Sun 20 Nov 00:50:24.616401 2022
Authorization
జయంతిపురాన్ని పాలిస్తున్న రాజు కమల వర్ధనుడు. గొప్ప వీరుడు, పరిపాలనా దక్షుడు. అతనికి కుమారులు లేరు. దమయంతి దేవి అనే కుమార్తె మాత్రమే ఉంది. మహారాజు రాజ్యభారాన్ని కుమార్తెకు అప్పజెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించినా, ఆమె వద్దని తిరస్కరించేది! ఈ విషయంలో మహారాజు బాధపడుతూ ఉండే వాడు. మహారాణి వైజయంతి దేవి ''మీరు ఎందుకు అంత బాధపడటం మా తమ్ముడు మిహిరసేనుడు ఉన్నాడుగా అతనికి మన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తే, మనవారే మన రాజ్యాన్ని ఏలవచ్చు'' అని సూచించింది. దానికి మహారాజు అంతగా ఇష్టం చూపక పోయినా భార్య చొరవతో మిహిర సేనుడికి, దమయంతి దేవికి వివాహం జరిగింది. ఆ తర్వాత కొంత కాలానికి తీవ్ర అనారోగ్యానికి గురై కమల వర్ధనుడు మరణించాడు.
పెళ్ళయి చాలా కాలమైనా దమయంతి దేవికి సంతానం కలుగలేదు. చివరికి హిమాలయాల నుంచి తెచ్చిన దివ్య ఔషధం తీసుకున్నాక ఇద్దరు కవల మగ పిల్లలకు జన్మనిచ్చింది. పిల్లలిద్దరూ పెరిగి పెద్దవారవుతుండగా వారి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఎంతో బాధపడ్డారు. వైద్యం చేయిస్తున్నప్పటికీ ఫలితం లేదు. యుక్త వయస్సు వచ్చినా ఎవరో ఒకరు ప్రతిరోజు వారిని కనిపెట్టుకొని ఉండా ల్సిన పరిస్థితి! పిల్లల్ని చూసి మహారాజు ఎంతో బాధపడేవారు.
మహారాజు ఒకరోజు తన మంత్రి ద్వారా రాజ్యంలో ''యువరాజుగా నియమించబడటానికి రాబోయే పౌర్ణమి రోజున ఎంపిక కలదు. ఇరవై ఐదు ఏండ్లలోపు వయస్సు గల యువకులు మాత్రమే పాల్గొనవలసిందిగా కోరుచున్నాము'' అంటూ దండోరా వేయించాడు. రాజ్యం నలుమూలల నుంచి వచ్చిన ఇరవై మంది యువకులకు రకరకాల పరీక్షలు నిర్వహించగా చివరికి ఇద్దరు మిగిలారు. ఒకరు సత్యానందుడు, రెండవవాడు జ్ఞాన కీర్తి. ''వీరిద్దరిలో రాజు ఎవరు అనేది చివరి పరీక్ష ద్వారా తేలుస్తాం. అది రానున్న పౌర్ణమి నాడు ఉంటుంది. అప్పటివరకు వీరిద్దరిని మన రాజ్య శివారులో గల గురుకులంలో ఉంచి, కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయండి'' అని రాజు మంత్రిని ఆదేశించాడు.
పౌర్ణమి రోజు రానే వచ్చింది ఇరువురు చెరొక గుర్రం మీద రాజు గారి ఆస్థానానికి బయలుదేరారు. సత్యానందుడు పరీక్ష సమయం కంటే ముందే చేరుకున్నాడు. సభ ప్రారంభమైంది. ''ఈరోజు యువరాజు ఎంపిక అయితే పోటీ దారుల్లో ఒకరైన సత్యానందుడు మాత్రమే సమయానికి వచ్చాడు. రెండో వ్యక్తి జ్ఞానకీర్తి రాని కారణంగా వచ్చిన సత్యానందుడినే విజేతగా మహారాజు ప్రకటించబోతున్నారు'' అని మంత్రి అంటుండగానే జ్ఞానకీర్తి వాయు వేగంతో అశ్వాన్ని అధిరోహించి వచ్చాడు. ''జ్ఞాన కీర్తి సమయపాలన పాటించాలని తెలియదా అసలే ఇది చివరి పరీక్ష కదా'' అన్న మహామంత్రితో క్షమించండి మహామంత్రి ''నేను ఆలస్యంగా రావడానికి గల కారణం, వచ్చే దారిలో ఒక వృద్ధుడు తోపుడు బండి మీద తీసుకెళ్తున్న బియ్యం బస్తాలు పడిపోయూయి. వాటిని బండి మీదకి ఎత్తడానికి అతను ఇబ్బంది పడటం గమనించి అతనికి సాయం చేశాను. మరికొంత దూరం వచ్చాక ఒంటినిండా గాయాలతో స్పృహ తప్పి పడి ఉన్న ఒక సైనికుడు కనిపించాడు. వెంటనే నా వద్ద ఉన్న నీటిని అతని ముఖం మీద చల్లి స్పృహ రాగానే అతనిని గుర్రం మీద ఎక్కించుకొని దారిలో గల వైద్యుని వద్ద దించి వైద్యం చేయమని చెప్పి రావడంతో ఆలస్యమైంది'' అని వివరించాడు.
విషయం తెలుసుకున్న మహారాజు ''సత్యానందుడా మీరు ఇరువురు కలిసి బయలుదేరలేదా?'' ''కలిసే బయలుదేరాం మహారాజా'' ''అయితే నీవు దారిలో జ్ఞానకీర్తి చెప్పిన వారిని గుర్తించలేదా?'' అనగా ''గుర్తించాను మహారాజా అయితే పరీక్ష గుర్తొచ్చి నేను ఎవరి వద్ద ఆగలేదు. అందుకనే సరైన సమయం కంటే ముందే చేరుకున్నాను'' అన్నాడు. అప్పుడు జ్ఞానకీర్తి మాట్లాడుతూ ''మహారాజా నాకు రాజు అవడం వల్ల కలిగే ఆనందం కంటే ఆపదలో ఉన్న వారిని రక్షించాను అనే ఆత్మ సంతృప్తి ముఖ్యం. అందుకనే నాకు కనిపించిన వారికి నా చేతనైన సహాయం చేసి వచ్చాను అందుకని ఆలస్యమైంది మీరు చెప్పిన సమయానికి రానందుకు క్షమించండి. మీరు ఏ శిక్ష విధించిన సిద్ధమే'' అన్నాడు. ''శభాష్ జ్ఞాన కీర్తి నేను పెట్టిన చివరి పరీక్ష ఇద.ే దానిలో నువ్వే గెలుపొందావు!'' అని మహారాజు జ్ఞానకీర్తిని యువరాజుగా ప్రకటించాడు. సత్యానందుని ఉద్దేశించి ''మనకు కలిగే లాభం కంటే ఇతరులకు కలిగే నష్టం ఎక్కువైనప్పుడు అదీ ప్రాణాపాయమై నప్పుడు మన లాభం కోసం చూడకుండా వారికి సహాయ పడటం ఎంతో ముఖ్యం. రాజుకి ఉండాల్సిన లక్షణం ఇదే. అది జ్ఞాన కీర్తిలో ఉంది. నీవు సమయపాలకు ఎంతో విలువ ఇవ్వడం బాగుంది. ఒక మంత్రికి ఉండవలసిన లక్షణం ఇది. కనుక నిన్ను యువ మహామంత్రిగా ప్రకటిస్తున్నాను'' అన్నాడు మహారాజు.
అప్పటినుంచి జ్ఞాన కీర్తి యువరాజుగా, సత్యానందుడు యువ మహామంత్రిగా చక్కగా రాజ్యపాలన చేయసాగారు.
- ఏడుకొండలు కళ్ళేపల్లి, 9490832338