Sun 11 Sep 00:13:46.802269 2022
Authorization
పులి కడుపున పులే పుడుతుంది మేక కడుపున మేక పుడుతుంది అన్నది ఎంత సత్యమో రాజు కొడుకు రాజవడం పేద కొడుకు పేదవడం అంతే సత్యం. సూర్యుడు తూర్పున ఉదయించటం మానేసే వరకూ ఇది ఇంతే! మెదడు మొద్దుబారే దాకా, కాళ్ళు చేతులు చచ్చుబడే వరకూ, పళ్ళూడి, నోరు వంకర తిరిగే వరకూ రాజ్యం చేసిన రాజులు ప్రజల్ని గాలికి అప్పజెప్పి పోలేరుగదా కొడుకులకి రాజ్యమూ ప్రజలూ వజ్రాలూ, వైఢూర్యాలూ, డబ్బూ, డాబూ దర్పమూ అధికారమూ వంటివి చేతిలో పెట్టి, నా ప్రజలు నా రాజ్యం అంటూ కళ్ళు తేలేసి తిరిగి రాని లోకాలకు ప్రయాణం చేస్తారు. రాజు కొడుకు రాజవడం రాజు మనువడు రాజవడం అలా సాగిపోతూనే ఉంటుంది.
అయితే ఒకానొక రాజ్యంలో రాజుకి సంతానం లేకపోవడంతో రాజవడానికి కొడుకనే వాడు లేకపోవడంతో రాజుని ఎక్కడ్నుంచి తేవాలో అర్థం కాలేదు మంత్రులకీ, అధికారులకీ.
రాజ్యానికి రాజనేవాడు లేకపోతే ప్రజలంతా అనాథలైపోతారు. శత్రువులు కోట పాగా వేస్తారు అరాచకం ఆంబోతులా రంకె వేస్తుంది అని రాజ్యానికి మూల స్తంభాలైనటువంటి వారు బాగా ఆలోచించి ఓ పాతదీ, ప్రశస్తమైనదీ అయిన పద్ధతిని పాటించాలని 'డిసైడై' పోయేరు. సత్తంభాల్లాంటి కాళ్ళు, చింతాకంత కళ్ళు, కొండంటి ఒళ్ళు, చేట చెవులూ, ఆకారాని ఏమాత్రం 'మ్యాచవని' తోకా ఉన్న గజరాజును రప్పించారు. గజరాజు గబగబా పరుగెత్తుకు రాలేడు కదా నిదానంగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చాడు.
సీనియర్ మంత్రి ముందు నిలబడి తొండం ఎత్తి 'నమస్కారం సార్ పిలిచారట' అన్నాడు.
'అవునోరు నువ్వే మన రాజ్యానికి రాజును వెతికి పెట్టాలి అందుకే పిలిపించాం' అన్నాడు మంత్రి ముఖం సీరియస్గా పెట్టి.
'తరతరాల నుంచీ రాజుల్ని వీపు మీద మోస్తూ వచ్చాం. అది మా కర్తవ్యంగా భావించాం. కేవలం రాజుల్ని మోయడమే మా పని అనుకున్నాం. తమరేమో ఇంత కఠినమైన పని చెయ్యమంటున్నారు. చేయగలనా?' అని సందేహించాడు గజరాజు.
'నో ప్రాబ్లం. మేమంతా లేమూ. ఈ రోజు నుంచి ఓ వారం రోజుల పాటు రాజ్యమంతా తిరుగు. జనం నాడి పట్టుకో. రాజ్యానికి రాజు ఎవరు కావాలో తేల్చుకో. మేం చెప్పిన రోజున గజమాల నీ తొండానికి తగిలిస్తాం. నువ్వు ఎవడి మెళ్ళో ఆ దండ వేస్తావో ఆ మనిషే మా రాజు మహారాజు' అన్నాడు మంత్రి. అవునవును అన్నది తతిమ్మా అధికార బృందం.
సరే తప్పుతుందా. వారం రోజుల టైం ఉంది కదా నా వంతు కృషి చేస్తానన్నది ఏనుగు. ఆ ర్తాసరి తను సరైన వ్యక్తిని రాజును చెయ్యగలదా అని ఆలోచిస్తున్న గజరాజుకి నిద్ర పట్టలేదు. ఎవరో ఒక వ్యక్తి తన పక్కనే వచ్చి నిలబడ్డం దాని చిన్న కళ్ళకి పెద్దగా కనిపించింది. 'ఏరు ఎవర్నువ్వు, ఇక్కడ నీకేం పని' అంది చిరాగ్గా. మైడియర్ ఎలిఫెంట్ కంగారు పడకు. నీ కోసం బస్తాల కొద్దీ వెలగపండ్లు తెచ్చా. కడుపునిండా తిను అన్నాడా మనిషి.
'ఎవర్నువ్వు. ఎప్పుడూ చూళ్ళేదే. నా మీద నీకింత ప్రేమ ఎందుకు పుట్టిందో' అన్నది ఏనుగు తల పక్కకి వంచి. 'రాజును ఎన్నుకునే విషయంలో సాయం చేద్దామని వచ్చా. నేను రాజు కొడుకుని కాదు గానీ ఈ రాజ వంశానికే చెందిన వాణ్ణి. రాజ్యార్హత కలవాడ్ని. నీ తొండానికి తగిలించే గజమాల సరిగ్గా నా మెడకి సరిపోతుంది' అన్నాడు ఆ మనిషి. ఓహో అందుకా వెలగపండ్లు సంతర్పణ అన్నది ఏనుగు. 'అదేం కాదు నీ ఆకలి తీర్చడమే నా తక్షణ కర్తవ్యం, నన్ను గుర్తుంచుకో' అంటూ వెళ్ళిపోయేడా మనిషి.
అలా ఓ రోజు గడిచింది. మరునాటి రాత్రి మరో శాల్తీ గజరాజు తొండం మీద వేళ్ళాడాడు. ఏమిటని అడిగితే నీ కోసం మోపులకి మోపులు చెరుకు గడలు తెచ్చానన్నాడు. ఎందుకంటే చెరుకు ఏనుక్కు ఇష్టమని తను కూడా రాజ వంశీకుడ్నని తనకూ రాజ్యర్హత ఉందని చెప్పి మాల వెయ్యమని బతిమాలాడాడు. మరో రోజు ముగిసింది. ఆ రాత్రి మరో వ్యక్తి ఏనుగు ఎదుట నిలబడ్డాడు. పెద్ద అరటి గెలను పట్టుకుని. ఏమిటని అడిగితే ఏనుగు కోసం గెలలకి గెలలు అనేక అరటి గెలలు తెచ్చానని తనకే రాజ్యార్హత ఉందని మాల తనకే వెయ్యమని పదే పదే దండాలు పెట్టాడు.
రాజులు కావడానికి రహస్యంగా వచ్చి తనకు లంచం యివ్వబోయిన వాళ్ళ సంఖ్య రోజురోజుకీ పెరిగిపోయింది. బహిరంగ సభల్లో రాజులవడానికి వివిధ రకాల హామీలు పంచి పెట్టేవాళ్ళ గోలకి, యిస్తామంటున్న ఉచిత పథకాలకి, ఉపన్యాసాల ఊపదంపుడికి పరస్పర తిట్ల పురాణాలకి ఏనుగు చెవుల నుంచి నీళ్ళూ, చీమూ, నెత్తురూ కూడా కారసాగినయి. ఎవర్ని రాజును చెయ్యాలో ఎవరి వాగ్దానాలు, పథకాలు నిజమని నమ్మాలో గరజరాజుకు అర్థంకాలేదు. ప్రజలకు పనికొచ్చేవాడు, రాజు అయ్యే అర్హత ఉన్న వాడు ఒక్కడూ కనిపించలేదు. అప్పనంగా రాజైపోయియ ఖజానాను దోచుకోవాలనుకునే వాళ్ళు తప్ప, ప్రజల సంక్షేమం కోసం నిజాయితీగా పాటు పడే వాడెవడూ కనిపించలేదు. ఎవర్ని రాజును చెయ్యాలో, ఎవరికి గజమాల వెయ్యాలో అర్థంకాని ఏనుగు గోడకి తలబాదుకోసాగింది.
కాలం ఏదైతేనేం ఎవరిని రాజును చెయ్యాలో ఏనుగుకే కాదు, మనుషులకూ ఒక్కోసారి అస్సలు అర్థం కాదు. అయినా ఓటు అనే ఆయుధాన్ని సరిగ్గా వాడకపోతే రాబోయే తరాల భవిష్యత్తు...???
-చింతపట్ల సుదర్శన్, 9299809212