Sun 06 Nov 02:45:32.165758 2022
Authorization
ధర్మవరం గ్రామంలోని పాఠశాలకు శంకరయ్య మాష్టారు బదిలీపై వచ్చారు. ఆయన తెలుగు భాషోపాధ్యాయుడు. ఆయన విద్యారంగంలో అందించిన సేవలకు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందారు. అందమైన గదులు, విశాలమైన ఆటస్థలం, స్వచ్ఛమైన చల్లని గాలిని అందించే రకరకాల పచ్చని చెట్లతో ఆ పాఠశాల ఆయనను ఎంతగానో ఆకర్షించింది.
నాలుగు రోజుల తర్వాత శంకరయ్య మాష్టారు ప్రధానోపాధ్యాయుడితో ''మాష్టారూ! మన పాఠశాలలో కొందరు పిల్లలు మాసిన దుస్తులతో, చింపిరి జుట్టుతో వస్తున్నారు. శుభ్రంగా రావాలని ప్రార్థన సమయంలో వివరిస్తే బాగుంటుంది కదా'' అన్నాడు.
ఈ విషయం అనేకసార్లు చెప్పాను. చెప్పి చెప్పి విసిగిపోయి వదిలేశాను. వాళ్లు మారరు. మీరూ ప్రయత్నించండి'' అన్నాడు ప్రధానోపాధ్యాయుడు.
శుభ్రత పాటించని వారిని తన వద్దకు పిలిచి కారణం అడిగాడు శంకరయ్య మాష్టారు.
''ఉదయమే పనికి వెళ్లి సాయంకాలం ఇల్లు చేరే అమ్మకు దుస్తులు శుభ్రం చేయడానికి సమయం దొరకదు మాష్టారూ!'' అని చెప్పారు కొందరు పిల్లలు.
''ఇంటిలో బట్టల సబ్బు లేదు. అద్దం లేదు. మాష్టారూ!'' అన్నారు మరి కొందరు. ఇంకొందరు దువ్వెన లేదన్నారు. రకరకాల కారణాలు చెప్పారు.
ఆయన బట్టల సబ్బు తెప్పించి దుస్తులు ఎలా శుభ్రం చేసుకోవాలో, సబ్బును పొదుపుగా ఎలా వాడాలో ఒక్క రోజులో విద్యార్థులకు నేర్పాడు. సబ్బు లేదన్న పిల్లలకు సబ్బులు తెచ్చి ఇచ్చాడు. ప్రతి తరగతి గదిలో అద్దం, దువ్వెన ఏర్పాటు చేశాడు. అమ్మ, నాన్న తిను బండారాల కోసం ఇచ్చే డబ్బులో కొంత పొదుపు చేసి అవసరాలకు ఎలా వినియోగించుకోవచ్చో నేర్పాడు.
పిల్లలు విశ్రాంతి సమయంలో పాఠశాల బయటకు వెళ్లి అంగడిలో ప్లాస్టిక్ కవర్లలోని పదార్థాలను కొని తెచ్చుకోవడం గమనించా డు.పిల్లలందరినీ సమావేశపరిచాడు. ''ఈ రోజు మనం కొన్ని ముఖ్యమైన విషయాలు నేర్చుకోవడానికి సమావేశ మయ్యాము. మొక్కలకు ఆకులు, పువ్వులు ఎంత అందాన్ని ఇస్తాయో మనకు ఉతికిన దుస్తులు అంత అందాన్ని ఇస్తాయి. కాబట్టి ఆదివారం రోజు ఇంటివద్ద మీ దుస్తులు మీరే శుభ్రం చేసుకోండి. సబ్బులేని వారు నన్ను అడిగితే ఇస్తాను. మనిషికి చదువు ఎంత అవసరమో పొదుపు అంతే అవసరం. పొదుపు ఉన్నతమైన జీవితాన్ని ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. రాజులకు కిరీటం, మనకు శుభ్రంగా దువ్వుకున్న తల అందాన్ని, హూందాతనాన్ని ఇస్తాయి. అద్దం, దువ్వెనలు తరగతి గదుల్లో ఉంచాము. చింపిరి జుట్టుతో, మాసిన దుస్తులతో ఏఒక్కరూ కనిపించవద్దు. మీరు ప్లాస్టిక్ కవర్లలోని పదార్థాలు కొన్ని తెచ్చుకుని తింటున్నారు. అవి పాడవకుండా చాలా కాలం నిల్వ ఉండడానికి రసాయనిక మందులు కల్పుతారు. అవి ఆరోగ్యాన్ని చెడగొడతాయి. భవిష్యత్తులో జబ్బులు వస్తాయి. పండ్లు మంచి ఆరోగ్యాన్నిస్తాయి. కాబట్టి ఈ రోజు నుండి పాఠశాలలో మధ్యాహ్న భోజనం వారు సపోట, జామ, ఉసిరి, దోస, చీనీ మొదలగు పండ్లను తక్కువ ధరలో అమ్ముతారు. వాటిని శుభ్ర పరుచుకుని తినండి. ఆహారపదార్థాల మీద ఈగలు, మీ మీద దోమలు వాలకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యంగా ఉంటారు'' అని వివరించి చెప్పారు.
ఆ రోజు నుండి పిల్లల్లో మార్పు వచ్చింది. ''ఇంత మార్పును మేము తీసుకు రాలేకపోయాము'' అన్నారు ప్రధానోపాధ్యాయుడు.
''మీరు పిల్లలను మారమని మాత్రమే చెప్పారు. నేను సమస్యల మూలాలను సరిదిద్దాను.'' అన్నారు శంకరయ్య మాష్టారు.
సమస్యకు మూలమేమిటో తెలుసుకుని సరిదిద్దినప్పుడే సమస్య పూర్తిగా సమసిపోతుందని గ్రహించారు అందరూ.
- డి.కె.చదువులబాబు, 9440703716