''కామేశ్వరీ! ఆ మందుల 'పొది'లా తెచ్చిపెట్టు'',
''అవునూ... పరమేశ్వరీ! ఫలహారం చేసి అరగంటైందంటావా?''
''లలితా! నిద్ర వస్తున్నట్లుగా వుంది. మందు బిళ్ళలు మింగిన తర్వాత కొంచెంసేపు పడుకుంటానేం.''
''కాదంబరీ! కొంచెం కాఫీ తాగుదామా? ఉదయం నుంచీ ఒక్కసారే దయచేసావా 'అమృత' ద్రవాన్ని వేసుకోవాల్సిన మందులు వేసుకుని అప్పుడే గంటైంది కదా. కొంచెం కాఫీని అనుగ్రహించు భద్రావతీ!'' ముసిముసిగా నవ్వుతూ వంటింట్లోంచి వచ్చింది బోధనలోనూ, కార్యాలయ వ్యవహారాల్లోనూ విశేష దక్షత, ప్రతిభ చూపించిన కేంద్ర పతక విజేత. విశ్రాంత కళాశాల ప్రిన్సిపాల్, శ్రీమతి లాస్య విలాసినీ దేవి. ఏడుగజాల చీరకట్టుకుని పసుపు రాసిన నుదుటను రూపాయి కాసంత కుంకుమబొట్టు, కళ్ళకు కాటుకతో భుజాల చుట్టూ చీర కప్పుకుని రెండు చేతులకు ముందూ వెనుకలుగా నాలుగేసి బంగారు మధ్యలో డుమూడు రంగులతో అరడజను మామూలు గాజులు, కాళ్ళకు వెండి చుట్లూ, ముత్యాల పట్టీలతో నడచొస్తున్న లక్ష్మీదేవిలా దర్శనమిచ్చింది రెండు చేతుల్లోనూ కాఫీ పొడి సీసా, పంచదార డబ్బాలను మూతలు తీయడం కోసం తెచ్చింది.
జామెక్కిన సూర్యుడిలా నులివెచ్చగానూ, ప్రసన్నంగానూ సౌందర్య సుభగంగానూ వున్న భార్యామణిని మురిపెంగా అలవోకగా తిలకిస్తూ, అవలోకిస్తూ, ''సుశీలా, పిల్లలిద్దరూ కార్యాలయాలకెళ్ళిపోయారా?'' మూతలు తీసి ఆమె చేతికందిస్తూ.
తలూపిందామే వాళ్ళుండే వాటాకేసి పరికించి చూస్తూ. పెదవులు నవ్వుతున్నాయి. ఆమె మౌనంగా రాగమేదో పాడుతున్నట్లుగా గొంతులోని పచ్చటినరాలు తంబూరాతో శృతి కలుపుతూన్నట్లుగా కదలుతున్నాయి. వెడల్పాటి కళ్ళు వెలుగులీనుతూ, ఆకీర్తనకు తగ్గట్టుగా కన్బొమలునర్తిస్తున్నాయి.
రెండువాటాలు గల ఇంట్లో ఎనిమిది పదుల సుందర రామయ్య రెవెన్యూ శాఖలో సహాయ కార్యదర్శి హోదాలో విశ్రాంత జీవితాన్ని ఆయన భార్య లాస్య విలాసినిదేవి, అర్ధ దశాబ్దం తక్కువగానూ, ఏ బాదరబందీ లేకుండానూ జీవిస్తున్నారు. ఆమె భర్తను కనురెప్పల్లా చూసుకుంటూంటుంది. పిల్లలిద్దరూ విదేశాలలో స్థిరపడ్డ వాళ్ళే, ఇంక యిక్కడుండేదీ జంట పక్షులే. పండువయస్సులో ఒకరికొకరుగా, నిండుగా వీళ్ళిద్దరే.
అందుకనే అవసరానికి తోడుంటారనే ఉద్దేశంతోనూ, కాలక్షేపానికి లోటుండదనే భావంతోనూ యింట్లోని సగ భాగాన్ని అద్దెకిచ్చారా దంపతులు: సూర్యసుందరం, రాగ సుందరి యిద్దరూ సమాచార సాంకేతిక రంగంలో రెండు ప్రముఖ సంస్థలలోని అత్యంత ప్రధానమైన విభాగాలలో పరిశోధన, పరిశీలన, విశ్లేషణ విభాగాలలో ప్రముఖ స్థానాల్లోనే కొలువులు చేస్తున్నారు.
ఇక నవతరం భార్యాభర్తలైన సూర్యసుందరం, సుందర రామయ్యగారిని పెదనాన్నాని, ఆవిడను పెద్దమ్మాని ఆప్యాయంగా పిలుస్తూంటాడు. రాగసుందరైతే పెదమామయ్య, పెద్దత్తయ్యాంటూ, భర్త కంటే రెండాకులు ఎక్కువగా చదివిందేమో అనిపించేలా వరసకలిపేసింది వచ్చిన వారం రోజుల్లోనే. ఆ దంపతులు కూడా ఎంతో అభిమానంతో వీళ్ళిద్ధరినీ ముఖ్యంగా అమెను కూతురులానే చూస్తూ ''అమ్మాయీ, చిన్నా, అమ్మాజీ, తల్లిగాడూ, సుందరమ్మా, రాగమ్మాంటూ'' అప్యాయంగానూ, అనురాగంగానూ పిలుస్తుంటారు.
''అన్నట్లు రేపు శనివారం పిల్లలిద్దరూ ఉదయమే వస్తారు''. గ్లాసులోని కాఫీని ఎంతోయిష్టంగా వూదుకుంటూ మరో గుక్క వేసారు, ఆ రుచిని ఆస్వాదిస్తూ కళ్ళు అప్రయత్నంగా అరమోడ్పు లవుతున్నాయి.
''రేపూ ఎల్లుండి శలవులుకదా, ఉదయం ఫలాహారాల కోసం, యిప్పట్నించే ఆలోచించి పెట్టుకోవాలి. లేకపోతే అలవాటుగా 'ఉప్మా'యే దిక్కవుతుంది'' సమాధానం కోసం కాకుండా స్వగతంగా అనుకుంటున్నట్లుగా.
కొన్ని ప్రశ్నలకు సమాధానాలుండవ్, కేవలం 'చర్య'లే, మరికొన్నింటికి అవి ప్రకటితమయ్యే శారీరక భంగిమలుగానో, మొహంలో వ్యక్తపరచే అనేకానేక భావాల పదగుచ్ఛంలానో సమాచార మార్పిడి వెంటవెంటనే జరుగుతూంటుంది. అంటే, చాలా వరకూ భావాలే భాష్యాలు చెబుతుంటాయన్నమాట.
పైనున్న ప్రశ్నలన్నీ ప్రతీదినమూ ఎదురయ్యేవే. అలానే సమాధానాలు కూడా, కేవలం ప్రాధాన్యతాక్రమం మాత్రం మారుతూంటుంది. చాలా మామూలుగా జరిగే క్రియలన్నిటికీ వ్యక్త పరచనవసరం లేని భాష్యాలూ, భావాలూ అనేకానేకాలు. అవన్నీ నిత్యనూతనాలు, కేవలం మనం ఎంచి ఎంచి చూసుకోవల్సిందే. ఏ కుటుంబంలోనైనా యిలాగే వుంటుంది అటూయిటూగా, కొంచెం తారతమ్యాలే ప్రధాన భాగంగా మారుతూంటాయి.
''సోమేశ్వరీ! కాసిని మంచినీళ్ళు తాగుదామా?''
''కళ్యాణీ! వంటైపోయిందా శాకాపాకాలేమిటో'' కొంటెగా కళ్ళెగరేస్తూ, తలనె వెనక్కు వంచి గ్లాసులోని ఆఖరి గుక్క మంచి నీళ్ళను గొంతులో పోసుకుంటున్నప్పుడు పొలమారడంతో ఒక్కంగలో వచ్చి మాడుమీద మెల్లగా రాస్తూ, ''మెల్లగా తాగవచ్చుగా'', అంది విలాసినీదేవి సున్నితంగా మందలిస్తూ.
''ఈ సమయంలో ఎవరు తలచుకుంటున్నారో పల్లవీ''. ''ఇంకెవరై వుంటారు, దూరంగా వున్న మీ మనవలూ, ముద్దుల మనవరాళ్ళూనూ'' మూతి మూడొంకర్లు తిప్పుతూ మురిపెంగా పిల్లలను తలచుకుంటున్నట్లుగా ఆ వెడల్పాటి కళ్ళే చెబుతున్నాయా కబుర్లు. తాతయ్యకంటే అమ్మమ్మంటేనే వాళ్ళకు ఎక్కువ చేరిక.
''ప్రభావతీ! నేనలా బేంక్ దాకా వెళ్ళొస్తాను. వచ్చాక భోజనం చేసేద్దా'' మంటూ బయలుదేరారు. తెల్లటి గూడకట్టు లుంగీ, కాలర్లేని జుబ్బా, మెడలో జంధ్యంలా సంచీ, దాంట్లోనే ఏవేవో కాయి తాలూ, ముందు జాగ్రత్తగా ఒకటో రెండో చిన్న గుడ్డ సంచీలు, అవసరమొచ్చి నప్పుడు వస్తువులో, కాయ గూరలో, పళ్ళో తీసుకుని రావడానికి వీలుగా, చేతిలో పొన్ను కర్రా, హాలీవుడ్ సినిమాల్లోని 'కౌబోరు'లా పెద్ద ఈతాకుల టోపీ, నాలుగు భాషలను అనర్గళంగా మాట్లాడే (మాట్లాడ గలిగే) నేర్పూ, ఆయన సొంతం. ఎప్పుడు బయటకు వెళ్ళాల్సి వచ్చినా యిదే ఆహార్యం. వచ్చేప్పుడే రెండు కొబ్బరి బొండాలూ, మస్క్మిలన్, కివీస్, మరచిపోకుండా సపోటాలూ, అలాగే రెండు ఆపిల్స్ తీసుకుని వచ్చారు. మొహంలో అలసటకనిపిస్తోంది.
''సుభద్రా! నువ్వు ఒకటిన్నర కొబ్బరినీళ్ళు తాగు, మిగతావి నేను తీసుకుంటాను. ఒక్కటక్కడే తాగేసేను. ఎండా బాగా వుంది కదా''ంటూ, కాళ్ళూ చేతులు కడుక్కుని తువ్వాలుతో తుడుచుకుంటూ''.
అలానే క్రమం తప్పకుండా సాయంత్రాలు వ్యాహ్యాళికిద్దరూ తప్పనిసరిగా 'స్పోర్ట్స్ షూస్' తొడుక్కుని మాత్రమే వెళతారు, రానూ పోనూ ఒక గంటన్నర పాటు అలా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తారిద్దరూనూ. చక్కటి క్రమశిక్షణతో తమ విశ్రాంత జీవితాన్నీ, సమయాన్నీ, అర్థవంతంగా మలచుకున్న తీరు అమోఘం.
**********
ఫలహారాలయ్యాక కూరల కోసమంటూ తండ్రీ కొడుకిలిద్దరూ బజారెళ్ళారు. యింట్లో తల్లీకూతుళ్ళిద్దరూ మధ్యాహ్న భోజనాల తయారీలో తలములకలౌతున్నారప్పుడే.
కూరలు కొనుక్కొని, కాసిని పళ్ళూ అవీ తీసుకుని మెల్లగా నడుస్తున్నారిద్దరూనూ.
''పెదనాన్నా! మిమ్మల్నొక విషయమడగనా? మీకు పెద్దమ్మంటే ఎంతిష్టమో మాకర్థమైందిప్పటికే కానీ, అర్థంకానిదొక్కటే, ప్రతీ క్షణమొక కొత్త పేరుతో పిలుస్తుంటారెందుకని'' గొంతులో జంకు కనిపిస్తూ, వినిపిస్తూండగా. నా మోచేతుల పైగానూ భుజం కిందుగా చేయివేసి పట్టుకుని పల్చగా నవ్వుతున్నాడాయన.
''ఒక్కటి కాదు సుందరం రెండన్నాడాయన'' నన్నామూలాగ్రం స్కాన్ తీసినట్లు చూస్తూ. యింకేమంటాను, మౌనంగా తలూపాను. దంపతులిద్దరూ ఒకరినిమించి మరొకరు ఉద్దండులే, ఆశేష ప్రతిభావంతులే.
''అవున్రా అబ్బారు! ముందుగా ఒక విషయం చెప్పాలి. నిజానికి మీ పెద్దమ్మ పేరు మరచిపోయి రెండున్నర దశాబ్దాలై వుంటుందేమో? మొదట్లో, మా పెళ్ళి శుభలేక చూసుకొని, ఒకటి రెండ్రోజుల పాటు గురుతుంచుకునేవాణ్ణి. అలా పిలిచేవాణ్ణి. ఆ తరువాత ఆ కార్డెక్కడో పోయింది. యింకప్పట్నించీ, అలా సరికొత్త పేర్లతో పిలుస్తూం''టాను. కళ్ళు నవ్వుతున్నాయి. భుజంమీద చేయివేసి బలంగా పట్టుకుంటూ.
''మరొక్క విషయమేమిటంటే, ఉదయాన్నే కాఫీపొడి సీసా మూత తీయడమనే పెద్దపని నా చేత మీ పెద్దమ్మ చేయిస్తూంటుంది. నిజమేననుకో, ఆ తరువాత కూరలు తరగడమూ, పళ్ళతో 'జ్యూస్' చేయడమనేదీ నా కర్తవ్యమే. నీకొక సంగతి చెప్పాలి. ఈ కాఫీపొడి సీసా మూత తీయడమనే క్రియ ద్వారా, నా మీద నాకున్న నమ్మకాన్ని యితోధికంగా పెంచుతూంటుంది. అవును సుమా! నేనేమీ శారీరకంగా కృంగిపోవడం లేదు. ఇటువంటి బలమైన భావం నాలో కల్గించడం కోసమంటూ మీ పెద్దమ్మ ఆ పనిని నాచేత చేయిస్తూంటుంది''.
''ఈ విషయాలన్నీ ఆమెకూ తెలుసును. ఐనా అమాయకంగా నాలోని మేల్ ఈగోని సంతృప్తి పరుస్తూంటుంది. పైగా, నేనా మూత తీయకపోయినా తనే తీసుకోకగలదనే విషయం నాకు తెలుసని ఆమెకు తెలియదనుకుంటు''న్నానంటూ యింట్లోకి దారి తీసారాయన.
దంపతుల మధ్య ఉండాల్సిన లక్షణాలను ఆకళింపు చేసుకుని అలా జీవితాన్ని గడుపుతూన్న పెదనాన్నా, పెద్దమ్మల మధ్య చక్కటి అవగాహన, భావసారూప్యతా, గుర్తించతగిన రీతిలో 'వేవ్లెంత'ంటామే అది బలంగా వుందనిపించింది. ఎప్పుడూ ఒకరిని విడచి మరొకరు లేరు. ఎక్కడికెళ్ళినా యిద్దరూ కలిసే దేవాలయ సందర్శనలైనా, విదేశాలలో వున్న పిల్లల దగ్గరకు వెళ్ళాల్సి వచ్చినా ఒకరివెంట మరొకరు వుండాల్సిందే. అలా ఎన్నెన్ని 'సప్తపదు'లు నడిచారో, ఎన్ని వేలడుగులకు మడుగులొత్తారో యిరువురూనూ.
**********
మా వాటాలో కూరల సంచీ పెట్టేసి, కాళ్ళూ చేతులు కడుక్కునొస్తూ, పెద్దమ్మకేసి తేరిపార చూసానెందుకో. అలా ఎందుకు చూడాలనిపించిందో, పరికించాలనిపించిందో, నాకైతే తెలీలేదు. రాగం పెద్దమ్మ దగ్గర కూర్చుని పువ్వులు మాల కడుతోంది. పెద్దనాన్నప్పటికే తీరిగ్గా నేలమీద 'వినాయకుడి'లా బాసింపట్టేసుకుని కూర్చున్నారు. పక్కనే రేడియోలో పాత హిందీ పాటని షంషాద్బేగమాలపిస్తోంది.
చాలా విషయాలలో యిద్దరికిద్దరూ ఉద్దండులే, సరిసమానులే అనిపించింది. పైగా యిద్దరూ భూమి పైకి దిగొచ్చిన పార్వతీ పరమేశ్వరుల్లా కనిపిస్తారు. అందుకనే వాళ్ళ ఉనికిలోనూ, సమక్షంలోనూ మేంచాలా నేర్చుకుంటూం టామనుకున్నాను. మనసులోనే కృతజ్ఞతలనర్పిస్తూ.
ఆ సాయంత్రం వేళల్లో, నడకలు చాలించి యింట్లో కూర్చుని 'టీ' తాగుతున్నప్పుడు, పెద్దమ్మ, ''తల్లీ రాగసుందరీ, ఏదీ ఆ కబీర్దాసు భజనగీతం ''భజోరే భయ్యా/ రామ గోవింద హరే / రామ గోవింద హరే// ఆలపిస్తూ, నర్తించగలవా యిప్పుడ''ంది శ్రీమతి లాస్య విలాసినీదేవి గోముగా రాగంకేసి చూస్తూ.
భోజనాల బల్ల పక్కనున్న ముక్కాలి పీటపై వున్న మువ్వలు తీసిస్తూ. 'రాగం' మౌనంగా చూస్తూ వాటినందుకొంది.
భజోరె భయ్యా/ రామ గోవింద హరే /రామ గోవింద హరే||
జప తప సాధన కఛు నహి లాగత/ ఖరచత నహిగఠరీ |
భజోరె భయ్యా/ రామ గోవింద హరే ||
సంతత సంపత సుఖకే కారణ జాసే భూల భరీ |
భజోరె భయ్యా/ రామ గోవింద హరే ||
కహత కబీర జా ముఖరామ నహి/ వా ముఖధూల భరీ |
భజోరె భయ్యా/ రామ గోవింద హరే |''
చాలా స్పష్టంగానూ, భావస్ఫోరకంగానూ, ఎంతో భక్తితోనూ, ఆ కోదండరాముని కీర్తించడమూ, అందుకనువుగా నర్తించడమూ బాగుందనిపించిందా సాయంత్రం వేళల్లో, అప్పుడప్పుడే వెన్నెల పరచుకుంటూందవని పై, చంద్రుడు ప్రకాశవంతంగా వెలుగులు పరస్తున్నాడు, మేం కూర్చున్న చోట 'సిల్హౌటీ'లా సన్నటి వెన్నెల రేకలు పలచగా పరచుకున్నాయి. జాజులతో కలసిన విదేశీపూల సుగంధాలేవో నాసికను తాకుతున్నాయి.
ఆ సమయంలో రాగం వాళ్ళత్తయ్యతో కలసి యుగళం గానూ, సంయుక్తం గానూ లయ పూర్వకంగానూ, శృతి పక్వంగానూ సన్న గానూ స్పష్టంగానూ, మెల్లగానూ ''సామజ వరగమనా'' అలపిస్తూన్నారు ఉభయులూ. పెద్దమ్మ గొంతిప్పటికీ అంత స్పష్టంగా వుండడం దేముడిచ్చిన వరంగానే భావించాలి.
ఆ తర్వాతెప్పుడో చెప్పింది పెద్దమ్మ ''తాను సంగీతంలో కొంత మేరకు కృషి చేసాననీ, ఆ తర్వాత విధినిర్వహణా, కుటుంబ బాధ్యతలతో మరలా అటువైపు దృష్టి సారించలేకపోయాననీ, ముఖ్యంగా మీరొచ్చాకనూ,మీతో పెరిగిన అనుబంధంతోనూ, అమ్మాయికి యిటు సంగీతం లోనూ, అటు నాట్యంలోనూ ప్రావీణ్యముండడంతోనూ పైగా తన కార్యాలయంలో జరగిన కార్యక్రమంలో కబీర్దాసు భజన కీర్తననూ, ఆ తర్వాత ఆహూతులలోని దేశ విదేశస్థుల కోరిక మేరకు అన్నమయ్య కీర్తనొకటి నర్తిస్తూ, గానం చేసాననీ చెప్పడంతో మనసు మరలా అటువైపు దృష్టిపెట్టేందుకు సాహసించేలా చేసింద''ంది పెద్దమ్మ.
''అవునమ్మారు! ఆ అన్నమయ్య కీర్తన పాడానన్నవే ఏదీ, మరోసారి వినిపించగలవా ఎంతో విధేయతగా చేతులు కట్టుకుని, చిన్న పిల్లాడిలా, బతిమాలుతూన్న గొంతుతో'' పెద్దనాన్నడిగారు. అప్పుడు మేం నల్గురం వరండాలో కూర్చునున్నాం. పల్చగా పరచుకుంటూన్న వెన్నెల, వాతారవణం చల్లగా మనసుకు ఆహ్లాదకరంగా వుంది. సన్నజాజుల పరిమళం గాలిలో కలసి మృదువుగా నాసికనలరిస్తోంది.
రాగం పల్చగా నవ్వుతూ నాకేసి చూసి, వెంటనే భోజనాల బల్ల దగ్గరున్న ముక్కాలి పీటపైనున్న మువ్వల పట్టీల కేసి చూస్తూ, అవి కావాలని కళ్ళతో ఎంతో భావస్ఫోరకంగా చెప్పింది. ముగ్ధుణ్ణై పోయాను అటువంటి భావప్రకటనకూ, అప్పుడు రాగం మొములో పలికిన భావసముచ్ఛయానికీ, ఎన్నెన్ని భావాలు ఆమె కళ్ళూ మోమూ ఎలా పలుకుతున్నాయాని ఆశ్చర్యపడుతూ, ఆమె కోరినట్లుగా మువ్వలను తెచ్చిచ్చాను మంచి బాలుడిలా, మా అనుబంధానికి పెద్దమ్మ ఎంతో మమకారంతో రాగంను దగ్గరకు తీసుకుని నుదుటిపై పెదవులు ఆన్చింది. ఆ తర్వాత ఆమె రాగం చేతిలోని మువ్వలను తీసుకుని బుగ్గలకూ, పెదవులకూ ఆపై చెవులకూ తాకించుకుంటూన్నప్పుడు కళ్ళు ఆరమోడ్పులవడం మా దృష్టి దాటిపోలేదు.
''అవును పెద్దమ్మా! ఈ అన్నమయ్య కీర్తన ఏ రాగంలో కూర్చా'' రన్నాను. నిజానికి నాకు సంగీతం గురించేమీ తెలియదు. ఐనా తెలుసుకోవాలనే ఉత్సుకత మెండుగా వుండ డమూ ఆ విధంగా 'రాగం' దృష్టిలో మంచి మార్కులు సంపాదించు కోవడమనే ఉభయతారక మంత్రంలా వుంటుందనే ఏకీకృత భావంతో.
కళ్ళతోనే మెచ్చుకోలుగా చూస్తూ, ''ఈ కీర్తన 'మంగళ కౌశిక' రాగ'' మంది పెద్దమ్మ.
ఎటువంటి వాడవయ్యా యిచ్చకమూ సేయుగాను / సటలంటా బొమ్మలను జంకింతురా / |పల్లవి||
వూరకే నీ పాదములు వొత్తుచుఁబిసుకుగాను / గోరుదాంకెనంటూ యేలకొచ్చి చూచేవు //
చేరి వూడిగాలు గడుఁజేసితే మెచ్చుఁగాక/ నేరపు నేరము లెంచినిందవేతురా // ||ఎటు||
కన్నగన్న చోటనెల్లా గందము నీకుఁబూయుగా // చన్నులు నాటెనంటూ సాదించేవు //
వున్నతి బత్తి సేసితే నొడంబడుదురుగాక // సన్నలుదప్పులు మోపి చండుచేతురా // ||ఎటు||
మెల్ల మిరతుల నిన్ను మోవి యాని కూడంగాను // పల్లు సొుఁకనంటా నాతోఁ బంతమాడేవు //
యిల్లిదే శ్రీ వేంకటేశ ఇందుకె నవ్వుటగాక // కొల్లగా సిగ్గువరశి కొసరుదురా // ||ఎటు||
''ఎన్నాళ్ళైందిరా యీ కీర్తన విని, అప్పట్లో రేడియోలోనూ, ఆ తర్వాతెప్పుడో ఒకసారి రవీంద్ర భారతిలో అనుకుంటా ఏదో నృత్య ప్రదర్శనకెళితే అక్కడ మరోసారి విన్నాను. చాలా చక్కగా పాడుతూ, నాట్యం చేశావమ్మాయ''న్నాడు పెదనాన్న ఆత్మీయంగా రాగంను పక్కన కూర్చోబెట్టుకుని.
రాగం కేసి చూసాను. మొహం మీద చెమరించిన ముత్యాల్లా మెరుస్తూ వింతందాలనుపంచుతోంది.
''ఈ శుభసందర్భంలో మంచి కాఫీ తాగితే బాగుంటుందా ప్రభావతీ!!'' కాఫీకావాలని నేరుగా అడగకుండా, ముగ్గుర్నీ చూస్తూ, పల్చగా పెదవులు నవ్వుతున్నాయి. పక్కనే రేడియో (మోగు)పాడుతోంది.
''ఆఁ కాఫీకేం భాగ్యం దానికోసం ఏదో సందర్భాన్ని సృష్టించుకోవడమెందు''కంటూ వంటింట్లోకెళ్ళింది పెద్దమ్మ. నేనూ అనుసరించానామెని.
''ఏమిటి సుందరం, ఏమిటీ సంగతంటూ కళ్ళతోటే ప్రశ్నించింది, ఎన్నెన్నో భావాలను అలవోకగా ప్రకటించే ప్రదర్శించే మోముతో పెద్దమ్మ. స్టౌవ్వున్న గట్టుమీద శుభ్రంగా కడిగిపెట్టిన కరివేపాకును దూసి పక్కనే వున్న పళ్ళెంలో పోస్తూ ''అదికాదు పెద్దమ్మా! నిన్ను పెద్దనాన్నెప్పుడూ రకరకాల పేర్లతో ఎందుకు పిలుస్తూంటారు. మాకైతే చాలా వింతగానూ, ఆశ్చర్యంగానూ వుంద''న్నాను ఆమె వదనం కేసి చూస్తూ.
''అదికాదు సూర్యం! నిజమే, మీ పెద్దనాన్నకు నేనంటే అపరిమితమైన యిష్టమే. కానీ, యిక్కడ జరిగిందేమిటంటే ఆయన నా పేరు మరచిపోయి దాదాపుగా రెండున్నర దశాబ్దాలై వుంటుందేమో'' అంటూ, ''అందుకనే ప్రతీసారీ ఒక కొత్తపేరుతో పిలుస్తూ తన వైఫల్యాన్ని కప్పిపుచ్చు కుంటూంటారు. అంతే కాకుండా నా పేరే కాదు, మా పెళ్ళిరోజు, నా పుట్టినరోజును సైతం మరిచిపోయారాయన'', అప్పుడామె వదనంలో ప్రస్ఫుటమయ్యే భావాలను దోసిలిపట్టి ఎంచుకోవడమే, పదిల పరచుకోవడమే. అన్నన్ని భావాలను వెంటవెంటనే ఎలా ప్రకటి(ంచే) స్తున్నారో ఈ అత్తాకోడళ్ళిద్దరూననుకున్నాను.
''మొదట్లోనైతే మా పెళ్ళి శుభలేఖ చూసి ఒకటిరెండు రోజులు గురుతుపెట్టుకునేవారు. నేనదిగమనించి దానిని తీసి దాచేశాన''ంటూ చిన్నపిల్లలా అరచేతులను చెంపల చుట్టూ వేసుకుని పకపక నవ్వేస్తూ. అప్పుడామె కళ్ళు సంతృప్తితో దివ్య వెలుతురేదో చిమ్ముతున్నాయనిపించింది. ''ఏది ఏమైనా ఆయన చల్లటినీడలో మిగిలిన యీ నాలుగునాళ్ళూ గడిపేస్తే అదే పదివేలు. ఐనా పేరులో ఏమున్నది పెన్నిధంటారు కదా.
లోకంలో ఎంతమంది దంపతులకిలాంటి భాగ్యం కలిగిందంటావ్ సూర్యం, అలానే ఎంతమంది భార్యలకిలాంటి అదృష్టం దక్కిందంటావ''ంటూ అప్యాయంగా నా కళ్ళల్లోకి చూసి నవ్వుతూ.
''మీ పెదనాన్నలా పిలుస్తున్నప్పుడు మొదట్లో వింతగా అనిపించినా, తర్వాత్తర్వాత యింకిప్పుడు ఏ పేరుతో పిలుస్తారోనంటూ ఎదురుచూడ్డమలవాటయింది.
ఒక్కొక్కసారి నాకే అనిపిస్తూంటుంది. అసలు నా పేరిమిటని?
ఆయనలా పిలవడమూ, నేను పిలిపించు కోవడమూ కూడా ఒకవిధమైన భక్తే, దైవారాధనే, అదంతా రోజూచేసే దేవీ స్త్రోత్ర సహస్రనామావళే అనిపిస్తూంటుంది. అదీ ఒక భక్తి మార్గమే కదా!.
''అదీకాకుండా సూర్యం! యిదంతా ఒక విధమైన వైద్య విధానమే కదా. అరోగ్యానికి ఆరోగ్యమూ, అనుబంధానికి అనుబంధమూ, ఎవ్వరికైనా'' డాక్టర్ లాస్య విలాసినీదేవి చేతిలోని చెంచాని నాకేసి చూపిస్తూ, పెదవులు నవ్వుతున్నాయి, యిప్పుడో యింకాస్సేపటిలోనో విచ్చుకుంటా యేమోననిపించేలా.
''ఏమిటీ, తల్లీకొడుకులిద్దరూ ముచ్చట్లుపెట్టుకుని అసలు సంగతి మరచిపోయినట్లున్నార''ంటూ వంటింట్లోకి రాగమొచ్చింది. అక్కడున్న ఎండబెట్టిన రేగొడియాన్ని ముక్క చేసుకుని నోట్లో వేసుకుంటూ.
''ఆ కాఫీలు యిటివ్వండత్తయ్యా నేను తెస్తాన''ంటూ రాగం ఒక కంచంలో పెట్టుకుని హాల్లోకి నడచింది. పెదనాన్న పక్కనున్న రేడియోలో వార్తలొస్తున్నాయి.
- బుర్రా లక్ష్మీనారాయణ
**********
Sun 25 Sep 01:04:25.690512 2022