''ఒకటి ఒకటి ఒకటి... ఒలింపియాడ్‌లో నూతన రికార్డుకు తెర తీసిన మా గ్రూప్ అఫ్ స్కూల్స్.... రాష్ట్రం మొత్తం 99.8 ఉత్తీర్ణత శాతం...'' చెవులు చిల్లులు పడేట్టు టీవీలో యాడ్.
అర్చనకి ఆఫీసులో అప్రైసల్ అండ్ పెర్ఫార్మన్స్ రివ్యూ టైం నడుస్తోంది. ఇవ్వాళ ఆఫీసులో తన ర్యాంకు కూడా తెలుస్తుంది. ఆఫీసులో ర్యాంక్ ఏంటి? సంవత్సరమంతా చేసిన పనికి సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఇచ్చే రేటింగ్. మంచి రేటింగ్ ఉంటే ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బోనస్‌లు.
''చిన్నప్పటి నుండి ఇదే పోటీ.
ఇవే పరుగులు. ఛ''
టీవీ ఆఫ్ చేసింది.
టైమైంది. బ్యాగ్ భుజాన
వేస్కుని అమ్మకి బై
చెప్పింది.
పేరుకే ఎనిమిది గంటల షిఫ్ట్. ఉదయం పదకొండింటికి మొదలైతే ఒక్కోసారి రాత్రి పదకొండైనా పని అవ్వదు. ఒక గంట ముందు వెళ్లాలన్నా లేక రాత్రి పూట లేట్ అవుతోందని చెప్పాలన్నా ఇబ్బంది. వెంటనే, ''సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఇవ్వన్నీ కామన్. సర్దుకోవాలి'' అంటుంది మేనేజర్. తిరిగి ఏమైనా అందామంటే ఆమె గుప్పెట్లో తన పెర్ఫార్మన్స్ రివ్యూ కార్డ్ ఉంటుంది. కోపంలో తక్కువ రేటింగ్ ఇస్తే ప్రమోషన్లు దగ్గర నుండి అన్నీ దెబ్బ తింటాయని టెన్షన్.
లి
గచ్చిబౌలి. హైదరాబాదు నగరానికి పూర్వోత్తర ప్రాంతంలో రాళ్లు, గుట్టలు, ఇరుకు రోడ్లతో ఒకప్పుడు నిర్మానుష్యంగా ఉండేది. రాను రాను గుట్టలని అభివద్ధి మింగేసింది. రోడ్లని వాహనాలు కమ్మేసారు. ట్రాఫిక్ మయం. ఆ వ్యూహంలో నుండి బయటపడే సరికి అర్చనకి లాగిన్ టైం కావొచ్చింది. కార్ పార్క్ చేసి గబగబా లోనికి పరిగెత్తింది.
''ఏంటి చెమటలు కక్కుతున్నావ్?'' ఎక్కువైన లిప్స్ట్టిక్ని టిష్యూతో అద్దుతూ అడిగింది కావ్య.
''ఇవ్వాళ బాస్‌తో నా పెర్ఫార్మన్స్ రివ్యూ మీటింగ్. టెన్షన్‌గా ఉంది'' లాప్టాప్ బయటకి తీస్తూ.
''శివంగి ఇప్పడే వచ్చింది. రాగానే బటర్ బ్యాచ్‌తో స్మోక్‌కి వెళ్ళింది. టైం పడుతుంది లే'' మేనేజర్ని, ఆమె అడుగులకి మడుగులు ఒత్తే కొలీగ్స్‌ని కలిపి దెప్పింది.
''బటర్ బ్యాచ్ ఏంటి? కొత్త పేరా?''
''బటర్ వేసి మస్కా కొట్టే వాళ్ళని ఇంకేం అంటారు? అది సరే, వాళ్ళని చూసావా?'' ఎదురు డెస్క్ దగ్గర కూర్చుని దాదాపు లాప్టాప్లోనికి దూరిపోయి పనిచేస్తున్న ఇద్దరు కుర్రాళ్ళని చూపించింది కావ్య.
''ఎవరు? అంత బిజీగా ఉన్నారు?''
''క్యాంపస్ నుండి వచ్చిన కొత్త రిక్రూట్స్.''
''అదేంటి? మనం క్యాంపస్ హైరింగ్‌కి వెళ్ళినప్పుడు అమ్మాయిలని కదా సెలెక్ట్ చేసింది?''
''శివంగి మార్చేసింది''
''అదే ఎందుకు? చాలా తెలివైన అమ్మాయిలు వాళ్ళు. వీళ్లు కారు అని కాదు. మన టీంలో అమ్మాయిల రేషియో తక్కువని ఎండీ చెప్తేనే కదా సరైన కాండిడేట్స్ కోసం ఎదురుచూసి మరీ సెలెక్ట్ చేసాము?''
''మనం ఒప్పుకున్నా లేకున్నా ఆమెకి అమ్మాయిలు పెద్దగా నచ్చరన్నది నిజం. నువ్వన్నట్టు తెవిగా ఉంటే అసలే నచ్చరు. గమనిస్తే, ఆమె చుట్టూ ఆమెని పొగిడేవారు, ఆమెతో కలిసి స్మోక్ బ్రేక్స్‌కి వెళ్లే వారు, తగ్గి తగ్గి ఉండేవారు ఉంటారు.''
అర్చన నిరుత్సాహ పడింది.
సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే జావా, సి, సింం ఇవే కాదు, చదరంగం ఆడటం కూడా బాగా తెలిసుండాలని ఉద్యోగంలో చేరిన ఆర్నెల్లకే తెలిసిపోయింది. ఎత్తుకి పైఎత్తు వెయ్యగలగాలి. ఇది అన్ని ఉద్యోగాల్లో ఉంటుంది కానీ ఇక్కడ బిజినెస్ మోడల్ మారినంత తేలికగా, పాత బాసు వెళ్లి కొత్త బాసు రావడమంత సునాయాసంగా ఎక్కడా జరగదు. తను ఉద్యోగంలో చేరిన రెండ్నెల్లకే కొత్త బాస్ వచ్చింది. సంతోషించింది. అది ఎక్కువ కాలం నిలవలేదు. వస్తూ వస్తూ తనతో పాటు పాత కంపెనీలో పని చేసిన మరో ఇద్దరిని వెంట తెచ్చింది. కార్తీక్, పునీత్. అర్చనతో పోలిస్తే పనిలో తక్కువ అనుభవమున్నా వచ్చిన సంవత్సరానికే వాళ్ళిద్దరినీ టీం లీడ్స్‌ని చేసింది.
ముఖ్యమైన నిర్ణ యాలు, ఫ్లోర్పల్స్,
క్లైంట్స్ రాకపోకలు, ఇవ్వన్నీ వాళ్ళతో ముందే మాట్లాడుతుంది. వాళ్ళతోనే స్మోక్ బ్రేక్స్ వెళ్తుంది.
టీం మీటింగ్స్‌లో తప్ప మిగతా వాళ్ళతో ఆమె ఒక మేనేజర్‌గా పెద్దగా కలవలేదు. తెలీని వాళ్ళని త్వరగా నమ్మదా? ఇంకేమైనా ఇబ్బందా? తెలీదు.
తర్వాత వచ్చే మేనేజర్ ప్రమోషన్ కోసం వీళ్లిద్దరు బాస్‌ని కాకా పట్టటానికి ఏమాత్రం వెనకాడరు. త్వరగా ఎదగాలని ఆత్రం. ఆ ఆత్రంతో వాళ్ళు తీసుకున్న ప్రెషర్ కన్నా తనకిచ్చిన ప్రెషర్ ఎక్కువ.
ఒక పెద్ద బ్యాంకు ప్రాజెక్ట్ మీద ఎనిమిది నెలలపాటు రోజుకి పదహారు గంటలు పనిచేసి టీం లీడ్‌గా ప్రమోషన్ తెచ్చుకుంది అర్చన. టెక్నికల్‌గా చాలా స్ట్రాంగ్, టీంని ఇన్నోవేటివ్ గా ఇంక్లూసివ్గా రన్ చేస్తుంది. కొలీగ్స్‌కి ఆమంటే ఇష్టం. తన పనితనానికి మూడు సార్లు ఔట్‌స్టాండింగ్ అవార్డు తీస్కుని హ్యాట్రిక్ కొట్టింది.
టీం లీడ్‌గా ప్రమోషన్ వచ్చి మూడేళ్లు దాటింది. తనకన్నా వెనక వచ్చిన కార్తీక్ ఇప్పుడు మేనేజర్ కావాలనుకుంటున్నాడు. కంపెనీకి ఆదాయం తెచ్చే రెండు ప్రాజెక్ట్స్ రన్ చేస్తోంది అర్చన. రాత్రి పదకొండు దాటినా బాస్ ఇంకా ఏదో పని చెప్తూ మెయిల్స్ పంపుతానే ఉంటుంది. స్టాఫ్‌గా ఉన్నప్పుడు ఏ రోజు పని ఆ రోజు చేసేసి చేతులు దులుపేసుకునేది. ఇప్పుడు అలా కాదు. షిఫ్ట్ అయ్యే టైంకి ఏదో ఒక ఫిట్టింగ్ పెడుతుంది బాస్. ఎంత లేటుగా ఉండాల్సి ఉంటుందోనని టెన్షన్. తన షిఫ్ట్ అయ్యే టైం కి అమెరికా టీం లాగిన్ అవుతుంది. చాలావరకు వాళ్ళతో కాల్స్ రాత్రి తొమ్మిదిన్నర తర్వాత మొదలవుతాయి. టైం లేకపోతే ఎన్నోసార్లు అర్చనకి వాళ్ళ అమ్మ భోజనం తినిపించేది. పోనీ కష్టపడినా ఏదైనా ఫలితం ఉందా అంటే అదీ లేదు. తనతో వర్క్ చేయించుకుని పెద్దవాళ్ళతో మీటింగ్స్‌కి ఆ ఇద్దరిని తీస్కుని వెళ్తుంది బాస్.
బాస్ స్మోక్ బ్రేక్ నుండి వచ్చింది. ''చెప్పు అర్చన. ఎలా ఉంది వర్క్?''
లాప్టాప్్ చూస్తూ అడిగింది.
ఎస్కేపిస్ట్. నో ఐ కాంటాక్ట్. ''ఫైన్ మామ్''
''కాల్ మీ వినీత'' అంది ప్రింటౌట్స్ ఆర్డర్లో పెడుతూ.
''యా వినీత. వర్క్ బాగుంది. చాలా నేర్చుకున్నాను లాస్ట్ ప్రమోషన్ తర్వాత. బట్ రోజూ పదకొండు దాటుతోంది. స్ట్రెస్ ఎక్కువైంది. వర్క్ లోడ్ కొంచం మిగతా వాళ్ళు కూడా తీస్కుంటే బ్యాలన్స్ అవుతుంది.'' కార్తీక్, పునీత్‌ల పేర్లు చెప్పే ధైర్యం లేదు. చీకట్లో సూచించింది.
''అదెలా? అందరూ బిజీ ఉన్నారు. అమెరికా టీంకి ఇక్కడ లీడ్స్ ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. సాఫ్ట్వేర్ జాబ్‌లో ఇవ్వన్నీ కామన్.'' అనుకున్నట్టే లాజిక్ లేని మ్యాజిక్ మాటలు చెప్పింది.
''మేనేజర్‌గా ప్రమోషన్ కోసం ట్రై చేస్తున్నా ఈ సంవత్సరం. మీ సపోర్ట్ కావాలి. అలాగే ఇంక్రిమెంట్ కూడా''
''అప్పుడే మేనేజర్ ఏంటి? ఇప్పుడు చేసేది ఎక్కడ సరిపోతుంది? నువ్వు ఒక టీం లీడ్‌గా ఇంకా పెద్ద పెద్ద టీమ్స్ లీడ్ చెయ్యాలి, మంచి నెట్వర్క్ ఉండాలి, కొత్త టెక్నాలజీ తెలిసుండాలి, ఇంకా చాలా చెయ్యాలి' లాప్టాప్లో టైపు చేస్తూ తన వంక చూడకుండా చెప్పింది. నిజానికి ఈ సంవత్సరం ఆమె కోటాలో కార్తీక్‌కి ప్రమోషన్ ఫిక్స్ అయ్యిందని సూచనలు కనపడ్డాయి. ఇంకేదో చెప్పబోతుంటే ఆమె మాట గిట్టనివ్వలేదు.
మీటింగ్ ముగిసింది. చిరాగ్గా వచ్చి డెస్క్ మీద ఫోన్ పడేసింది అర్చన.
''ఏమైంది?'' అడిగింది కావ్య.
''సింగినాదం కబుర్లు చెప్పింది. అన్ని పనులకి కలిపి ఒక టీం లీడ్‌ని పెట్టుకున్నట్టుంది నా బతుకు. బయట ఎంత గొప్పగా చెప్పుకుంటారో, లోన అంత విలువ లేని ఉద్యోగాలు మన సాఫ్ట్వేర్ వాళ్ళవి. ఎంత చేసినా తప్తి లేని జీవితాలు.''
''కూల్ డౌన్. అసలేమైంది?''
''పెద్ద ప్రాజెక్ట్స్ లీడ్ చెయ్యాలంట. ప్రతిసారీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎక్కడ నుండొస్తారు? వచ్చిన ప్రాజెక్ట్ కరెక్ట్‌గా చేశామా, క్లయింట్ ప్రాబ్లెమ్ సాల్వ్ చేశామా అని ఉండాలి కదా?''
''అదీ నిజమే. పోనీ పెద్ద ప్రాజెక్ట్ ఇవ్వమని అడగక పోయావా?''
''దానికి నెట్వర్క్ ఉండాలంట. కొత్త టెక్నాలజీ తెలిసుండాలంట.''
''కొత్త టెక్నాలజీ ప్రాజెక్ట్స్ మీదే కదా నువ్వు పనిచేసేది? నెట్వర్క్ అంటే? స్మోక్ బ్రేక్స్‌కి వెళ్లడమా? లేక ఆఫీస్ పార్టీస్‌లో లేట్‌గా ఉండటమా? అదే ఆమెతో పాటు స్మోక్ బ్రేక్స్‌కి వెళ్తే ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుంది. రాబోయే క్లైంట్స్ గురించి, జరగబోయే మీటింగ్‌లు గురించి రెండు వారాలు ముందే ఇస్తుంది. అలా చెప్పే కదూ వాళ్ళని ముందుగానే ప్రిపేర్ చేసి డైరెక్టర్ ముందు మంచిగా చూపిస్తుంది?'' కార్తీక్, పునీత్ ఊసు ఎత్తింది.
అర్చన తన పీర్స్, సీనియర్స్‌తో బాగుంటుంది. ఏదైనా నేర్చుకోవాలంటే మొహమాటం లేకుండా సబ్జెక్ట్ తెల్సిన వారిని అడిగి తెలుసుకుంటుంది. ఆఫీస్ పార్టీస్‌కి వెళ్లి అందరికి కనపడి, ఓ రెండు గంటలు ఉండి వస్తుంది. వాళ్ళ లాగా అర్ధరాత్రి దాటే వరకు ఉండదు. ఇంట్లో వీలు పడదు. అలా ఉండాల్సిన అవసరం కూడా లేదు అనుకుంటుంది. స్మోక్ బ్రేక్స్ అయితే తనకిష్టం లేదు.
వాళ్ళ స్మోక్ బ్రేక్స్‌లో సోషలైజింగ్ వేరే లెవెల్ ఉంటుంది. లైటర్ అందించినప్పుడో, పొగ ఊదే మధ్యలోనే బాస్ నుండి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ లాగుతుంటారు. రాబోయే క్లైంట్స్ గురించి, ఇవ్వబోయే హైకులు గురించి వాళ్లకి తెలీనది అంటూ లేదు. పేరుకి మాత్రమే అర్చనకి పీర్స్. మేనేజర్ లేని టైములో హవా అంతా వాళ్లదే. చిన్న ఇన్ఫర్మేషన్ కూడా చెప్పరు. ఒకటి రెండు సార్లు పాసివ్ స్మోకర్గా అర్చన కూడా వెళ్ళింది. నిలబడలేక పోయింది. ముందు వాళ్ళు ఇబ్బంది పడ్డారు, తర్వాత తనని ఆ పొగ ఇబ్బంది పెట్టింది. తన ముందు ఆఫీస్ విషయాలు ఏమీ మాట్లాడకుండా పెరిగిపోయిన ట్రాఫిక్, రాబోయే వర్షాలు పైపైన డిస్కస్ చేసి వచ్చేసారు.
తన వంతు ప్రయత్నం చేద్దామని బాస్‌ని కాఫీకి వెళదామా అని అడిగింది కొన్ని సార్లు. ఒకసారి వచ్చింది. కూర్చునే టైం ఇవ్వలేదు. బిల్ కట్టేసి డెస్క్ దగ్గరికి వచ్చేసింది. కొన్ని సార్లు ''నాట్ నౌ'' అంది.
ఇష్టం లేకపోయినా సరే మానవ సంబంధాల్లో ''లౌక్యం'' ప్రధాన పాత్ర పోషిస్తుంది. నిజమే. లౌక్యం అంటే మస్కా కొట్టడం కాదుగా.
ఓ శుక్రవారం రాత్రి ఎనిమిది అవుతుండగా నైట్ షిఫ్ట్‌కి హ్యాండోవర్ ఇచ్చి లాగౌట్ చేసింది అర్చన. ఆఫీస్ నుండి బయట పడేసరికి ఎనిమిదిన్నర్ర. రోడ్లన్నీ ట్రాఫిక్ మయం. చిత్ర గారి మౌనంగానే ఎదగమని పాట సగం విందో లేదో బాస్ ఫోన్.
''అర్చన... వచ్చే వారం క్లయింట్ వస్తున్నారు, ప్రాజెక్ట్ డెమో ఇవ్వాలి, ఇంటికి వెళ్ళాక ప్లాన్ పంపించు. కార్తిక్‌తో కోఆర్డినేట్ అయ్యి చెయ్యి'' చివర్లో నోరు జారింది.
వెంటనే, ''అంటే, అతనికి క్లయింట్ వస్తున్నారని ఇంకా తెలీదు. నేను కాల్ చేసి చెప్తాను. ముందు నీకే చెప్పాను'' కవర్ చేసింది.
క్లయింట్ వస్తున్నాడని తనకి తెలిసి రెండు వారాలైంది. కార్తీక్‌కి ఎందుకు తెలీదు?
లేట్ నైట్ కూర్చుని ప్లాన్ రెడీ చేస్తున్న టైం లో కార్తీక్ మెసేజ్ చేసాడు.
''హే, ప్లాన్ అయ్యిందా?''
''లేదు, చేస్తున్నా. క్లయింట్ వస్తున్నారని నీకు తెలిసినప్పుడు నాకు ముందే చెప్పాల్సింది''
''యా, నీకు చెప్పడం మర్చిపోయాను'' చాలా తేలిగ్గా చెప్పాడు. దొరికపోయారు అనుకుంది.
తిట్టుకుంటూనే ప్లాన్ రెడీ చేసి బాస్‌కి పంపింది. ప్రెసెంటేషన్ ఎలా చెయ్యాలా, ఏది చెయ్యాలా అని ఆలోచించింది. క్లయింట్ విజిట్ అనగానే ఎప్పుడో చేసిన ప్రాజెక్టులు చూపించి, మార్కెట్లో ఉన్న కొత్త టెక్నాలజీ గురించి మాట్లాడటం సహజం. కొత్తగా ఏం చేస్తే బిజినెస్ వస్తుందనే ఆలోచనల్లో పడింది.
ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు, టేబుల్ మీద తల పెట్టుకుని అలానే పడుకుండిపోయింది. తెల్లారాక అమ్మొచ్చి లేపింది.
''ఏంటే ఇక్కడే పడుకున్నావ్? అంత ఎక్కువ పనుందా? రెస్ట్ లేకపోతే ఎలా?''
''సాఫ్ట్వేర్ లో ఇది ఉండేదే అమ్మా. నీకు తెలీదులే.''
''పోనీ నాలుగు రోజులు సెలవు పెట్టి రెస్ట్ తీస్కో.''
''ఇప్పుడు కాదులే, పనులున్నారు. తర్వాత చూస్తాను'' లేచి బయటకి వెళ్ళింది.
అతిశీతలమైన ధనుర్మాస ఉదయం. మంచుతో కప్పబడిన వీధులు. బాలభానుడి నులివెచ్చని కిరణాలు భూమిని తాకుతున్నాయి. పెరట్లో అరవిరిసిన దేవ గన్నేరులపై మంచు బిందువుల ముత్యాల్లా మెరుస్తున్నాయి. పచ్చని పచ్చికపై నడుస్తుంటే అరికాళ్ళలో కితకితలు. ఎన్నాళైయ్యింది ఈ అద్భుతాన్ని చూసి అనుకుంది. తులసి కోట దగ్గర ఆగింది. అమ్మ దీపం పెట్టేసి వంటింట్లోకి వెళ్లిపోయింది. గాలికి దీపం రెపరెపలాడకుండా చిల్లుల గిన్నె అడ్డు పెట్టింది. ఆ కంతల్లో నుండి దీపం వెలుగులు మిణుకు మిణుకు మంటూ బయటకొచ్చి అమ్మ వేసిన పద్మం మీద అందంగా వాలాయి. పక్కనున్న బండ మీద కూర్చుండిపోయింది. ఒక్క దీపం నుండి ఇన్ని వెలుగులే! ఇలాంటిది ఒక్కటి నా మీద పడినా చాలు, ధైర్యంగా ఉంటుంది అనుకుంది.
లోపల నుండి తిరుప్పావై వినిపించింది. అమ్మ కాసేపటికి చీర చెంగుతో రెండు వేడి వేడి కాఫీ గ్లాసులు భద్రంగా పట్టుకొచ్చి పక్కన కూర్చుంది.
''V్‌ా్మ.... ఏంటి సంగతులు? తెగ బిజీ అయిపోయావు. మొక్కల్లోకి చాలా నెలలు తర్వాత వచ్చావు''
''వర్క్ బిజీ'' అంది కాఫీ గుక్క వేస్తూ.
''ఏంటంత బిజీ? తిండి ఎలాగో సరిగ్గా తినడం లేదు. ఇప్పడు నిద్ర కూడా లేదు'' కళ్ళ కిందున్న నల్ల చారలు వేలుతో చూపిస్తూ.
ఆఫీస్ విషయాలు పైపైన చెప్పింది. కాసేపటికి పక్కకి తిరిగి చూసింది. అమ్మ కాఫీ తాగేసి గ్లాస్ కింద పెట్టి తన వంకే చూస్తోంది.
''వింటున్నా, నాకు అర్థమౌతోంది. కంటిన్యూ'' అంది.
అమ్మకెందుకు తెలీదు? అన్నీ తెలుసు. తను పుట్టకముందే ఆమె పెద్ద బ్యాంకులో మేనేజర్. ఇవన్నీ చూసుండదా? తను పుట్టాక రెండేళ్లు ఆఫీస్ పని నుండి బ్రేక్ తీస్కుంది. తన కొలీగ్స్ తనకంటే ముందున్నారు, తను వెనకపడిందనే సంభాషణ ఇంట్లో ఎప్పుడూ రాలేదు. చీఫ్ మేనేజర్ లెవెల్ వరకు ఎదిగింది.
ఎందుకో లోపల ఉన్నదంతా చెప్పుకొచ్చింది. తను ఇలా మనసు విప్పి మాట్లాడటం ఉద్యోగంలో చేరాక ఇదే మొదటిసారి. ప్రమోషన్ రేస్‌లో పడిపోయి నార్మల్ అంటే మర్చిపోయింది.
''ఇవన్నీ నువ్వు ఇంత ప్రశాంతంగా ఎలా చేస్తావమ్మా? నా వల్ల కావట్లేదు. చాలా ప్రెషర్గా ఉంది.'' బాస్ స్మోక్బ్రేక్స్ గురించి, ఆమె పక్షపాత ధోరణి గురించి అంతా చెప్పింది.
''ఒకదాని తర్వాత ఒకటి అర్చన. మీ జెనెరేషన్తో ప్రాబ్లెమ్ ఏంటో తెలుసా? అన్నీ ఒకటేసారి సాధించేయాలనే తాపత్రయం. అమ్మాయిలకైతే ఇది ఒక సూపర్ వుమన్ సిండ్రోమ్. చెక్స్ అండ్ బ్యాలన్స్ ఉండాలి. అన్నిటి వెనక ఒకటేసారి పరిగెడితే అలసిపోయేది నువ్వే.''
''మరి వాళ్ళు నాకన్నా ముందు వెళ్ళిపోతే?''
''పోనీరు. ఇది జీవితం. రేస్ కాదు. ఈ సంవత్సరం ప్రమోషన్ రాకపోతే నిన్ను వెతుక్కుంటూ వచ్చి ఎవరైనా నిలదీస్తారా? ఆ రేస్‌లో పడి నువ్వు జీవితంలో చిన్న చిన్న సంతోషాలకి దూరం అవుతున్నావు. శీతాకాలంలో ఆ దేవ గన్నేరు పువ్వు మీద మంచు బిందువులు ప్రతి ఉదయం ఉంటారు. నువ్వు చూడటం మానేసావు అంతే.''
''మరి ఆఫీస్ పాలిటిక్స్?''
''అవి ఎక్కడ లేవు? నువ్వు చేసేది నువ్వు చెయ్యి. క్లయింట్‌కి కావాల్సింది సొల్యూషన్ అని నువ్వే అంటావుగా? ఇవ్వు. ప్రపంచానికి పరిచయమవ్వడం పెద్ద పనేం కాదు. సరైన దారి పట్టుకో. స్మార్ట్‌వర్క్ కూడా ముఖ్యం'' అంది దగ్గరకి తీస్కుంటూ.
చాలా రోజుల తర్వాత తనకి మైండ్ అంతా ఫ్రెష్‌గా అనిపించింది. సమస్య చెప్పుకుంటే మనసు తేలిక పడుతుందంటే ఇదేనేమో. తన మనసులో ఉన్న అనుమానాలన్నీ ఉఫ్ అని ఊదేసింది అమ్మ. కొండంత ధైర్యం పుట్టింది తనకి.
ఆఫీస్ కి వెళ్ళాక బాస్‌కి ప్లాన్ ఇచ్చింది. తర్వాత రెండ్రోజులు ఏమి ప్రెసెంట్ చెయ్యాలా అనే ఆలోచనలో పడింది.
''ఏంటి ఆలోచిస్తున్నావ్?'' పక్కన వచ్చి కూర్చున్నారు కావ్య, మరో కొలీగ్.
''అదే క్లయింట్ తో ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలా అని. మనం ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ ఎందుకు చూపించకూడదు?''
''మనం చేసేది ఆటోమొబైల్ ఇండిస్టీ ప్రాజెక్ట్ కదా? అది వాళ్లకి ఎలా ఉపయోగం?'' అంది కావ్య.
''కేవలం ఇండిస్టీ వేరు. అవసరం దాదాపు అదే కదా. మహా అయితే కొన్ని చిన్నా చితకా మార్పులు చెయ్యాలి. మొత్తం మొదటి నుండి చేసే బదులు ఇది మేము చేసామని ఉన్నది చూపించడానికేం? మార్పులు చేర్పులు వాళ్ళ అవసరం బట్టి.''
''ఈ ఐడియా బానే ఉంది. బాస్‌తో చెప్పావా?'' అన్నాడు కొలీగ్ సెలవు మీద వెళ్లిన బాస్ ఖాళీ క్యాబిన్ చూస్తూ.
''ఇంకా లేదు...'' ఆలోచనలో పడింది.
మర్నాడు కార్ పార్క్ చేసి లిఫ్ట్ ఎక్కుతుంటే ఎండీ శేఖర్ కనిపించాడు.
''హే... గుడ్ మార్నింగ్ చీఫ్'' గ్రీట్ చేసింది.
''హారు అర్చన. ఎలా ఉన్నారు?''
''గుడ్, థాంక్యూ''
''వర్క్ ఎలా ఉంది? ఏ ప్రాజెక్ట్ మీద చేస్తున్నారు?''
చెప్పింది.
''క్లయింట్ వస్తున్నారని తెలిసే ఉంటుంది, రెడీగా ఉన్నారా?'' అని అడిగాడు.
అమ్మ గుర్తొచ్చింది. దారి పట్టుకో అని తను చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఇదే కరెక్ట్ టైం అనుకుంది. లిఫ్ట్ కొన్ని ఫ్లోర్స్‌లో ఆగి మెల్లగా పన్నెండో ఫ్లోర్ చేరే సరికి తను అనుకున్న ప్రాజెక్ట్ గురించి వివరించింది.
''చాలా మంచి ఐడియా. కంపెనీలకి ఇలా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం వచ్చే ప్రాజెక్ట్స్ అయితే బాగుంటుంది. లంచ్ తర్వాత ఒకసారి మీరు, మీ మేనేజర్ నా ఆఫీస్ కి రండి. ఫైనల్ చేద్దాం'' అన్నాడు.
లోలోపల ఆనందంతో ఊగిపోయింది. తను ఇప్పుడు లిఫ్ట్ లో వాడుకున్న అవకాశాన్ని 'ఎలివేటర్ పిట్చ్' అంటారు. ప్రతి కార్పొరేట్ ఆఫీసులో చెప్పేదే. అనుకోకుండా మీ బాస్ లిఫ్ట్‌లో లేక కాంటీన్లో కనిపించి ఒక రెండు నిమిషాలు టైం ఉంటే, ఆ టైం లో మీ గురించి, మీ పని గురించి బాస్‌ని ఎలా మెప్పించాలనేది దాని ఉద్దేశం. దాని కోసం ఎలా మాట్లాడాలని ట్రైనింగ్ కూడా ఇస్తారు. అర్చన ఏ ట్రైనింగ్‌కి వెళ్ళలేదు. సమయస్ఫూర్తితో ఆ అవకాశం వాడుకుంది.
బాస్ వచ్చాక జరిగింది చెప్పింది. షాక్ అయ్యింది. ''ముందు నాకు చెప్పకుండా ఎందుకు మాట్లాడావు?'' చిరాకు పడింది. ఆమెకి ఇష్టం లేదు. ఆమె ఎదగడం ఇష్టం లేదు. ఒక్కసారిగా ఆమెకున్న చికాకులు బయటకి తన్నుకొస్తున్నట్టు మొహం పెట్టింది. కార్తీక్‌ని క్లయింట్‌తో మాట్లాడమని ముందే చెప్పి పెట్టింది. ఇప్పుడు అది కుదరదు.
లంచ్ తర్వాత ఎండీ ని కలిసి ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. ఆయన కొన్ని సూచనలు ఇచ్చి ఓకే అన్నాడు. అర్చనకి బాధ్యత అప్పగించాడు.
''బట్ శేఖర్, తను జూనియర్. ఇంకా టెక్నికల్ గా...'' అంటుండగా ఆమెని కట్ చేసాడు.
''జూనియర్ అయితే ఏంటి వినీత? ఏదైనా ప్రాబ్లెమ్ ఉందా? ఇది అర్చన ఐడియా కాబట్టి తనైతేనే సరిగ్గా చెప్తుంది. జూనియర్స్‌కి మనం అవకాశాలు ఇస్తేనే కదా వాళ్లేంటో నిరూపించుకునేది. అర్చన విల్ రాక్ ఇట్. ఏమైనా ఉంటే ఉన్నాం కదా సీనియర్స్. కవర్ చేద్దాం.'' అన్నాడు.
''ఓకే శేఖర్'' అంది మోహంలో నిరుత్సాహం దాయలేక, చేసేదేంలేక.
థాంక్స్ చెప్పి బయటకి వస్తుండగా, ''అర్చన, మీరు ఇలానే కొత్త కొత్త సొల్యూషన్స్ ఇవ్వండి. సరైన దారిలో ఉన్నారు'' అన్నాడు ఎండీ.
సరైన దారి పట్టుకుంది. సరైన లీడర్ దొరికాడు. ఇంకేం కావాలి? ఆ రోజు నుండి ఎవరు ఎవరితో స్మోక్ బ్రేక్‌కి వెళ్లినా ఆమెకు అనవసరం. సిగరెట్ డబ్బా మీద స్టాట్యూటరీ వార్నింగ్ ఉన్నట్టు అలాంటి పనులు, ఎత్తులు వేయడాలు హానికరం అని తెల్సుకుంది. స్మార్ట్ వర్క్ చేయడం ప్రారంభించింది. చిన్న చిన్న సంతోషాలకి ఇప్పుడు తనకి టైం ఉంది. సూపర్ వుమన్ నుండి స్మార్ట్ వుమన్‌గా మారుతోంది.
- శ్రీ ఊహ
Sun 05 Jun 02:50:19.614926 2022