Sun 03 Jul 00:27:54.661647 2022
Authorization
చదువురాకపోవడం ఒక లోపమైతే, విద్యావంతులకు పరభాషా పరిజ్ఞానం లేకపోవడం మరింత పెద్ద లోపం. యూనివర్శిటీ డిగ్రీ తీసుకుని, పరిశోధనా రంగంలో ప్రవేశించాక వొరొటోవ్కి ఈ విషయం అనుభవంలోకి వచ్చింది.
'ఎలాగ ఈ యిబ్బందిని అధిగమించడం' అంటూ ఒకటే వర్రీ అయి పోయాడు. ఇరవ య్యారేళ్లే. ఎర్రగా, బొద్దుగా వుంటాడు. జీవితమంతా వృధా అయిపోయిందే అనే బాధ మొదలైంది.
బద్దకాన్ని పక్కనబెట్టి అర్జెంటుగా, జర్మన్, ఫ్రెంచి నేర్చుకోవాలి. ఎంత ఖర్చయినా సరే. ట్యూటర్ కోసం వెదికాడు.
ఒక ఉదయం, పనిమనిషి వచ్చి చెప్పాడు.
'ఎవరో ఒకమ్మాయి మీకోసం వచ్చింది సార్.'
'రమ్మను.'
ఇంకా యిరవయేళ్లన్నా నిండనట్టుగా కనిపించే అందమైన పిల్ల తనను ఫ్రెంచి టీచర్‌గా పరిచయం చేసుకుంది. పేరు ఆలిస్ అంకెట్.
'గుడ్. నాకు ట్యూటర్ అవసరముందని మీకెలా తెలిసిందీ? నా ఫ్రెండ్సు పంపించారా ఏమిటి? ఎనీవే, థాంక్స్.'
ఫ్రెంచి స్త్రీలు ఎంత అందంగా ఉంటారు! ఆ హుందాతనం. ఆ వయ్యారం. కోలమొహంలో ఎంత ఆకర్షణ. వీళ్లకు యింత సన్నటి నడుం ఎలా వుంటుంది? జుట్టు ఎంత అందంగా దువ్వుకుందో! చిన్నపిల్లలా కనిపిస్తున్నది కాని కనీసం యిరవైమూడేళ్లన్నా వుండకపోతాయా! ఆ.. అలాగే కనిపిస్తారు. పాతిక కూడా వుంటాయి. కళ్లలో పలకరింపు వున్నది గాని ఆహ్వానం లేదు. 'పనిమీద వచ్చాను. పరిచయం పెంచుకోవటానిక్కాదు' అన్నట్టుగా వున్నాయి కళ్లు. నవ్వనూ లేదు. మొహం ముడుచుకోనూ లేదు. 'డబ్బు విషయం ముందర తేల్చుకుందాం.' అన్నట్టుగా వుందామె ధోరణి.
ట్యూషన్, పిల్లలకోసం అనుకుని వచ్చినట్టుగా వుంది. ఈ మధ్య వయస్కుడికి (లావుగా వుండటం వల్ల అతడలా కనిపిస్తాడు) అని తెలుసుకుని ఆశ్చర్యపడింది.
'సో. మేడం, రోజూ గంట సేపు పాఠం చెప్పండి. ఇంక మీ ఫీజంటారా. పాఠానికో రూబుల్. అంగీకారమేనా?''
వొరొటోవ్ మాట్లాడుతూనే వున్నాడు. టీ తాగుతారా? వాతావరణం బాగుంది కదూ? ముసురు పడుతుందా ఏమిటి? మీ గురించి కాస్త చెప్పండి. ఎక్కడ చదువుకున్నారు? ఇల్లెలా గడుస్తుంది?
ఆమె జవాబులో సాన్నిహిత్యం లేదు. మాట కలపాలనే ఉత్సాహం లేదు. ప్రైవేట్ బాలికల స్కూల్లో చదువుకుంది. తండ్రి యిటీవలే మరణించాడు. తెల్ల కాగితాలతో పూలు చేసి అమ్ముతుంది. ఉదయం ఒక సూలో పనిచేస్తుంది. సాయంత్రం మర్యాదస్తుల యిళ్లలో ట్యూషన్లు చెబుతుంది.
ఆమె వెళ్లిపోయినా, కూర్చున్న చోట ఆమె రాసుకున్న సెంటువాసన పలకరిస్తూనే వున్నది. చేతులు నులుముకుంటూ, ఆమెను గురించిన ఆలోచనల్లో గడిపాడు వొరొటోవ్.
'ఆడపిల్లలు తమ కాళ్లమీద తాము నిలబడితే బాగానే వుంటుంది. కాని యింత అందమైన పిల్లలు గూడా యింత కష్టపడి సంపాదించుకోవాలా? కనికరం లేని లోకం.'
ఫ్రెంచి స్త్రీలు విచ్చలవిడిగా తిరుగుతారని అతడికో నమ్మకం. మరి పురుషుల చూపుల్ని కట్టిపడేసుకోగల ఈ చిలక యితర పద్ధతుల్లో మాత్రం సంపాదించుకోదా! సాయంత్రం ఏడింటికి అయిదు నిమిషాల ముందే వచ్చింది. చలిలో రావడం వల్ల మొహం ఎర్రబడింది. ప్రైమరు పుస్తకం తీసి,
'ఫ్రెంచిలో యిరవై ఆరు అక్షరాలుంటాయి. మొదటి అక్షరం ఎ. రెండవది బి' అంటూ ప్రారంభించింది పాఠం.
వారొటోవ్ అడ్డుపడ్డాడు.
మేడం, నా విషయంలో మీరు పాఠం చెప్పే పద్ధతి కాస్త మార్చుకోవాలి. ఎందుకంటే, మీరేం అనుకోకండి. నాకు రష్యన్, లాటిన్, గ్రీక్ భాషల్లో ప్రావీణ్యం వుంది. తులనాత్మక భాషా శాస్త్రాన్ని అధ్యయనం చేశాను. ఈ ప్రైమర్‌ను పక్కన పడేసి మనం ఏ కథో, నవలో ప్రారంభిస్తే బాగుంటుదనుకుంటాను.'
అంతేనా, వయోజనులకు భాషాబోధన ఎలా చెయ్యాలో తెలియచెప్పాడు.
'మా ఫ్రెండొకడిలాగే చేశాడు. వాడు ఫ్రెంచి, జర్మన్, లాటన్లలో వున్న బైబిల్ ఓకేసారి చదువుతూ, ఒక్కొక్క పదం ఏ భాషలో ఎలా వుంటుందో నేర్చుకున్నాడు. అంతే. ఏడాది తిరిగేలోగా మూడు భాషల్లోనూ పరిచయం కలిగింది. మనమూ అదే పద్ధతి పాటిద్దామా?''
ఆమె విస్మయంగా చూసింది. ఇలా వింతగా మాట్లాడతాడేం ఈ మనిషి. చిన్నపిల్లలెవరైనా యిలాంటి సలహా యిస్తే నాలుగు వాయించేదే. కాని ఈ లావుపాటి పెద్దమనిషి కూడా యింత సిల్లీగా మాట్లాడితే ఏం చెప్పాలో తోచక,
'మీ యిష్టమండి.'' అంది.
వొరొటోవ్ తన పుస్తకాల షెల్పులోంచి అట్టలు చిరిగిన ఫ్రెంచి పుస్తకం ఒకటి తీశాడు.
'ఇది సరిపోతుంది గదూ.'
'ఫరవాలేదు.'
'ఇక ప్రారంభిద్దాం. మొదట పుస్తకం పేరు... మెమొయిర్స్' ఆ పదం అంత నచ్చిందేమో, పదే పదే వుచ్ఛరిస్తూ ఆమె వైపు చూశాడు. తనేం చెయ్యాలి. విసుగ్గా చూసింది. ప్రశ్నలన్నింటికీ ముభావంగా సమాధానా లిచ్చింది.
అతడి మాటలకూ, ఆలోచనలకూ పొంతన లేదు. ఈవిడ అద్దం ముందర చాలా సేపు గడుపుతుందనుకుంటాను. కష్టపడుతున్నానం టుంది. మళ్లీ యిన్ని షోకులు.
సరిగ్గా ఎనిమిదింటికి 'గుడ్ బై, రేపొస్తానం'టూ వెళ్లిపోయిందామె. సుకుమారమైన ఆ సెంటు వాసన మాత్రం మిగిలింది.
గురువు నిష్క్రమించినా, శిష్యుణ్ణి ఆలోచనలు వదలలేదు.
ట్యూషన్ శ్రద్ధగానే చెబుతుంది. మంచిపిల్ల. అన్న టైముకి వస్తుంది. కాని భాషా పరిజ్ఞానం తక్కువ. పెద్దవాళ్లకు ఎలా బోధించాలో అస్సలు తెలియదు.
ఆమె ఫీజు సెటిల్ చేసి, 'ఇంక పాఠాలు చాల'ని చెప్పాలని నిశ్చయించుకున్నాడు. ఇంతకన్నా మంచి టీచరు కావాలి. ఏడో రోజున ఆమె పాఠం ముగించాక, ఏడు రూబుళ్లు ఒక కవర్లో పెట్టి ''అయాం సారీ, మేడం. మీ దగ్గిర ఇంకా నేర్చుకోవాలనే ఉంది. గాని... ఏం చెప్పమంటారు...''అంటూ నసిగాడు.
కవర్లో ఏముందో ఆమెకు తెలుసు. టీచరు విద్యార్థి సంబంధంలో ఆమె చూపిన కఠినత్వం కరిగిపోయింది. కళ్లు వాల్చి దిగులుగా చూసింది. ఒక్కొక్క రూబుల్ ఆమెకు ఎంత అవసరమో అతనికి తెలిసి వచ్చింది. ఈ అమ్మాయికి ఈ మాత్రం సాయమైనా చెయ్యలేడా తను!
''ఒక్క నిమిషం ఆగండి'' అంటూ పక్క గదిలోకెళ్లి, తన ప్రవర్తనకు పశ్చాత్తాపడి, వచ్చి,
'పాఠాలు మళ్లీ ప్రారంభిద్దాం' అంటూ ప్రకటించాడు.
అయితే ఇప్పుడతడికి ట్యూషన్లో ఆసక్తి లేదు. ఆమె ఏం చెప్పినా వింటాడు. విన్నట్టుగా నటిస్తాడు. సందేహాలు లేవు. ప్రశ్నలడగడు. ఒకనాడు పది పేజీలు ఏకధాటిగా అనువాదం చేసి చెప్పింది. అతడి ధ్యాస మరెక్కడో ఉంది. ఆమెను చూస్తూ, సెంటు వాసన ఆఘ్రా ణిస్తూ, తన ఊహల్లో తను....
కేవలం ట్యూషన్ చెప్పించు కుంటున్న పిల్లాడిలా కనిపిస్తు న్నట్టుంది తను ఆమెకు! ఫీజు ఇస్తున్నాడు. యువకుడు. అందగాడు. ఒక్కసారైనా తనను చూసి నవ్వదే! తనెక్కడ తాకుతానోనని భయం తో ముడుచుకుని దూరంగా కూర్చొం టుంది. ఎందుకు తన మీద నమ్మకం లేదు. ఇద్దరూ మంచి ఫ్రెండ్సుగా గడప లేరూ? ''పాఠాలు చెప్పలేకపోతేనేం, నువ్వు మంచిపిల్లవి'' అని నచ్చచెప్ప గలిగితే,
ఒకనాడు అలంకరించుకుని గులాబీ రంగు డ్రెస్సులో, గ్లామరస్‌గా తయారై వచ్చింది. సెంటు వాసన మత్తెక్కించింది. డాన్సుకు వెళ్లాలి. ఈ రోజు పాఠం అరగంటే.
ఫ్రెంచి పడతులు సెక్సీగా ఉంటారని అందరూ ఎందుకంటారో అర్థమైంది. పెర్ఫ్యూమ్, ఒంపులు కనిపించే డ్రెస్సు, కళ్లలో చిలిపిదనం.
ఆమె మాత్రం ట్యూషన్ త్వరగా ముగించాలని గబగబా ఫ్రెంచి వాక్యాలు అనువాదం చేస్తూ పోతున్నది. మెమొయిర్స్ ఎప్పుడో అయిపోయింది. ఇది మరో పుస్తకం.
ఒకనాడు ఏడింటికి బదులుగా ఆరింటికే వచ్చింది. ఏడింటికి నాటకం చూడటానికి పోవాలట. ఆమె వెనువెంటే వొరొటోవ్ కూడా నాటకానికి వెళ్లాడు. ''ఆమెకోసంకాదు. నా సరదా కోసం'' అని తనను తాను నమ్మించుకున్నాడు. తనవంటి మేధావి, పండితుడు, జ్ఞాని కేవలం ఒక ఆడపిల్ల వెంటపడి పోతాడా ఎక్కడైనా?
నాటకం మీద దష్టి లేదు. హాల్లో కళ్లు ఆమెకోసం గాలించాయి. చివరకు ఎదుటి వరుసలో చివరన ఆ గులాబీ డ్రెస్సు. అసూయగా ఉంది.
వెంట మరో ఇద్దరు కుర్రాళ్లున్నారు. ఆమె అంత బిగ్గరగా నవ్వడం తనెప్పుడూ చూడలేదు. ఇప్పుడా మొహంలో పరుషత్వం లేదు. ఎంజారు చేస్తున్నది. ఫ్రీగా కబుర్లు చెబుతున్నది. దగ్గరగా వెళ్లి విష్ చేశాడు. తనను గుర్తించింది కాని మాట్లాడలేదు. బహుశా తను ట్యూషన్లు చెబుతున్నానని కుర్రాళ్లకు తెలియకూడదు కాబోలు.
ఆ రోజు ఆమెను కుర్రాళ్లతో చూసిన క్షణాన, తను ప్రేమలో పడ్డానని గ్రహించాడు వొరొటోవ్. పాఠాలు చెప్పడానికి వస్తూనే ఉందామె. కాని అతడి దష్టి ఆమె శరీరం మీద.
ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ఠంచన్‌గా ఎనిమి దింటికి వెళ్లిపోతూనే ఉంది. అతడిలోని ఆందోళన ఆమెకు ఊహా మాత్రంగానైనా తట్టలేదు.
పాఠం వింటూ కలలు కంటాడు వొరొటోవ్.
'నువ్వే నా హదయేశ్వరి వం'టూ చేతులు చాస్తే... కాని ఆమె మొహం చూడగానే కలలు చెల్లాచెదరవుతాయి. అదే నిరాసక్తత.
ఒకసారి ఆత్మసంయమనం కోల్పోయి ''అలిస్, నువ్వు లేకుండా బతకలేను'' అంటూ ప్రకటించాడు.
ఆమె భయంతో బిక్కచచ్చిపోయింది. ఆ తర్వాత అతడికి ట్యూషన్ చెప్పలేదు. పాఠానికో రూబుల్ ఇక రాదు. అదీ ఆమె బాధ.
''సర్లెండి... వస్తాను''
ఆ రాత్రి అతడికి నిద్ర పట్టలేదు. తన ప్రేమ ప్రతిపాదన తో ఆమెను అవమానించాడా? ఆమె ఇక తన మొహం చూడదా? మొదట ఆమె అడ్రసు కనుక్కుని క్షమించమని వేడుకుంటూ ఒక పెద్ద ఉత్తరం రాయాలి. అంత అవసరం రాలేదు.
తెల్లారి ఆమె యథాప్రకారం ట్యూషన్‌కు వచ్చింది. కొంచెం ఇరకాటంగా వున్నా పుస్తకం తెరిచి పాఠం ప్రారంభించింది.
''ఈ పువ్వులు అలంకరణ కోసం కాదు, యువకుడా, ఇది జబ్బుగా ఉన్న నా చిన్నారిపాప కోసం'' అదీ పాఠ్యాంశం.
పాఠాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికి నాలుగు పుస్తకాలు చదివి పెట్టింది. అతనికొక్క ముక్క వంటపట్టలేదు. 'పరిశోధన ఎందాకొచ్చింది' అని ఎవరైనా అడిగితే అతడు 'ఆకాశం మబ్బుపట్టిందే' అంటూ జవాబిస్తాడు.
మూలం : చెహోవ్
అనువాదం : ముక్తవరం పార్థసారథి