Sun 07 Aug 00:44:16.351956 2022
Authorization
సూర్యగిరి రాజ్యాన్ని విజయసింహ పాలించేవాడు. అశ్వశాలలో ఎన్నో గుర్రాలు ఉన్నా రుద్ర అనే గుర్రం విజయ సింహుడికి ఎన్నో విజయాలను ఇచ్చింది. పరుగు పెట్టడం లోను, ఎత్తైన గుట్టలు అవలీలగా ఎక్కడంలోను రుద్రను మించిన గుర్రం మరొకటి లేదు. అందుకే విజయసింహకు, రుద్ర అంటే అంత ప్రాణం.
ఒకసారి విజయసింహ, రుద్రతో కొత్త ప్రదేశం వెళ్ళాడు. ఆ ప్రదేశాలు చూసుకుని ప్రవహిస్తున్న నది మీద ఉన్న చిన్న వంతెన మీదుగా వస్తుండగా, రుద్ర కాలు జారి నీటిలో పడింది, అయినా నీటిలో ఈదుతూ అతి కష్టంగా రాజును ఒడ్డుకు చేర్చి తాను పట్టు తప్పి నీటిలోకి కొట్టుకుపోయింది.
మరుసటి రోజు చేపలు పట్టే జాలరులు గాయాలతో స్పహ కోల్పోయిన రాజును చూసి కోటకు చేర్చారు. రాజ వైద్యులు రాజుకు సకల వైద్యాలు చేశాక ఒక మాసానికి కొద్దిగా కోలుకున్నాడు. ''రుద్ర... రుద్ర'' అని కలవరించసాగాడు. మంత్రి పక్కన ఉండి అన్నీ చూసుకోసాగాడు. ''మంత్రిగారూ రుద్ర ఏది? రుద్రకు ఏమీ కాలేదు కదా..'' అని అడిగాడు రాజు. ''ఏమీ కాలేదు మహారాజా... కొన్ని గాయాలు అయ్యాయి ఇప్పుడిప్పుడే కోలుకొంటోంది'' అని చెప్పాడు మంత్రి.
రాజుగారిని కోటకు తెచ్చిన రోజు నుండీ, రుద్ర కోసం, రాజు స్పహకోల్పోయిన నది పరీవాహక ప్రాంతమంతా వేగులతో వెతికించాడు మంత్రి. కొన్ని రోజులకు రుద్ర చనిపోయి నీటి మీద తేలుతూ చారులకు కనిపించింది. రుద్రను ఒడ్డుకు చేర్చి మంత్రికి సమాచారం ఇచ్చారు. మంత్రి, వీరయ్య ఆ ప్రాంతానికి వచ్చి ఎన్నో విజయాలకు కారణమయిన రుద్రను చూసి కన్నీరు మున్నీరయ్యారు. తరువాత అతి గోప్యంగా రుద్రను అక్కడ చెట్ల మధ్యలో ఖననం చేయించాడు మంత్రి.
మహారాజు క్రమక్రమంగా కొలుకొంటున్నా రుద్ర మీద ప్రేమతో మానసిక వేదనకు గురి అవుతున్నారు అని రాజ వైద్యులు, మంత్రి గ్రహించారు. దీనికి ఏదైనా తరుణోపాయం ఆలోచించాలి అని కొందరితో సమావేశమయ్యాడు మంత్రి. అందులో అశ్వశాలలో పని చేసే వీరయ్య కూడా ఉన్నాడు. ''మంత్రి గారూ పొరుగున ఉన్న చంద్రగిరి రాజ్యం చిత్రసేన మహారాజు మన రాజుగారికి మంచి స్నేహితులు. నాకు అక్కడకు వెళ్లడానికి అనుమతి ఇవ్వండి అక్కడ అశ్వశాలలో నా మిత్రుడు సహదేవుడు పనిచేస్తున్నాడు. రుద్రను పోలి ఉన్న గుర్రం మనకు దొరికితే మహారాజు పూర్తిగా కోలుకుంటారు'' అన్నాడు వీరయ్య.
పొరుగు రాజ్యం వెళ్లడానికి వీరయ్యకు అనుమతి ఇచ్చాడు మంత్రి. అన్ని విషయాలను గుప్తంగా ఉంచాలని అందరూ తీర్మానించారు. ముఖ్యంగా రాజా వైద్యుల సూచన మేరకు రుద్ర కోలుకోంటోందని రాజుకు ఎప్పటికప్పుడు చెప్పాలని అనుకున్నారు.
వీరయ్య, చిత్రసేన మహారాజును కలసి విక్రమసింహ మహారాజు గురించి చెప్పి, రుద్ర లాంటి గుర్రంతో పోలి ఉన్న గుర్రం కావాలని అడిగాడు. అందుకు అంగీకరించాడు చిత్రసేనుడు. వీరయ్య గుర్రపుశాలకు వెళ్ళి మిత్రుడు సహదేవుణ్ణి కలిసి అతనికి కూడా విషయం చెప్పాడు. ''మిత్రమా! రుద్ర ఏ రంగులో ఉంటుందో చెప్పు'' అన్నాడు సహదేవుడు. ''గోధుమ రంగు, అక్కడక్కడా తెల్ల మచ్చలు, తోక నలుపు రంగు'' అని చెప్పాడు వీరయ్య.
దాదాపు రుద్రతో సరిపోయే గుర్రం ఒకటి అశ్వశాలలో కనిపించింది. ''మిత్రమా! ఇది సరిపోతుంది'' అన్నాడు వీరయ్య. సరే అని దానిని అక్కడ నుండి మైదానంలోకి తీసుకు వచ్చి, వీరయ్యకు మచ్చిక అయ్యేట్టు చేశాడు సహదేవుడు. రెండు రోజులకు ఆ గుర్రం వీరయ్యకు బాగా మచ్చిక అయ్యింది. చిత్రసేన మహారాజుకు, మిత్రుడు సహదేవుడికి కతజ్ఞతలు చెప్పి ఆ గుర్రం మీద సూర్యగిరి చేరుకున్నాడు వీరయ్య.
మంత్రిని కలిసి తెచ్చిన ఆ గురాన్ని చూపించి రుద్రలా తీర్చి దిద్దడానికి ఒక వారం రోజుల సమయం కావాలని చెప్పాడు వీరయ్య. మంత్రి సరే నన్నాడు. వారం రోజులకు ఆ గుర్రం వీరయ్య చెప్పినట్టు నడుచుకుంది. ఒకరోజు విజయ సింహ మహారాజును ఆ గుర్రం వద్దకు తీసుకు వెళ్ళగానే ఆ గుర్రం ఎంతో ప్రేమగా సకిలించింది. రాజు కళ్లు చెమ్మగిల్లాయి. ప్రేమతో ''రుద్రా.. నిన్ను చూసి ఎన్నాళ్లయ్యింది'' అని ఎంతో ప్రేమతో తల నిమిరాడు.
ఆ గుర్రాన్ని చూసిన రాజుకు ఎలాంటి సందేహం కలగ లేదు. కొన్ని రోజుల్లోనే రాజు పూర్తిగా కోలుకొని మళ్లీ ఆ గుర్రం మీద స్వారీ చేయసాగాడు. మహారాజు పూర్తిగా కోలుకోవడానికి కారణమైన వీరయ్యను, మహారాణి, మంత్రి ఎంతో ప్రశంసించారు తరువాత ఒకరోజు మంత్రి, వీరయ్యలు చిత్రసేన మహారాజును, సహదేవుడిని కలసి మహారాజు పూర్తిగా కోలుకున్నాడని వారికి కతజ్ఞతలు చెప్పారు.
- యు.విజయశేఖర రెడ్డి