పాలకేంద్రానికి పాలు తెస్తూ జున్ను తీసుకొని ఇంట్లోకొచ్చాడు బీంరాజు, ఇద్దరం తింటూ మంచంలో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఇంతలో బీంరాజుతండ్రి వచ్చి అదేంట్రా పటేల్ పక్కన కూర్చున్నావ్, కొంచెం దూరంగా కూర్చో అంటూ పాల కాన్ తీసుకొని కేంద్రానికి వెళ్లిపోయాడు. బీంరాజు పడుతున్న ఇబ్బంది అర్థమయి మాట మార్చుతూ కబుర్లు చెప్పడం మెదలెట్టాను. బీంరాజు వెళ్లాక అన్పించింది, ఒక్క జీవితానికే ఈ వివక్షని అందులో సామాజిక వెలి లేని ఆర్థిక పరమైన వివక్షనే నేను తట్టుకోలేకపోయాను. ఇంకా అంతర్గతంగా వారిని వెంటాడుతున్న ఈ సామాజిక వెలిని వాళ్ల పూర్వీకులు ఎంత దారుణంగా అనుభవించారో.... సృష్టిలో ఏ జంతువు అనుభవించని క్షోభ కదా అది.
రోజులు వేగంగా గడుస్తున్నాయి, చల్లటి చలిగాలులకి ఆరింటికే నట్టనడిరాత్రి చీకట్లు కమ్ముకుంటున్నాయి, అలా తెల్లారిందో లేదో ఇలా రాత్రి ముంచుకొస్తున్నట్టుగా అన్పిస్తుంది, అన్ని సవ్యంగా ఉన్నవారికి ఇది అద్భుతంగా అన్పించవచ్చు.
కానీ ఇంత వేగంగా నడుస్తున్న కాలంలోనూ నా జీవితం మాత్రం భారంగా గడుస్తూ ఉంది, రేపటిని తలుచుకుంటూనే బెంగ పట్టుకుంటుంది, అలవాటుగా ఇంట్లో నాన్న ఏమైనా తీసుకొస్తాడని ఎదురు చూస్తున్న పిల్లలకి గత నెల రోజులుగా మొఖం కన్పించకుండా వాళ్ళు పడుకున్నాక ఇంటికి వెళ్తున్నాను, ఏం తెచ్చావ్ నాన్నా అనే వాళ్ల ప్రశ్నకి సమాధానం చెప్పలేక...
హైదరాబాద్ వచ్చిన పదిహేనేళ్ల తర్వాత కూడా నేనేం సాధించాను అనే ప్రశ్నని నాకు నేనే వేసుకోలేకపోవడం నా చేతగాని తనమా
లేక నన్నిలాగే ఉంచిన ఈ వ్యవస్థ లోపమా అనేది అర్థం కావట్లేదు.
ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదూ.... నా పేరు మహిపాల్ రెడ్డి మాది మానేరు నదీ పక్కనే ఉన్న అందమైన గ్రామం ఆవునూరు, సిరిసిల్లకి కూత వేటు దూరంలో చక్కని పాడిపంటలతో నిర్మల మైన మనుషులున్న గ్రామం.
స్కైలాబ్ పడ్డాక రెండేళ్లకి పుట్టానంట నేను, భూమ్మీద మనుషులెవరూ బతకరనుకొని స్కైలాబ్ పడడానికి ముందే అందినకాడికి వండుకు తిన్నారంట అప్పట్లో... ఆ గండం దాటి పుట్టాను కాబట్టి మల్లీ పాత రోజుల్లోలా మహిలో రెడ్డి రాజ్యాన్ని స్థాపించాలనే ఆశతో మహిపాల్ రెడ్డి అని పేరు పెట్టాడంట మా పెద్ధ తాత నాకు.
వాళ్ల ఇల్లు మా ఇంటి పక్కనే ఉండేది మాతాతలు నాతో కలిసి బతికిన కాలం కొంచెమే అయినా పెద తాత ఇంట్లో కర్ణాలు, మునసబులు, గ్రామ పెద్దలు అంతా ఆయన పక్కనే కూర్చొని దర్జా ఒలకబోస్తుంటే...
తాత చెప్పేది శ్రద్ధగా వినే పాలేగాల్లు దూరంగా చేతులు కట్టుకొని గుమ్మం భయటే ఎందుకు కూర్చున్నారనేది అంతగా అర్థం కాకపోయేది.
ఇంట్లో రెండు గ్లాసులు, ఆచారాలు, మడికట్లు చాతుర్వర్ణ వ్యవస్థని నిక్కచ్చిగా పాటించే ఆయన జీవనం తెలిసీ తెలియని వయసులో అంతగా అర్థమయ్యేది కాదు.
రెండు మూడేళ్లు వచ్చాక మా ఇంటికి రెండు వాడల ఆవతల ముదిరాజులు, యాదవుల ఇండ్లుండేటివి అక్కడి పిల్లలు మేము కలిసి మా ఊరి పెద్ద చెరువు వరకీ వెళ్లి కోతి కొమ్మచ్చి, తొక్కుడు బిల్లా, సిర్ర గోనే ఆటలు ఆడుకునేటోల్లం ఇలా ఆడుకునేటప్పుడు ఒకరింట్లలోకి ఒకరం ఆడుతూ పాడుతూ గెంతుతూ పరుగెత్తే వాళ్లం.
వాళ్ళిండ్లకి వెళ్లినప్పుడు పటేలు ఇంటికొచ్చిండు అంటూ గౌరవంగా చూసేవాళ్లు, అదే వాళ్లు మా ఇంటికి వచ్చినప్పుడు పెద్దింట్లో వరకీ వచ్చినా వంటింట్లోకి మాత్రం వచ్చేవారు కాదు, అదే మా పెద్ధ తాత గుమ్మంలోకి కూడా పొరపాటున వచ్చేవారు కాదు.
అప్పుడప్పుడు మా పెద్ద తాత అంత దూరం పోయి ఎందుకు ఆడుతున్నావ్, ఇక్కడే మనవాళ్ళతోనే ఆడుకో అని తిడుతుంటే అర్థమయ్యేది కాదు, దూరం పోతే అజాగ్రత్తగా ఉంటామని అంటున్నాడేమో అని అనుకునేటోన్ని.
ఆ కాలంలోనే మా ఊర్లో పదో తరగతి దాక బడుండేది, అట్లనే మా ఇంటిదగ్గరే నాలుగోతరగతి వరకూ రంగాచారి బడుండేది, ఆరో ఏట నేను బడికి పోవుడు, మా తాతలిద్దరూ ఒకరి తర్వాత ఒకరు కాలం చేసుడూ ఒకేసారి జరిగిపోయాయి.
అలా ఆటపాటల స్థానంలోకి కొంచెం చదువు వచ్చి చేరింది, కాలం గడుస్తున్నా కొద్ది మా ఇంట్లోకి సైతం నా స్నేహితులు వడివడిగా వచ్చేవారు, అయితే పండగలప్పుడు, నోములప్పుడు మాత్రం వంటిట్లోకి రాకపోయేవారు.
తర్వాత్తర్వాత పెద్దబడికి మారింది మా చదువు, అక్కడికి ఊర్లోని అందరు పిల్లలూ చదువుకోవడానికి వచ్చేవారు. మా ఊరికి దూరంగా మూలపల్లిలో మాదిగ కులానికి చెందిన వారు ఎక్కువగా ఉండేవారు. పెద్దబడిని ఆనుకొని మాలవాడ ఉండేది అక్కడినుండి మా పెద్దబడికి పిల్లలు చదువుకోవడానికి వచ్చేవారు, ఇంకా చుట్టుపక్కల ఊర్లకి మా ఊరే సెంటర్‌గా ఉండడంతో లచ్చపేట, కట్కూరు, పదిరల నుండి పిల్లలంతా వచ్చి చదువుకునేటోల్లు.
అందరికీ ఒకే రకం యూనిఫామ్‌తో సీతాకోకచిలుకల వనంలా ఉండేది మా స్కూలు. ఏ రోజు ఎట్లున్నా... జెండా మందిరం రోజు మాత్రం అందరం కొత్త బట్టలతో ఒక కొమ్మకు పూచిన పూవుల్లా ఉండేవాళ్లం.
ఈ లోగా మా బాబాయిలు, అత్తలు ఎవరి కాపురం వాల్లు పెట్టడంతో ఒకే ఊర్లో ఉన్నా ఎవల ఇంట్లో వాళ్లు ఎవల పొలాలు వాల్లవీ అన్నట్టుగా సాగుతుండేది జీవితం.
పదోతరగతికి వచ్చేసరికి మాతాత ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి ఇంటి పరిస్థితుల్లో తేడాలు స్పష్టంగా తెలుస్తున్నాయి, వర్షాలు సరిగ్గాలేక, పంటలు సరిగ్గా పండక, వ్యవసాయం తప్ప మరే ఉపాది లేక, అడ్డగోలు బోర్లు, అడ్డమైన దళారీలు ఇలా మోతుబరి కుటుంబం కాస్తా ఓ మోస్తరు కుటుంబానికి దిగజారింది.
కొంచెం పలుకుబడి కల్గిన ఆసాములు మాత్రం అప్పుడప్పుడే మెదలైన యాంత్రీకరణని వాడుకొని, ఆర్థిక సరళీకరణలో అవకాశాలని అందిపుచ్చుకుంటూ ఆర్థికంగా మరింత ఉన్నతి సాధించి రాజకీయం అనే కొత్త పాత్రలోకి మారిపోయారు.
ఈ పదేళ్లలో చాలా మార్పులు వచ్చాయి, నరిగాడు, భీంరాజుగాడు, రాజిరెడ్డిగాడు, దొరోల్ల లక్ష్మణ్ అనే తేడాలైతే తొలిగిపోయాయి.
మా ఇంట్లో అందరం కలిసి సరదాగా చదువుకొనేటోళ్లం. మాల వాడల్లో.. మాదిగ పల్లేల్లో పెద్ద తేడాలైతే ఏం రాలేదు, చిన్నప్పుడు నేను ఎట్లాగైతే చూసానో ఇంచుమించు అలాగే ఉంది.
అయితే చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న కొందరి గుడిసెల స్థానంలో కొన్ని దాబాలు, తారురోడ్లు, కొంత మంది ప్రభుత్వ సాయంతో పొలాలు కొనుక్కొని వ్యవసాయం చేస్తున్నా ఇంకా ఎనభై శాతం మాత్రం అలాగే ఉండిపోయారు.
నేను చదువులో మరీ మెరిట్ స్టుడెంట్ కాకపోయిన డల్ స్టూడెంట్‌ని మాత్రం కాదు, నిజానికి ఆ కాలంలో పదోతరగతి పాసవడమే కొంచెం గొప్ప అన్న పరిస్థితులని మా స్కూలు అదిగమించింది, ఇంచుమించు ఒకరిద్దరు మినహా మేమంతా పదోతరగతి పాసయ్యాము.
నాకు మాత్రం డాక్టర్ చదవాలని తెగ ఆరాటంగా ఉండేది, ఎందుకంటే మా ఇంటిపక్కనే అయ్యగారు మందులిస్తూ చాలా మంది రోగాల్ని నయం చేసేవాడు. నేను కూడా అలా చేయాలి అనుకునేవాన్ని, అందుకే సిరిసిల్ల కాలేజిలో బైపీసీకి అప్లై చేశా, నా ఫ్రెండు నరిగాడు కూడా బైపీసీకే అప్లై చేశాడు.
అయితే ఇద్దరి మార్కులు సమానమే అయినా వాడికి సీటొచ్చి నాకు రాలేదు, ఎందుకు అనే ప్రశ్నకి నాకొచ్చిన సమాధానం అతను బ్యాక్వార్డ్ క్లాస్ నువ్వు ఫార్వర్డ్ కాస్ట్ అందుకే రాలేదు అని,
దీంట్లోని సామాజిక న్యాయాన్ని అర్థం చేసుకునేంత వయసు కాదు, నాకున్న పరిజ్ఞానం అందుకు అప్పుడు సరిపోదు. కానీ తొలిసారిగా ఇన్నేళ్లు నా సహోదరులు ఎదుర్కొన్న వివక్షత ఎలా ఉంటుందో నా మనసుకి అర్థమయింది, అప్పుడప్పుడే ఏర్పడిన ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో చదివించే స్థోమత నుండీ నా కుటుంబం దిగజారిపోయింది. రోజులు గడిచిపోయాయి.
ఇలా ఉన్నత విద్యాబ్యాసం సాగిన ఏడేళ్లు నా ఆలోచనా పరిది విసృతమవుతున్న కొద్ది తరానికి సంబవించే మార్పులు, ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో నెలల్లో సంబవిస్తున్నా.... నాడు నా పూర్వీకులు చూపిన వివక్షత ఇంకా మమ్మల్ని వెంటాడటం మానలేదన్పిస్తుంది.
దీనికి తోడు ఈ ఏడేళ్లలో వ్యవసాయం సరిగ్గా సాగక అప్పుల ఊబిలో కూరుకుపోయా ఇంట్లో చెళ్లెల్ల పెండ్లీల్లు చేసి నా కుటుంబం ఉన్నదంతా అమ్మి అప్పుల్ని తీర్చుకొని, అప్పటివరకూ దర్జాగా బతికిన అదే ఊరిలో కూలీ పనులకి వెళ్లలేక నాతో పాటు హైదరాబాద్ వచ్చి స్థిరపడడం ఒకేసారి జరగడం యాదృచ్ఛికమో విధి ఆడిన వింత నాటకమో అర్థం కాదు .
కన్స్ట్రక్షన్ కంపెనీలో సూపర్ వైజర్‌గా నాన్న, ప్రైవేట్ మీడియాలో ఉద్యోగిగా నేను, సాప్ట్ వేర్ కంపెనీలో మా తమ్ముడు ఒకేసారి ఈ మహానగరంలోని మాయాబజార్లోకి అడుగుపెట్టడం జరిగిపోయింది.
అన్యాయం చేసైనా.. అబద్ధం ఆడైనా.. బాగుపడే సగటు రాజకీయ తత్వంలేని మామూలు మనుషులం... పొట్లాడైనా.... పోటీపడైనా.... సాధించేంత చేవ లేనోళ్లం, సర్దుకుపోయి బతకడమే తెలిసిన సామాన్య మానవులం మేం. ఇలాగే మమ్మల్ని వదిలేస్తే... ఇంకో వందేళ్లకి మైనార్టీగా మిగిలే మాకోసం చట్టాల్ని సవరించినా ఇదో చక్ర భ్రమణమే కానీ ఉపయోగం శూన్యం.
భారత రాజ్యంగ మౌళిక సూత్రానికి విరుద్ధంగా జరుగుతున్న ఈ తంతుని ప్రశ్నించడానికి ముందుకు రాని సమాజాన్ని, తమ అవకాశాలు మెరుగుపరుచుకోవడానికి నటిస్తున్న రాజకీయ వ్యవస్థని, మౌళికమైన ఈ సూక్ష్మాన్ని పసిగట్టలేని న్యాయ వ్యవస్థని నేనేం అడగను.
ఎందుకంటే... ప్రైవేటు ఉద్యోగమంటేనే భద్రత లేనిదనే సమాజంలో బతుకుతూ నెల రోజుల క్రితం ఉద్యోగంలోంచి తీసేసిన యాజమాన్యాన్నే ప్రశ్నించలేని మిడియా రంగం నాది.
అవకాశాలు మరింత సంక్లిష్టమయ్యాయి, ముప్పైవేల జీతానికి ఒక్కణ్నే ఎందుకు ముగ్గురు అందుబాటులో ఉన్నప్పుడు అనే వ్యాపార సూత్రాన్ని యాజమాన్యాలు పాటిస్తున్నప్పుడు ఎవర్ని మాత్రం ఏమనగలం. ఇక రిజర్వేషన్లన్నీ ఎండమావులవడం కళ్ళ ముందే జరిగిపోతున్నాయి.
ఇదంతా కాదు, అసలు రేపటి భవిష్యత్తుపై భయంతో బతకడం ఎంత దుర్భరమో అవగాహనకొస్తుంది. అయితే అప్పుడు నాతో పాటు చదువుకోని అయిలయ్య ఇంకా అదే ఊర్లో అదే కూలీ చేసుకుంటూ బతుకుతున్నాడు,
రిజర్వేషన్ ఇచ్చిన అస్త్రాన్ని వాడుకొన్న వర్గాలే తిరిగివాడు కోవడం తప్ప మిగతా వాళ్ళందరు?
పదేళ్లలో ఈ వివక్షతలని దూరం చేయాలన్న మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలని నెరవేర్చలేని నేతలు 2020 జనవరితో ముగియాల్సిన రిజర్వేషన్లని మరో పదేళ్లు పొడిగిస్తూ చట్టం చేశారనే వార్తే చివరగా నేనందించిన వార్త.
అంతకుముందే అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ల వార్త చూసినప్పుడు ఎంత నవ్వొచ్చిందో ఇదీ అలాగే అన్పించింది.
ఇంత జరిగీ 21వ శతాభ్దంలో కృత్రిమ మేధ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నా నేటికి అవసరమైన చట్టాల్ని సమగ్రంగా రూపొందించలేకపోవడం కొంచెం వింతగానే ఉంది, కొండ నాలికకి మందేస్తే ఉన్న నాలిక ఊడిందన్నట్టుగా ఉంది పరిస్థితి. ఈ గందరగోళానికి పనిలేకపోవడం కూడా తోడవడంతో నిరంతరం అవే ఆలోచనలు.
ఇంతలో సంక్రాంతి పండగ రావడంతో ఊరెళ్లాను, కొంచెం ప్రశాంతంగా అనిపించింది. రేపటి గురించిన చింత లేకుండా హాయిగా అన్పించింది, బీంరాజు ఊళ్ళోకెళ్లగానే ఎదురయి, ఎప్పుడ్రా రావడం సాయంత్రం జున్ను తెస్తాను తింటూ కబుర్లు చెప్పుకుందాం అన్నాడు. సరేరా అంటూ ఇంట్లోకి వెళ్లాను, చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడుతుంటే బతుకుమీద కొంచెం ప్రేమ కలిగింది, నాకోసం నా అనేవాళ్లు ఉన్నారనే ధైర్యం కలిగింది. పట్నం వెళ్లాక ఎలాగైనా బతకగలననే ధైర్యాన్ని ఇచ్చింది మా ఊరు.
పాలకేంద్రానికి పాలు తెస్తూ జున్ను తీసుకొని ఇంట్లోకొచ్చాడు బీంరాజు, ఇద్దరం తింటూ మంచంలో కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఇంతలో బీంరాజు తండ్రి వచ్చి అదేంట్రా పటేల్ పక్కన కూర్చున్నావ్, కొంచెం దూరంగా కూర్చో అంటూ పాల కాన్ తీసుకొని కేంద్రానికి వెళ్లిపోయాడు. బీంరాజు పడుతున్న ఇబ్బంది అర్థమయి మాట మార్చుతూ కబుర్లు చెప్పడం మెదలెట్టాను. బీంరాజు వెళ్లాక అన్పించింది, ఒక్క జీవితానికే ఈ వివక్షని అందులో సామాజిక వెలి లేని ఆర్థిక పరమైన వివక్షనే నేను తట్టుకోలేకపోయాను. ఇంకా అంతర్గతంగా వారిని వెంటాడుతున్న ఈ సామాజిక వెలిని వాళ్ల పూర్వీకులు ఎంత దారుణంగా అనుభవించారో.... సృష్టిలో ఏ జంతువు అనుభవించని క్షోభ కదా అది.
-గంగాడి సుధీర్, 9394486053
Sun 19 Dec 03:35:19.543507 2021