''ఏమాలోచిస్తున్నావు బేగం? ఆఫీస్‌కి వెళ్ళే ఉద్దేశం లేదా?'' అని షమీ అడగడంతో ఆలోచనల్లోంచి బైట పడి అతని వైపు చూశాను. అప్పటికే అతను తయారై, నాకోసం కూచుని ఉన్నాడు. మా ఇద్దరి ఆఫీసులు పక్కపక్కనే కావడంతో, రోజూ ఇద్దరం కలిసే వెళ్తాం. నేను లేచి గబగబా రెడీ కాసాగాను. అదే సమయంలో హాల్లో కూచుని ఉన్న షమీ వాళ్ళ నాన్న నోటినుంచి పదునైన కత్తుల్లా మాటలు రావడం మొదలయ్యాయి. 'కట్నం ఇవ్వడానికి శక్తి లేనపుడు ఆడపిల్లల్ని కనడం ఎందుకు? నా కొడుకులాంటి అమాయకుల్ని బలి చేయడానికేగా. సిగ్గూశరం లేని మనుషులు..' అంటున్నాడు. నేను షమీ వైపు తిరిగి చూశాను. 'శాంతం' అంటూ కళ్ళతోనే సైగ చేశాడు. కట్నాలిచ్చే సాంప్రదాయానికి మా అమ్మానాన్నే కాదు, నేను కూడా బద్ధ వ్యతిరేకినే.
నా భర్త మంచివాడే. వాళ్ళ నాన్నతోనే సమస్యంతా. అతన్ని మామగారనో, ససుర్జీ అనో గౌరవించడానికి మనసొప్పదు. నాకు మా నాన్నంటే చాలా ఇష్టం.. ఇష్టమేనా? ప్రాణం.. చెల్లి అమ్మకూచి ఐతే నేను చిన్నప్పటి నుంచి నాన్నకూచినే. మా మామకు నేను కట్నం తీసుకురాలేదని గుర్తొచ్చినపుడల్లా నోటికొచ్చినట్లు తిడ్తుంటాడు. నా దురదృష్టం కొద్దీ అతనికా విషయం రోజూ గుర్తుకొస్తూనే ఉంటుంది. నన్ను తిట్టినా పర్వాలేదు. భరిస్తాను. కానీ అతను మా నాన్నను తిడ్తుంటాడే.. అప్పుడొస్తుంది కోపం..
మధ్యలో నాన్నేం చేశాడు? పాపం నాన్న. ఎంత మంచివాడో. ఆయన్ది వెన్నలాంటి మెత్తటి మనసు. ఎవ్వర్నీ నొప్పించి ఎరుగడు. ఎవరితోనూ పరుషంగా మాట్లాడి ఎరుగడు. అటువంటి వ్యక్తి నా వల్ల తిట్లు తినాల్సి వస్తుందే అని బాధపడని రోజు లేదు. నా మనసుకైన గాయాల్నిమోసుకుంటూ రాత్రి పడగ్గదిలోకి వెళ్ళగానే షమీ తన ప్రేమనంతా రంగరించి వాటిమీద మృదువుగా మాటల నవనీతం రాస్తాడు. అప్పటి వరకూ గుండెల్లో దాచుకున్న కోపం, బాధా మెల్లగా కరిగిపోతాయి. రోజూ ఇదే తంతు..
'ప్లీజ్ నా కోసం.. మా నాన్న ఏమన్నా మనసులో పెట్టుకోకు. పది లక్షల కట్నం ఇస్తామని వచ్చిన సంబంధం కాదని, ఆయనకు ఎదురు తిరిగి నిన్ను పెళ్ళి చేసుకున్నా కదా. ఆ కోపంలో ఏదేదో అంటాడు. పెద్ద వయసు కదా. పట్టించుకోకు' అంటాడు షమీ.
పెద్ద వయసుంటే సరిపోయిందా? పెద్ద మనసుండొద్దూ. నేనూ షమీ ప్రేమించి కదా పెళ్ళి చేసుకున్నాం. ప్రేమ వివాహాల్లో కట్నాల ప్రసక్తి ఉంటుందా ఎక్కడైనా? ఐనా ముస్లింల పెళిళ్ళలో కట్నాలుండవుగా. ఇస్లాం ప్రకారం నిఖా సమయంలో అబ్బాయే కదా అమ్మాయికి మెహర్ ఇవ్వాలి. రెండుసార్లు హజ్‌కి వెళ్ళొచ్చిన మా మామకు ఆ మాత్రం తెలియదా? తెలుసు.. కానీ డబ్బు యావ.. మిగతా విషయాల్లో మతాను సారం నడుచుకున్నా డబ్బు దగ్గర కొచ్చేటప్పటికి మనిషి ఎన్ని సవరణలైనా చేసుకుంటాడేమో..
నాకు షమీ ఇంజనీరింగ్‌లో క్లాస్మేట్. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నపుడు సంతోషంగా ఒప్పుకోడానికి కారణం అతని మంచితనం.. షమీ చాలా మృదుభాషి. సహృదయుడు.. సంస్కార వంతుడు.. మా నాన్నలానే. అందుకేనేమో నేనూ అతని వైపుకి ఆకర్షించబడ్డాను. మొదటే షమీకి మా అమ్మా నాన్నల మతాంతర వివాహం గురించి చెప్పాను. నాన్న ముస్లిం, అమ్మ హిందు. వాళ్ళిద్దరూ ప్రేమించుకుని, పెద్దల్ని ఎదిరించి పెళ్ళి చేసుకున్నారు.
విన్న వెంటనే షమీ కంగారు పడినా కొద్దిసేపటి తర్వాత స్థిమితపడి, 'పర్వా లేదు. మా అమ్మానాన్నల్ని ఎలాగోలా మన పెళ్ళికి ఒప్పించగలను. అదృష్టం ఏమిటంటే మీ వాళ్ళు నీకు ఏ హిందూ పేరో పెట్టకుండా ఆయేషా అని పెట్టడం' అన్నాడు.
'మా చెల్లి పేరు ఆముక్త' సంకోచి స్తూనే చెప్పాను.
'అదేమిటి?' భృకుటి ముడి వేస్తూ అడిగాడు.
'అదంతా మా అమ్మ ఆలోచన. ఇద్దరికీ హిందూ పేర్లు పెడితే యింట్లో అంతా తన పెత్తనం అనుకుంటారని నాకు ముస్లిం పేరు, చెల్లికి హిందూ పేరు పెట్టింది' అంటూ నవ్వాను.
షమీ కొన్నిక్షణాలు ఆలోచించాక, 'పోన్లే.. నాన్నగారు నమాజ్ చేస్తారుగా' అని అడిగాడు.
చేయరని చెప్పాను. 'ఆయన కమ్యూ నిష్టు భావజాలంతో పెరిగిన వ్యక్తి. కుల రహిత మతరహిత సమాజాన్ని స్వప్నిస్తూ కవితలు రాసేవారు. ఆయన మసీదు కళ్ళడం మేమెప్పుడూ చూళ్ళేదు' అన్నాను.
'ఐతే మన పెళ్ళి జరగడం కష్టమే. మా నాన్న నమాజీ.. ససేమిరా ఒప్పు కోడు' అన్నాడు.
'మరేం చేద్దాం?' భయపడుతూ అడిగాను. షమీ నవ్వి 'అందర్నీ ఎదిరించి పెళ్ళి చేసుకోవడమే' అన్నాడు.
మొదట యింట్లో చెప్పి చూశాడు. 'ప్రాణం పోయినా ఈ పెళ్ళికి ఒప్పుకోను' అన్నాడు వాళ్ళ నాన్న. షమీ యింట్లోంచి బైటికొచ్చేసి, మా అమ్మానాన్నల అను మతితో నన్ను నిఖా చేసుకున్నాడు. మా అత్త తనకు తన కొడుకూ కోడలు కావాలని ఏడ్చి, పట్టుబట్టడంతో రాజీకొచ్చి షమీ వాళ్ళ నాన్న మమ్మల్ని యింట్లోకి రానిచ్చాడు.
''ఏమాలోచిస్తున్నావు బేగం? ఆఫీస్‌కి వెళ్ళే ఉద్దేశం లేదా?'' అని షమీ అడగడంతో ఆలోచనల్లోంచి బైట పడి అతని వైపు చూశాను. అప్పటికే అతను తయారై, నాకోసం కూచుని ఉన్నాడు. మా ఇద్దరి ఆఫీసులు పక్కపక్కనే కావడంతో, రోజూ ఇద్దరం కలిసే వెళ్తాం. నేను లేచి గబగబా రెడీ కాసాగాను. అదే సమయంలో హాల్లో కూచుని ఉన్న షమీ వాళ్ళ నాన్న నోటినుంచి పదునైన కత్తుల్లా మాటలు రావడం మొదలయ్యాయి.
''కట్నం ఇవ్వడానికి శక్తి లేనపుడు ఆడపిల్లల్ని కనడం ఎందుకు? నా కొడుకులాంటి అమాయకుల్ని బలి చేయడానికేగా. సిగ్గూశరం లేని మనుషులు..'' అంటున్నాడు.
నేను షమీ వైపు తిరిగి చూశాను. 'శాంతం' అంటూ కళ్ళతోనే సైగ చేశాడు. కట్నాలిచ్చే సాంప్రదాయానికి మా అమ్మానాన్నే కాదు, నేను కూడా బద్ధ వ్యతిరేకినే.
''మసీదుకెళ్ళడు. నమాజ్ చేయడు. ముస్లిం పేరు పెట్టు కున్నంత మాత్రాన సరిపోయిందా? వాడసలు ముసల్మాన్కే పుట్టాడా?'' అని విన్పించింది. నాకు చాలా కోపం వచ్చింది. షమీ నా వైపు చూస్తూ ''ప్లీజ్.. కోప్పడకు'' అన్నాడు బతిమాలుతున్న ధోరణిలో.
''రేపీ పెద్ద మనిషి చచ్చిపోతే, పూడుస్తారా? కాలుస్తారా?'' అన్నాడు మళ్ళా. నేను కోపం పట్టలేక విసురుగా లేచి, హాల్లోకి వెళ్ళబోయాను. షమీ అడ్డుపడి, నా చేతులు రెండూ పట్టుకుని, ''నా కోసం చాలా భరించావు. ప్లీజ్ యింకొన్నాళ్ళు భరించు. మనం ఫ్లాట్ కొనుక్కుని, అందులోకి మారిపోయేవరకు.. నీకు తెల్సుగా నాకు గొడవలు, తగాదాలు ఇష్టముంఢవని'' అన్నాడు.
అతని స్కూటర్ వెనుక కూచుని ఆఫీస్ కెళ్తున్నంత సేపు నా మనసు నిండా షమీ వాళ్ళ నాన్న అన్న మాటలే ప్రతిధ్వనిస్తూ.. కలవర పరుస్తూ.. కోపం బాధగా, బాధ కన్నీరుగా రూపాంతరం చెందుతూ..
నాన్న చనిపోయాక ఏమౌతుంది? ఆ ఆలోచనకే భయమేసింది. ఐనా చావు ఎవరికెప్పుడు వస్తుందో ఏ రూపంలో వస్తుందో ఎవరు చెప్పగలరు? మనసు నిండా ఎన్ని ప్రశ్నలో.. జవాబు దొరకని ప్రశ్నలు..
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని తన కబంధ హస్తాల్లో బంధించి కరాళ నృత్యం చేయ సాగింది. లాక్డౌన్ ఎత్తేసి మూడు నెలలు గడిచి పోయాయి. రోజుకు కొన్ని వేల కొత్త కేసులు.. కొన్ని వందల మరణాలు.. ఆస్పత్రుల్లో బెడ్లు దొరకని దయనీయస్థితి..
నేనూ షమీ వర్క్ ఫ్రం హోం చేస్తున్నాం. షమీ వాళ్ళ నాన్నే ఎంత చెప్పినా వినకుండా బైటికెళ్ళి వస్తున్నాడు. యింట్లో ఉంటే పిచ్చెక్కినట్టు ఉంటోందట. ఏమీ తోచడం లేదట. 'బైట తిరగడం ప్రమాదం నాన్నా' అని షమీ ఎన్నిసార్లు హెచ్చరించినా 'నాకేం కాదులేరా. నాది ఉక్కులాంటి శరీరం. కరోనా కాదు కదా దాని బాబులాంటి వైరస్ కూడా నన్నేమీ చేయలేదు' అంటున్నాడు.
మేము భయపడినట్టే అతనికో రోజు గొంతు నొప్పితో పాటు జ్వరం పట్టుకుంది. 'ఇది మామూలు జ్వరమేలేరా.. రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుంది' అని అతను చెప్తున్నా వినకుండా షమీ ఆస్పత్రికి ఫోన్ చేశాడు. అతనికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించాము.
వారం రోజులు వైద్యం అందించినా అతని పరిస్థితి మెరుగు పడలేదు. దానికి తోడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో వెంటీలేటర్ అమర్చారు. ఆస్పత్రిలో చేర్చిన పన్నెండో రోజు అతను చనిపోయాడనీ, వచ్చి పార్ధివ దేహాన్ని తీసుకెళ్ళమని షమీకి కబురందింఛారు.
యిల్లు శోక సముద్రంలా మారిపోయింది. ఒక వైపు అత్త, మరో వైపు షమీ, యింకో వైపు నేను.. అతనెంతగా నన్ను హింస పెట్టినా స్వంత మామ కదా. మనసులో అతన్ని ఎన్ని సార్లు తిట్టుకున్నా అతని చావుని కోరుకునేంత దుర్మార్గురాల్ని కాదు కదా. మొన్నటి వరకూ మనతో కలిసి తిరుగాడిన వ్యక్తి హఠాత్తుగా చనిపోతే ఏడుపు రాక ఎలా ఉంటుంది?
'నేను ఆస్పత్రికెళ్ళి బాడీని తీసుకుని, అట్నుంచటే ఖబరస్తాన్కెళ్ళి అంతిమ సంస్కారాలు పూర్తి చేసి వస్తాను' అన్నాడు షమీ.
అంత దుఃఖంలో ఉన్న షమీని వొంటరిగా పంపడం ఇష్టం లేక 'నేను తోడొస్తాను' అన్నాను.
'ఆడవాళ్ళు శ్మశానం లోపలికి రావడానికి వీల్లేదుగా' అన్నాడు.
'ఈ సమయంలో స్నేహితుల్ని తోడు రమ్మన్నావాళ్ళకేమైనా అంటుకుంటుందేమోనని భయపడ్తారు షమీ. అందుకే నేనొస్తాను. శ్మశానం లోపలికి రాను. నువ్వు తిరిగొచ్చేవరకు గేట్ బయటే ఉంటాను' అన్నాను.
షమీ ట్యాక్సీ మాట్లాడాడు. మెడికల్ షాపుకెళ్ళి రెండు పీపీఈ కిట్లు కొనుక్కొచ్చాడు. ఇద్దరం పీపీఈ సూట్లు తొడుక్కుని ఆస్పత్రికెళ్ళాం. బాడీని ప్లాస్టిక్ బాడీబ్యాగ్లో ప్యాక్ చేసి, దానిపైన డిస్ఇన్ఫెక్టెంట్ చల్లి, పైన మరో తెల్లటి బట్టలో చుట్టి మా కప్పగించారు. అంబులెన్స్ మాట్లాడుకుని, బాడీని అందులో ఉంచి, ఖబరస్తాన్ వైపుకు ప్రయాణమైనాం.
ముస్లింల శ్మశాన వాటిక చేరుకున్నాక నేను గేట్ బైట కార్లోనే ఉండిపోయాను. అంబులెన్స్‌తో పాటు షమీ లోపలికెళ్ళాడు. ముందే ఫోన్ చేసి చెప్పి ఉన్నాం కాబట్టి లోపల గొయ్యి తవ్వి తయారుగా పెట్టి ఉంటారు. ఓ అరగంటలో ఖనన సంస్కారం పూర్తయిపోతుంది అనుకుంటున్నంతలో లోపలి నుంచి షమీ ఏడ్చుకుంటూ రావడం కన్పించింది. నేను కంగారు పడిపోతూ కారు దిగి, అతనికెదురెళ్ళి 'ఏమైంది షమీ' అని అడిగాను.
'అది మా నాన్న శవం కాదు. దాదాపు నలభై యేండ్ల వయసున్న హిందూ స్త్రీ శవం. నుదుట కుంకుం బొట్టుంది. మా నాన్న బాడీని ఏం చేశారో ఏమో? మనం తొందరగా ఆస్పత్రికెళ్ళి కనుక్కోవాలి. పద' అంటూ ఏడుస్తూనే కారెక్కాడు. మా వెనకే అంబులెన్స్‌లో ఆ హిందూ స్త్రీ శవం..
'నీకెలా తెలిసింది?' దార్లో అడిగాను.
'బాడీని అంబులెన్స్ సిబ్బంది సాయంతో సమాధిలోకి దింపేముంది చివరిసారిగా నాన్న మొహం చూడాలనిపించి వాళ్ళలో ఒకణ్ణి బతిమాలుకుని, వెయ్యి రూపాయలిస్తానని ఆశ పెట్టాను. బాడీబ్యాగ్కున్న జిప్ని తల వైపు కొద్దిగా తీసి చూపింఛాడు' అంటూ మళ్ళా వెక్కి వెక్కి ఏడ్వసాగాడు.
ఆస్పత్రిలో కనుక్కుంటే పొరపాటు జరిగిందనీ, షమీ వాళ్ళ నాన్న శవాన్ని హిందూస్త్రీ శవమనుకుని ఆమె కొడుకు శ్రీనివాస్‌కి అప్పగించినట్టు చేప్పారు. శ్రీనివాస్ అడ్రస్‌తో పాటు అతని ఫోన్ నంబర్ తీసుకున్నాం. ఆ ఫోన్‌కి ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచ్చడ్ ఆఫ్ అనే వస్తోంది. ఫోన్ వల్ల ప్రయోజనం లేదనుకుని అత్యంత వేగంగా అక్కడి హిందూ శ్మశాన వాటికను చేరుకున్నాం. అక్కడ గుమికూడి ఉన్న వాళ్ళలో శ్రీనివాస్ ఎవరో కనుక్కుని, 'మీ అమ్మగారి శవాన్ని పొరపాటున మాకప్పగించారు. మా నాన్నగారి బాడీని మీకిచ్చారు' అంటూ జరిగింది వివరించాడు షమీ.
'అయ్యో అలానా.. మరి మేము దహన సంస్కారాలు నిర్వహించిన శవం మీ నాన్నగారిదా?' అన్నాడతను.
'దహనం చేసేశారా?' షమీ హతాశుడౌతూ అడిగాడు.
'అంతా పూర్తయింది. అదుగో యింకా మండుతోన్న బొగ్గులు' అంటూ అటు వైపు చూపించి, 'ఏదీ మా అమ్మ శవం?' అంటూ 'అమ్మా' అని ఏడుస్తూ అతను అంబులెన్స్ వైపుకు పరుగెత్తాడు.
ఏం చేయాలో తెలీక, ఆ హిందూస్త్రీ శవాన్ని అతని కప్పగించి యింటికి తిరిగొచ్చాం. అత్తతో మాత్రం జరిగిన విషయాలేవీ చెప్పలేదు.
షమీ వాళ్ళ నాన్న పార్థివ దేహాన్ని ఖననం చేయకుండా దహనం చేశారని తెలిశాక ఎన్నో యేండ్లుగా నన్ను వేధిస్తోన్న కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరికినట్టయింది.
- సలీం, 7588630243
Sun 27 Feb 01:54:54.350365 2022