తక్కువ జనాభా గల్గిన చిన్న గ్రామపంచాయతీ గ్రామమది. పెద్ద నగరానికి దగ్గరగా ఉన్నప్పటికీ ఊరు ఊరంతా వ్యవసాయం చేస్తూ, కూలీ నాలీ పనుల మీదనే ఆధారపడడం వల్ల, సరైన అక్షరాస్యత లేకపోవడం వల్ల ప్రాపంచిక అవగాహనకు దూరంగా ఉంటూ ఎట్లాంటి అనారోగ్య సమస్య వచ్చినా మంత్రాలు, తంత్రాలు వంటి పాత కాలం నాటి మోటు వైద్యం పైనే ఆధారపడడం గ్రామస్తులందరికీ సాధార ణమై పోయింది. అయితే ఊరైనా లోకమైనా ముక్కున వేలేసుకునేటట్టు బతకా లంటే మంత్రాలు తంత్రాలే గట్టివని ఆండాలు బలంగా నమ్ముకుంటుంది. భర్త బుగ్గయ్య అప్పుడప్పుడూ అగ్గిలా విభేదించినా ఒక్కోసారి కరిగిపోతాడు. శివ ఎం.ఫార్మసీ చదివి ఆ గ్రామానికి దగ్గరగా ఉన్న కంపెనీలో ఫార్మాసిస్ట్‌గా పని చేస్తున్నాడు. దేశ కాలమాన పరిస్థితుల అప్డేట్ సమాచారం తెలుసుకుంటూ అనేక గ్రామాలను వెనక్కి నెడుతున్న అంధ విశ్వాసాలు, మూఢ నమ్మకాలను తీవ్రాతి తీవ్రంగా నిరసిస్తాడు. అందుకే ఆ ఇంట్లో శివకూ తల్లి తండ్రులకు ప్రతి రోజూ ఓ ప్రపంచ యుద్ధమే.
స్వాతి శివకంటే తెలివైన అమ్మాయి. ఎక్కువ చదివిస్తే కట్నం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని తొమ్మిదో తరగతిలోనే చదువు మాన్పించి పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు, కానీ పెద్ద చదువు చదువుకోని పెద్ద ఉద్యోగం సంపాదించి గొప్ప పేరు తెచ్చుకోవాలనుకున్న స్వాతి కలల సౌధం కళ్లెదురుగా కూలిపోతుంటే ఎవ్వరికేమీ చెప్పలేక అయిదేళ్ళుగా రోజుకింత మానసికంగా మరింత బలహీనమయ్యింది. ఇంటిపని, వంట పని, చెల్కపని, చేను పనితో పాటు అప్పుడప్పుడూ నాన్న చేసే ఉప్పరి కూలిపనికి, అన్నింటికీ సాయపడడం అలవాటు చేసుకుంది.
*************
రెండు రోజుల తరువాత పెళ్ళి చూపులకు కొత్త చుట్టాలు వచ్చి వెళ్ళారు. అబ్బాయి సెంట్రింగ్ కూలిపని చేస్తాడు. అమ్మాయి చాలా అందంగా ఉన్నదనీ, అబ్బాయికి బాగా నచ్చిందనీ, ఇచ్చి పుచ్చుకోవడాలు అటు ఇటైనా రెండు వారాల్లోనే ముహూర్తం పెట్టుకుందామని వర్తమానం పంపారు. కట్నం లేని సంబంధం కుదిరిందని తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. తన అభిప్రాయం కూడా తీసుకోకుండా తల్లిదండ్రులు తొందర పెడుతుంటే వాళ్ళను నోరుండీ మూగమనిషిలా ఎదిరించలేని అమాయక స్వాతి గుండెల్లో మళ్ళీ ఏదో గుబులు, వీడని ఆందోళనకు తోడు శివ మనసు కూడా అసంతప్తి జ్వాలలపై ఊగిసలాడుతుంది. పెళ్ళి తనకిష్టం లేదని స్వాతి స్పష్టంగా చెప్పినా చివరకి ఇరవై రోజుల్లో బలవంతంగా ముహూర్తం పెట్టించారు తల్లి దండ్రులు. దగ్గరి బంధువులు కొందరొచ్చారు. కొన్ని పెళ్ళి పనులు మొదలు పెట్టారు. కానీ స్వాతి ఆ పెళ్ళి రోజుని తలుచుకొని తలచు కొని అతిగా ఆలోచిం చటం వల్ల తన ప్రవ ర్తనలో పెను మార్పులు సంభవిం చాయి. అరవటం, నవ్వటం నుండి ఎదురైన వాళ్ళ ను తీవ్రంగా భౌతిక దాడి చేసి గాయపరిచే వరకు గొడవలు తగ్గ లేదు. లాభం లేదని తల్లిదండ్రులు మళ్ళీ ఎంకవ్వ దగ్గరికి తీసు కెళ్ళారు. ఆమె రెండు రాత్రులు పరిశీలించి, గాలి సోకుడు పారి పోయిందనీ తరువాత రక్త పిశాచి పట్టుకుం దనీ అందుకే మాటి మాటికి బలం తగ్గి ఇట్లా చేస్తుందని చెప్పి చిన్న చిన్న ఖర్చులు పెట్టించి, ఏవేవో విన్యాసాలు చేసి, స్వాతికి తాత్కాలిక ఉప శమనం కోసం ఎడమ కాలికి నల్లదారం కట్టి తనకు తెలిసిన పెద్ద మంత్రగాడు ఉన్నాడని, చిన్న చిన్న గాలి సోకుడు నుంచి చేతబడిదాక ఇంటికి మొత్తం బందోబస్తు జేస్తడని డబ్బులు బాగానే తీసుకుంటాడని భయపడొద్దని సలహా చెప్తుంది.
ఎంకవ్వ చెప్పిన మాటలన్నీ విన్న శివకి కోపం, ఆవేశం పెరిగింది. అక్కడికక్కడే ఎంకవ్వతో వాదించాలనుకున్నా ఏమీ అనలేక ఇంటికి వచ్చిన తరువాత ''ఇంకా ఈ పిశాచులు, మంత్రాలు, దయ్యాలేంది నాయినా? మనం ఏ కాలంల ఉన్నామో మర్చిపోతున్రా?''
''ఏంరో ! లెస లెస జెప్పవడ్తివీ? తలకాయ దిరుగుతుందా నీకూ ?
''నేనున్నదే జెప్తున్నా, మంత్రగాడొద్దు ఏమొద్దు. సీటీల ఏదైనా హాస్పిటల్‌కి తీసుకెల్దాం. మంచి డాక్టర్‌కి సూపిద్దాం. స్వాతికి ఏం ప్రాబ్లెమ్ ఉందో తెలుస్తది. అప్పుడే బాగయితది.''
''ఆ పొద్దటి సందింతేరా ? మమ్మల్నేడ ముందల బడనిస్తవు నువ్వు ? మేం సవ్వ శేరంటే నువ్వద్ద శేరంటవు. ఊరోల్లందరొక్క తీర్గబోతే నువ్వేందిరా ! ఇంకో బాటంటవు? ఆ పట్నం బోతే ఊకెనే అయితదా? లచ్చల్లచ్చలు బోయ్యాలె,ఏడ దెస్తవురా?''
''ఇగో నాయినా ! చెల్లెకు నువ్వన్నట్లు లక్షలు పొసే రోగమేం లేదు. మీరే పుండొక దగ్గరుంటే మందొక దగ్గర రాసినట్లు, డాక్టర్ దగ్గరికి తీస్కపోదామంటే మంత్రగాల్ల సుట్టూ చెక్కర్లు కొట్టుకుంట అడ్డగోలిగ పైసలు పోస్తలేరా? మనకు నమ్మకం, విశ్వాసం ఉండాలి కానీ మీరూ? అపనమ్మకం, అంధవిశ్వాసంలోకి జారుతున్నరు. ఊరోల్ల లెక్క మీరూ గొర్రెల పోకడ పోతుంటే ఉన్నత విద్యావంతుడిగా నాకూ విచక్షణ ఉంది నాయినా? నా బాధ అర్ధం చేసుకోన్రి !''
ఈ వాదనంతా వింటున్న ఆండాలు ఆవేశంతో ''అరేరు శివా? గడియ తీర్క లేదు- గవ్వడామ్దాని లేదు నీకు! నువ్వెక్వ తక్వ వొర్లుడు బంజెయ్యి? దాని పెండ్లి వారం లేదు. ఇంకే దావకాన్లకు తీస్కబోతవయ్యా? ఎల్లుండి అమాసనాడు ఆ పెద్ద మంత్రగాన్ని తీస్క రమ్మని ఎంకవ్వకు జెప్పిన. కర్సుల కర్సయితమాయె పోరి కంటెక్కువనా? ఇంటికి మంత్రకా డొస్తుండని అందరికి జెప్పి టాం టాం జెయ్యకు?''
అంతా విన్న తరువాత అమ్మా నాన్నలతో వధా వాదన ఎందుకని, ఆ మంత్రకాడు ఏం చేస్తాడో చూద్దాం అని ఊరుకున్నాడు.
ఆదివారం అమావాస్య నాడు రాత్రి పూట నలుగురు సహాయకులతో పెద్ద మంత్రకాడు ఆండాలు ఇంటికి వచ్చాడు. నల్లని శరీరానికి తెల్లని ధోతీ, లాల్చీ, ఎర్ర కండువా, పెంచుకున్న జుట్టుతో తిప్పి తిప్పి వేసుకున్న సిగ, గుబురు మీసాలు, రూపాయి బిల్లంత ఎర్రబొట్టు పెట్టుకొని, కొన్ని గడ్డి పోచలు పట్టుకొని నిటారుగా నిలబడి పెద్ద పెద్ద అడుగులేస్తూ వచ్చాడు.ఇంటికి వున్న అన్ని మూలల్లో చిన్న గుంటలు త్రవ్వించి వాటిలో ఏవేవో ధాన్యాలు, వేర్లు, వన మూళికలు వేసి పూడ్చమన్నాడు. తరువాత స్వాతి చేయి పట్టుకొని బాగా పరిశీలించి ఊరికి పట్టాల్సిన అతిపెద్ద రక్తపిశాచి స్వాతిని పట్టుకొని వదలడం లేదని చెప్పి దాన్ని రాత్రికి రాత్రే ఉరికిస్తానని చూడమని చెప్పాడు. ఆలస్యం చేయకుండా తెల్లముగ్గు, నల్లకోడిపెట్ట, నల్లదారం, నిమ్మకాయలు, వేప మండలు, కల్లుకుండ, సాంబ్రాణీతో పాటు ఇంకా కావాల్సిన వస్తువులన్నీ తన దగ్గరికి తెప్పించకుని సిద్ధం చేసుకున్నాడు. సరిగ్గా అర్ధరాత్రి కాగానే తన తంతు మొదలు పెట్టాడు. పూర్తయ్యే దాకా ఆండాలు ఇంటివాళ్లెవరూ నిద్ర పోవద్దని చెప్పి వాళ్లందరికీ విశ్వాసం కలిగే విధంగా ముచ్చట పెడుతూ, తన మహిమల ప్రత్యేకతలు వివరిస్తూ, వివిధ విన్యాసాలు ప్రదర్శిస్తూ చుక్క పొడిచే జాము దాకా కొనసాగించి, చివరికి స్వాతిని ఇల్లంతా వందసార్లు ముందుకు పరుగెత్తి వెనుకకు నడవాలని చెప్పి ఇంటికి పట్టిన రక్తపిశాచి అరవై మైళ్ళ దాకా తరిమి తరిమి కొట్టానని చెప్పి ఇంటి గుమ్మాలకు ఎర్రగుడ్డలో కొబ్బరికాయ కట్టించి, వేలాడ దీయించి, అక్కడక్కడా రాగి రేకులు కొట్టించి, స్వాతి ఎడమ కాలికి నల్ల దారం కట్టి, ఆమె పెళ్ళి వారం లోపే గొప్పగా జరుగుతుందని, భవిష్యత్తులో ఇంటిమీద ఏ గాలి సోకదనీ, ఎటువంటి దయ్యాలు ఆశపడవని చెప్పి యాభై వేలకు పైగా నోట్లను లెక్కపెట్టుకొని సంచిలో వేసుకొని తెల్లారేసరికి ఊరి పొలిమేర దాటాడు.
*************
మరో నాలుగు రోజుల్లో జరిగే పెళ్ళికి ఏర్పాట్లు అన్నీ పూర్తయినవి. మంత్రకాడి మాయల మాటల ప్రభావంతో రెండు రోజులు స్వాతి ప్రశాంతంగా ఉన్నప్పటికీ మెల్ల మెల్లగా మళ్ళీ గుబులు మొదలయ్యింది. ఇంతలోనే పెళ్ళి కొడుకు బంధువు నుంచి బుగ్గయ్యకి ఫోన్ వచ్చింది. అమ్మాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడ్తుందన్న సంగతి తెలిసిందనీ, ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదని ఇష్టం వచ్చినట్టు తిట్టి మరీ సంబంధం వదులుకున్నారు.
వార్త వినగానే బుగ్గయ్య ఆండాలు ఇద్దరికీ ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. శివకు కోపం, ఆవేశం ఎక్కువై ఉన్న మాట అనాలని ''చూడమ్మా! నిన్న గాక మొన్ననేగా? ఆ మంత్రగాడు ఈ వారంలోనే పెండ్లయితదని చెప్పిందీ..? ఇప్పుడేమ యింది..? ఆ మాయల మారోల్లను, ఆల్ల దొంగ శేతలను ఇప్పటికైనా ఇడిసిపెడ్తరా మీరూ? మీలాంటోల్ల అజ్ఞానంతోని సంచులకు సంచులు కూడబెట్టుకుంటరమ్మా.. వాళ్ళు? కాలమెంత మారినా మీరు మారరు,కానీ జనాన్ని ఇంకో వందేళ్లు ఎన్కకు తీస్కపొయ్యేది కూడా మీలాంటోల్లేనమ్మా? గొర్రెలు కసాయి కత్తిని నమ్మినట్లు కుప్పలు కుప్పలు పైసలు పొసే మీరూ గొర్రెలేనమ్మా? నామాట ఎందుకింటరు మీరు..? ఆ ఎంకవ్వనడుగు పాండ్రి? ఇంకేదన్న జెప్తదీ ...!''
డబ్బులు వధా అయినాయన్న బాధతో కొంగుతో కళ్ళ నీళ్లను తుడుచుకుంటూ అండాలు ''శెల్లెలు పానం మంచిగై తదని, దాని పెండ్లి జెద్దామనుకున్నం గని ఇట్లైతదనుకోలే కొడుకా...!''
''స్వాతికింత శిన్నప్పుడు పెండ్లెందుకమ్మా..? చెల్లెలిని బాగా చదివించాలని ఎప్పటినుంచో అంటున్నా, మీరు వింటున్నరా ఎమన్న ? మీ స్వార్థం కోసం స్వాతి బతుకంతా ఆగం జేసి, ఏమెరుగనట్లు ఇప్పుడా ఏడుపెందుకూ? ''
ఆండాలు ఆపుకోలేని బాధతో స్వాతిని పిలిచి ''అరేరు బుజ్జీ? మల్ల సదువుకుంటావుర ?'' నిదానంగా అడిగింది.
''అమ్మో..! నా సదువు బందై అయిదేండ్లాయె. ఇప్పుడు సదువుతందుకు నా నోరు తిరుగదు, రాస్తందుకు నా శెయ్యి మెదుగదు, నా వల్ల కాదమ్మో...!''
శివ కల్పించుకొని ''అమ్మా..! పెసరు శేన్ల పోగొట్టుకున్నంక పప్పటికల దేవులాడ్తే కుదరదమ్మా...?''
తండ్రి బుగ్గయ్య కొడుకును చల్లబరచాలని ''ఇగో సూడ్రా శివా..? నువ్వన్నది నిజమే..! మరి ఇప్పుడేం జెయ్యమంటవో జెప్పురా ? అట్లనే చేస్తం''
''నాయినా..? మంత్రాలకు చింతకాయలు రాలవని నేనెంత చెప్పినా వినని మొండోల్లు మీరు? చెవిటోల్ల ముందు ఎన్ని శంఖాలు, ఎన్ని సార్లూదాలమ్మా.? అందుకే నా వల్ల కాదు. నా దారి నేను చూసుకుంటా. నేనింట్లనుంచెల్లిపోతున్న. మన మండలం కాడ రూమ్ తీసుకొని ఉంటా''
స్వాతి ఏడుస్తూ వచ్చి అన్న చేతులు పట్టుకొని ''వద్దన్నా నువ్విల్లొదిలి పోవద్దన్నా.! ప్లీజ్..అన్నా! నువ్విం ట్లనే ఉండన్నా!'' అని బతిమాలింది.
''లేదురా స్వాతీ..! మన అమ్మా నాన్నలకు చదువుకున్నోల్ల మాటలు వింటే శిగాలొచ్చి ఊగుతరు. ఇగ నామాటలు వింటే చెవి మీద పేను వారదు. నీకర్ధమైతదని చెప్తున్నరా.! విశ్వంలోని ఎన్నెన్నో రహస్యాలను కనుక్కొంటూ ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానంలో మానవుడు దూసుకెళ్తున్న కాలమిది. కానీ తర తరాలుగా మంత్రాల చీడ పీడను పట్టుకు వేలాడుతున్న ఈ పాత రోగగ్రస్తుల మధ్యలో చదువుకున్న వాడిగా నేనిమాడలేనురా''
బుగ్గయ్య మరింత కోపంతో ''ఏమిరో...? ఎవన్ని బెదిరిస్తున్నవ్..? నువ్వు లేకుంటె ఏందిరా? నీకేడ నచ్చితే ఆడనే ఉండుపో..!''
ఆండాలు కూడా ధైర్యంతో ''ఉన్న రెండెకరాలు అమ్ముతా, దాని పెండ్లి చేస్తపోరా? ఇయ్యాల సంది నువ్వు సచ్చిన వనుకుంటం పోరా..?'' శోకాలతో ఏడుపు మొదలు పెట్టింది.
శివ ఎవ్వరి ముఖం చూడకుండా, ఏదీ పట్టించుకోకుండా సామానంత సర్దుకొని ఇంటిని వదిలి, తన వాళ్ళను విడిచి తాననుకున్న చోటుకే వెళ్ళిపోయాడు.
*************
అన్ని విషయాలలో కొడుకు అండగా ఉన్నా మంత్రాలు పేరెత్తితే ఎప్పుడూ గొడవపడే కొడుకు ఇల్లు వదిలేస్తాడను కోలేదు తల్లిదండ్రులు. ఒక వైపు ఆ బాధ ఉన్నప్పటికీ మరో వైపు స్వాతి పెళ్ళి తక్కువ ఖర్చుతో గట్టెక్కించాలన్న తాపత్ర యాన్ని మాత్రం వదులుకో లేదు. ఆ నోటా ఈ నోటా ఏవేవో విషయాలు తెలుసుకుంటూ గుళ్ళు, గోపురాలు తిరుగుతూ, చిన్నోళ్ళను పెద్దోళ్ళను కలుస్తూ కొత్త కొత్త మంత్రకాళ్ళు, భూత వైద్యులు, నాటు వైద్యులు, కోయ దొరల చుట్టూ ప్రదక్షిణలు మానలేదు. రాబడి మాత్రం లేదు కానీ మంచు కరిగినట్లు ఉన్న డబ్బులు అయిపోగా కొత్తగా అప్పులు చెయ్యాల్సి వస్తుంది. కొడుకు బయటికెళ్ళి ఆరు నెలలు గడిచినవి. స్వాతికి ఒక్క సంబంధం వచ్చింది లేదు. ముందడుగు వేసింది లేదు. అనుకోకుండా ఒకరోజు మళ్ళీ ఎంకవ్వ కొత్త వార్తతో వచ్చింది.
''ఆండాలూ.. ఓ ఆండాలూ..! ఏం జేస్తున్నర్రా..?''
''ఆ..ఏం లేదు పెద్దమ్మా, ఇట్లొచ్చినవేందీ?''చ
''గాడ పట్నంల జుంపాలయ్య మంచిగ జూస్తడంటనే..! మంత్రం లేదంట, తంత్రం లేదంట అందరూ చూస్తుండంగనే మన చేతిల ఊబిది (విభూతి) పోస్తడంటనే..! అది తెచ్చుకొని మనం వారం రోజులు మొకానికి రాసుకోవాలంట. ఇగ జూస్కో మనకు ఇల్లంటే ఇల్లు, పెండ్లంటే పెండ్లి, పిల్లలంటే పిల్లలు,పైసలంటే పైసలు ఏదంటే అదైతదంటరా..? ఎమ్మటే మనమరాల్ని ఆడికి తీస్కబోయే..? పొల్లకు జెల్ది పెండ్లయితది, దెబ్బకు మీ పరేషాన్లన్నీ ఊడ్సుక పోతయి సూడూ..!''
''అట్లనా పెద్దమ్మా..! ఒక్క పైసలేదేట్ల జెయ్యా? ఎంతయితదో ఏమో..! పాడువడా, పత్తి అమ్ముడు పోదాయే, నెల్లాల్ల సంది నీ కొడుకు ఉప్పరికూలి బందై పాయె''
''పైస పోతే పానం బోతదే నీకూ? పొయ్యేనాడేస్కపోతవా ఏందే? యాభై వేలు లేవా పోరీ? పానం కంటే ఎక్కువనా? ఏడనన్న అప్పు సప్పు జేసుకోవాలె కార్యం జేయ్యాల్నే శినాల్దానా?''
ఎంకవ్వ మాటలతో చాలా ఉబ్బి తబ్బిబ్బయింది ఆండాలు. స్వాతి పెళ్ళయ్యిందన్న భావనకొచ్చింది. వెంటనే వడ్డీ వ్యాపారి దగ్గరకి వెళ్ళి అయిదు రూపాయల మిత్తికి అరవై వేలు తెచ్చి, బుగ్గయ్య స్వాతితో కలిసి రెండు వందల కిలోమీటర్ల దూరంలో జుంపాలయ్య ఉండే నగరానికి కొండంత నమ్మకంతో బస్సెక్కింది.
అదో పెద్ద సమావేశ భవనం. అందులో కనిపించే వస్తువు లన్నీ తెల్ల రంగులో కొత్తగా కళకళలా డుతున్నవి. దాదాపు రెండువేల మందికి పైగా తెల్లని వస్త్రాలతో బూడిద కోసం కింద కూర్చొని ఉన్నారు. వారికెదురుగా వేదిక పైన తెల్లని లాల్చీ పైజామాతో, వేలాడేసిన నల్లని పొడవాటి జుట్టుతో ప్రశాంతంగా పళ్ళిగిలిస్తూ, ఇద్దరు సహాయకులతో వేదికపై చేతులను అడ్డంగా నిలువుగా ఊపుతూ, విచిత్ర విన్యాసాలు చేస్తూ కూర్చొని ఉన్నాడు జుంపాలయ్య. ఆండాలు తల్లి ముగ్గురూ ఆఫీస్ కౌంటర్లో యాభై వేలు చెల్లించి వచ్చి కింద కూర్చున్న జనంలో కలిసిపోయారు.
అందరూ చూస్తుండగా వేదిక మీద తెల్లని వస్త్రం పై కూర్చొని జుంపాలయ్య ''హమ్...భమ్... హమ్...భమ్....'' అంటూ కుడిచేతిని అటూఇటూ తిప్పుతూ విభూతి రాల్చుతు న్నాడు. అది రాలి పడుతుంటే భక్తజనమంతా అద్భుతమైన మహిమ అని దండాలు పెడుతూ, చప్పట్లు కొడుతూ, పాటలు పాడుతూ, శిగాలూగుతుంటే ఆండాలుకు కొండంత ధైర్యం వచ్చింది. ఇన్నేండ్లు ఎన్ని పైసలు వధా ఖర్చులయినయో గానీ ఇదొక్కటే నిజమైన ఖర్చు అని తన మనసులో తెగ ఆనంద పడి పోతున్నది. స్వాతి కూడా చెప్పలేని సంతోషంతో కొత్తగా పూనకంలోకి జారుకుంది. ఆమెను ఆపాలంటే తల్లిదండ్రు లిద్దరికీ శక్తి సరిపోవట్లేదు.
మరొక వైపు మైకులో వచ్చిన వారికీ సూచనలు చెప్తు న్నారు. జుంపాలయ్య గారు కిందికి వస్తారని, అప్పుడే సష్టించిన విభూ తిని ఒక్కొక్కరి చేతిలో జారవిడు స్తారని, అందుకు అందరూ కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి ఉంచాలని చెప్తు న్నారు. ఏ మాత్రం పొరపాటు జర గొద్దని భక్తులంతా అట్లాగే చేస్తు న్నారు.
జుంపాలయ్య మెల్ల మెల్లగా నడుచు కుంటూ భక్తజనం మధ్యలోకి వచ్చి రెండు గంటల్లో రెండు వేల మంది వరకు విభూతిని రాల్చాడు. ఆ తంతు అంతా చూస్తుంటే ఆండాలుకి, స్వాతికి, బుగ్గయ్యకి సరికొత్త లోకంలోకి వచ్చినట్లయింది. జుంపాలయ్య మహిమతో ఇచ్చిన విభూతిని అపురూపంగా దాచుకొని ముగ్గురూ అమితానందంతో హుషారుగా ఊరి బస్సు ఎక్కారు. కొంత దూరం వెళ్ళాక శివతో కలిసి చదువుకున్న గ్రామ యువకుడు రాజు బస్సు ఎక్కాడు. సీట్లు ఖాళీ లేకపోవడంతో జరుగుతూ వచ్చి ఆండాలు వాళ్ళ దగ్గరికి వచ్చి నిలబడి గుర్తు పట్టి ''హల్లో అంకుల్, అంటీ, హారు స్వాతీ.! శివగాడు రాలేదా ? మీరెక్కడి నుంచొస్తు న్నారు.?'' అని అడిగితే స్వాతి అసలు నిజం చెప్పబోతుంటే ఆండాలు సైగతో ఆపి ''శివ ఊర్లనే ఉన్నడు రాజూ! ఈడ మా అక్క తానికి పొయ్యొ స్తున్నం, ఇంతకూ నువ్వే డుంటు న్నవ్..?'' అస్సలు ఊరికొస్తలేవుగా! ఊరోల్లను మర్శి పొయి నవా ఏందీ? ఏం పని జేస్తున్నవిక్కడా?'' అని వరుస పెట్టి అడిగింది.
''ఊర్లే ముందనొస్తా మాంటీ..! ఐదేళ్ల కిందనే అమ్ము కోని సిటీకొ చ్చినం, నేనీడ జుంపాలయ్య దగ్గర డ్యూటీ చేస్తున్న''
''ఏం డ్యూటీ రాజూ..?'' వెంటనే తెలుసుకోవాలని ఆత్రుతగా అడిగాడు బుగ్గయ్య.
''జుంపాలయ్య రోజూ కొన్ని వేల మందికి విభూతిని స్తాడంకుల్...!, అది కూడా చెయ్యి నుంచి రాల్చాలి. జనం మధ్యలోకి వచ్చినపుడు విభూతి అయిపోతుంది. అప్పుడు ఆ జనం మధ్యలో నేను భక్తుని వలె కూర్చోని ఎవ్వరికీ తెలియకుండా నా దగ్గరి విభూతిని అందియ్యాలి. ఇదే నా డ్యూటీ, ఇట్లా నా లాగ వంద మందికి పైగా చేస్తారంకుల్ ! బయట అందరూ అనుకుంటున్నట్లు ఆ జుంపాలయ్య చేతిల ఏ మాయలు మంత్రాల్లేవంకుల్ ! శివగాడు నా దోస్తుగాడని మోస పోవద్దని ముందే చెప్తున్నా, అంతా ఉత్తదే, ఆ జుంపాలయ్య తక్కువోడు కాడాంటీ! పెద్ద డబ్బులు గుంజుడుగాడు. యాభై వేలకు తక్వ తీసుకోడు. ఇగో ఆంటీ ! అటు దిక్కు అస్సలు పోకుండ్రి...? మా రూమ్ బస్టాప్ వచ్చేసింది. నేను దిగుతానాంటీ...!'' అని చక చకా బస్సు దిగాడు.
ఆ తరువాత ముగ్గురూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని వెనుక చూపుల ఎంకవ్వ లాంటి మంది మాటలు నమ్ముకుంటే చివరికి బూడిద కూడా మోసం చేసిందని, ఇట్లయిపోతిమెట్లా అనుకొని జీవకళ తప్పిన ముఖాలతో ఎండిపోయిన చేపల్లాంటి మొహాలతో ఉస్సూరు మనుకుంటూ ఊరెళ్ళారు.
- డాక్టర్ మండల స్వామి,
9177607603
Sun 27 Mar 07:36:50.537819 2022