Sun 11 Sep 00:13:41.175675 2022
Authorization
ఒకసారి పక్షులకు, జంతువులకు పెద్ద గొడవ జరిగింది. చివరికి ఆ గొడవ కారణంగా అవి ఒకదానితో మరొకటి పరస్పరం మాట్లాడుకోకూడదని నిర్ణయించాయి.
ఒకరోజు ఒక బుజ్జి కుందేలుకు చాలా దాహం వేసింది. అది తన బొరియ వద్ద గల ఒక చెట్టుపై ఉన్న ఒక డేగ పిల్లతో ''మిత్రమా! మా అమ్మ ఆహారం కొరకు బయటకు వెళ్లింది. నాకు చాలా దాహం అవుతూంది. నాకు నీరు ఎంత దూరంలో ఉందో చెప్పరాదూ!'' అని అంది.
అప్పుడు డేగ పిల్ల ''ఉష్! గట్టిగా అరవకు. మాకు మీకు పెద్ద గొడవ జరిగిందట. మనం పెద్దవాళ్ళ గొడవ మూలంగా మాట్లాడుకోవడమే తప్పు. పైగా నీటి జాడను చెప్పమంటున్నావు'' అని అంది.
అప్పుడు బుజ్జి కుందేలు ''పెద్దవాళ్ల గొడవలతో మనకేం పని? నీవు నాకు సాయం చేయరాదూ! దప్పిక తీర్చకుంటే నేను బతకలేను'' అని అంది.
అప్పుడు ఆ డేగ పిల్ల లోపల ఉన్న తల్లితో ''అమ్మా! పాపం నా మిత్రునికి నీటి జాడ కావాలట! నీవు చెప్పరాదూ!'' అని అంది.
ఆ డేగ వెంటనే బయటకు వచ్చి ఆ బుజ్జి కుందేలుతో ''ఓ బుజ్జి కుందేలా! నేను నీకు ఆ జాడను చెబుతాను .కానీ ఆ సంగతి మీ అమ్మకు తప్ప ఎవరికీ చెప్పకు. మా పక్షులకు ఈ సంగతి తెలిస్తే అవి మాపై కోపగిస్తాయి'' అని అంది.
అందుకు బుజ్జి కుందేలు సరేనంది.
అప్పుడు డేగ ''ఇక్కడకు ఉత్తరాన రెండు మైళ్ళ దూరంలో చెరువు ఉంది .వెళ్లి తాగు'' అని అంది.
బుజ్జి కుందేలు సంతోషంతో అక్కడికి వెళ్లి నీటిని తాగి వచ్చింది.
ఆ తర్వాత ఒకసారి మృగరాజు సింహం బిడ్డ అనుకోకుండా అస్వస్థత పాలయింది. దానిని పరీక్షించిన ఎలుగుబంటి ''మృగరాజా! నీ బిడ్డ బతకాలంటే ఇక్కడకు ఆరు మైళ్ళ దూరంలో ఉన్న ''ప్రాణపుష్ప'' అనే ఆయుర్వేద మొక్కను తీసుకొని రావాలి. అది కూడా గంట సమయంలోపు గానే ఆ పని జరగాలి'' అని అంది.
సింహం భోరుమని రోదిస్తూ ''ఇక ఎలాగూ నా బిడ్డ బతుకదు. ఇప్పుడు అంత దూరం వెళ్లేవారెవరు? ఆ మొక్కను గుర్తించి తెచ్చేవారెవరు?'' అంటూ ఏడవ సాగింది.
ఎలుగుబంటి ''మృగరాజా! గతంలో మనకూ, పక్షులకు గొడవ జరగకముందు నాకు దానిని ''దూరగతి'' అనే ఒక డేగ తీసుకుని వచ్చి ఇచ్చేది. అది పరోపకారి. అది ఇప్పుడు ఎక్కడ ఉందో కదా! అందులో వాటికి మనకు గొడవ జరిగి మాటలు లేవు కదా! ఇప్పుడు అది మన మాట వింటుందో! లేదో!'' అని అంది.
ఇంతలో అప్పుడే వచ్చి ఈ మాటలు విన్న కుందేలు ''ఎలుగు మామా! మా చెట్టు పైననే ఆ దూరగతి ఉంది. దాన్ని అడగనా!'' అని అంది.
అప్పుడు ఎలుగుబంటి ఆలస్యం చేయకుండా వెంటనే అడిగి చూడమంది.
వెంటనే కుందేలు తన బొరియ వద్ద ఉన్న చెట్టు వద్దకు వెళ్లి దూరగతితో ''మిత్రమా! మా మృగరాజు బిడ్డ అస్వస్థత పాలైంది. ఇప్పుడు నీవే ఆదుకోవాలి. గతంలో నీవే ఆ ప్రాణపుష్ప మొక్కను తెచ్చి ఎన్నో ప్రాణులను కాపాడావట. నాకు ఎలుగుబంటి చెప్పింది. నీవు నా బిడ్డకు చేసిన ఉపకారాన్ని కూడా నేను మరవలేను. నీవు పరోపకారివని నాకు తెలుసు'' అని అంది.
అప్పుడు డేగ ''మీ మృగరాజు బిడ్డను కాపాడటానికి నేను వెళతాను ! కానీ మా పక్షిరాజు నాకు అనుమతి ఇస్తాడో! లేదో!'' అని కుందేలుతో అంది
అప్పుడే అక్కడికి వచ్చిన పక్షిరాజు గరుత్మంతుడు ఈ మాటలు విని డేగను వెళ్ళమని చెప్పాడు.
రాజాజ్ఞతో డేగ వెళ్లి వెంటనే ప్రాణ పుష్ప మొక్కను తెచ్చి ఎలుగుబంటికి ఇచ్చింది. ఎలుగుబంటి చేసిన వైద్యంతో సింహం బిడ్డ బతికింది. మృగరాజు సింహం ఎంతో సంతోషించి డేగ ఉపకారాన్ని ప్రశంసించింది.
''ఇక ముందు పరస్పర సహాయంతో మనమందరం కలిసి ఉందాం! పోట్లాటల వల్ల నష్టమే తప్ప లాభం లేదు'' అని అంది మృగరాజు.
పక్షిరాజు గరుత్మంతుడు వాటితో స్నేహానికి సరేనని అన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన పక్షులన్నీ ఆనందంగా 'మృగరాజుకు జై' అని అంటే జంతువులు 'పక్షిరాజుకు జై' అని అన్నాయి.
- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య, 9908554535