అది ఫ్యాక్టరీ కూలీల కోసం పెట్టిన హోటలు. అక్కడ అర్థణాకు ''చా'' దొరుకుతుంది. అణా పెడితే కాసిని ''భజ్యా'' తిని ''చా'' తాగవచ్చు. సాహసించి ఇంకో అర్థణా ఖర్చు పెట్టదలచినవాడు ''పాప్ ఉసల్''తో పొట్టనింపురుని ''చా'' తాగి పోవచ్చు. ''భజ్యా'' అంటే శనగపిండితో చేసిన పకోడిలు. ''పాప్'' అంటే నాలుగౌన్సుల రొట్టె. ''ఉసల్'' అంటే శనగలుగాని, అల్చందలుగాని వేసి నీటితో మరగ బెట్టిన కూర. అందులో రొట్టి ముంచుకు తినవచ్చు. ఉదయం ఏడున్నరకల్లా ఫ్యాక్టరీ పనివాళ్ళు ఒక్కొక్కరే వచ్చి కూచుని హిందీలోనూ, మహారాష్ట్రలోనూ తమకు కావలసిన ఆహారపదార్థాలు అతి తొందరగా ఆర్డరివ్వసాగారు. పదార్థాలందించే వాడేకాక, గల్లాదగ్గర కూర్చున్నవాడు కూడా ''ఏక్ గ్లాస్ పానీదే. ఏక్ లెమన్ దో!'' అని కేకలు పెడుతూ, తినేవాళ్ళ అవసరాలు కనుక్కుంటున్నాడు.
ఈ హోటల్లోకి ఒక కుర్రాడు వచ్చాడు. అందరి కళ్ళూ వాడు తొడుక్కున్న కొత్త చొక్కా మీద, కొత్త ధోవతి మీదా పడ్డాయి. కాని వాడి పల్లెటూరి మొహం తెలిసిపోతూనే వుంది. కుర్రాణ్ణి ఒక గుండ్రని బల్ల దగ్గర కూర్చోబెట్టి వస్తువులందించే వాడు, ''కారు పాహిజేమలా?'' అని అడిగాడు.
కుర్రాడికి ప్రశ్న అర్థమయింది గాని వాడు వెంటనే సమాధానం చెప్పలేక పోయాడు.
వాడు మొఖానికి అడుగున్నర దూరంలో పెద్ద గాజు జాడీ నిండా తెల్లటి మజ్జిగ పోసి పెట్టి వుంది. బల్లమీద పరచిన చలవరాతి పలకలూ, నేలమీద పరచిన నున్నటి కృత్రిమ చలవరాతి పులకలూ వాడికి ఆశ్చర్యం కలిగించాయి. ఈ హోటలుకు జమీందార్లు కూడా వస్తారని వాడికి దృఢ విశ్వాసం కలిగింది. బల్లల దగ్గర కూర్చున్న వాళ్ళల్లో జమీందార్లెవరన్నా వున్నారేమో చూతామంటే మజ్జిగ జాడీ మూలంగా సాధ్యపడలేదు.
''ఏం కావాలి!'' అని మళ్ళీ అడిగాడు వస్తువులందించేవాడు.
''ఏమున్నరు!'' అన్నాడు కుర్రాడు. హోటలువాడు అన్నీ ఏకరువు పెట్టాడు. ''పూరీ, శిరా, బటాటా, పాప్, ఉసల్, భజ్యాస, చా, లెమన్, తాక్, షర్బత్....''
కుర్రాడు జాగర్తగలవాడు. అన్నిటి ధరలూ కనుక్కుని రెండణాలన్నరతో దాటకుండా ఆర్డరిచ్చాడు.
హోటలు నుంచి ఫ్యాక్టరీకి ఎంతో దూరం లేదు. కొండపక్కగా వెళ్ళే అందమైన రోడ్డు నేరుగా ఫ్యాక్టరీల దగ్గరికి తీసుకుపోతుంది. రోడ్డుపక్క వరసగా ఇరవై ఇళ్ళున్నాయి. కొత్తగా కట్టినవి, చాలా అందమైనవి. వాటిని దాటి ఒక ఫర్లాంగు పోతే రెండు ఫ్యాక్టరీలు ఒకదాన్నానుకుని మరొకటి వున్నాయి. ఒక అరఫర్లాంగు అవతల మూడో ఫ్యాక్టరీ వుంది. ఆ రోడ్డు వెంబడి వచ్చాడు కుర్రాడు. వాడికేదన్నా కూలి పని కావాలి.
మొదటి ఫ్యాక్టరీ నిర్జీవంగా కనిపించింది. రెండో ఫ్యాక్టరీ గేటుకెదురుగా రోడ్డు ఆవలివేపున నలుగురైదుగురు మనుషులు నిలబడి వున్నారు. వాళ్ళూ పనికోసమే నిలబడి వున్నారని మన కుర్రాడికి తెలీదు. వాడు గేటు దగ్గర నిలబడి వున్న పఠానువాణ్ణి గమనించకుండా గేటు దగ్గరికి పోయి లోపలికి తొంగిచూశాడు. లోపల చాలా అందంగా వున్నది. ఒక పక్కగా చిన్న కంచె మీద అందమైన లత ఒకటి పాకుతున్నది. దాని వెనక కొన్ని తొట్ల మొక్కలు చక్కగా పెట్టారు. ఫ్యాక్టరీ చాలా లోపలిగా వున్నది.
''పనిచేస్తే ఇటువంటి ఫ్యాక్టరీలో పనిచెయ్యాలి'' అనుకున్నాడు వాడు. పెట్టి పుట్టిన పనివాళ్ళు అటువంటి చోట పనికి కుదురుతారనుకున్నాడు.
ఇంతలో - పఠాన్ గొంతు వినిపించింది.
''ఏరు, ఏంకావాలి?''
కుర్రాడికి హిందీ ఏమీ రాదు. కాని ప్రశ్న అర్థమయింది.
''పని'' అన్నాడు వాడు.
''పోయి వాళ్ళ దగ్గర నిలబడు... అదుగో యజమాని కారు. వెళ్ళు. వెళ్ళు. వెళ్ళు.''
కంగారుతో కుర్రాడు రోడ్డు దాటి అవతల పడ్డాడు. వాడవతలికి వెళ్ళిన తక్షణంలోనే నల్లని కారొకటి అతివేగంగా వచ్చి గేటులోకి తిరిగి లోపలికి వెళ్ళి పోయింది.
ఆ కారులో వున్న ''మాలిక్'' తనను గేటు దగ్గర చూసి కోపం తెచ్చుకున్నారేమో. తనకు పని యివ్వడేమోనని కుర్రాడికి బాధకలిగింది. ఆ నల్లకారు కింద పడ్డా వాడికంత బాధ కలిగి వుండదు.
2
ఫ్యాక్టరీల ముందు నిత్యమూ పనికోసం నుంచునే వాళ్ళను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆ ఫ్యాక్టరీలలో ఏం చేస్తారో వారికి అవసరం లేదు. అది వనస్పతి ఫ్యాక్టరీ గానీ, లోహపు ఫ్యాక్టరీ గానీ, బట్టలమిల్లుకానీ వాళ్ళకు ఒకటే. చదువు వెంట పెట్టుకు పొయ్యేవాడికి ఉద్యోగం దొరకదగిన స్థలాలూ, దొరకదగని స్థలాలు అంటూ వుంటాయి. వాడు తనవెంట ఏదో తెచ్చుకుంటాడు. పారిశ్రామిక కూలీ తన కండలూ, ఎముకలూ తప్ప యింకేమీ తీసుకురాడు. గొట్టంలోంచి పొగలు వచ్చే ఏ చోటైనా వాడికి పోదగిన చోటే. ఏ చోటు అచ్చివచ్చేదీ, ఏది అచ్చిరానిదీ దైవాధీనం. ఒక ఫ్యాక్టరీలో నాలుగు రోజులే వుండవచ్చు. మరో ఫ్యాక్టరీలో నాలుగు నెలలుండవచ్చు. కాలక్రమాన ఏదీ అచ్చిరాని చోటే. ఎందుచేతనంటే నాలుగేళ్ళలోనూ వుండడు. ఆ తరువాత మళ్ళీ జీవితం ఎప్పటి చోటికి రావటమంటే పనివాడు తన కండలన్నీ వున్నవి వున్నట్టు వెనక్కి తెచ్చుకుంటాడని కాదు. అది ఎన్నటికీ జరగదు. అంతో యింతో రక్తమూ, కండలూ ఫ్యాక్టరీకి ముట్టవలసిందే. ఫాక్టరీల నుంచి బయటికివచ్చే సమయానికి పొరపాటున నాలుగు డబ్బులు జేబులో మిగిలినా అవి పూర్తిగా అయిపోతేగాని మళ్ళీ యింకోచోట పని కుదరదు. ఇది కూలివాళ్ళకు అమ్మవారి శాపం. సులభంగా పని దొరికే యుద్ధకాలంలోనే ఈ విధంగా వుంటే యితర సమయాల సంగతి వేరే చెప్పాలా?
ఆ ఫ్యాక్టరీ బయట పనికోసం నిలబడ్డ వారిలో ఒకరిద్దరు చాలా రోజుల నుంచి పని దొరకనివారున్నారు. ఫ్యాక్టరీ ప్రారంభమై అరగంటలోగా పని దొరికేది లేనిదీ తెలిసిపోతుంది. ఆ తర్వాత యింకోచోటికి వెళ్లి లాభం వుండదు. అంతా లాటరీ.
ఈ లాటరీలో మన కుర్రాడి అదృష్టం బాగున్నది. యజమాని కారు లోపలికి వెళ్ళిన కొద్దిసేపట్లో లోపలినుంచి ఎవరో వచ్చి నిలబడి వున్న వాళ్ళకేసి ఒకసారి చూసి ''తుమ్ ఆవ్. తుమ్ ఆవ్'' అని మన కుర్రవాణ్ణి, మరొక యువకుణ్ణి లోపలికి పిలుచుకు వెళ్ళాడు. ఇది బొత్తిగా లాటరీ అనటానికి కూడా వీలులేదు. ఇది ఫ్యాక్టరీ స్వయంవరం. ఇందులో కండపుష్టి, యవ్వనమూ చప్పున ఆకర్షిస్తాయి. లోపలికి పోయిన తరువాత ఆ మనిషి మన కుర్రాడి వంక తిరిగి చాలా తొందర పని మీద ఉన్నవాడల్లే మాటాడుతూ, ''నీ పేరేమిటి?'' అన్నాడు.
''విఠల్ పాండురంగ్.''
''ఎప్పుడన్నా ఫ్యాక్టరీ పనిచేశావా!''
''లేదు.''
''రోజుకు మూడు పావలాలు మజూరీ. మూడు పావలాలు మాంగాయూ, ఈ ఖాతలో పనిచెయ్యి.''
తనకు నిజంగా యెంతో గౌరవం జరిగినట్టు భావించుకున్నాడు విఠల్. రోజుకు రూపాయిన్నర చొప్పున నెలకు? కనీసం 25 రోజులు పనిచేసినా ముప్పై ఏడున్నర అయి ఏడాదికి 450 రూపాయలు! తమ ఊళ్ళో ఆడా, మగా, పిల్లా మేకా కలిసి ఏడాది పొడుగు వొళ్ళు విరుచుకున్నా పొలం పనిలో అంత గాదే! ఎంత అదృష్టం... అదీ కాక ఎటువంటి పని! ఎంత తెలివైన పని! ఎంత శుభ్రమైన చోటు! మట్టిలేదు. బురదలేదు. ఫ్యాక్టరీ వొదిలిన మరుకం చీకూ చింతా లేదు. రోజుకు ఎనిమిది గంటలు! తమ పల్లెటూళ్ళో పనికి అంతూ పంతూ వుందా? ఎంత చేసినా తరగదు. ఈ పట్టణంలో ఎన్ని బస్సులు, ఎన్ని ట్రాములు, ఎని సినిమాలు! ఎంత బస్తీ..
ఒక మూల ఆవరణలోనే ఒక లారీ నిలబడి వున్నది. ఆ లారీనిండా లోహపు అచ్చులున్నాయి. నలుగురు పనివాళ్ళు లారీలోకి ఎక్కి ఆ అచ్చులను కిందవున్న కూలీలకు అందిస్తున్నారు. కిందవున్న పనివాళ్ళు వాటిని లోపలికి తీసుకుపోయి పేరుస్తున్నారు. అవి రాగిదిమ్మలు. ఎర్రగా వున్నాయి. లోపలికి చేరవేయమని విఠల్‌ను నియోగించారు. ప్రతి కూలివాడూ ఒక్కొక్క చేత్తో ఒక్కొక్క దిమ్మను పట్టుకుని వగర్చుకుంటూ పోతున్నాడు. రెండు చేతులకూ అడ్డంగా పెట్టే వాళ్ళుంటే మూడేసి కూడా మొయ్యవచ్చుననిపించింది. ఈసారి లారీ దగ్గరికి వచ్చినప్పుడు విఠల్ చేతులు రెండూ ముందుకు పెట్టి వాటి మీద దిమ్మలు పెట్టమని లారీలో నిలబడ్డ కూలీకి సూచించాడు.
''చాల్లే, గొప్ప పనివాడివి! అందుకో'' అన్నాడు లారీలో వాడు.
''మూడేసి పట్టుకుపోతా'' అన్నాడు విఠల్.
''అందరూ చేసినట్టు చెయ్యి'' అన్నాడు లారీలో వాడు, తానే విఠల్ యజమానిలాగా. విఠల్ నిరుత్సాహపడ్డాడు.
3
విఠల్ పనిలో ప్రవేశించి నాలుగు రోజులయింది. అప్పటికి వాడికి ఫ్యాక్టరీ కొత్త తీరింది. మనుష్యుల కొత్తా తీరింది. కాని ఫ్యాక్టరీ పని వైనం వాడికర్థం కాలేదు. ఇది మనిషి చెయ్యగల పనేగాని మనుషులు చేసినట్లు చేసేపని కాదు. ఈ పని ఎవరో తరుముకొస్తున్నట్టుగా చెయ్యాలిసిన పని. పాటలు పాడుతూ, మాట్లాడుతూ చేసేపని కాదు. ఇష్టమై చేసినట్టుగా చేసేపని కాదు. అందుచేత గామాలు ఈ ఫ్యాక్టరీ కూలీలు తాము చేసిన పని మీద ఏదో పగ వున్నట్టు చేస్తారు గాని ఆప్యాయంగా చెయ్యరు. చేసేపని గురించి మాట్లాడరు. మాట్లాడినా గునుస్తూ మాట్లాడతారు.
మిగిలిన పనివాళ్ళు మొట్టమొదటిరోజు తనను చాలా వేళాకోళం పట్టించారు. మొదటి కారణం తన దుస్తులు.
''నీవు కూలీవా ముకద్దమువా? అని అడిగారు. వాళ్ళు నవ్వుతూ. ఒక పెద్దవాడు ''రేపణ్ణుంచి పనిచేసే గుడ్డలు వేరే తెచ్చుకో- ఇక్కడ నిజంగా పని ఉంటుంది'' అన్నాడు చాలా మంచిగా. నిజానికి వాళ్ళందరూ కుళ్ళుగుడ్డలే వేసుకున్నారు. వాళ్ళే కాదు, ''సాబ్''లు కూడా కుళ్ళుగుడ్డలే వేసుకున్వారు.
మిగిలిన పనివాళ్ళు ఏ తరగతి నుంచి వచ్చిందీ విఠల్ గ్రహించలేక పోయినాడు. కాని వాళ్ళెవ్వరికీ తనకున్న హోదా ఇంటి దగ్గర లేదేమో అనిపించిది. ఇంటి దగ్గర తనవాళ్ళు గౌరవ కుటుంబీకులు. కాకపోతే కొద్ది పొలం మీద చాలా మంది పడి తినటం చేత కొంత అప్పయింది. తన ఉత్సాహం కొద్దీ తాను పట్నం వచ్చాడు గాని తననెవరూ పొమ్మనలేదు. ఏ రోజు తన కిష్టం లేకపోతే ఆ రోజు తానీపని మానేసి ఇంటికి పోతాడు. కాని పాపం, వీళ్ళ గతేమిటి? వీళ్ళలో చాలా మంది ఎన్నో ఏళ్ళుగా ఈ చాకిరీ చేస్తున్నారు. ఈ పని లేకపోతే వీళ్ళు వీధిలో నిలబడి అడుక్కుతినాలి.
మచ్చుకు ''భయ్యా'' ఉన్నాడు. వాడు వెయ్యిమైళ్ళ దూరం నుంచి వచ్చి ఇక్కడ పడ్డాడు. వాడు వేలిముద్రగాడు. చదువు రాకపోవడమేగాక వొఠి మట్టి బుర్ర. అందరూ ఏడిపిస్తారు. బండపని వాడికి చెబుతారు. వాడికి అలుపంటే ఏంటో తెలీదు. వాడు వచ్చి ఎన్నో రోజులు కాలేదు. పనిలో చేరింది లగాయతు వాడు అర్థణా పెట్టి టీ తాగిన పాపాన పోలేదు. ఇన్నాళ్ళూ వాడు తిండికూడ తినటం లేదుట. తనగదిలో - ఇంకా ఆరుగురు కూడా ఆ గదిలోనే ఉంటున్నారు. వాడు శనగలు నానేసుకొని అవే తింటున్నాట్ట. వెధవకు తెగులు పుట్టుకొచ్చి మొహమంతా ఉబ్బింది. కళ్ళవెంట పుసులు కారసాగాయి.
''నీకేం బుద్ధిలేదా? శనగలు తింటే చచ్చిపోతావు. నీకు పెళ్ళామా, పిల్లలా? సంపాదించినదంతా హాయిగా తినలేవూ? రాయంటి వొళ్ళు మట్టి చేసుకుంటావు. జాగర్త'' అని ''చాచా'' వాణ్ణి గట్టిగా కోప్పడ్డాడు.
''చాచా'' పఠాన్ పేరు రహమాన్. అందరూ ''చాచా'' అని పిలుస్తారు. వయస్సు 62. 1914 యుద్ధంలో యుద్ధ రంగాన రైళ్ళు నడిపాడు. ఇప్పటికీ పుష్టిగా, బలంగా ఉన్నాడు. ఒకనాడు ''చాచా'' విఠల్‌కు తన కథ చెప్పాడు. యుద్ధం నుంచి తిరిగి వెళ్లిన తరవాత ''చాచా'' తాను మిగుల్చుకున్న డబ్బుతో సరిహద్దున కొంత పొలం కొన్నాడు. పత్రాలూ, సాక్ష్యాలూ లేవు. అక్కడి వాళ్లకి కచ్చేరీలలో నమ్మకం లేదల్లే ఉంది. పొలం అమ్మినవాడు ఏదో పేచీ పెట్టి ''చాచా''ను పొలం మీది నుంచి పంపించాలని చూశాడు. ''పొలంలోకి అడుగు పెడితే చంపుతా'' అన్నాడు ''చాచా''. పొలం అమ్మినవాడి మనిషి వచ్చి ''చాచా'' చెయ్యి పట్టుకుని, ''ఒకసారి అవతలికి రా, ఒక్కమాట వినిపోదూగాని'' అన్నాడు.
''చెయ్యి వదులు'' అన్నాడు ''చాచా''.
వాడు వదల్లేదు. రెండో చేతిలో ఉన్న కర్రతో ''చాచా'' వాడి మణికట్టుకు ఎగువగా ఒక్కటే దెబ్బ పెట్టాడు. వాడి చెయ్యి విరిగింది. ''చాచా''ను మూడేళ్ళు ఖైదులో ఉంచారు.
ఖైదులో నుంచి వస్తూనే ''చాచా'' కొత్త ఉద్యోగం చూసుకున్నాడు - ''డాకూ'' ఉద్యోగం.
''డాకూ అంటే దొంగకాదు'' అన్నాడు ''చాచా'' గర్వంగా. ''అదొక ఉద్యోగం కష్టమైన ఉద్యోగం. నీ భార్యాబిడ్డల్ని నువ్వు రహస్యంగా పోయి చూడాలిసిందే గాని, వాళ్ళకు నువ్వుండే చోటు చెప్పటానికి వీల్లేదు.''
''డాకూలు ఎక్కడుంటారు?''
''ఎక్కడుంటారు? ఎవరికీ తెలీకుండా కొండల్లోనో, అడవుల్లోనే ఉండాలి.''
''ఎవరూ చూడరారూ?''
''రావచ్చు, కాని నాకు అంతదూరంలో నిలబడాలిసిందే. నా సరసన నిలబడటానికి వీల్లేదు - తమ్ముడయేది తండ్రి అయేది.''
''ఏమల్లా?''
''డాకూ ఎవర్నీ నమ్మడు. డాకూను పట్టిస్తే సర్కారు డబ్బిస్తుంది. దగ్గిర వాళ్ళే కక్కుర్తి పడవచ్చు. అందుచేత, ఎదురుగా నిలబడు! అంతే! పక్కకి రాకు! భుజం మీద చెయ్యి వేశావా?''
''చాచా'' తన భుజం మీద ఎవరో వేసిన చేతిని ఒక్కసారిగా తోసేసి వాడి మీద తుపాకీ బారు చేసినట్టు అభినయించాడు. ఒక్కక్షణం పాటు ''చాచా'' కళ్ళల్లో డాకూ చూపు కనిపించినట్టే తోచింది. విఠల్‌కు.
4
ఆవకాశం దొరికినప్పుడల్లా విఠల్ లఖ్ఖ వేస్తుండేవాడు. తాను నెలకు హీన పదిరూపాయలు మిగల్చవచ్చు. కొంచెం కష్టపడితే పదమూడు, పధ్నాలుగూ కూడా మిగల్చవచ్చు. ఇంటి దగ్గర రెండొందల యాభై బాకీ ఉంది. మిగిలిన డబ్బంతా ఇంటికి పంపివేస్తే రెండేళ్లలో బాకీ తీరిపోతుంది.
మొదటినెల పన్నెండు రూపాయలింటికి పంపించినప్పుడు విఠల్ ఆనందానికి మేరలేదు. తన గురించి తన తల్లీ, అన్నలూ ఎంత సంతోషిస్తారో వాడు ఊహించుకున్నాడు. ఆ మనియార్డరుతో బాటే తాను కూడా వెళ్ళి మొహాలు చూడాలనిపించింది. ఇల్లూ, గొడ్డూ, పొలమూ జ్ఞాపకం రాగానే కడుపులో ఏదో ఆవేదన కలిగింది. కాని అభిమానం అడొచ్చింది. అప్పు తీర్చిగాని ఇంటికి తిరిగిపోరాదు. కనీసం సగం అప్పన్నా, అధమం యాభై రూపాయలన్న చెల్లువేసి మరీ వెళ్ళాలి. ఏంలేదు. తనకు శలవెవరిస్తారు? ఒకవేళ ఇచ్చినా ఇంటికి వెళ్లి రావాలంటే ఒక నెల మిగిల్చేదంతా ఖర్చన్న మాటే. నెలల్లా చేసిన శ్రమంతా వధా!
రెండో నెల గడిచింది. మూడోనెలా నాలుగో నెలా కూడా గడిచాయి యిప్పుడు విఠల్‌కు ఒంట్లో వున్న జవసత్వాలు లేవు. ఆ ''చా'' దుకాణంలో తినేది తనకు పడటం లేదు. ఒక్కసారి యింటితిండి తినటానికైనా వెళ్లిరావాలనిపించింది. కాని ఎట్లా? మొదట్లో ఫ్యాక్టరీ నుంచి ఇంటికి వెల్చేటప్పుడే నీరసంగా ఉండేదిగాని, తెల్లవారి నిద్రలేచిన తర్వాత ఉత్సాహంగానే ఉండేది. ఇప్పుడిప్పుడు వాడికి నిద్ర వల్ల శరీరం బడలిక తీరటం లేదు.
''వెధవ తిండి, వెధవ పని, వెధవ బతుకు!'' అనుకునేవాడు విఠల్. తిండి కన్నా, పనికన్నా ఈ బతుకే వింతగా ఉండేది వాడికి. తాను ఇక్కడ ఎట్లా బతుకుకుతున్నదీ చెబితే యింటి దగ్గర ఎవరూ నమ్మరు. ఈ జీవితం శుద్ధ అబద్దమనీ, ఇట్లా జీవిస్తూ తాను మారువేషం వేస్తున్నానని విఠల్ భావించాడు. ఆ బాకీ తీరిన మరుక్షణం తాను ఫ్యాక్టరీకి చిన్న సలాంకొట్టి యింటికి తిరిగిపోతాడని తన తోటి పనివాళ్ళెరగరు. తాను ఇక్కడ ఏ విధంగా జీవిస్తున్నదీ యింటి దగ్గర తన వాళ్ళకు తెలీదు.
ఇప్పటికి తాను 30 రూపాయల బాకీ తీర్చేశాడు. ఇక ఇంటికి పోతేనేం? ఆ బాకీ అంతా తీర్చాలని తనలో తాను శపథం చేసుకున్నాడేగాని ఎవరూ తన చేత చేయించలేదు. అదంతా తాను తీర్చెయ్యవలసిన అగత్యం కూడా లేదు. కాని ఇంటికి పోదామని నిశ్చయం చేసుకున్నప్పుడల్లా విఠల్ అంతరాత్మ ''నువు మనిషిని కావా?'' అని అడిగేది.
విఠల్ ఈ సందిగ్ధంలో ఉండగా సమ్మె వచ్చింది. ఆ రోజుల్లో సమ్మెలు చీటికీ మాటికీ జరగటం లేదు. ఇది కార్మిక నాయకత్వంతో కూడిన అధికార సమ్మె కూడా కాదు. డిసూజా అను ఫోర్మనుకూ ఒక పనివాడికీ కొద్ది రోజులుగా ముసుగులో గుద్దులాట జరుగుతూ అది ఒకనాడు ''నువ్వంటే నువ్వు'' అనుకునేదాకా వచ్చింది. ఫ్యాక్టరీ యజమాని డిసూజా పక్షమై ఆ పనివాణ్ణి తొలగించాడు. నోటీసైనా లేకుండా అప్పటికప్పుడు పని వాళ్ళంతా సమ్మె నిర్ణయించారు. ఎక్కడి వాళ్ళక్కడ పని వదిలేసి ఆవరణలోకి వచ్చారు. అందరూ తలా ఒక్క మాటా మాట్లాడుతున్నారు. ఇద్దరేసి, ముగ్గురేసి నలుగురేసి ముఠాలుగా చేరి, అవుననీ కాదని ఘర్షణ పడసాగారు.
ఫ్యాక్టరీ మేనేజరు బయటికి వచ్చి, ''ఒక్క నిమిషంలో లోపలికి వచ్చి పని చెయ్యని వాళ్ళందర్నీ బయటికి పంపించేస్తాను'' అన్నాడు. కొంత మంది లోపలికి వెళ్ళారు. విఠల్ కూడా వాళ్ళతోబాటు లోపలికి వెళ్ళాడు. మిగిలిన వాళ్ళను బయటికి పొమ్మన్నాడు.
తీరా లోపలికి వచ్చిన తరువాత విఠల్ ఆశ్చర్యపడ్డాడు. లోపలికి వచ్చిన వాళ్ళు ఇరవైమంది కూడా లేరు. దాదాపు యాభై మంది వెళ్ళిపోయారు. అందరూ లోపలికి వస్తారనుకున్నాడు విఠల్. ''సాబ్' మాటకు కూలీలు ఎదురు చెప్పటమంటూ ఉండదని విఠల్‌కు సందేహం కూడా కలుగలేదు. ఈ సంగతి ముందు తెలిస్తే తాను కూడా బయటికే వెళ్ళేవాణ్ణనుకున్నాడు విఠల్.
రెండు గంటలపాటు ఫ్యాక్టరీలో ఏ పనీలేదు. ఫ్యాక్టరీకేదో పెద్ద సుస్తీ చేసినట్టయింది. లోపల్నుంచి బయటికీ, బయటి నుంచి లోపలికి ఏం రాయబారాలు జరిగాయో విఠల్ ఎరగడు. రెండు గంటలు దాటిన తరువాత ఫ్యాక్టరీ బయట పెద్ద పెడబొబ్బ వినిపించింది. బయటికి పోయిన వాళ్ళంతా పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చారు. ''జీత్‌గయా, సాలా!'' అనే ప్రతిచోటా వినిపించింది. పనివాళ్ళలో అంత ఉత్సాహం విఠల్ ఎన్నడూ చూడలేదు... సమ్మె అయిపోయింది. తీసిన మనిషిని మళ్ళీ పనిలోకి రానిచ్చారు.....
ఒక మహారాష్ట్ర పనివాడు నేరుగా విఠల్ దగ్గరకు వచ్చి ఎందుకో చెప్పకుండా మహారాష్ట్ర భాషలో తిట్టిపొయ్యసాగాడు. నాకేమీ తెలీదుబాబో, అని విఠల్ ఎంత చెప్పినా వాడి ధోరణి ఆగలేదు. అందరూ సమ్మెచేస్తే తాను చెయ్యనందుకు యజమాని తనకు మెచ్చి మేకతోలు కప్పకపోయినా, పనివాళ్ళకు చాలా కోపం తెప్పించినట్లు విఠల్ గ్రహించేడు. ఇదొక పీడగా తోచింది వాడికి. వీళ్ళంతా ఎందుకు పని మానాలో విఠల్‌కు నిజంగా అర్థంకాలేదు. కాని పైకి ఆ మాట అనలేదు. ఫ్యాక్టరీ పనిలో పనివాళ్ళ జులుం ఒకటి విధిగా ఉంటుందని మాత్రం వాడు గ్రహించాడు.
ఇంకో రెండు నెల్లు గడిచింది. విఠల్ తల్లికి సుస్తీగా ఉందని ఉత్తరం వచ్చింది. అసలే పెద్దది. విఠల్ ఆఖరు బిడ్డ. వాడికి తల్లిని చూస్తే పంచప్రాణాలు.
''చాచా, మా అమ్మకు జబ్బుగా వుంది. నేను వెళ్ళాలి. ఎట్లా ?'' అన్నాడు విఠల్.
''శలవు పెట్టి పో, ఫోర్మన్తో చెప్పు. జీతం మట్టుకు రాదు'' అన్నాడు చాచా.
''వెధవ జీవితం!'' అన్నాడు విఠల్.
వాడికి వారం రోజులు శలవు దొరికింది. ఆరోజు సాయంకాలమే స్వగ్రామానికి బయలుదేరాడు.
5
తిరిగి స్వగ్రామం కంటపడగానే విఠల్ గుండెకేదో అయింది. అంతా నిన్న చూసినట్టే ఉంది. ఒక్క రవ్వయినా మార్పులేదు. ఎంతోమంది ఎరిగినవాళ్ళు కనిపించారు. నిన్న కూడా తనను చూసినట్టే మాట్లాడారుగాని తనను కొత్తగా చూడలేదు. ''ఎలావుంది పట్నం?'' ఈ ఒక్క ప్రశ్నే వాళ్ళు వేసింది. కొద్దిమంది మాత్రం, ''ఎందుకెళ్ళావురా పట్నం?'' అని అడిగారు. విఠల్‌కు ఏమీ ఉత్సాహకరంగా లేదు. ఇంటికెళ్ళాడు.
నడవలో తల్లి తన రెండో కూతురి పిల్లని ఒళ్ళో పెట్టుకునేదో తినిపిస్తున్నది. మనషి మామూలుగానే ఉంది. జబ్బేమీ ఉన్నట్టు కనబడలేదు,
''అమ్మా నీ జబ్బెట్లా ఉంది?'' అని తల్లినడిగాడు విఠల్.
''ఏం జబ్బురా?... అదప్పుడే పోయింది. వచ్చావేం?'' అన్నది తల్లి.
విఠల్‌కు ఏదో అర్థంగాని బాధ కలిగింది.
''వారం రోజులే శలవు తీసుకున్నా'' అన్నాడు విఠల్, యింతేనా అని తల్లి అంటుందేమోనని.
''అట్లాగా?'' అన్నది తల్లి.
''అట్లా అయితే నీకు కావలసిన వన్నీ చేయించుకు తిను. అక్కడి తిండి ఎట్లా ఉంటుందో!''
''తిండిమాట అడక్కు! చాలా అసహ్యం.'' అన్నాడు విఠల్
తల్లి కొడుక్కేసి జాలిగా చూసింది. కొడుక్కు కొంత ఉపశాంతి కలిగింది.
ఇంతలో పెద్దన్న వచ్చాడు. తమ్ముణ్ణి చూడగనే, ''అయిపోయింది నౌకరీ?'' అన్నాడు చాలా నిరాశ కనబరుస్తూ, ''నేనసలు వెళ్ళోద్దనే అన్నాను.''
''శలవు తీసుకొచ్చా. వెళ్ళితే ఏం నష్టమయిందీ? దాదాపు యెనభై రూపాయలప్పు తీరిందా. లేదా?'' అన్నాడు విఠల్. తాను డబ్బు పంపిన సంగతి వాళ్ళెవ్వరూ స్మరించేటట్టు లేరు.
''ఇట్లా తీరే అప్పా అదీ?'' అంటూ అన్న లోపలికి వెళ్ళాడు.
''ఏమిటమ్మా? నేపంపిన డబ్బుతో బాకీ తీర్చలేదా?'' అన్నాడు విఠల్ తల్లితో.
తల్లి పెద్దగా నవ్వి, ''తీరుద్దామనే అనుకున్నాంగాని, ఏదో ఓ ఖర్చు వచ్చింది. నువు పెద్దవాడివై సంపాదిస్తున్నావుగా? తీరకేం జేస్తుందిలే?'' అన్నది, చాలా ధైర్యంగా.
''ఒక్క రూపాయి కూడా బాకీ కింద చెల్లు పెట్టలేదా?'' అన్నాడు, విఠల్ ఆశ్చర్యంతో.
''ఇంకా లేదు,'' అన్నది తల్లి నిబ్బరంగా.
'నే పంపినదంతా ఏమయినట్టు?'' అన్నాడు విఠల్ చిరాకుతో.
''నేను పారేశానుట్రా? నువు మొదటిసారి పంపించినప్పుడు మీ మామా వాళ్లిక్కడే ఉన్నారు. దాని కూతురు చేతులు బొత్తిగా బోసిగా ఉంటే, ఇంకా రెండు రూపాయలు వేసి చేతులకేవో చేయించా. పెద్దకూతురంటే పడిచస్తుందంటారని గౌరి కూతురిక్కూడా రెండోనెల్లో ఏదో చేయించా. ఆడపిల్లలకే పెడుతుందంటారని ఇంట్లో పిల్లలకి ఇవీ అవీ కొన్నా. పైకం నా పేర పంపించావు కనక కాస్తనా పెద్దరికానికి తగ్గట్టు చేశామరి, బాకీ తీర్చమని నువ్వేమన్నా రాశావా?'' అన్నది తల్లి కొంచెం దెప్పుగా.
విఠల్‌కు చాలా ఆశాభంగం కలిగింది. చూస్తున్న కొద్దీ తనవాళ్ళంతా వొట్టి ఆశపాతకులుగాను, దోపిడిగాళ్లుగానూ, ఇతరుల కష్టసుఖాలు తెలుసుకోలేని వాళ్లుగానూ కనిపించారు. తనను ఆరునెల్ల తరువాత చూసి ఒక్క ప్రాణి అయినా నిజంగా సంతోషించలేదు. అందరూ కలిసి సంపాదించినంత తాను ఒక్కడూ సంపాదిస్తే ఒక్కరు మెచ్చుకోలేదు. తాను చమటోడ్చి, గడ్డి తిని సంపాదించిన డబ్బు వెనకాముందూ చూడకుండా అలాములు, పలాములు చేశారు.
విఠల్ తన ఫ్యాక్టరీని జ్ఞాపకం తెచ్చుకున్నాడు. ఒక్క కూలివాణ్ణి తీసినందుకు ఫ్యాక్టరీలో వున్న కూలీలంతా బయటికి నడిచారే! వాళ్ళా మనుషులు వీళ్ళా? తన మీద 'చాచా' కున్న అభిమానంలో నూరోవంతు ఇంట్లో వాళ్ళందరికీ కలిపినా ఉన్నదా?
''వీళ్ళనని లాభంలేదు. ఇక్కడ జీవితమే ఇంత. నేనూ ఇటువంటి వాణ్ణ్లేగా ఆరునెల్ల కిందటి దాకా! ఇక్కడ ఉండి లాభంలేదు.''
మర్నాడే విఠల్ పట్టణానికి ప్రయాణమైనాడు.
''అప్పుడేనా?'' అన్నారందరూ.
కాని వాళ్ళకు తాను నిజంగా ఉండిపోవాలని ఉన్నట్టు విఠల్‌కు తోచలేదు.
''కాదు. వెళ్ళాలి! రోజుకు రూపాయిన్నర నిష్కారణంగా పోతుంది...అమ్మకు జబ్బంటే వచ్చాగాని రాకనే పోదును'' అన్నాడు.
''అట్లా అయితే వెళ్ళు, పాపం!'' అన్నారందరూ.
విఠల్ ఈసారి నిజమైన పారిశ్రామిక కార్మికుడుగా పట్నం ప్రవేశించాడు. పట్నం అతన్ని తన గర్భంలో దాచుకున్నది. అతని దగ్గర్నుంచి తల్లికి మళ్ళీ ఒక్క ఎర్ర ఏగానీ కూడా మనియార్డరు ద్వారా చేరలేదు.
- కొడవటిగంటి కుటుంబరావు
Sun 11 Sep 00:13:33.331205 2022