దాని మూతి మీద ఒక్కటి వేసింది. అంతే... దెబ్బకు వాని ముక్కు తెగి అవతల ఎగిరి పడింది. దాంతో... ఆ నొప్పికి బ్రహ్మ రాక్షసుడు విలవిలలాడుతా ''ఓరి నాయనోరు... వీడు మామూలు మంత్రగాడు కాదురోరు... నేను వచ్చింది పసిగట్టినట్టు న్నాడు. ఇంగొక్క క్షణం ఇక్కడుంటే ముక్కే కాదు ఏకంగా తలనే నరికేటట్టు న్నాడు''అని లబలబలాడు కుంటా పరుగు తీశాడు. మొదటి బ్రహ్మ రాక్షసుడు ''ఆగు... ఆగు...'' అని అరుస్తా వున్నా వెనక్కి తిరిగి చూడకుండా మాయ మయ్యాడు. అది చూసి మొదటి బ్రహ్మరాక్షసుడు భయంతో మరింత వణికిపోయాడు. ఆలస్యమైతే ఏం చేస్తాడో ఏమో అనుకుని ఒక్కక్షణం గూడా ఆగకుండా చేనంతా శుభ్రం చేసి, చక్కగా దున్ని, బావి తవ్వి, నీళ్ళతో అంతా తడిపాడు.
వణుక్కుంటా ఆ యువకుని దగ్గరికి వచ్చి వినయంగా చేతులు కట్టుకొని ''అయ్యా... నువ్వు చెప్పినట్లే అన్ని పనులూ చేశా... దయచేసి నన్ను వదిలెయ్యి. ఎవరి కంటికీ కనిపించనంత దూరం వెళ్లిపోతా'' అన్నాడు.
దానికా యువకుడు ''సరే... ఈ ఒక్కసారికి నిన్ను క్షమిస్తున్నా... మరలా ఈ చుట్టుపక్కల ఎక్కడ కనబన్నా నా మంత్రశక్తితో పట్టి శాశ్వతంగా భూమిలో పాతి పెడ్తా. జాగ్రత్త'' అంటూ జేబులోంచి అద్దం తీశాడు.
బ్రహ్మరాక్షసుడు ఆ అద్దంలో కనబడుతున్న తన మొహం చూస్తా గజగజా వణుకుతా అట్లాగే నిలబడ్డాడు. అప్పుడా యువకుడు ''భంభం చుకచుకా... బైటికిరా గబగబా...'' అంటూ ఆ అద్దం చుట్టూ మూడుసార్లు చేయి తిప్పి చటుక్కున దాన్ని వెనక్కి తిప్పి చూపించాడు. దాంతో ఆ బ్రహ్మరాక్షసునికి ఈ సారి అందులో తన మొహం కనబడలేదు. అప్పుడు వాడు హమ్మయ్య అనుకుంటా ఆనందంగా ఆ యువకునికి నమస్కారం చేసి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు.
- డా.ఎం.హరికిషన్, 9441032212