Sun 18 Sep 01:35:34.819252 2022
Authorization
''క్వాక్...... క్వాక్'' అంటూ సంతోషంతో తల్లి దగ్గరకు వచ్చాయి బాతు పిల్లలు .
''ఏమిటమ్మా చాలా సంతోషంగా ఉన్నారు'' అడిగింది తల్లి.
''అమ్మా, అక్కడ నది ఒడ్డున చాలా వానపాములున్నాయి. మేమందరమూ పట్టుకొని కడుపునిండా తిన్నాము. మనం ఇక్కడే ఉందాము. ప్రతిరోజూ మనం అక్కడ వానపాములను తినవచ్చు'' అంది ఒక బాతు.
''సరేనమ్మా'' అంది తల్లి
ఒక చిట్టి బాతు మరలా నది ఒడ్డుకు వెళ్తుంటే ''అందరూ కడుపునిండా తిన్నారుగా మరలా ఎందుకు వెళ్తున్నావు'' అంటూ తల్లి బాతు అడిగింది.
''అమ్మా తిన్నది తిరగాలంటే కాస్సేపు ఆడాలి. నేను నది ఒడ్డున వెళ్లి ఆడుకొంటాను''
''ఇక్కడ వీళ్లతోనే ఆడుకోవచ్చుగా'' అంది తల్లి.
''వీళ్ళతో ఎప్పుడూ ఒకే ఆట ఆడాలంటే విసుగ్గా ఉంది. అక్కడైతే నేను సరదాగా రక రకాల వానపాములను పట్టుకొని వాటిని రెండు మూడు భాగాలుగా చేస్తాను. వానపాము భాగాలు వెంటనే చావకుండా అటూ ఇటూ తిరగడం చూడటానికి సరదాగా ఉంటుంది'' అంది చిట్టి బాతు.
చిట్టి బాతులోని రాక్షసత్వం చూసి తల్లి బాతు ఒక్క క్షణం ఆలోచనలో పడింది. చిట్టిబాతులో మార్పు తెప్పించాలని ''చిట్టి బాతూ నీవు చేస్తున్నది చాలా రాక్షసమైన పని. ఆకలి కోసం వేరే దారి లేక మనం ఒకేసారి చంపితింటాం. వానపాముకు కళ్ళు, చెవులు, కాళ్ళు లేవని ఇలా హింసించడం చాలా తప్పు, నీవు చేస్తున్న క్రూరమైన పనికి ఎవరో ఒకరు శిక్షిస్తారు.''అంది
''ఏమిటమ్మా నీవు చెప్పేది ఆ వానపాము కోసం నాతో ఎవరూ యుద్ధానికి రారులే అమ్మా'' అంది చిట్టిబాతు.
''అన్యాయం జరిగినప్పుడు న్యాయాన్ని రక్షించడానికి ఎవరో ఒకరు ఉంటారని మానవ మహాత్ముడు చెప్పారు''
''అమ్మా ఇప్పుడు మానవ ప్రపంచం అవినీతితో నిండి పోయిందని నాకు ఒక కొంగ చెప్పింది. నాకు ఏమీ కాదమ్మా, వానపాములకు అన్యాయం జరిగితే పోరాడటానికి ఎవరైనా వస్తారా వింటుంటే సరదాగా ఉంది'' అంటూ తల్లి పిలుస్తున్నా వినకుండా నవ్వుకొంటూ వెళ్ళింది చిట్టి బాతు.
నది ఒడ్డుకు వెళ్లి వానపాములను పట్టుకొని రెండు మూడు భాగాలుగా కాళ్లతో వేరుచేసి రాక్షసంగా నవ్వుకొంటూ ఆనందించ సాగింది చిట్టి బాతు
అక్కడకు దగ్గరలోఉన్న చెట్టుపై కూర్చొన్న ఒక కాకి జరుగుచున్నదంతా గమనించి ''ఆకలైతే ఒకటేసారి పట్టుకొని తినకుండా ఇలా రాక్షసంగా హింసించడం ఏమిటి దీనికి మరచిపోలేని విధంగా శిక్షించాలి ''కోపంగా అనుకొంది. చెట్టుపై నున్న మిగిలిన పక్షులకు జరిగింది చెబుతూ అక్కడ చూడమంది .అన్ని పక్షులకూ కోపం కలిగి ఏమైనా చెయ్యాలనుకొంది.
ముసలి గద్ద వేగంగా వెళ్లి ఒక్కసారిగా బాతును తన్నగానే కింద పడింది.. వెంటనే చెట్టుపైనున్న పక్షులన్నీ చిట్టి బాతుపై పడి బాతు కళ్ళను పొడుస్తూ ''నీవు చేసే రాక్షస పనిని చూస్తూ ఉండలేకపోయాము'' అన్నాయి.
కళ్ళు కోల్పోయిన ఆ చిట్టి బాతు, కష్టపడుతూ తల్లి దగ్గరకు వెళ్లి ''అమ్మా నీ మాట వినకుండా వెళ్లినందుకు నన్ను క్షమించమ్మా, నీవు చెప్పినవిధంగానే న్యాయాన్ని రక్షించడానికి ఎవరో ఒకరు ఉంటారన్నది నిజమైంది'' పశ్చాత్తాపంతో ఏడుస్తూ చెప్పింది.
- ఓట్ర ప్రకాష్ రావు, 09787446026