పెద్ద మేనల్లుడు గీ విషయం ఫోన్లో చెప్పంగనే సోఫాలో కుప్ప కూలిపోయిన. వంటింటిలోంచి ఉరికచ్చింది నా భార్య యమున.
కంగారు పడుతూ ''ఏమైందండీ!'' అనుకుంట ఆమె నా భుజాలు పట్టుకుని తట్టి కుదుపేసరికి తేరుకున్న.
యమునకు చూచాయగ ఫోనులోని విషయం చెప్పిన. హుటాహుటిన కరీంనగర్ బస్సెక్కిన.
డాక్టర్ వీరేంద్ర హాస్పిటల్ అనే బోర్డు ఉన్న హాస్పిటల్లోకి అడుగుపెట్టిన. రూమ్ ఏదో వెతుక్కుంట పోయిన. మేనల్లుడు రూపేష్ ఎదురుంగనే వచ్చిండు.
''మామయ్యా! నిన్న ఉదయం ఏడు గంటలప్పుడు షుగర్ లెవల్స్ పడిపోయినయట. తన గదిలో ఒక్కతే ఉంటుంది గద. ఎవరు టైముకి చూడక పోయేసరికి కోమాలోకెళ్లి పోయింది'' గద్గద స్వరంతో చెప్పిండు.
''ఏంగాలేదురా! అక్కయ్య కేంగాదురా!'' వాడికి నచ్చ చెప్పుకుంటనే నాకు నేనే కాస్త ధైర్యం చెప్పుకున్న.
పరుగులాంటి నడకతో ఐసీయూ గదిలోకి వోయిన.
అక్కడ... అక్కయ్య, నా తోబుట్టువు, అమ్మ తర్వాత అమ్మ... నిస్తేజంగా నిస్త్రాణంగా అచేతనంగా మంచంపై... పచ్చని చెట్టుకి మెల్లమెల్లంగ ఎండుతున్న పసుపు పచ్చని ఆకు లెక్క... ఆమెను గట్ల చూస్తుంటే గుండెల్లో నుంచి దుఃఖం గోదావరి లెక్క పొంగుకచ్చింది.
చదువుకునే రోజులల్ల అక్కయ్య వాళ్ల అత్తగారి ఊరికి పోయెటోడిని. చిరునవ్వు నవ్వుకుంట ఎదురుంగ వచ్చుకుంటనే నా బ్యాగ్ తన చేతుల్లోకి తీసుకుని ''తమ్ముడూ ముందుగాల కాళ్ళు చేతులు కడుక్కుని రారా! తిందువు గని'' అంటూ లవు ఆప్యాయంగ పలకరించేది. పన్నీటి జల్లు ముఖం మీద చల్లినట్టు అయ్యేటిది.
''వచ్చి నిమిషం గాలేదు. తిండికి మొహం వాచినోని లెక్క గిప్పుడే తినుడేందక్క'' అనుకుంట చిరుకోపం ప్రదర్శించేటోడిని.
నా మేనల్లుండ్లని చూపించుకుంట ''గాళ్ళకు అమ్మను. నీకు అక్కయ్యను గాదుర!'' అనేది అమ్మ లెక్క తల మీద చెయ్యేసి ప్రేమగా నిమురుకుంట.
అసువంటి మంచి మనసున్న అక్కయ్య నేను వచ్చి ఇంతసేపైన గని కండ్లు తెరిసి గిటు సూసుడే లేదు.
'తమ్ముడా!ఎట్లున్నవుర. మరదలు పిల్లలు మంచిగున్నరా?' అనుకుంట కుశల ప్రశ్నలు వేసుడేలేదు.
ఉబికి వస్తున్న కన్నీళ్లను మోచేత్తో తుడుసుకుంట కనుపాపల తడి తెరలోంచి ఆమెను బేలగ చూసిన. అమాస గోలె వెన్నెల కోల్పోయిన చంద్రుడి లెక్క చిక్కి శల్యమై... విషాదంతో కూరుకుపోయిన శిధిల శకలం లెక్క... చేష్టలుడిగి పోయి ఉంది.
గల గలా పారే నిండు గోదారి లెక్క నిత్యం నవ్వుకుంట అందరినీ పేరు పేరున పలకరించే ఆమెను గట్ల చూస్తుంటే గుండె బరువెక్కుతంది.
పెనవేసుకుపోయిన రక్తసంబంధం నన్ను ఊరుకోనిస్తలేదు ''అక్కయ్యా...'' అని ఆర్తిగ పిలిసిన.
నా పిలుపు వింటుందేమో అని ఆశపడిన. నా ఉనికి పసిగడుతుందేమో అని సంబరపడిన. ఈ తమ్ముడికి ఏమైనా చెప్పుకోవాల్నని తపన పడుతుందేమోనని అనుకున్న... ఆమెలో చిన్న కదలిక వచ్చేసరికి!
అసువంటిదేమీ లేదు. తటాలున తల కొద్దిగా విదిలించి చూస్తుండగనే భళ్ళున వాంతి చేసుకుంది.
అప్పటికే గా అమతమూర్తి తల నిమురుతూ తలగడ దగ్గరే వంగి నిలబడి ఉన్న నేను చప్పున నా దోసిలి పట్టిన. ఆమె ఈ లోకంలోనే లేదు. నా దోసిలిలో పడి ఉన్న వాంతిని వాష్ బేసిన్ లో వేసి చేతులు కడిగిన. నా జేబులోంచి కర్చీఫ్ తీసి అక్కయ్య మూతి దగ్గర అంటిన తడిని తుడిసిన. పక్కనే నిలబడి ఉన్న మేనల్లుడు రూపేష్ చేష్టలుడిగి చూస్తుండి పోయిండు బొమ్మ లెక్క.
బాహ్య ప్రపంచంతో తనకేమీ సంబంధం లేనట్టు... ఒక ప్రశాంత తపో మూర్తిలెక్క... గా మంచం మీద కదలికలు లేకుండ పండుకొని ఉంది.
మేం నలుగురం మగపిల్లలం. మా అందరి కంటే పెద్దది ఒక్కతే అక్కయ్య. చిన్న వాడిని నేను. ఆమెకి నాకు సుమారుగా పద్దెనిమిది సంవత్సరాల తేడా. ఆమెకి చిన్న వయసులోనే పెళ్లయ్యింది. అక్కయ్య పెద్దకొడుకు నాకంటే అయిదేండ్లు చిన్న. ఇంటికి చిన్నవాడిని అయినందుకేనేమో నేనంటే అక్కయ్య విపరీతంగా అభిమానించేది. తనకి నేను మూడవ సంతానం అన్నట్టు ప్రేమ కురిపించేది.
అక్కయ్య మెట్టినింటి వాళ్ళ స్థోమత గొప్పది. బావ గారు ప్రభుత్వ ఉద్యోగి. ఆయన తండ్రి పెద్ద భూస్వామి. నూరు ఎకరాల మాగాణికి ఆసామి. వాళ్లవి కూడా చాలా మంచి మనసులు. బావగారైతే మరీ ఉత్తములు. నోట్లో నాలుక లేని మనిషి. అల్లుడి హోదాలో మమ్మల్ని అది కావాలి, ఇది కావాలి అని ఎన్నడూ నోరు తెరిచి అడిగింది లేదు.
అక్కయ్య కూడా ఎప్పుడో కానీ మా ఇంటికి వచ్చేది కాదు. అత్తగారి ఇంట్లోనే ఊపిరాడకుండా ఆమెకు ఎన్నో పనులు. రాక రాక ఇక్కడిక వచ్చినప్పుడు నాకోసం తప్పనిసరిగా ఏదో ఒక తినుబండారం తీసుకు వచ్చేది.
అమ్మ కోప్పడేది ''ఎందుకే గియన్నీ...'' అనుకుంట.
''మనింట్ల అందరి కంటే చిన్నోడు గాదమ్మా!'' అనుకుంట ప్రేమగ నా బుగ్గలు నిమిరేది.
''అమ్మా! నీ తర్వాత నేనే గదే వాడికి అమ్మని'' అనుకుంట నన్ను దగ్గరికి తీసుకుని ఆప్యాయంగా ఒక అమ్మ లెక్క హత్తుకునేది. ఆ ప్రేమమూర్తి కౌగిలిలో గువ్వలా ఒదిగి పోయేటోడిని.
నాకు మా అమ్మ కంటే అక్కయ్యనే ఎక్కువగ నా పట్ల ప్రేమ కురిపిస్తుందేమో అనిపించేది ఒక్కోసారి..
ఒక వారం పది రోజులుండి తిరుగు ప్రయాణం అవుతున్నప్పుడు అమ్మ ఒక వందో అయిదు వందలో అక్కయ్య చేతిలో పెడితే... అమ్మ చూడకుంట ఆమె ఆ డబ్బుని నా చేతికి ఇచ్చేది.
నేనేం తక్కువ తిన్ననా? ఆ అక్కకి తమ్ముడినేగా. నేనేమో తిరిగి మా మేనల్లుండ్లు ఇద్దరిలో ఎవలకో ఒకలకు జేబులో ఆ పైసల్ని కుక్కేటోడిని అక్కయ్యకు తెలియకుంట.
అమ్మ తరఫున గాని నాన్న తరపున గాని మాకు అమ్మమ్మ తాతయ్యలు అప్పటికి ఎవరూ బతికి లేరు. సంక్రాంతి, దసరా గిట్లా పండుగలకు సెలవులు వచ్చినయంటే చాలు. బ్యాగ్ సర్దేసుకుని మా అక్కయ్య వాళ్ళ ఇంట్లో వాలిపోయేటోడిని. ఒక రెండు, మూడు రోజులుండి మా అక్కయ్య పిల్లల్ని తీసుకొని మళ్లీ మా జగిత్యాలకు వచ్చేటోడిని.
జస్ట్ నిన్నకాక మొన్ననే ఫోన్ చేసింది అక్కయ్య.
''ఏరా తమ్ముడు సుధా! కరీంనగర్‌కి ఓ సారి వస్తావారా? ఫోన్లో ఏం చెప్పుడు? నువ్వు వచ్చినంక అన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం గని...''
ఏం చెప్పాలని అనుకుందో ఏమో? ఆమె అంతరంగంలోని కొక్కానికి ఏం వేలాడుతుందో ఏమో? నా పైన ఉన్న ముగ్గురు సోదరుల కంటే నాతోనే ఆమెకు ఎక్కువ చనువు. అందుకని ఆమె అంతరంగాన్ని తరచూ నా ముందు పరిచే ప్రయత్నం చేసేది.
మంచి చెడుల గురించి చానాసేపు ముచ్చట వెట్టేది. బావగారు బతికున్నప్పటి విషయాల్ని గుర్తుకు తెచ్చుకుంట వెక్కీ వెక్కి ఏడ్సేది.
''ఆయన లేరన్న లోటు తప్ప నాకు ఇంకేమి బాధ లేదురా...'' అనుకుంట కన్నీరు చీర కొంగుతో ఒత్తుకునేది.
ఆమె అన్న దాంట్లో అవాస్తవం ఏమీ లేదు. తోడుగా బావ గారు లేరు అన్న ఒకే ఒక్క అసంతప్తి మినహా పరిపూర్ణంగా ఆమె తన జీవనయానం కొనసాగిస్తోందని నాకు తెలుసు. చిన్నవాడు అమెరికాలో సెటిల్ అయ్యాడు. చాలాసార్లు అక్కయ్య అమెరికా వెళ్లి వచ్చింది కూడా. ఇక పెద్దవాడు ఇక్కడే బిజినెస్ చేసుకుంట అమ్మ దగ్గరే ఉంటున్నడు భార్యా పిల్లలతో.
బావగారు ప్రభుత్వ ఉద్యోగి కనుక అక్కయ్యకి నెల నెలా పెన్షన్ చేతికి వస్తది. ఉండడానికి సౌకర్యవంతమైన మూడంతస్తుల భవంతి కూడా ఉంది. ఐదు పోర్షన్లకి అద్దె కూడా వస్తది. ఇలా పైసలకి ఎసువంటి ఇబ్బంది లేదు.
కొడుకుల ముందు చేయి చాచాల్సిన అవుసరం గూడ లేదు. అయినా గీ మధ్య ఎందుకనో తరచూ నాకు ఫోన్ చేస్తంది. ఏందో చెప్పాలని తాపత్రయపడతంది. కానీ చెప్పలేక పోతంది. నోరు విప్పకుంట ముభావంగా ఉదాసీనంగా ఉంటంది. నాతో చెప్పకూడదని కాదు. నా హదయాన్ని కూడా ఎందుకు భారం చేయాలి అనే తలంపు కూడా అయి ఉండచ్చు.
ఇతరుల మనసు నొప్పించి ప్రవర్తించడం ఆమెకి ఎప్పుడు తెలియదు. మంచి మనసు. సహదయురాలు. తనకు ఉన్న ఏవో చిన్న చిన్న ఇబ్బందులు ప్రోది చేసి నన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని అనుకుందో ఏమో?
ఎందుకంటే అమెరికాలో ఆరు నెలలు చిన్న కొడుకు దగ్గర ఉండి వస్తనని చెప్పి వెళ్లిన అక్క మూడు నెలలకే తిరిగి వచ్చింది.
''విషయం చెప్పు అక్కయ్యా! చిన్నోడు ఏమైనా అన్నడా? కోడలి మీద అలిగి వచ్చినవా?'' అనుకుంట ఫోన్లో అడిగితే పెదవి విప్పలేదు. నా నుండి అసువంటి ప్రశ్న వస్తుందని బహుశా ఆమె ఊహించి ఉండక పోవచ్చు.
అందుకే చానా సేపటికి జవాబు వెతుక్కొని మెల్లంగ ''అలాంటిదేం లేదురా! అక్కడ ఉండబుద్ధి కాకనే ఈడికి వచ్చిన'' అంది. కానీ అసలు విషయం మాత్రం బయటకు చెప్పకుంట దాట వేసింది.
సరే, ఇక్కడ ఇండియాలో ఏమైనా కుదురుగా ఉందా అంటే అట్లసుతం గూడ కాదు. సరిగ్గ ఏడాది గడవక ముందే మల్ల అమెరికా పోయి వస్త అనేది చిన్నోడికి ఫోన్ చేసి టికెట్స్ బుక్ చేయమని చెప్పి హడావుడిగా అక్కడికి వెళ్ళి పోయేటిది
''మామయ్య! ఇంటికి వెళ్దామా!'' కదిపాడు రూపేష్ నా ఆలోచన్లను చెల్లాచెదురు చేస్తూ.
''ఏరా? నీ భార్య వైదేహి కనబడడం లేదని'' అడిగిన, వంటకి ఇంటికి పంపించిండేమో అని.
''వాళ్ళ నాన్నకి ఒంట్లో బాగుండటం లేదట మామయ్యా! పిల్లలిద్దరినీ తీసుకొని ఈరోజు ఉదయమే నిజామాబాద్‌కు పోయింది'' అన్నడు వాడు తల వంచుకుని ముభావంగ.
'ఈడ అక్కయ్య ఇంత సీరియస్‌గా ఉంటే భార్యను పుట్టింటికి పంపినవా?' నా నోటి దాకా వచ్చిన మాట తిరిగి గొంతులోకి వెళ్లి పోయింది.
''మరి అక్కయ్యను ఎవర్రా కనిపెట్టుకొని ఉంటంది'' అడిగినా ఆందోళనగ.
''ఒక ఆయాను పెట్టాను మామయ్యా!'' అన్నడు వాడు వడివడిగా అడుగులు బయటకు వేసుకుంట.
వాడి వెంట బయటకు నడుసుకుంట ''మరి చిన్నోడికి టికెట్స్ కన్ఫామ్ అయినయట్నా?'' అడిగిన వాడి కార్లో కూర్చుంటూ.
కారు స్టార్ట్ చేయబోయే ముందు ''ఊ!'' అన్నడు పొడిగా.
''ఫ్యామిలీ మొత్తం వస్తున్నరు గదా?''సందేహం వెలిబుచ్చిన.
కారు నెమ్మదిగా రోడ్డుమీదకు పోయింది.
''మరదలికి లీవ్ ప్రాబ్లమ్ అట. తమ్ముడు ఒక్కడే వస్తున్నడు. అది కూడా వారం ఉండి వెళ్తడట. టైం కుదరడం లేదని చెప్పిండు'' స్టీరింగ్ మీదనుండి తల తిప్పకుండనే సమాధాన మిచ్చిండు రూపేష్.
నా తల గిర్రున తిరిగినట్లు అయింది.
మమతల దారులు ముడుచుకుంటూ... ఆత్మీయాను రాగాల ముడులు విచ్చుకుంటూ... ఏదీ బంధం? ఇంకెక్కడిదీ అనుబంధం? విధ్వంసపు శకలాలపై ఎందాకీ బతుకు పయనం?
ఎక్కడో గుండె అట్టడుగు పొరలు చిరిగి పోయినట్టు మౌనంగా నాలో ఒక అంతర్లీన అలజడి.
నిజానికి ఇన్నాళ్లు అక్కయ్య అటు చిన్న వాడి దగ్గర అమెరికాలో, ఇటు పెద్ద వాడి దగ్గర ఇండియాలో కుదురుగా ఉండలేక పోయింది. ఎందుకనో ఇంత చనువున్న నా దగ్గర కూడా మనసు విప్పి తన బాధను చెప్పుకోలేకపోయింది.
''అక్కయ్యా! నాతో ఏదో చెప్పాలనిపిస్తంది కానీ చెప్పలేక పోతున్నవు. సరే! నా దగ్గర దాస్తే దాచినవు. పోనీ నా దగ్గరకు వచ్చేయ రాదూ! నీకు తోచినన్ని రోజులు ఉండి పోదువు?'' అలాగైనా కాస్త ఆమెకు ఉపశమనం కలుగుతుందేమోనని జగిత్యాలకు రమ్మని కోరితే, నవ్వేస్తూ ''అలాగే లేరా!''అని నా మాట తీసేయకుంట జగిత్యాలకు వచ్చేది.
అలా ఒకటి రెండు రోజులు గడిచాయో లేదో ''ఇక నేను పోత'' అనుకుంట బ్యాగ్ సర్దుకునేది.
''అక్కడికి పోయి నువ్వు చేసేది ఏముంది? ఇక్కడే ఉండి పోరాదూ! నా పిల్లలు హైదరాబాద్‌లో హాస్టల్లో చదువు కుంటున్నరు తెల్సు గద. ఇగ మరదలు ఇంట్లో ఒక్కతేగా ఉండేది. మీరిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంట కాలక్షేపం చేయచ్చు గదా!'' అనేవాడిని.
''మనది రక్త సంబంధం కాబట్టి నా వద్ధాప్యం పట్ల నీవు కురిపించే ఆప్యాయత సహజమే కదరా తమ్ముడూ! మరదలు మరో ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్ల. ఎన్నాళ్ళని నన్ను భరించగలదు చెప్పు? భరించాల్సిన అవసరం కూడా ఆమెకు లేదు కదా!'' అనుకుంట సర్ది చెప్పేది.
ఆమె మాటలు పూర్తికాకుండనే ''ఏందక్కయ్యా? కొత్తగ అట్ల మాట్లాడుతున్నవేంది?'' అన్నగని ఆమె హదయ పరివేదన ఎందుకనో అప్పుడు నాకు వినిపించలేదు. తెలియ రాలేదు కూడా. కానీ ఇప్పుడు అర్థం అవుతోంది. నెమ్మది నెమ్మదిగా బోధపడుతంది.
ఇంటి ముందు కారుని పార్కింగ్ చేసుకుంట ''మావయ్యా! ఫ్రెష్ అప్ అయితే అట్ల బయటకు పోయి భోంచేసి వద్దం'' అన్నడు రూపేష్.
''అట్లనే లేరా! ముందు నువ్వైతే లోపలికి పద. నేను ఒక ఫోన్ కాల్ చేసుకుని వస్త!'' చెప్పి గేటు లోపలే ఆగిపోయిన.
నేను చేసిన కాల్కి స్పందిస్తూ వెంటనే ఫోన్ ఎత్తింది యమున.
''చెప్పుండ్రి! అక్కయ్యకి ఎట్ల ఉంది?''అనుకుంట ఆదుర్దాగా అడిగింది.
నా భార్య కూడా ఎప్పుడూ మా అక్కయ్యని వదిన అని పిలిచింది లేదు. పెద్దావిడ అని నాతో పాటు ఆప్యా యంగా అక్కయ్యా అని నోరార పిలుస్తది.
మా పెద్దబ్బాయి ఇంజనీరింగ్‌లో ఉన్నడు. రెండు నెలలు కావస్తంది. వాడు జగిత్యాలకు రాక. 'నాన్నా! ఈ రోజు ఇంటికి వస్తున్నా' అని పొద్దున్నే నాకు ఫోన్ చేసి చెప్పిండు. వాడు వచ్చే సరికి ఇంట్లో ఎవరో ఒకరం ఉండకపోతే బాగుండదని అక్కయ్యను చూసేటందుకు నేను ఒక్కడినే కరీంనగర్‌కు రావాల్సి వచ్చింది.
అక్కయ్య యోగక్షేమాల గురించి యమున ఆరా తీసేసరికి నిర్వేదంగా నవ్విన.
''మనకు తెలిసి భౌతికంగా అక్కయ్య ఉదయమే కోమాలోకి వెళ్ళిపోయింది. కానీ మనకు తెలియకుండా తన ఇంట్లో తానే నిరాదరణకు గురై ఆమె మానసికంగా ఎప్పుడో కోమాలోకి వెళ్ళిపోయింది. తనలో తానే కుమిలిపోయింది తప్ప ఎవరికీ ఏమీ చెప్పలేదు. చెప్పుకోలేక పోయింది'' చెప్పడం ఆపి ఊపిరి ఆడనట్టు అనిపిస్తే గట్టిగా నిట్టూర్పు వదిలిన.
నేను చెప్పింది అర్థమైనట్టుంది యమున మౌనంగ ఉండిపోయింది ఫోన్లో.
''వంట పూర్తి అయిందా?'' అంటూ మాట మార్చిన.
''ఊ..'' అంటూ ముక్తసరిగ జవాబిచ్చింది.
''అట్లైతే భోంచేసి కరీంనగర్‌కి వచ్చేసేరు! అక్కయ్యను కనిపెట్టుకొని ఉండడానికి ఒక మనిషి కావాలె...'' ఆగి ''...ఇంటి మనిషి కావాలె. వచ్చేటప్పుడు నీకు సరిపడా చీరలు బ్యాగులో వేసుకొని వచ్చేసేరు!'' అంటూ మరో మాటకు తావులేకుండా ఫోన్ పెట్టేసిన.
మౌనంగ తలవంచుకుని ఇంటి లోపలికి నడుస్తుంటే అక్కయ్య లేని ఆ దేవాలయం కళ తప్పిన విషాదం లెక్క బోసి పోయినట్టు... మనసులో కలుక్కుమంది!
గుండె బరువెక్కుతుంటె... చెమ్మగిల్లిన హదయంతో... భారంగ ఇంట్లోకి అడుగు పెట్టిన.
- ఎనుగంటి వేణుగోపాల్
Sun 19 Jun 06:01:53.32769 2022