Sun 30 Oct 01:43:36.888106 2022
Authorization
వెంకన్న, రమణల కుమారుడు కిట్టు. వ్యవసాయ కూలీ కావడంతో ఇద్దరూ పొద్దుగాల లేసి కూలీ పనులకు వెళ్లి ఏ రాత్రికో ఇంటికి వచ్చేవారు. కిట్టు ఆలనాపాలనా నాయనమ్మ అంతమ్మే చూసుకుంటూ ఇంటి పట్టునే ఉండేది. కిట్టూకి ఐదు సంవత్సరాల వయసురాగానే పాఠశాలకు వెళ్ళనని మారాం చేస్తే నాయనమ్మే కిరాణా దుకాణం వద్ద చాక్లెట్లు కొనిచ్చి కిట్టూతోపాటే నాయనమ్మ పాఠశాలకు వెళ్లి పాఠశాల వదిలే వరకు అక్కడే కూర్చునేది. అలా పాఠశాలకు వెళ్ళిన కిట్టూ ఇప్పుడు ఐదవ తరగతికి వచ్చాడు. ఎప్పుడూ నాయనమ్మతో పాటే ఉంటూ నాయనమ్మ చెప్పే చందమామ కథలు వింటూ హాయిగా నిద్రపోయేవాడు.
కాలం గడుస్తుంది. కిట్టూ ఇప్పుడు 7వ తరగతికి వచ్చాడు. కిట్టూ వెనకాలే నాయనమ్మ చేతిలో కర్ర పట్టుకొని నడుస్తూ పాఠశాలకు వెళ్ళేది.
''ఎందుకే నాయనమ్మ నా వెనకాలే వస్తావు! నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎగతాలి చేస్తున్నారు. నువ్వు ఇంకా చిన్నపిల్లాడివారా! అంటున్నారు. నువ్వు రాకు నేను ఒక్కడినే పాఠశాలకు వెళ్తాను'' అన్నాడు. అయినా అవేమి పట్టించుకోని నాయనమ్మ చిన్నగా నడుస్తూ కిట్టూతో పాటే వెళ్ళేది. తల్లికోడి పిల్లలను కాపాడుతూ వచ్చినట్లు కిట్టూను కాపాడుతూ వెళ్ళేది.
ఎంత చెప్పినా నాయనమ్మ వెనకాలే వస్తుంటే కిట్టూకి నాయనమ్మ మీద కోపం పెరిగింది. నాయనమ్మను చూస్తేనే అసహ్యించుకునేవాడు. నాయనమ్మతో మాట్లాడటం కూడా మానేశాడు. ఐనా మనవడిపై ప్రేమతో కిట్టూని అనుసరిస్తూ పాఠశాలకు వెళ్ళేది. అది గమనించిన కిట్టూ కోపంతో అరుస్తూ ''ఏరు ముసల్దానా ! ఒకసారి చెప్పితే వినిపించుకోవా! నీ వల్ల నా పరువు అంతా పోతుంది. నన్ను చూసి 'నాయనమ్మ వస్తుందిరోరు!' అని ఎగతాళి చేస్తున్నారు నా మిత్రులు. ఇంకోసారి నా వెనకాల వచ్చావంటే నీ నడుములు ఇరగ్గొడత'' అని కోపంగా తరగతి గదిలోనికి వెళ్ళాడు కిట్టూ.
అవ్వా! బామ్మా! అంటూ ముద్దుగా పిలిచే మనవడి ప్రవర్తన చూడగానే నాయనమ్మకు కంటనీరు ఆగలేదు. ఇంటిపట్టునే ఉందామంటే నా కిట్టూ ఏమైతడో! అని వెళ్ళి పాఠశాల మొత్తకు ఆనుకొని జారుతున్న కన్నీటిని ముతక కొంగుతో తుడుచుకుంటూ పాఠశాల గోడ పక్కనే కూర్చుంది.
అటుగా వెళ్తున్న బొర్రమ్మ అంతమ్మను చూసింది. అంతమ్మ దగ్గరకొచ్చి 'ఏందే అంతమ్మ ఎందుకేడుస్తున్నావ్?'' అని అడిగింది. ఆ మాటలు విన్న అంతమ్మ దుఃఖం రెట్టింపైంది.
''ఏం లేదు! నా కొడుకూ, కోడలు కష్టాలు తలుసుకొని ...'' అని అంటుండగానే ''ఎందుకే అబద్ధాలు చెప్పుతావు. అవి ఎప్పుడూ ఉండేవే కదా! వారం రోజుల నుండి చూస్తూనే ఉన్న ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటున్నవు. కిట్టుగాడు ఏమన్న అన్నాడా!'' అనగానే ''వాడు చిన్న పిలగాడే! బడికి ఒక్కడే పోతా అంటున్నాడు. దారి నిండా కుక్కలు, పశువులు ఉంటాయి వాన్ని వదిలి ఇంటి దగ్గర నేను ఒక్క దానినే ఏమి చేస్తాను. వానికి భయం ఎక్కువ. అంటుండగానే బొర్రమ్మ నాయనమ్మ కన్నీటిని తుడుస్తూ ''వానికే తెలుస్తదిలే'' అని ఓదార్చింది.
ఆ రోజే తెలుగు ఉపాధ్యాయుడు 7వ తరగతిలోకి ప్రవేశించి ''పిల్లలూ...! ఈ రోజు మనం నాయనమ్మ పాఠం చెప్పుకుందాం. వద్ధులు దైవంతో సమానం వారిని ఎప్పుడూ గౌరవించాలి. వారికి కావలసిన పనులు చేసి పెట్టాలి. అమ్మానాన్నలు ఇంటి వద్ద వదిలేసి పనులకు వెళ్తే మనకు సేవ చేసి, సాన్నం చేయించి, అన్నం తినిపించి ఎప్పుడు చంక దించకుండా పెంచారు. మన బాగోగులు చూసి ఇంత పెద్ద వాళ్ళను చేశారు. వాళ్ళ జీవితాన్ని మన కోసమే ధారపోసారు. వారు లేకుంటే మనం లేము కదా! నాకు ఆరోగ్యం చెడిపోయినపుడు మా నాయనమ్మ తన కిడ్నీని దానం చేసింది. తన వల్లే నేను మీ ముందు నిల్చుని పాఠాలు చెబుతున్నాను. ఏ స్వార్థం, మలినం లేని దైవ స్వరూపులు వారు. ప్రతి ఒక్కరూ వృద్ధులను గౌరవించాలి'' అని ఉపాధ్యాయులు చెబుతుండగానే కిట్టూకు ఉదయం నాయనమ్మను అన్న మాటలు గుర్తొచ్చి కంట నీరు ఆగడం లేదు.
''చాలా పెద్ద తప్పు చేశాను'' అని మనసులో బాధ పడ్డాడు. మిగతా విద్యార్థులు కిట్టూను అన్న మాటలు గుర్తొచ్చి తలదించుకున్నారు.
ఇంటిగంట మోగగానే పరిగెత్తుతూ వచ్చి పాఠశాల గోడ పక్కనే దీనంగా కూర్చున్న నాయనమ్మను దగ్గరగా చుట్టుకొని ''సారీ నాయనమ్మ'' అంటూ ఏడ్చాడు. నాయనమ్మ 'ఊకోర నా బంగారు కొండ' అంటూ కిట్టూని ఓదార్చింది. ఆ రాత్రి కిట్టూ నాయనమ్మ దగ్గరే కథలు వింటూ నిద్రపోయాడు.
మరుసటి రోజు నాయనమ్మతో కలిసి పాఠశాలకు వెళ్ళాడు కిట్టూ. కథా రచన పోటిలో కిట్టూకి మొదట్టి బహుమతి వచ్చింది. ప్రధానోపాధ్యాయలు కిట్టూని స్టేజీ మీదకు పిలవగానే స్టేజి ఎక్కి ''ప్రధానోపాధ్యాయులు గారు .. నాకు ఈ బహుమతి రావడానికి కారణం చిన్నప్పటి నుండి మా నాయనమ్మ చెప్పిన కథలే కారణం. అందుకే మీరు బహుమతిని నాయనమ్మకు ఇవ్వండి'' అని వినయంగా అడిగాడు.
ప్రధానోపాధ్యాయులు సంతోషించి ''సరే తీసుకురా'' అన్నాడు. నాయనమ్మకు బహుమతి అందివ్వగానే పాఠశాల ప్రాంగణం అంతా కరతాళ ధ్వనులతో మారుమ్రోగింది.
కిట్టూలో వచ్చిన మార్పుకు నాయనమ్మతో పాటూ, కిట్టూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సంతోషించారు.
- ముక్కాముల జానకీరామ్, 6305393291